ఆదాయపు పన్నులో సంస్కరణలు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (GST)లోనూ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర బడ్జెట్‌లో (Union Budget 2025-26) ఆదాయపు పన్ను (Income Tax) రేట్లను హేతుబద్ధీకరించిన తర్వాత, జీఎస్టీ రేట్లను కూడా ప్రభుత్వం హేతుబద్ధీకరించాలని చూస్తోందని వార్తా సంస్థ మనీకంట్రోల్ వెల్లడించింది.
ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అన్ని రాష్ట్రాలను బోర్డులోకి తీసుకురావడానికి కేంద్రం కృషి చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పినట్లు పేర్కొంది. "జీఎస్టీని హేతుబద్ధీకరించడానికి ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతోంది. ఏవైనా మార్పులను ఖరారు చేయడానికి ముందు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకోవాలనుకుంటున్నాం" అని విషయం గురించి తెలిసిన వ్యక్తొకరు చెప్పినట్లుగా పేర్కొంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో రూ.12 లక్షలలోపు ఆర్జించేవారికి ఆదాయపు పన్ను నుండి మినహాయించడం ద్వారా మధ్యతరగతి ప్రజలను దాదాపు గణనీయమైన ఉపశమనాన్ని అందించారు. అలాగే ఇతరులకు కూడా పన్ను స్లాబ్‌లను సర్దుబాటు చేశారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వం రూ. 1 లక్ష కోట్ల ఆదాయాన్ని వదులుకోనుందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో వెల్లడించారు.
ఇప్పటికే ఏకాభిప్రాయం
జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణను పరిశీలించేందుకు ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. గత డిసెంబరులో ఈ ప్యానెల్ దాదాపు 150 వస్తువులపై పన్ను రేట్లను సవరించడంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2017 జూలైలో ఈ పరోక్ష పన్ను విధానం అమలులోకి వచ్చినప్పటి నుండి జీఎస్టీ రేటు విధానం అనేక సవరణలకు గురైంది. ప్రారంభంలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఇలా.. నాలుగు ప్రాథమిక పన్ను స్లాబ్‌లతో జీఎస్టీ విధానాన్ని
రూపొందించగా వాటి పరిధిలోకి వచ్చే వివిధ వస్తువులను కాలానుగుణంగా పలు సర్దుబాటు చేశారు.
భిన్న పన్ను స్లాబ్‌లు వర్గీకరణ వివాదాలు, సమ్మతి సవాళ్లను సృష్టిస్తాయని వాదిస్తూ సరళమైన జీఎస్టీ విధానం కోసం ఆర్థికవేత్తలు చాలాకాలంగా వాదిస్తున్నారు. పన్ను సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి హేతుబద్ధీకరణ చర్యను పరిశ్రమ నాయకులు కూడా ఆశిస్తున్నారు. కస్టమ్స్ సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం కూడా పన్ను విధానాన్ని మరింత బిజినెస్ ఫ్రెండ్లీగా మార్చడానికి ఒక అడుగుగా పరిగణిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్.. రాబోయే సమావేశాలలో రేట్ల హేతుబద్ధీకరణ కోసం తుది రోడ్‌మ్యాప్‌పై చర్చిస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment