గణపురం గుళ్లకు పూర్వ వైభవం!
భారీ పునరుద్ధరణ ప్రాజెక్టుకు శ్రీకారం
- ఇప్పటికే తొలి ద శ పూర్తి.. రెండో దశ పనుల కోసం శాస్త్రీయ అధ్యయనం
- రంగంలోకి ఢిల్లీ,వరంగల్ నిట్ నిపుణులు
- ఆపై యునెస్కో గుర్తింపునకు దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: ఐదెకరాల ప్రాంగణం.. చుట్టూ మహా ప్రాకారం.. ఓ పక్కన 60 స్తం భాలతో మహా మండపం.. పక్కనే ముఖ మండపం, మహామండపం, అర్ధ మండపాలతో కూడిన అద్భుత శిల్పరీతితో అలరారే గణపేశ్వర దేవాలయం.. చుట్టూ మరో 21 ఆలయాలు.. ప్రతీ గోడపై అత్యద్భుతమైన శిల్ప సౌందర్యం.. వెరసి అదో ఆధ్యాత్మిక ప్రపంచం.. యావత్తు తెలంగాణలో ఇలాంటి ఆలయాల సమూహం మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో.. ఇదీ వరంగల్ జిల్లా గణపురంలోని గణపేశ్వరాలయం (కోట గుళ్లు) ప్రాంగణ సొగసు.
13వ శతాబ్దంలో నిర్మితమై.. కులీకుతుబ్‌షాహీల హయాంలో ఔరంగజేబుల దాడులతో ధ్వంసమైన ఈ ఆలయం తిరిగి అప్పటి శోభను సంతరించుకోనుంది. ఇప్పటికే తొలి దశ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి మలిదశ కోసం కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం వరంగల్‌లోని నిట్ ఇంజనీర్లు, ఢిల్లీకి చెందిన పురావస్తు సాంకేతిక నిపుణులు అధ్యయనం ప్రారంభించారు. వారి నివేదిక ఆధారంగా త్వరలోనే జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గుళ్లను పునరుద్ధరించే భారీ ప్రాజె క్టు కార్యరూపం దాల్చనుంది. దీనికి దగ్గర్లో ఉన్న రామప్ప దేవాలయంతో కలిపి ‘యునెస్కో’ వారసత్వ హోదా కోసం దరఖాస్తు చేయాలని పురావస్తు శాఖ యోచిస్తోంది.
‘శాండ్ బాక్స్’ పరిజ్ఞానం
కాకతీయ రాజైన గణపతి చక్రవర్తి హయాంలో 13 శతాబ్దంలో ఈ మహా ఆలయాల సమూహం నిర్మితమైంది. భూకంపాలను తట్టుకునేలా పునాదుల్లో ‘శాండ్ బాక్స్’ (మూడు మీటర్ల మందంతో ఇసుకను నింపటం) టెక్నాలజీని ఉపయోగించారు. అనంతర కాలంలో ఢిల్లీ నుంచి ఔరంగజేబు ఉలూఫ్‌ఖాన్‌ను పురామాయించి ఈ ఆలయాలను ధ్వంసం చేయించారు. కాలక్రమంలో దిగువన ఉన్న ఇసుక 10 శాతం మేర బయటికి వెళ్లిపోయింది. దీంతో ఖాళీ ఏర్పడి ఆలయాలు కుంగిపోయాయి. ఇలాగే కొనసాగితే కొద్ది కాలంలోనే ఉన్న సంపద కూడా పూర్తిగా నేలమట్టం కావడం ఖాయం.
ఇప్పుడేం చేస్తారు?
గట్టిపడ్డ పునాది ఎంత బరువును ఆపగలుగుతుంది.. పైన ఆలయ పునరుద్ధరణకు అవలంబించాల్సిన పద్ధతులు.. ఆలయ రాళ్ల పటుత్వం, అక్కడి నేల స్వభావం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నీళ్లు వచ్చి ఆలయ పునాదుల్లోకి చేరకుండా చేయాల్సిన పనులు.. అక్కడి వాతావరణం.. వంటి అంశాలపై నిపుణులు పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. వారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తారు. పునరుద్ధరణకు దాదాపు రూ.10 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సింగరేణి, కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం వంటి ఇతర సంస్థల సాయాన్ని కూడా కోరనున్నారు. ఈలోపు అందుబాటులో ఉన్న రూ.2 కోట్లతో పనులు మొదలుపెట్టనున్నారు.
► పునాదుల్లోకి అవసరమైన ఇసుకను నింపి, దానిపై పురాతన పద్ధతిలో రాతి కట్టడాన్ని పేరుస్తారు. రాళ్ల మధ్య బాండింగ్‌కు స్టీలు పట్టీలు, రాళ్ల మధ్య రంధ్రాలు చేసి స్టీలు వైరుతో కదలకుండా చేస్తారు.
►ఆలయం చుట్టూ పచ్చిక బయళ్లు, పర్యాటకుల విడిది కేంద్రాలు నిర్మించి దక్షిణ భారత్‌లోనే దీన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రణాళికలు రచిస్తున్నారు. రామప్ప దేవాలయం, రామప్ప, లక్నవరం చెరువులతో దీన్ని ఒకే ప్రాంగణంగా మార్చాలని భావిస్తున్నారు.
తొలి దశలో ఏం చేశారంటే..
ఈ గుళ్లను పునరుద్ధరించేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం నుంచి వచ్చిన రూ.3 కోట్ల సీఎఫ్‌ఏ నిధులతో ఈ ఏడాది ప్రారంభంలో పనులు చేశారు. తొలుత ప్రధాన ఆలయం పునాదుల చుట్టూ, ప్రదక్షిణ పదం, పై భాగంలో బోరు యంత్రంతో 6 మీటర్ల మేర 340 రంధ్రాలు చేసి ఎయిర్ కంప్రెషర్‌ల ద్వారా సున్నం పేస్ట్‌ను లోపలికి పంపారు. అది పునాదుల్లోకి చేరి అక్కడ మిగిలిన ఇసుక వెలుపలికి రాకుండా గట్టిపడేలా చేసింది. దీంతో పునాదులు పటిష్టంగా మారాయి.