ఎలిఫెంటా కేవ్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ముంబయి టూర్‌లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. సముద్రం మధ్యలో ఓ దీవి. అందులో ఓ కొండ. ఆ కొండలో తొలిచిన గుహలివి. అయితే ఈ కొండ మీద కానీ, గుహల్లోనూ ఎంత వెదికినా ఏనుగు మాత్రం కనిపించదు. బ్రిటిష్ వారు ముచ్చటపడి తమ దేశం తీసుకెళ్లాలనుకున్నారట.
పెకలించే ప్రయత్నంలో డ్యామేజ్ అవడంతో ఏనుగును వదిలేసి కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనంతో సరిపెట్టుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనవాళ్లు డ్యామేజ్ అయిన ఏనుగు విగ్రహానికి మరమత్తులు చేసి నగరంలోని శివాజీ మ్యూజియంలో ఉంచారు. ఏనుగు లేదని ఈ గుహలను చూడడం మానుకోకూడదు. ఈ గుహలు మన వారసత్వానికి ప్రతీకలు. ఈ గుహలను చేరడానికి అరేబియా సముద్రంలో సాగే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.
నీరెండలో కడలి విహారం
ఎలిఫెంటా కేవ్స్‌కి ముంబయిలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫెర్రీలో వెళ్లాలి. ఫెర్రీలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే తీసుకెళ్తాయి. ఈ సీజన్‌లో మిట్ట మధ్యాహ్నం కూడా సూర్యుడు గోరువెచ్చగానే ఉంటాడు. ఫెర్రీ బోట్‌పై అంతస్థులో ప్రయాణిస్తూ ముంబయి తీరంలో అరేబియా తీరాన్ని వీక్షించడం ఆహ్లాదకరం మాత్రమే కాదు ఓ ఎడ్యుకేషన్ కూడా. హార్బర్‌కు వచ్చిన షిప్పులు పోర్టులో బెర్త్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ లంగరు వేసుకుని ఉంటాయి.
వాటిలో క్రూ డెక్ మీదకు వచ్చి సముద్రాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. బకెట్‌కి తాడు కట్టి బావిలో నీటిని తోడినట్లు సముద్రపు నీటిని తోడుకుని షిప్ లోపలికి వెళ్తుంటారు. ఇంటర్నేషనల్ కార్గోలను అంత దగ్గరగా చూడడం కుదరని పని. ఎలిఫెంటా కేవ్స్ టూర్‌లో ఇది బోనస్. షిప్పులు తీరానికి రెండు కిలోమీటర్ల వరకు ఆగి ఉంటాయి. వాటిని చూస్తూ ప్రయాణించడం వల్ల కేవ్స్‌కు పదికిలోమీటర్లు ప్రయాణించిన విషయం అర్థం కాదు.
కడలి గర్భం నుంచి తీరాన్ని చూడవచ్చు
కొండ దగ్గర ఫెర్రీ దిగిన తర్వాత దాదాపు కిలోమీటరు దూరం నడవాలి. గుహలను చేరడానికి టాయ్‌ట్రైన్ ఉంది. కానీ ఎప్పుడో ఒక ట్రిప్పు తిరుగుతుంది. ట్రైన్ కోసం ఎదురు చూడాలా నడవాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. సముద్రం లోపల పది కిలోమీటర్ల దూరం నుంచి తీరాన్ని చూడడం బాగుంటుంది. సముద్రపు అలలు, మరోవైపు కొండలను చూస్తూ సాగే ఆ నడక కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఇంతటి వైవిధ్యతను ఆస్వాదిస్తూ గుహల్లోకి అడుగుపెట్టిన తర్వాత అది మరో ప్రపంచం.
శిల్పాలు మాట్లాడతాయి!
ఈ గుహలు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటివి. శిల్పాల్లో బౌద్ధం, శైవం ప్రభావం కనిపిస్తుంది. ఒక్కో శిల్పం ఒక్కో కావ్యంతో సమానం. మనం చూస్తున్న శిల్పంలో దాగిన కావ్యకథ గైడ్ వివరించే వరకు అర్థం కాదు. విధ్వంసకారులు ఏ శిల్పాన్నీ వదల్లేదు. ప్రతి శిల్పానికి ఎక్కడో ఓ చోట గాయం తప్పనిసరి. హీనయాన బౌద్ధులు ఈ కొండలను తొలిచి ఆవాసాలుగా మలుచుకున్నారు.
బౌద్ధ శిల్పాలను చెక్కారు. శివపురాణం ఆధారంగా చెక్కిన ఘట్టాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. బౌద్ధం సన్నగిల్లిన తర్వాత ఈ ప్రదేశం హిందువుల ఆధీనంలోకి వచ్చింది. శైవం పతాకస్థాయికి చేరిన కాలంలో కాలచూరులు, రాష్ట్రకూటులు ఈ శిల్పాలను చెక్కించారు. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో సమాజం స్త్రీ పురుష సమానత్వం గురించి ఆలోచించింది. సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి శైవాన్ని మాధ్యమం చేసుకుంది. అలా రూపొందిన శిల్పమే అర్ధనారీశ్వరుడి శిల్పం. పిఎస్: ఎలిఫెంటా కేవ్స్ సందర్శనకు సోమవారం సెలవు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
(చదవండి: ఆర్ట్‌తో మూగ జీవుల సంక్షేమంపై అవగాహన..!)
Comments
Please login to add a commentAdd a comment