మీ కుటుంబమంతా కలిసి ఒకే దగ్గర కూర్చుని ఎయిరిండియా విమానంలో ప్రయాణించాలనుకుంటున్నారా...? అయితే ఇక ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందేనట. సదూర విమానాల్లో ముందు వరుస సీట్లకు ఇప్పటివరకు ఛార్జీలు విధిస్తున్న ఎయిరిండియా.. తాజాగా మధ్య సీట్లకు, విండో సీట్లకు, ఎక్కువ వరుస సీట్లకు ఛార్జీలు విధించాలని నిర్ణయించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నింటికీ ఈ ఛార్జీలు వర్తిస్తాయని ఎయిరిండియా పేర్కొంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం పలు రూట్లలో సీటు సెలక్షన్ ఫీజును లిస్ట్ చేస్తూ ట్రావెల్ ఏజెంట్లకు ఓ సర్క్యూలర్ జారీచేసింది. దేశీయ విమానాల్లో మధ్య సీట్లకు ఫీజు రూ.100గా ఎయిరిండియా నిర్ణయించింది. విండో సీటు కోరుకుంటే రూ.200 చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే ఖాఠ్మాండు ప్రయాణాలకు విండో సీట్లకు రూ.100నే ఛార్జీగా విధించనున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వరుసకు ఈ ఫీజు మరింత అధికంగా ఉండనుందని ఎయిరిండియా పేర్కొంది. అయితే ఇది మార్గాలను బట్టి ఉంటుందని తెలిపింది.
సీట్ల ఎంపికకు అదనపు ఛార్జీలు విధించడాన్ని కుటుంబ ఫీజుగా ఎయిరిండియా పరిగణిస్తున్నట్టు చెప్పింది. ఈ ఛార్జీలు ఎయిర్‌లైన్స్ రెవెన్యూలు పెంచడానికి దోహదం చేయనున్నాయని తెలిపింది. మధ్య, ఇతర సీట్ల ఎంపికపై ఛార్జీల విధింపును ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టిక్కెట్ చేసుకునేటప్పుడు లేదా వెబ్ చెక్-ఇన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment