దోచుకున్నోడికి దోచుకున్నంత!
♦ పర్యాటక శాఖలో కొందరు అధికారుల ఇష్టారాజ్యం
♦ మంత్రి చందూలాల్ సీరియస్
♦ పూర్తి నివేదిక అందించాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టూరిజం బస్సు టికెట్లు విక్రయించే ట్రావెల్ ఏజెంట్లు పర్యాటక శాఖకు దాదాపు రూ. 50 లక్షలు బకాయిపడ్డారు. అధికారులు వారిని అడగడమే లేదు.
► పర్యాటకాభివృద్ధి సంస్థ బస్సులను శుభ్రం చేసే యంత్రంలో చిన్న మరమ్మతు... రూ. 10వేలతో దాన్ని సరిచేయవచ్చు. అయినా దాన్ని మూలన పడేసి క్లీనింగ్ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఇందుకు రూ.లక్షలు చెల్లిస్తున్నారు.
► టూరిజం హోటళ్లలో నిర్వహణ పేరుతో రూ.లక్షలు దుబారా అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ హోటళ్లను తనిఖీ చేయకుండానే అధికారులు ‘అంతా బాగుంది’ అనేస్తున్నారు.
► నిబంధనలకు విరుద్ధంగా కనీసం పత్రికా ప్రకటన ఇవ్వకుండా ఇటీవల డ్రైవర్లను నియమించారు. టికెట్లు జారీ చేయకుండానే పర్యాటకులను ఆ బస్సుల్లో తరలిస్తున్న విషయాన్ని విజిలెన్స్ గుర్తించింది.
అయినా చర్యల్లేవు...
వీటన్నింటి వెనుకా మతలబు ఏమిటి, అధికారుల చర్యల్లోని మర్మం ఏమిటనేది సందేహాస్పదంగా మారింది. పర్యాటకశాఖలో అధికారుల అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్లుగా పాతుకుపోయిన కొందరు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నిధులను మింగేస్తున్నారు. వారిపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా చర్యలుండవు. ఇటీవల ఆ శాఖ పనితీరును సమీక్షించిన మంత్రి చందూలాల్ దాదాపు 30 అంశాలపై ఆరోపణలను ప్రస్తావిస్తూ.. వివరణ అడిగారు.
మంత్రి అసహనం
గతంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులుగా పనిచేసిన వారి కనుసన్నల్లో మెలుగుతూ... అర్హతల్లేకున్నా పదోన్నతులు పొందిన కొందరు అధికారులపై ఆరోపణలున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించినట్లు తెలి సింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో కొందరు అధికారుల అవినీతి వ్యవహారాన్ని విజిలెన్స్ బట్టబయలు చేసినా చర్యలు తీసుకోకపోవడం, ఇప్పుడు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలో వారికి కీలక బాధ్యతలు అప్పగించడంపైనా ప్రశ్నించినట్లు సమాచారం.
ఇక హైదరాబాద్‌లోని యాత్రీ నివాస్ లీజుల విషయంలో నెలకొన్న గందరగోళంపైనా మంత్రి అసహనం వ్యక్తం చేశారు. దీని వెనుక కొందరు అధికారుల హస్తముందని, దీనిని సరిదిద్దాలని పేర్కొన్నట్టు సమాచారం. ఇక కొన్ని పర్యాటక ప్రాంతాల్లో నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లించారని మంత్రి నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై తనకు నివేదిక అందజేయాలన్నారు.