సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
రాయదుర్గం: హైదరాబాద్‌కు యునెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాలు ఉన్నాయని, ఎన్నింటినో గుర్తించి, ఆధునీకరించామని, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. శనివారం నగరంలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
నగరంలో క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ 2036 నాటికి ఒలింపిక్స్ హౌజ్ నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న ఉప్పల్, ఎల్‌బీ స్టేడియాలను మరింత ఆధునీకరించి, కొత్త స్టేడియాలను, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తామన్నారు. నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తున్నామని, వచ్చే పదేళ్లలో 24 గంటలపాటు తాగునీరు అందేలా చేయాలని, వచ్చే అయిదేళ్ల కాలంలో రోజువారీగా తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరాన్ని తొమ్మిదిన్నరేళ్లలో భూతల స్వర్గం చేశామని చెప్పమని, కానీ చిత్తశుద్ధితో కష్టపడి ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేశామని చెప్పగలనన్నారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేలా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
జీహెచ్‌ఎంసీకి మరో ఇద్దరు అదనపు కమిషనర్లు
హైదరాబాద్ అభివృద్ధి కోసం జీహెచ్‌ఎంసీలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించాలనే ప్రతిపాదన ఉందని కేటీఆర్ చెప్పారు. చెరువులు పరిరక్షణ, పర్యవేక్షణ, సుందరీకరణకు ఒక ప్రత్యేక కమిషనర్, పార్కులు, హరిత పరిరక్షణకు మరో ప్రత్యేక కమిషనర్‌ను నియమించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో కాలుష్య రహిత రవాణా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మెట్రోను రానున్న కాలంలో 415 కి.మీ.కు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. లింకురోడ్ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేస్తున్నామని, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ ఈ ప్లాన్ చాలా బాగుందని మెచ్చుకున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment