స్టార్.. స్టార్... దగా స్టార్
విజయవాడ నడిబొడ్డున ముఖ్యనేత భూదందా
⇒ రూ.200 కోట్ల విలువైన ట్రాన్స్‌కో భూమికి ఎసరు
⇒ 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవాలని ఆదేశం
⇒ సర్వే ప్రారంభించిన పర్యాటక శాఖ అధికారులు
⇒ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్ అభ్యంతరాలు బేఖాతరు
⇒ స్టార్ హోటల్ నిర్మాణం పేరిట బినామీ సంస్థకు ధారాదత్తం!
⇒ కొంతకాలం తర్వాత చినబాబుకు అప్పగించేలా ఒప్పందం
విజయవాడ నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన ఐదెకరాల ప్రభుత్వ భూమి. అందులో ఒక బ్రహ్మాండమైన ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించే బాధ్యత ఓ ప్రముఖ హోటల్ నిర్వహణ సంస్థది. వాళ్లు ఆ హోటల్ నిర్మించి, కొంతకాలం పాటు లాభాల బాటలో నడిపించిన తర్వాత చినబాబుకు కట్టబెడతారు. ఇదీ చినబాబు వేసిన అదిరిపోయే స్కెచ్. అంటే కాణీ ఖర్చు లేకుండా రాజధాని నగరంలో చినబాబు ఖాతాలో ఖరీదైన హోటల్ పడబోతోందన్నమాట.
ఈ భూమి ప్రస్తుతం విద్యుత్ శాఖ అధీనంలో ఉంది. చినబాబు స్కెచ్ వేయగానే భూమిని స్వాధీనం చేసుకుని, ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు పర్యాటక శాఖ అధికారులు సర్వే ప్రారంభించారు.
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో చినబాబు, ప్రభుత్వ పెద్దలు ఏపీ ట్రాన్స్‌కో– ఏపీఎస్పీడీసీఎల్‌కు చెందిన రూ.200 కోట్ల విలువైన 4.80 ఎకరాల భూమిని బినామీల ముసుగులో హస్తగతం చేసుకునేందుకు పథకం వేశారు. లీజు పేరిట 99 ఏళ్లకు దక్కిం చుకునేందుకు పన్నాగం పన్నారు. అందు కోసం అన్ని నిబంధనలను బేఖాతరు చేస్తూ పర్యాటక శాఖ ద్వారా రంగంలోకి దిగారు. ట్రాన్స్‌కో, సదరన్ డిస్కం ఉద్యోగుల అభ్యం తరాలను కూడా వారు లెక్కచేయడం లేదు. మరోవైపు తాము ఈ భూదందాలో కేవలం పావులమేనని, అసలు బాగోతం అంతా ప్రభుత్వ ముఖ్యనేతదేనని పర్యాటక శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం.
లోపాయికారీ ఒప్పందం
రాజధానిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిం చేందుకు స్టార్ హోటళ్లు నిర్మించే ముసుగులో ఆ 4.80 ఎకరాలను దక్కించుకోవాలని ముఖ్యనేత వ్యూహం పన్నారు. ఇప్పటికే స్టార్ హోటళ్లు నిర్వహిస్తున్న ఓ కార్పొరేట్ సంస్థతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం... సదరు సంస్థకు 99 ఏళ్ల లీజు పేరిట ఆ 4.80 ఎకరాలను కట్టబెడతారు. ఆ సంస్థ చినబాబుకు బినామీగా ఉంటూ స్టార్ హోటల్‌ను నిర్మించాలి. దాన్ని కొంతకాలం నిర్వహించిన అనంతరం పూర్తిగా చినబాబుకే అప్పగించాలి.
ట్రాన్స్‌కోకు సమాచారం లేదు
స్టార్ హోటల్ నిర్మాణానికి వీలుగా 4.80 ఎకరాలను లీజుకు ఇచ్చేందుకు వెంటనే టెండర్లు పిలవాలని పర్యాటక శాఖను ముఖ్యనేత కార్యాలయం ఆదేశించింది. ట్రాన్స్‌కో, ఏపీ ఎస్పీడీసీఎల్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. భూమి అప్పగించకుండా తాము టెండర్లు ఎలా పిలుస్తామని పర్యాటక శాఖ అధికారి ఒకరు సందేహం వ్యక్తం చేశారు. అదంతా తాము చూసుకుంటామని, టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు మొదలుపెట్టాలని ముఖ్యనేత స్పష్టం చేసినట్లు సమాచారం.
ఏదైనా ఉంటే పెద్దలతో మాట్లాడుకోండి
ముఖ్యనేత ఆదేశాలతో పర్యాటక శాఖ రంగంలోకి దిగింది. విద్యుత్తు సౌధ ప్రాంగణంలోని భూమిని శుక్రవారం సర్వే చేసింది. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. తమ సంస్థకు చెందిన భూమిని పర్యాటక శాఖ సర్వే చేయడమేమిటని ప్రశ్నించారు. ఆ భూమిని పర్యాటక శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే తాము సర్వే చేస్తున్నామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు ఏదైనా ఉంటే సచివాలయంలో పెద్దలతో మాట్లాడుకోవా లని, తమ సర్వేను అడ్డగించవద్దని తేల్చిచెప్పారు.
స్టార్ హోటల్‌పై చినబాబు మక్కువ
విజయవాడ ఏలూరు రోడ్డులోని గుణదలలో విద్యుత్తు సౌధ భవన ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణంలో దాదాపు 4.80 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. 1952 నుంచి అప్పటి రాష్ట్ర ఎలక్ట్రికల్ బోర్డు అధీనంలో ఈ భూమి ఉంటూ వచ్చింది. ఏపీఎస్‌ఈబీని విభజించిన తరువాత ఈ భూమిని ఏపీ ట్రాన్స్‌కో, సదరన్ డిస్కంలకు ఉమ్మడిగా కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా మార్కెట్ ధర రూ.40 కోట్లకు పైమాటే. ఆ లెక్కన మొత్తం భూమి మార్కెట్ విలువ దాదాపు రూ.200 కోట్లు. ఖాళీగా ఉన్న ఈ విలువైన భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న చినబాబు ఆ భూమిలో ఓ స్టార్ హోటల్ నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ముఖ్యనేత ఓ కార్పొరేట్ సంస్థ ముసుగులో చినబాబు స్టార్ హోటల్‌కు అడ్డంకుల్లేకుండా ఎత్తుగడ వేశారు.
ప్రైవేట్‌కు అప్పగిస్తే ట్రాన్స్‌కోకు తీవ్ర నష్టం
రాష్ట్ర విభజన అనంతరం మౌలిక వసతులు లేక ట్రాన్స్‌కో, ఏపీఎస్సీడీసీఎల్ సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగుల శిక్షణ కేంద్రం, ఆర్‌అండ్‌డీ కేంద్రం కూడా లేవు. విజయవాడలో నీటిపారుదల శాఖకు చెందిన స్థలంలో ఎస్పీడీసీఎల్ భవనం ఉంది. ఆ భవనాన్ని ఖాళీ చేయాలని నీటిపారుదల శాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. విద్యుత్తు సౌధ ప్రాంగణంలోనే ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్‌లకు భవనాలను నిర్మించాలని యోచిస్తున్నారు. కానీ, తమ సంస్థలకు చెందిన భూమిని ప్రైవేట్‌కు కట్టబెట్టడం ఏమిటని ట్రాన్స్‌కో, ఎస్పీ డీసీఎల్ అధికారులు, ఉద్యోగులు నిలదీస్తున్నారు. ట్రాన్స్‌కోకు నష్టాన్ని కలిగించే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ట్రాన్స్‌కో ఇంజనీర్ల అసోషియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, సంఘ ప్రతినిధి కోటేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు.
సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
‘‘ఈ భూమి ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్ ఉమ్మడి ఆస్తి. ఎస్పీడీసీఎల్‌కు సొంత భవనం లేదు. భవిష్యత్తులో ట్రాన్స్‌కో అవసరాలు పెరుగుతాయి. అప్పుడు మేము ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్లాలా? ట్రాన్స్‌కో చెందిన విలువైన ఆస్తిని ప్రైవేటుకు కట్టబెడతారా? ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం’’
– ఉదయ్‌కుమార్, ట్రాన్స్‌కో ఇంజనీర్ల సంఘం అదనపు కార్యదర్శి