జీఎస్‌టీ రేటు 22 శాతం!
ఆ రేటుకు రాష్ట్రాలు సమ్మతిస్తాయని కేంద్రం అంచనా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకే పన్నును ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) ప్రామాణిక రేటు 22 శాతం వరకూ ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. ఈ రేటు రాష్ట్రాలకు సానుకూలంగా ఉంటుందని ఆర్థికశాఖ నిర్దిష్ట అంచనాకు వచ్చినట్లు ఆ వార్తల సారాంశం. దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక జీఎస్‌టీ బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు)ను పార్లమెంటు కొద్ది రోజుల కిందట ఆమోదించిన విషయం తెలిసిందే.
దేశంలో.. కేంద్ర, రాష్ట్రాల పరోక్ష పన్నులన్నిటి స్థానంలో ఒకే పన్నును విధించటం ఈ బిల్లు లక్ష్యం. అయితే.. జీఎస్‌టీ పన్ను రేటుపై గరిష్టంగా 18 శాతం పరిమితి విధించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి.
ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కొంత కాలం కిందట ఇచ్చిన నివేదికలోనూ జీఎస్‌టీ రేటును 18 శాతంగా నిర్ణయించవచ్చని ప్రతిపాదించారు. పన్ను రేటును కూడా ప్రభుత్వం అదే స్థాయిలో నిర్ణయిస్తుందన్న అంచనాలూ నిపుణుల నుంచి వ్యక్తమయ్యాయి. అయితే.. 18 శాతం జీఎస్‌టీ వల్ల రాష్ట్రాలు పన్ను ఆదాయాన్ని నష్టపోయే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఆ వార్తల ప్రకారం.. జీఎస్‌టీలో మరిన్ని వస్తువులను చేరుస్తారని, తద్వారా మరింతగా పన్ను వసూళ్లు ఉంటాయన్న అంచనాలతో సుబ్రమణ్యం 18 శాతం జీఎస్‌టీ ప్రతిపాదించారు. కానీ.. 18 శాతం రేటు నిర్ణయిస్తే రాష్ట్రాలు భారీగా పన్ను ఆదాయాన్ని నష్టపోతాయని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.
కేరళ ఆర్థికమంత్రి థామస్ ఇస్సాక్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 22 శాతం కన్నా తక్కువ జీఎస్‌టీకి చాలా రాష్ట్రాలు ఒప్పుకోవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ 22 శాతం వరకూ ఉంటే రాష్ట్రాలకు నష్టం ఉండదని కేంద్రం అభిప్రాయపడుతోంది. అయితే.. జీఎస్‌టీపై 18 శాతం గరిష్ట పరిమితి విధించాలని బలంగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్.. ఆ పన్ను రేటు 22 శాతం వరకూ ఉంటుందంటే దానిని వ్యతిరేకించవచ్చనీ భావిస్తున్నారు.
నిర్ణయం మండలిదే..
జీఎస్‌టీ రేటును జీఎస్‌టీ మండలి నిర్ణయించాల్సి ఉంటుంది. జీఎస్‌టీకి సంబంధించిన సెంట్రల్ జీఎస్‌టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ, స్టేట్ జీఎస్‌టీ బిల్లులను కూడా పార్లమెంటు ఆమోదించాక ఈ ప్రక్రియ మొదలవుతుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జీఎస్‌టీని అమలులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే.. జీఎస్‌టీ అమలులోకి వస్తే ఆర్థికవ్యవస్థపై తాత్కాలిక ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున.. జీఎస్‌టీని వచ్చే ఏడాదే అమలు చేయటం సరైనదేనా అన్న అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు.