Travel agents
-
Union Budget 2024-25: పర్యాటకానికి పరిశ్రమ హోదా..
పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కల్పించాలని ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది.దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్టీ రేటును 12 శాతానికి క్రమబద్ధీకరించాలని ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మగోవ్ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్‌స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు.‘విద్యుత్ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్‌లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కల్పిస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్టర్న్ ఇండియా) ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వన్ ఇండియా.. వన్ టూరిజం
పర్యాటకానికి సంబంధించి దేశం మొత్తం మీద ఒకే విధానం అమలయ్యేలా వన్ ఇండియా వన్ టూరిజం పద్ధతిని పరిశీలించాలని ట్రావెల్ ఏజెంట్ల అసోసియేషన్ (టీఏఏఐ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఒకే పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చే అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని కోరింది. తద్వారా మహమ్మారి ధాటికి సంక్షోభంలో చిక్కుకున్న దేశీ ట్రావెల్, టూరిజం, ఆతిథ్య రంగానికి తోడ్పాటు అందించాలని టీఏఏఐ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, సంబంధిత వర్గాలందరికీ విమాన ప్రయాణం మరింత చౌకగా అందుబాటులో ఉండేలా విమాన ఇంధనాన్ని (ఏటీఎం) కూడా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేర్చాలని కోరింది. అలాగే, అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం (ఈసీఎల్జీఎస్) పరిధిని మరింత విస్తృతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రం, రాష్ట్రాలు తోడ్పాటునివ్వాలి.. టూరిజం రంగం కోలుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటునివ్వాలని టీఏఏఐ పేర్కొంది. విచక్షణాయుత ఖర్చులు పెట్టేందుకు వీలుగా మధ్యతరగతి ప్రజల చేతిలో తగు స్థాయిలో డబ్బులు ఆడేందుకు సముచిత చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. స్టార్టప్‌లు, చిన్న .. మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) వర్కింగ్ క్యాపిటల్ భారాన్ని తగ్గించేందుకు, నగదు లభ్యత మెరుగుపడేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. అలాగే ఆదాయపు పన్ను రేటు, జీఎస్టీ రేటును తగ్గించాలని, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. 2022–2023లో అన్ని టూరిస్ట్ వీసాలపై ఈ–వీసా ఫీజు మినహాయింపునివ్వాలని పేర్కొంది. ఎంఎస్ఎంఈలను పటిష్టం చేయడం, పరిశ్రమలో టెక్నాలజీ వినియోగానికి ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమును ఏర్పాటు చేయడం, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం క్రెడిట్ ఆధారిత క్యాపిటల్ సబ్సిడీ స్కీము (సీఎల్సీఎస్ఎస్)ను పునరుద్ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని టీఏఏఐ కోరింది. అలాగే, ట్రావెల్ ఏజెంట్లు, ఆపరేటర్ల మనుగడ కోసం వారికి రావల్సిన చెల్లింపులకు భద్రత కల్పించే విధంగా తగు వ్యవస్థను నెలకొల్పాలని విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ ఎంఐసీఈ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) కార్యక్రమాలను భారత్‌కు రప్పించే దిశగా, దేశీ ఎంఐసీఈ కంపెనీలు అంతర్జాతీయ బిడ్డింగ్‌లలో పాల్గొనేందుకు ఉపయోగపడే గ్లోబల్ బిడ్డింగ్ ఫండ్ ఏర్పాటు అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని టీఏఏఐ కోరింది. -
వారికోసం కొత్త ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేసిన సోనూసూద్..!
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి తన వంతు సాయమందిస్తూ రియల్ హీరో అయిపోయాడు నటుడు సోనూసూద్. లాక్డౌన్ సమయంలో అనేక మందిని వారి సొంత ఊర్లకు చేరవేయడంలో సోనూసూద్ ఎంతగానో కృషి చేశారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రయాణికుల అవసరాల కోసం సరికొత్త ప్లాట్‌ఫాంను సోనూసూద్ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ట్రావెల్ ఏజెంట్ల కోసం ‘ట్రావెల్ యూనియన్’ అనే ప్లాట్‌ఫాంను సోనూసూద్ లాంచ్ చేశారు. సోనూసూద్ ఏర్పాటు చేయనున్న ఈ ప్లాట్‌ఫాం భారత తొలి గ్రామీణ బీ2బీ(బిజినెస్ టూ బిజినెస్) ట్రావెల్ టెక్‌ప్లాట్‌పాంగా నిలవనుంది.దీంతో గ్రామీణ ప్రయాణికులు మరింత సౌకర్యవంతమైన ప్రయాణసేవలను పొందనున్నారు. గ్రామీణ స్థాయిలో ట్రావెలింగ్ సెక్టార్ అసంఘటితంగా ఉంది. టైర్ 2 పట్టణాల్లోని ప్రయాణికులకు సేవలను అందించడానికి పలు ట్రావెలింగ్ సంస్థలు పెద్దగా మొగ్గుచూపడంలేదు. గ్రామీణ ప్రయాణికుల కోసం ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫామ్స్ అసలు లేవని ట్రావెల్ యూనియన్ సంఘాలు పేర్కొన్నాయి. సోనూసూద్ ఏర్పాటుచేసిన ప్టాట్‌ఫాంతో గ్రామీణ ప్రయాణికులకు తక్కువ ధరలోనే ప్రయాణాలను, ఇతర సదుపాయాలను ఆఫర్ చేయవచ్చునని ట్రావెల్ ఏజెంట్లు వెల్లడించారు. ఈ ప్లాట్‌ఫాం మల్టిపుల్ ట్రావెల్ సర్వీస్ పార్టనర్లతో భాగస్వామాన్ని కల్గి ఉంది. అంతేకాకుంగా ఐఆర్సీటీసీ, 500కు పైగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలను, 10,000కు పైగా బస్ ఆపరేటర్లను, 10 లక్షలకు పైగా హోటల్ సదుపాయాలను ఈ ప్లాట్ ఫాం ద్వారా యాక్సెస్ చేయవచ్చును. ప్రస్తుతం ఈ ట్రావెల్ యూనియన్ ప్లాట్‌ఫాం ఇంగ్లీష్, హిందీ భాషలో అందుబాటులో ఉంది. త్వరలోనే మరో 11 రిజనల్ భాషల్లో సేవలను అందించనుంది. రూరల్ బీ2బీ ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫాం ‘ట్రావెల్ యూనియన్’ లాంచ్ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ... “లాక్డౌన్ సమయంలో ప్రయాణాల విషయంలో గ్రామీణ భారతీయులు ఎదుర్కొనే సవాళ్లను నేను ప్రత్యక్షంగా చూశాను. గ్రామీణ ప్రయాణికులు ముందుగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే అవకాశం లేదు. వారి ప్రయాణాల కోసం మల్టీపుల్ ట్రావెల్ ఆపరేటర్లను సంప్రదించాల్సి ఉంటుంద’ని పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫాంతో గ్రామీణ ప్రయాణికులు ఏలాంటి అడ్డంకులు లేని ప్రయాణ అనుభూతిని పొందవచ్చునని తెలిపారు. -
వ్యాక్సిన్ : లండన్‌కు క్యూ కట్టనున్న ఇండియన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడంతో భారతీయులు బ్రిటన్ వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం బుధవారం ఆమోదించిన కోవిడ్-19 ఫైజర్ వ్యాక్సిన్ కోసం వీలైనంత త్వరగా యూకే వెళ్లాలని భావిస్తున్నారట.చాలామంది వీసాదారులు ట్రావెల్ ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. ఈ మేరకు తమకు కాల్స్ రావడం ప్రారంభమైందని ట్రావెల్ ఏజంట్లు చెబుతున్నారు. అటు ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ట్రావెల్ ఏజెన్సీలు కూడా భారీ ప్రణాళికలతో సిద్ధమైపోతున్నాయి.(ఫైజర్ టీకా వచ్చేసింది!) వచ్చే వారం నుంచే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎపుడు, ఎలా వెళ్లాలి, ఐసోలేషన్ నిబంధనలు ఏమిటి అంటూ చాలామంది తమను ప్రశ్నిస్తున్నారని ముంబైకి చెందిన ట్రావెల్ ఏజెంట్ తెలిపారు. క్వారంటైన్ లేకుండా లండన్‌కు షార్ట్ ట్రిప్ ఏదైనా ఉందా అని కొంతమంది వాకబు చేసినట్టు బెంగుళూరుకు చెందిన మరో ట్రావెల్ కంపెనీ తెలిపింది. లండన్ వెళ్లే భారతీయులకోసం మూడు రాత్రుల ప్యాకేజీని ప్రారంభించాలని యోచనలో ఉన్నాయి కంపెనీలు. ఈ నెల(డిసెంబరు) 15 నుంచి తమ దేశంలో అడుగుపెట్టే ప్రతి విదేశీయుడూ 5 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని, ఆరో రోజున ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని బ్రిటన్ కఠిన ఆంక్షలు విధించింది. (పిజ్జా హట్ కో ఫౌండర్ ఇక లేరు) లండన్ పర్యటనకు ఇది ఆఫ్‌బీట్ సీజన్ అయినప్పటికీ ఫైజర్ వ్యాక్సిన్ గురించి బుధవారం ప్రకటించిన మరుక్షణం, యూకే వీసాలున్న భారతీయులు వాక్సిన్ లభ్యతపై ఎంక్వైరీ మొదలు పెట్టారని ఈజ్ మై ట్రిప్ డాట్ కామ్ సీఈఓ నిషాంత్ వెల్లడించారు. అయితే భారతీయ పాస్ పోర్టు హోల్డర్లు అక్కడ వ్యాక్సినేషన్‌కు అర్హులా కారా అన్నది ఇపుడే తేల్చలేమన్నారు. దీనిపై ప్రభుత్వం నుండి స్పష్టత కోసం వేచి చూస్తున్నా మన్నారు. మరోవైపు విమాన టికెట్ల రేట్ల విషయమై వివిధ విమానయాన సంస్థలను సంప్రదిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే లండన్ హోటళ్లతో, అక్కడి ఆసుపత్రులతో కూడా సంప్రదింపులు జరుపు తున్నామని, ఇప్పటికే లండన్ హోటళ్ళతో ఒప్పందాలున్నాయని వెల్లడించారు. అయితే ఆ దేశం నుంచి అధికారికంగా తమకు సమాచారం లభించాల్సి ఉందని మరికొందరు ట్రావెల్ ఏజంట్లు చెబుతున్నారు. అయితే ఫైజర్ వ్యాక్సిన్ ప్రభావం, సమర్థతను తెలుసుకోవాలనుకుంటున్న ప్రజలు వేచి చూసే ధోరణిలో ఉన్నారని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు జ్యోతి మాయల్ చెప్పారు. సైడ్ ఎఫెక్ట్స్ పై కూడా కొందరు భయపడుతున్నట్టు తెలుస్తోంది. కాగా కరోనా తొలి వ్యాక్సిన్ ఆమోదించిన తొలి దేశంగా యూకే నిలిచింది. ఫైజర్, బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ప్రయోగాల ఫలితాల ఆధారంగా అక్కడి స్వతంత్ర రెగ్యులేటర్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీకి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
వీసా పేరిట టోకరా
సుల్తాన్‌బజార్: వివిధ దేశాలలోని పర్యాటక ప్రదేశాలు సందర్శించేందుకు వీసాలు, ఫ్లయిట్ టిక్కెట్లు ఇప్పిస్తానని దాదాపు 100 మంది వద్ద రూ.1కోటీ 32 లక్షలు మోసం చేసిన ఓ ట్రావెల్ ఏజెంట్‌ను శుక్రవారం సుల్తాన్‌బజార్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ సుబ్బారామిరెడ్డి తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన నితిన్‌కుమార్ అగర్వాల్(38), బషీర్‌బాగ్‌లో నివాసం ఉంటూ అదే ప్రాంతంలో యాస్ వెకేషన్స్ పేరిట ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా వివిధ దేశాలలో సందర్శక ప్రాంతాలను సందర్శించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నితిన్‌కుమార్‌ను ఆశ్రయించారు. దాదాపు 100 మంది వద్ద లక్ష నుంచి రెండు లక్షల చొప్పున వసూలు చేసిన నితిన్‌కుమార్ వారికి విసా, ప్లాయిట్ టికెట్లు ఇప్పించడంలో ఆలస్యం చేయడంతో అనుమానం వచ్చిన వినియోగదారులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీంతో సుల్తాన్‌బజార్‌కు చెందిన ఖలీల్, పాండురంగ మరో 20 మంది వద్ద ఈ జూన్ 22న యూరప్, థాయ్‌లాండ్, ఉజ్జయినీ లాంటీ ప్రాదేశాలకు తీసుకువెళ్లేందుకు వీసా, టికెట్లు ఇప్పిస్తానంటూ నమ్మబలికి వారి వద్ద రూ. 9.70 లక్షలు వసూలు చేశాడు. వినియోగదారులు తమ డబ్బు తమకు అప్పగించాలని ఒత్తిడి తీసుకురావడం, అప్పులు అధికం కావడంతో నితిన్‌కుమార్ తాను ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్‌నోటు రాసి ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు సైఫాబాద్ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ నమోదు చేయించారు. అదే పోలీసుస్టేషన్లో నితిన్‌కుమార్ భా«ధితులు తమను చీటింగ్ చేశాడని సైతం కేసు నమోదు అయ్యింది. విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్, నల్లకుంట ప్రాంతాలకు చెందిన భాధితులు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఈ నెల 11వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ చంద్రమోహన్ కేసునమాదు చేసుకుని ధర్యాప్తులో భాగంగా బషీర్‌బాగ్‌లో నిందితుడు నితిన్‌కుమార్‌ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించారు. తనకు వెండిబంగారు నగల దుకాణం ఉందని దానిలో ప్రయాణికుల వద్ద తీసుకున్న డబ్బును పెట్టడంతో నష్టం వచ్చిందని విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
ఎయిరిండియాలో ఆ సీట్లు ఇక కాస్ట్లీనే!
మీ కుటుంబమంతా కలిసి ఒకే దగ్గర కూర్చుని ఎయిరిండియా విమానంలో ప్రయాణించాలనుకుంటున్నారా...? అయితే ఇక ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందేనట. సదూర విమానాల్లో ముందు వరుస సీట్లకు ఇప్పటివరకు ఛార్జీలు విధిస్తున్న ఎయిరిండియా.. తాజాగా మధ్య సీట్లకు, విండో సీట్లకు, ఎక్కువ వరుస సీట్లకు ఛార్జీలు విధించాలని నిర్ణయించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నింటికీ ఈ ఛార్జీలు వర్తిస్తాయని ఎయిరిండియా పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం పలు రూట్లలో సీటు సెలక్షన్ ఫీజును లిస్ట్ చేస్తూ ట్రావెల్ ఏజెంట్లకు ఓ సర్క్యూలర్ జారీచేసింది. దేశీయ విమానాల్లో మధ్య సీట్లకు ఫీజు రూ.100గా ఎయిరిండియా నిర్ణయించింది. విండో సీటు కోరుకుంటే రూ.200 చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే ఖాఠ్మాండు ప్రయాణాలకు విండో సీట్లకు రూ.100నే ఛార్జీగా విధించనున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వరుసకు ఈ ఫీజు మరింత అధికంగా ఉండనుందని ఎయిరిండియా పేర్కొంది. అయితే ఇది మార్గాలను బట్టి ఉంటుందని తెలిపింది. సీట్ల ఎంపికకు అదనపు ఛార్జీలు విధించడాన్ని కుటుంబ ఫీజుగా ఎయిరిండియా పరిగణిస్తున్నట్టు చెప్పింది. ఈ ఛార్జీలు ఎయిర్‌లైన్స్ రెవెన్యూలు పెంచడానికి దోహదం చేయనున్నాయని తెలిపింది. మధ్య, ఇతర సీట్ల ఎంపికపై ఛార్జీల విధింపును ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్ చేసుకునేటప్పుడు లేదా వెబ్ చెక్-ఇన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. -
దోచుకున్నోడికి దోచుకున్నంత!
♦ పర్యాటక శాఖలో కొందరు అధికారుల ఇష్టారాజ్యం ♦ మంత్రి చందూలాల్ సీరియస్ ♦ పూర్తి నివేదిక అందించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: టూరిజం బస్సు టికెట్లు విక్రయించే ట్రావెల్ ఏజెంట్లు పర్యాటక శాఖకు దాదాపు రూ. 50 లక్షలు బకాయిపడ్డారు. అధికారులు వారిని అడగడమే లేదు. ► పర్యాటకాభివృద్ధి సంస్థ బస్సులను శుభ్రం చేసే యంత్రంలో చిన్న మరమ్మతు... రూ. 10వేలతో దాన్ని సరిచేయవచ్చు. అయినా దాన్ని మూలన పడేసి క్లీనింగ్ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఇందుకు రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ► టూరిజం హోటళ్లలో నిర్వహణ పేరుతో రూ.లక్షలు దుబారా అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ హోటళ్లను తనిఖీ చేయకుండానే అధికారులు ‘అంతా బాగుంది’ అనేస్తున్నారు. ► నిబంధనలకు విరుద్ధంగా కనీసం పత్రికా ప్రకటన ఇవ్వకుండా ఇటీవల డ్రైవర్లను నియమించారు. టికెట్లు జారీ చేయకుండానే పర్యాటకులను ఆ బస్సుల్లో తరలిస్తున్న విషయాన్ని విజిలెన్స్ గుర్తించింది. అయినా చర్యల్లేవు... వీటన్నింటి వెనుకా మతలబు ఏమిటి, అధికారుల చర్యల్లోని మర్మం ఏమిటనేది సందేహాస్పదంగా మారింది. పర్యాటకశాఖలో అధికారుల అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్లుగా పాతుకుపోయిన కొందరు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నిధులను మింగేస్తున్నారు. వారిపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా చర్యలుండవు. ఇటీవల ఆ శాఖ పనితీరును సమీక్షించిన మంత్రి చందూలాల్ దాదాపు 30 అంశాలపై ఆరోపణలను ప్రస్తావిస్తూ.. వివరణ అడిగారు. మంత్రి అసహనం గతంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులుగా పనిచేసిన వారి కనుసన్నల్లో మెలుగుతూ... అర్హతల్లేకున్నా పదోన్నతులు పొందిన కొందరు అధికారులపై ఆరోపణలున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించినట్లు తెలి సింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో కొందరు అధికారుల అవినీతి వ్యవహారాన్ని విజిలెన్స్ బట్టబయలు చేసినా చర్యలు తీసుకోకపోవడం, ఇప్పుడు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలో వారికి కీలక బాధ్యతలు అప్పగించడంపైనా ప్రశ్నించినట్లు సమాచారం. ఇక హైదరాబాద్‌లోని యాత్రీ నివాస్ లీజుల విషయంలో నెలకొన్న గందరగోళంపైనా మంత్రి అసహనం వ్యక్తం చేశారు. దీని వెనుక కొందరు అధికారుల హస్తముందని, దీనిని సరిదిద్దాలని పేర్కొన్నట్టు సమాచారం. ఇక కొన్ని పర్యాటక ప్రాంతాల్లో నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లించారని మంత్రి నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై తనకు నివేదిక అందజేయాలన్నారు.