మనకూ ఓ చైనా వాల్‌! | China wall also in telangana | Sakshi
Sakshi News home page

మనకూ ఓ చైనా వాల్‌!

Published Thu, Jan 19 2017 4:03 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

మనకూ ఓ చైనా వాల్‌! - Sakshi

మనకూ ఓ చైనా వాల్‌!

భూపాలపల్లి జిల్లా మల్లూరు గుట్టపై భారీ కుడ్యం

  • ఐదు కిలోమీటర్ల పొడవునా 10 అడుగుల ఎత్తుతో నిర్మాణం
  • నలు చదరంగా చెక్కిన భారీ రాళ్ల వినియోగం
  • ఇప్పటివరకు వెలుగుచూడని తీరు
  • అది సైక్లోపియన్‌ తరహా గోడ కావొచ్చంటున్న పురావస్తు నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: చైనా వాల్‌ తరహాలో మన దేశంలోనూ ఓ భారీ గోడ ఉందన్న సంగతి నాలుగు రోజుల కింద వెలుగు చూసింది. మధ్య ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌–డియోరీ నుంచి చోకీఘడ్‌ వరకు అడవులు, గుట్టలమీదుగా దాదాపు 80 కిలోమీటర్ల మేర ఆ గోడ విస్తరిం చి ఉంది. అదే తరహాలో మన రాష్ట్రంలోనూ ఓ భారీ గోడ ఉన్న సంగతి తాజాగా వెల్లడైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలో గోదావరి తీరంలోని మల్లూరు గుట్టపై  దట్టమైన అడవిలో దాదాపు 5 కిలోమీటర్ల మే ర ఈ భారీ కుడ్యం విస్తరించినట్లు గుర్తించారు. ఇప్పటివరకు స్థానిక గిరిజనులకు మాత్రమే దీని సంగతి తెలియడం గమనార్హం.

ఇక్కడ స్థానికంగా పేరుగాంచిన హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 8 కి.మీ. దూరంలో ఈ గోడ మొదలై.. దాదాపు 5 కి.మీ. పొడవునా విస్తరించి ఉంది. పురాతన చారిత్రక ప్రాంతాలను పరిశీలించేందుకు ఇటీ వల నాలుగు రోజుల పాటు పర్యటించిన ‘తెలంగాణ సోషల్‌ మీడియా ఫోరం’ స భ్యులు దీనిని గుర్తించారు. ఈ మేరకు వివ రాలను బుధవారం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పేర్వారం రాములు, ఎండీ క్రిస్టీనా చోంగ్తులకు అందజేశారు. ఈ గోడను ఎవరు నిర్మించారో, ఎందుకు కట్టారో, ఏ కాలంలో నిర్మితమైందో ఎక్కడా ప్రస్తావన కనిపింలేదని, దీని సంగతి తేల్చాలని రాష్ట్ర పురావస్తు విభాగాన్ని కోరారు.

అవి సైక్లోపియన్‌ వాల్స్‌!
కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక మిగిలిన సేన బస్తర్‌కు వలస వెళ్లే క్రమంలో కొంతకాలం ఇక్కడ ఉండి ఉంటుందని, ఆ సమయంలో రక్షణ కోసం దీన్ని నిర్మించుకుని ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ దీనిని పురావస్తు నిపుణులు ఖండిస్తున్నారు. దానిని రాష్ట్రకూటుల సమయంలో నిర్మించి ఉంటారని, ఆ సమయంలో ప్రభుత్వ పర్యవేక్షణ లేక స్థానికంగా తమను తాము అధిపతులుగా ప్రకటించుకున్నవారు నిర్మించి ఉంటారని చెబుతున్నారు. అక్రమంగా పన్నుల వసూళ్లు, దోపిడీల వంటివి చేసి రక్షణ కోసం ఈ గోడలు కట్టి ఉంటారని అంటున్నారు. కాకతీయులు బస్తర్‌కు వెళ్లే క్రమంలో వారి వద్ద ధనం లేదని, ఇలాంటి గోడలు నిర్మించే ప్రణాళిక కూడా వారికి లేదని చరిత్ర ఆధారంగా తెలుస్తోందని పురావస్తు శాఖ ప్రత్యేకాధికారి రంగాచార్యులు చెప్పారు.

ఇలాంటివి అక్కడక్కడా ఉన్నాయని, ఎలాంటి మిశ్రమ అనుసంధానం లేకుండా రాళ్లు పేర్చి నిర్మించే ఈ గోడలను సైక్లోపియాన్‌ వాల్స్‌గా పిలుస్తారని తెలిపారు. కాగా తాము పరిశీలించిన పాండవుల గుట్ట, మైలారం గుహలు, దామరవాయి బృహత్‌ శిలాయుగపు సమాధులు, గన్‌పూర్‌ దేవాలయాలు అద్భుత ప్రాంతాలని.. వాటివద్ద వసతులు కల్పిస్తే మంచి పర్యాటక కేంద్రాలుగా మారుతాయని సోషల్‌ మీడియా ఫోరం సభ్యులు పర్యాటకాభివృద్ధి సంస్థ దృష్టికి తెచ్చారు.

భారీ రాళ్లు.. ఎనిమిది దారులు
మల్లూరు గుట్టపై ఉన్న ఈ గోడ దాదాపు 10 అడుగుల ఎత్తుతో నిర్మించి ఉంది. కొన్ని చోట్ల మాత్రం శిథిలమై నాలుగైదు అడుగుల ఎత్తుతో ఉంది. నలు చదరంగా చెక్కిన భారీ రాళ్లతో ఈ గోడను నిర్మించారు. రాయికి రాయికి మధ్య ఎలాంటి అనుసంధాన మిశ్రమం వాడలేదు. కేవలం రాయి మీద రాయిని పేర్చి నిర్మించారు. కొన్ని చోట్ల ఆ రాళ్లు మూలలు పదునుగా ఉండేంత కచ్చితంగా చెక్కి ఉండడం గమనార్హం. అయితే ఈ రాళ్లపై ఎలాంటి శాసనాలు, గుర్తులు, చిహ్నాలు, బొమ్మలు లేకపోవడంతో వివరాలు అంతుచిక్కడం లేదు. ఇక ఈ గోడకు ఎనిమిది చోట్ల దారులున్నాయి. అక్కడ తలుపుల్లాంటివేమీ లేకుండా కేవలం రాకపోకలు సాగించేందుకు కొంత ఖాళీ వదిలారు.

ఏడాదిలో ముఖచిత్రం మారుతుంది
‘‘ఈ గోడ సహా సోషల్‌ మీడియా ఫోరం సభ్యులు పేర్కొన్న అంశాలను గుర్తిం చాం. కేంద్రం స్వదేశీ దర్శన్‌ పథకం కింద ట్రైబల్‌ సర్క్యూట్‌కు ఇచ్చిన రూ.99 కోట్లతో ప్రణాళిక రూపొందించాం. ఏడాదిలో ఆయా ప్రాంతాల ముఖచిత్రం మారుతుం ది. ఈ గోడ నేపథ్యం తెలుసుకుని దాన్ని కూడా ఇందులో జోడిస్తాం.’’
– పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పేర్వారం రాములు, ఎండీ క్రిస్టీనా చోంగ్తు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement