రణక్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్న కేంద్రం
సరిహద్దు గ్రామాల్లో మౌలిక వసతులు, ఆర్థిక వనరుల కల్పనే లక్ష్యం
రక్షణ, పర్యాటక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా కార్యాచరణ
రక్షణ శాఖ ఆధ్వర్యంలో ‘రణభూమి దర్శన్’ యాప్ ద్వారా సమగ్ర వివరాలు
12వేల అడుగుల ఎత్తయిన సియాచిన్, గాల్వాన్ లోయల సందర్శనపైనా ప్రచారం
మొత్తం 77 యుద్ధభూమి ప్రాంతాలు టూరిజం సర్క్యూట్‌కు అనుసంధానం
సాక్షి, అమరావతి: లాంగేవాలా.. 1971 భారత్–పాకిస్తాన్ యుద్ధం కారణంగా మన దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రాంతం. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు జేపీ దత్తా రూపొందించిన క్లాసిక్ ఫిల్మ్ ‘బోర్డర్’ ద్వారా కళ్లముందు సాక్షాత్కరించిన యుద్ధభూమి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎడారిని సందర్శించే పర్యాటకులకు కేంద్ర బిందువు. భారత్–పాక్ యుద్ధాన్ని ఆవిష్కరించిన వార్ మెమోరియల్ కూడా. 120 మంది భారతీయ సైనికులతో కూడిన చిన్న దళం రెండువేల నుంచి మూడువేల మంది సైనికులతో కూడిన పాకిస్తానీ బలగాలను చిన్నచిన్న యుద్ధ ట్యాంకులు, ఫిరంగులతో ఎదురొడ్డి నిలిచి గెలిచింది.
ఇక్కడ ఈ యుద్ధానికి సంబంధించిన డాక్యుమెంటరీలను వీక్షించడం, భారతీయ సైనికుల త్యాగాలను గౌరవించడం, ఆర్మీ నిర్వహించే దుకాణం నుంచి స్మృతి చిహ్నాలను కొనుగోలు చేయడం ద్వారా సందర్శకులు అద్భుతమైన అనుభూతిని పొందుతున్నారు. ఈ స్ఫూర్తితోనే భారత సైనిక వారసత్వ ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరిచింది. దేశ యుద్ధకాలపు చరిత్ర అన్వేషణకు బాటలు వేస్తోంది. పర్యాటక మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అత్యంత ప్రసిద్ధిచెందిన యుద్ధభూముల్లోకి మునుపెన్నడూ లేని విధంగా పౌరులను తీసుకెళ్లనుంది. ‘యుద్ధభూమి పర్యాటకాన్ని’ ప్రోత్సహించేలా భారత్ రణభూమి దర్శన్ యాప్‌ను సైతం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా యుద్ధభూములను, సరిహద్దు ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా మారుస్తోంది.
సరిహద్దు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం..
‘యుద్ధభూమి’ పర్యాటక ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక వనరులను సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మారుమూల ప్రాంతాలకు సందర్శకులను ఆకర్షించడం ద్వారా అక్కడ మౌలిక సదుపాయాలను, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను మెరుగుపరచడం, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం, వలసలను అరికట్టడంలో సహాయపడుతుందని ఆర్మీ భావిస్తోంది. దీంతో.. దేశ సైనిక చరిత్రను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతాలపై చారిత్రక అవగాహన, దేశభక్తి, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు బహుముఖ లక్ష్యంతో అడుగులు వేస్తోంది.
‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ కింద రక్షణ వారసత్వాన్ని ప్రచారం చేయనుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబిథూ, లద్ధాఖ్‌లోని రెజాంగ్ లా (1962 చైనా–భారత్ యుద్ధంతో ముడిపడి ఉన్న ప్రాంతాలు) వంటి ప్రదేశాలకు పౌరులను తీసుకెళ్లడం ద్వారా భారతదేశ యుద్ధకాల చరిత్రను చాటిచెప్పనుంది. వీటితో పాటు యుద్ధ స్మారక చిహ్నాలైన ద్రాస్ వార్ మెమోరియల్ (కార్గిల్ వార్, 1999), వాలాంగ్ వార్ మెమోరియల్ (వాలాంగ్ యుద్ధం–1962) తవాంగ్ వార్ మెమోరియల్, లోంగేవాలా వార్ మెమోరియల్, ఆపరేషన్ మేఘదూత్ వార్ మెమోరియల్‌లను యుద్ధభూమి టూరిజం సర్క్యూట్‌కు అనుసంధానిస్తోంది.
12వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ సందర్శన..
ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్. ఇక్కడ 1984 నుంచి చాలా ఏళ్లపాటు భారత్–పాక్ దళాల మధ్య ఘర్షణ వాతావరణం నడిచేది. 2023లో పర్యాటకులకు అనుమతిస్తూ.. ఈ మంచు పర్వతాల్లో సైనికులు ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను సామాన్యులకు పరిచయం చేసింది. సందర్శకులు 12వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి ఈ ప్రాంతాన్ని అన్వేషిస్తున్నారు.
ఇక 2020లో ఇండియా–చైనా ఘర్షణ జరిగిన ప్రదేశం గాల్వాన్.. 1971 ఇండియా–పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించిన ప్రాంతం లాంగేవాలా.. భారతదేశ సైనిక చరిత్రలో కీలక స్థానాలైన రెజాంగ్ లా, బమ్ లా పాస్, పాంగోంగ్ త్సో, డోక్లామ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను రణభూమి దర్శన్ యాప్ ద్వారా అందిస్తోంది. ఇందులో 77 యుద్ధభూములకు చెందిన సమగ్ర చారిత్రక కథనాలను అందిస్తోంది. వీటిని సందర్శించాలనుకునే వారి కోసం ఈ వెబ్‌సైట్ సమగ్ర ప్రయాణ వివరాలను అందిస్తుంది. నిషేధిత ప్రాంతాలను సందర్శించడానికి అవసరమైన అనుమతులు, దరఖాస్తుల వివరాలు యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment