జీఎస్‌టీ రేటు క్రమబద్ధీకరించాలి
ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ డిమాండ్
పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కల్పించాలని ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్‌టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది.
దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్‌టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.
మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్‌టీ రేటును 12 శాతానికి క్రమబద్ధీకరించాలని ఆన్‌లైన్ ట్రావెల్ సేవల సంస్థ మేక్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మగోవ్ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్‌స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు.
‘విద్యుత్ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్‌లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కల్పిస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్టర్న్ ఇండియా) ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment