GST rate
-
Union Budget 2024-25: పర్యాటకానికి పరిశ్రమ హోదా..
పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కల్పించాలని ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది.దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్టీ రేటును 12 శాతానికి క్రమబద్ధీకరించాలని ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మగోవ్ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్‌స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు.‘విద్యుత్ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్‌లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కల్పిస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్టర్న్ ఇండియా) ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జీఎస్టీ పెంపు: ఇలా అయితే డిజిటల్ ఎకానమీ ఎలా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయం.. పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. 2025 నాటికి 1 లక్ష కోట్ల డిజిటల్ ఎకానమీ కావాలన్న భారత్ ఆకాంక్షలకు ఎదురుదెబ్బలాంటిదని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల పరిశ్రమపై పన్ను భారం 1,000 శాతం మేర పెరుగుతుందని ఐఏఎంఏఐ తెలిపింది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్) ఫలితంగా 2.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ స్టార్టప్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. కొత్తగా రాబోయే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పూర్తిగా నిలిచి పోయే అవకాశం ఉందని వివరించింది. చట్టబద్ధమైన ఆన్లైన్ గేమింగ్ రంగంపై .. గ్యాంబ్లింగ్ కార్యకలాపాకు సమాన స్థాయిలో పన్ను విధించడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఐఏఎంఏఐ పేర్కొంది. కాగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సంబంధిత కంపెనీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా డెల్టా కార్ప్ ఎన్నడూ లేనంతగా నష్టాలను ఎదుర్కొంది. -
Union Budget 2023-24: హెల్మెట్లపై జీఎస్టీని తొలగించాలి
పార్లమెంట్ (రెండు భాగాల) బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్లో హెల్మెట్లపై విధించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీని) తొలగించాలని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బడ్జెట్లో నిర్ణయం ఉండాలని కోరుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక లేఖ రాసినట్లు ఐఆర్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. సురక్షితమైన రహదారుల కోసం ఐఆర్ఎఫ్ కృషి చేస్తోంది. ప్రస్తుతం హెల్మెట్లపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించే రోడ్డు ప్రమాద మరణాలలో భారత్ 11 శాతం వాటా కలిగి ఉందని ఐఆర్ఎఫ్ ఎమెరిటస్ ప్రెసిడెంట్ కేకే కపిల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారుల విషయంలో ఇది దాదాపు 31.4 శాతంగా ఉందన్నారు. -
10 వేల మందిని తొలగించక తప్పదు!
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద బిస్కెట్ తయారీ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. భారీగా పతనమైన డిమాండ్, జీఎస్టీ భారంతో 8నుంచి 10వేల మంది ఉద్యోగులను తీసివేయాలని చూస్తున్నామని బ్రిటానియా వెల్లడించింది. పార్లే ఉత్పత్తుల కేటగిరీ హెడ్ మయాంక్ షా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బిస్కట్లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న18శాతం జీఎస్టీ తలకుమించిన భారంగా ఉందని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జీఎస్టీ కౌన్సిల్ తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కిలోకు రూ .100 లేదా అంతకంటే తక్కువ ధర గల బిస్కట్ ప్యాకెట్లపై జీఎస్టీ తగ్గించాలని మయాంక్ షా డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టకపోతే ఉద్యోగాల కోత తప్ప తమకు మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. అటు భారీగా పడిపోయిన డిమాండ్, అధిక జీఎస్టీ రేటు మొత్తం బిస్కట్ల పరిశ్రమను దెబ్బతీస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిస్కట్లపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరుతోంది. జూన్ 30, 2019 తో ముగిసిన త్రైమాసికంలో, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఏకీకృత నికర అమ్మకాలలో సంవత్సరానికి 5.9 శాతం (వార్షిక ప్రాతిపదికన)వృద్ధిని 2,677.3 కోట్ల రూపాయలుగా నమోదు చేయగా, నికర లాభం 3.7 శాతం తగ్గి 248.6 కోట్ల రూపాయలకు చేరుకుంది. బ్రిటానియా గ్రామీణ వ్యాపారం, పట్టణాల కంటే వేగంగా పెరిగేది. కానీ ఈ త్రైమాసికంలో క్షీణించింది. ఈ త్రైమాసికంలో కేవలం 3 శాతం వృద్ధిని సాధించింది. ఈ సందర్భంగా బ్రిటానియా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ మాట్లాడుతూ వినియోగదారుడు కేవలం రూ. 5 బిస్కట్ ప్యాకెట్ కొనడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారనీ, ఇది తమ లాభాలపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తోందన్నారు. సహజంగానే, ఆర్థిక వ్యవస్థలో కొన్ని తీవ్రమైన సమస్య ఉందని మిస్టర్ బెర్రీ వ్యాఖ్యానించారు. మాట్లాడుతూజూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన రోజు ఆగస్టు 9 నుండి కంపెనీ షేర్లు దాదాపు 7.5 శాతం (మంగళవారం ముగిసే నాటికి) పతనమైంది. బుధవారం కూడా నష్టాల్లోనే కొనసాగుతోంది. కాగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ సహా, పలువురు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి త్రైమాసికంలో జీడీపీ 5.8 శాతంగా ఉండగా, జూన్ క్వార్టర్లో 5.4 - 5.6 శాతం మధ్య ఉండవచ్చునని చెబుతున్నారు. అంటే ఇది ఐదేళ్ల కనిష్టం. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, దేశీయంగా ఆటో మొబైల్ రంగంలో తీవ్ర సంక్షోభానికి తోడు ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ లాంటి కీలక రంగాల్లో మందగమనం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
గుడ్‌న్యూస్ : ప్రీమియం రైళ్ల ఛార్జీలు తగ్గాయ్!
రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్ల ఛార్జీలు కిందకి దిగొచ్చాయి. ఆహార పదార్థాలపై జీఎస్టీ ఛార్జీలను తగ్గించడంతో టిక్కెట్ ధరలు కూడా కిందకి దిగొచ్చినట్టు తెలిసింది. సోమవారం నుంచి రైళ్లు, ప్లాట్‌ఫామ్ వద్ద విక్రయించే ఆహార పదార్థాలు, డ్రింకుల ధరలను ఇండియన్ రైల్వేస్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) తగ్గించింది. దీంతో మీల్స్ ధరలు కలిసి ఉండే ప్రీమియం రైళ్ల టిక్కెట్ ధరలు కూడా తగ్గాయి. జీఎస్టీ రేటును తగ్గించడంతోనే ఆహార పదార్థాల ధరలు తగ్గించామని ఐఆర్సీటీసీ తెలిపింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌ల వద్ద, రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు విక్రయించే ఆహార పదార్థాలు, డ్రింకులన్నింటిపై కూడా ఒకేవిధమైన జీఎస్టీ రేటు 5 శాతాన్ని విధించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతకముందు ఈ రేటు 18 శాతంగా ఉండేది. ఈ రేటును 18 శాతం నుంచి 5 శాతం తగ్గించడంతో, ప్రీమియం రైళ్ల టిక్కెట్ ధరలు ఒక్కో టిక్కెట్‌పై రూ.40 నుంచి రూ.60 మధ్యలో దిగొచ్చాయి. రైల్వే లైసెన్సులతో దోపిడీకి పాల్పడుతున్న వారిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశీయ రైల్వే మొబైల్, స్టాటిక్ కేటరింగ్‌కు పలు రేట్లను అమలు చేస్తోంది. జీఎస్టీ రేటు తగ్గింపుతో, ఐఆర్సీటీసీ అధికారిక లైసెన్సీలు అమ్మాల్సిన ఆహార పదార్థాల ధరలు ఈ విధంగా ఉన్నాయి.. చికెన్ బిర్యానీ ప్లేటుకు 89 రూపాయలు, అంతకముందు రూ.100 ఎగ్ బిర్యానీ ప్లేటుకు 61 రూపాయలు, అంతకముందు రూ.69 మసాలా దోశ ప్లేటుకు 18 రూపాయలు, అంతకముందు రూ.21 సూప్‌లు, వెజ్ నూడుల్స్, రైస్ పదార్థాలకు రైల్వే ప్రయాణికులు రూ.2 నుంచి రూ.4 తగ్గనుంది. జీఎస్టీ మినహాయింపు ఉన్న టీ, కాఫీ, రైల్వే నీర్, స్టాండర్డ్ బ్రేక్‌ఫాస్ట్, ఎకానమీ మీల్స్ వంటి వాటి ధరల్లో మార్పు లేదు. -
'ఒకే ఒక్క జీఎస్టీ రేటు తీసుకొస్తాం'
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే సాధారణ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన గెలుపు భావుటా ఎగురవేయనుందని పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆ లోపు ఒకవేళ బీజేపీ జీఎస్టీ పన్ను రేటును ఫ్లాట్ 18 శాతానికి తీసుకురాకపోతే, 2019లో తాము చేసి చూపిస్తామన్నారు. 178 వస్తువుల పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకున్న నిర్ణయంపై రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు భిన్నమైన పన్ను రేట్లు భారత్‌కు అవసరం లేదని, ఈ పాలనలో సమగ్రనాత్మక నిర్మాణం అవసరమన్నారు. ''మేము సంతోషంగా లేము. 'గబ్బర్ సింగ్ ట్యాక్స్' ను రద్దు చేయాలని కోరుకుంటున్నాం. కేవలం ఒకే ఒక 18 శాతం పన్ను శ్లాబు మాకు కావాలి. ఒకవేళ బీజేపీ దీన్ని చేయలేకపోతే, 2019లో మేము చేసి చూపిస్తాం'' అని రాహుల్ గాంధీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీసు ట్యాక్స్‌ను, రాహుల్ గాంధీ గబ్బర్ సింగ్ ట్యాక్స్‌గా అభివర్ణించారు. పన్ను రేట్లు తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సినవసరం ఉందని పేర్కొన్నారు. చిన్న వర్తకులకు బీజేపీ సాయం చేయడం లేదని, కేవలం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకే ఇది సహకరిస్తుందని రాహుల్ విమర్శించారు. -
టెలికంపై జీఎస్టీ రేటు తగ్గించండి
ఆర్థిక శాఖకు సీవోఏఐ లేఖ న్యూఢిల్లీ: సెల్యులర్ ఆపరేటింగ్ సంస్థలు టెలికం సర్వీసులపై నిర్ణయించిన 18 శాతం జీఎస్టీ రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాయి. అధిక పన్ను రేటుకు ఇన్పుట్ క్రెడిట్ ప్రయోజనం సరిపోదని అభిప్రాయపడ్డాయి. సెల్యులార్ ఆపరేటర్లను సభ్యులుగా కలిగిన సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) తాజాగా రెవెన్యూ సెక్రటరీకి ఒక లేఖ రాసింది. టెలికం పరిశ్రమ ఇప్పటికే పలు ఆర్థిక సమస్యలతో సతమతమౌతోందని, ఇలాంటి సందర్భాల్లో అధిక జీఎస్టీ రేటు సమంజసం కాదని, అందుకే రేటును తగ్గించాలని పేర్కొంది. మూడు శాతం పన్ను రేటు పెంపు ముందు ఇన్పుట్ ట్యాక్స్ ప్రయోజనం స్వల్పమని తెలిపింది. కాగా టెలికం సర్వీసులపై జీఎస్టీ పన్ను రేటు 18 శాతంగా ఉండబోతోంది. అయితే ప్రస్తుతం టెలికం సేవలపై పన్ను 15 శాతంగా ఉంది. -
జీఎస్టీ రేటు 22 శాతం!
ఆ రేటుకు రాష్ట్రాలు సమ్మతిస్తాయని కేంద్రం అంచనా న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకే పన్నును ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రామాణిక రేటు 22 శాతం వరకూ ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. ఈ రేటు రాష్ట్రాలకు సానుకూలంగా ఉంటుందని ఆర్థికశాఖ నిర్దిష్ట అంచనాకు వచ్చినట్లు ఆ వార్తల సారాంశం. దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక జీఎస్టీ బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు)ను పార్లమెంటు కొద్ది రోజుల కిందట ఆమోదించిన విషయం తెలిసిందే. దేశంలో.. కేంద్ర, రాష్ట్రాల పరోక్ష పన్నులన్నిటి స్థానంలో ఒకే పన్నును విధించటం ఈ బిల్లు లక్ష్యం. అయితే.. జీఎస్టీ పన్ను రేటుపై గరిష్టంగా 18 శాతం పరిమితి విధించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కొంత కాలం కిందట ఇచ్చిన నివేదికలోనూ జీఎస్టీ రేటును 18 శాతంగా నిర్ణయించవచ్చని ప్రతిపాదించారు. పన్ను రేటును కూడా ప్రభుత్వం అదే స్థాయిలో నిర్ణయిస్తుందన్న అంచనాలూ నిపుణుల నుంచి వ్యక్తమయ్యాయి. అయితే.. 18 శాతం జీఎస్టీ వల్ల రాష్ట్రాలు పన్ను ఆదాయాన్ని నష్టపోయే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఆ వార్తల ప్రకారం.. జీఎస్టీలో మరిన్ని వస్తువులను చేరుస్తారని, తద్వారా మరింతగా పన్ను వసూళ్లు ఉంటాయన్న అంచనాలతో సుబ్రమణ్యం 18 శాతం జీఎస్టీ ప్రతిపాదించారు. కానీ.. 18 శాతం రేటు నిర్ణయిస్తే రాష్ట్రాలు భారీగా పన్ను ఆదాయాన్ని నష్టపోతాయని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కేరళ ఆర్థికమంత్రి థామస్ ఇస్సాక్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 22 శాతం కన్నా తక్కువ జీఎస్టీకి చాలా రాష్ట్రాలు ఒప్పుకోవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ 22 శాతం వరకూ ఉంటే రాష్ట్రాలకు నష్టం ఉండదని కేంద్రం అభిప్రాయపడుతోంది. అయితే.. జీఎస్టీపై 18 శాతం గరిష్ట పరిమితి విధించాలని బలంగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్.. ఆ పన్ను రేటు 22 శాతం వరకూ ఉంటుందంటే దానిని వ్యతిరేకించవచ్చనీ భావిస్తున్నారు. నిర్ణయం మండలిదే.. జీఎస్టీ రేటును జీఎస్టీ మండలి నిర్ణయించాల్సి ఉంటుంది. జీఎస్టీకి సంబంధించిన సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ బిల్లులను కూడా పార్లమెంటు ఆమోదించాక ఈ ప్రక్రియ మొదలవుతుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జీఎస్టీని అమలులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే.. జీఎస్టీ అమలులోకి వస్తే ఆర్థికవ్యవస్థపై తాత్కాలిక ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున.. జీఎస్టీని వచ్చే ఏడాదే అమలు చేయటం సరైనదేనా అన్న అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. -
ఎవరి అంచనాలు వారివి..!
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 29 బడ్జెట్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా... మరికొందరు... బడ్జెట్ అంచనాలతో నిమగ్నమయ్యారు. వీటిలో కొన్నింటిని ఒక్కసారి పరిశీలిస్తే... 2 శాతం వరకూ కార్పొరేట్ పన్ను తగ్గింపు నాలుగేళ్లలో ప్రభుత్వం కార్పొరేట్ పన్నును ప్రస్తుత 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా రానున్న బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 1 నుంచి 2 శాతం వరకూ తగ్గించే అవకాశం ఉంది. అయితే దీనిని భర్తీచేసుకునే దిశలో ఏ మినహాయింపులు తొలగిస్తారన్న అంశాన్ని చెప్పలేం. పన్ను చట్టాలు మరీ అంత క్లిష్టంగా ఏమీ లేవు. నిర్వహణా పరంగా మాత్రం ఈ విభాగంలో కొన్ని సంస్కరణలు అవసరమే. అయితే సమీప కాలంలో వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేదు. కొద్దికొద్దిగా కాకుండా మొత్తంగా వ్యవస్థాపరమైన మార్పులు తీసుకురావాల్సి ఉండడమే దీనికి కారణం. - బాబీ పరేఖ్, బీఎంఆర్ అడ్వైజర్స్ ఐటీ పురోగతికి చర్యలు... ఐటీ పరిశ్రమ... ప్లాట్‌ఫామ్స్, ప్రొడక్ట్స్ దిశలో అడుగులు వేయాల్సిన తక్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించి నైపుణ్య శిక్షణ, సబ్సిడీలు, పన్ను రాయితీలు, నిధుల లభ్యత వంటి అంశాల కోణంలో 2016-17 బడ్జెట్లో తగిన చర్యలు ఉంటాయని భావిస్తున్నాం. ఈ రంగం వృద్ధి లక్ష్యంగా ఒక ప్రత్యేక కర్తవ్య నిర్వహణా బృందాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. తయారీ, సేవలు, ఇన్ఫ్రా వంటి కీలక అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయాలు రూపొందించాలి. ప్రత్యేక ఆర్థిక జోన్లకు పన్ను ప్రయోజనాలను పునరుద్ధరించాలి. - పీ వెంకటేశ్, మావరిక్ సిస్టమ్స్, డెరైక్టర్ ఆదాయాలు పెరిగే అవకాశం రానున్న ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా పన్ను వసూళ్లు 12.5 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. నికరంగా ఇది 18 శాతంగా ఉంటుంది. జీఎస్టీ రేటు (17 శాతం)కు అనుగుణంగా సేవల పన్నును స్వల్పంగా పెంచవచ్చు. పెట్రోలియం ప్రొడక్టులపై సుంకాల పెంపు ద్వారా ప్రభుత్వం తన రెవెన్యూ పెంపునకు కృషి చేయవచ్చు. పరోక్ష పన్ను పరిధిలోకి మరిన్ని వస్తువులను తీసుకురావడం ద్వారా కూడా ఆదాయాల పెంపునకు మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుంది. ప్రణాళికేతర వ్యయాలను 15 శాతం పెంచుతుందని భావిస్తున్నాం. ఇంధన సబ్సిడీల భారం తగ్గినా... ఆహార సబ్సిడీల భారం అధికంగానే కొనసాగుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ విభాగానికి సంబంధించి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటవుతుందని భావిస్తున్నాం. కొన్ని అదనపు భారాలు ఉన్నప్పటికీ, బడ్జెట్ 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదనపు ఆదాయాలు అందుతుండడం వల్ల మూలధన వ్యయాల పెంపుదలవైపే ప్రభుత్వం దృష్టి సారించే వీలుంది. స్థూల రుణాలు రూ. 6.1 లక్షల కోట్లు, నికర రుణాలు రూ.4.3 లక్షల కోట్లుగా బడ్జెట్ నిర్దేశించవచ్చన్నది అంచనా. ప్రభుత్వ రంగ కంపెనీల్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి కేంద్రం వ్యూహ రచన చేసే వీలుంది. - రీసెర్చ్ విభాగం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్