నల్లగొండలో బృహత్ యుగకాల సమాధులు
ఆత్మకూర్ (ఎస్) మండలంలో వెలుగు చూసిన వైనం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: చారిత్రక ఆధారాలకు నెలవైన నల్లగొండ జిల్లాలో పురాతన యుగం నాటి సమాధులు మరోసారి బయటపడ్డాయి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 200 సం వత్సరాల వరకు బృహత్ యుగకాలం. నాటి సమాధులను పురావస్తు శాఖ అధికారులు ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్, కందగట్లల్లో వెలికి తీశారు. నెమ్మికల్‌లో 3-4 ఎకరాల విస్తీర్ణంలో 25 వరకు ఇవి ఉన్నాయని పురావస్తుశాఖ చెబుతోంది.
ఇదీ సమాధుల చరిత్ర: ఈ సమాధులను బృహత్ కాలయుగ సమాధులని అంటారు. నాటి ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ఈ సమాధుల్లో మనుషులను పాతిపెట్టేవారు. ఆత్మలుంటాయని నమ్మే ఆ రోజుల్లో ఆ ఆత్మలకు ఆహారం పెట్టడం తోపాటు ఆత్మలు బయటకు రాకుండా ఉండేందుకు, జంతువులు ఆ పార్ధివదేహాలను తినకుండా ఉండేందుకు పెద్ద బండరాళ్లతో ఆ సమాధులను ఏర్పాటు చేశారు. కాగా, సూర్యాపేట సమీపంలోని నెమ్మికల్, కందగట్లలో జరిపిన తవ్వకాల్లో నాటి సమాధులు బయటకు వచ్చాయి.