
సాక్షి, అమరావతి: జనవరి వచ్చేలోపు గ్రామాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల్లో సంతృప్తి పెరిగేలా పనిచేయాలని నిర్దేశించారు. గ్రామదర్శిని కార్యక్రమం అమలుకోసం నియమితులైన నోడల్ అధికారుల సదస్సును బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సాధికార మిత్రలకు శిక్షణ ఇవ్వాలని, వారి పనితీరును పర్యవేక్షించాలని నోడల్ అధికారులకు సూచించారు. నోడల్ అధికారులు ప్రభుత్వ ప్రతినిధులని, ప్రతిభ చూపి ప్రజల్లో సంతృప్తి పెంచాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.
ఉద్యోగుల వైఖరితో ఇబ్బంది..
సంక్షేమ పథకాలు పెద్దఎత్తున అమలు చేస్తున్నా ఉద్యోగుల వైఖరి వల్ల ఇబ్బంది ఏర్పడుతోందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేకూర్చినా రేషన్, పింఛన్ పంపిణీ సందర్భంగా ఉద్యోగులు అసహనం వ్యక్తం చేయడం, కరుగ్గా మాట్లాడడం వల్ల సంతృప్తి రావట్లేదన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత పెంచాలని కోరారు.
సంతోష స్థాయిలో దేశం వెనుకబడినా మనం ముందున్నాం..
అన్ని రాష్ట్రాలకు అవతరణ దినోత్సవాలు ఉన్నా మన రాష్ట్రానికే అవతరణ దినోత్సవం లేదని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆరు దశాబ్దాల ఆటుపోట్లే అందుకు కారణమన్నారు. అయినప్పటికీ దేశంలోనే వృద్ధిరేటులో ముందున్నామన్నారు. హ్యాపీనెస్(సంతోష సూచిక) ఇండెక్స్‌లో రాష్ట్రం 74వ స్థానం నుంచి 44వ స్థానానికి పెరిగితే.. దేశం 122 నుంచి 133వ స్థానానికి పడిపోయిందన్నారు. తొలుత తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతి పట్ల సంతాపం తెలుపుతూ తీర్మానం చేశారు. సీఎం మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తోనూ, తనతోనూ కరుణానిధికి సాన్నిహిత్యముందని చెప్పారు. సమావేశంలో మంత్రులు పుల్లారావు, పితాని, లోకేష్, సీఎస్ దినేశ్‌కుమార్ పాల్గొన్నారు. కాగా, గ్రామదర్శిని పేరుతో నిర్వహించిన ఈ ఒకరోజు వర్క్‌షాపునకు ఏకంగా రూ.36 లక్షలు ఖర్చుచేయడం గమనార్హం. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ ప్రణాళికాశాఖ ఉత్తర్వులిచ్చింది.
త్వరలో వర్సిటీల్లో జపాన్ భాష
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో త్వరలో జపాన్ భాషను ప్రవేశపెడతామని సీఎం చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం జపాన్ రాయబారి కెంజి హిరమట్సు బృందంతో ఆయన సమావేశమయ్యారు. పర్యాటక శాఖకు చెందిన ఆధునిక ఓల్వో బస్సులను సీఎం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ సమీపంలో బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులను విశాఖపట్నం నుంచి తిరుపతికి తిప్పుతామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment