టెలికంపై జీఎస్‌టీ రేటు తగ్గించండి
ఆర్థిక శాఖకు సీవోఏఐ లేఖ
న్యూఢిల్లీ: సెల్యులర్ ఆపరేటింగ్ సంస్థలు టెలికం సర్వీసులపై నిర్ణయించిన 18 శాతం జీఎస్‌టీ రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాయి. అధిక పన్ను రేటుకు ఇన్‌పుట్ క్రెడిట్ ప్రయోజనం సరిపోదని అభిప్రాయపడ్డాయి. సెల్యులార్ ఆపరేటర్లను సభ్యులుగా కలిగిన సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) తాజాగా రెవెన్యూ సెక్రటరీకి ఒక లేఖ రాసింది.
టెలికం పరిశ్రమ ఇప్పటికే పలు ఆర్థిక సమస్యలతో సతమతమౌతోందని, ఇలాంటి సందర్భాల్లో అధిక జీఎస్‌టీ రేటు సమంజసం కాదని, అందుకే రేటును తగ్గించాలని పేర్కొంది. మూడు శాతం పన్ను రేటు పెంపు ముందు ఇన్‌పుట్ ట్యాక్స్ ప్రయోజనం స్వల్పమని తెలిపింది. కాగా టెలికం సర్వీసులపై జీఎస్‌టీ పన్ను రేటు 18 శాతంగా ఉండబోతోంది. అయితే ప్రస్తుతం టెలికం సేవలపై పన్ను 15 శాతంగా ఉంది.