ఎవరి అంచనాలు వారివి..!
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 29 బడ్జెట్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా... మరికొందరు... బడ్జెట్ అంచనాలతో నిమగ్నమయ్యారు. వీటిలో కొన్నింటిని ఒక్కసారి పరిశీలిస్తే...
2 శాతం వరకూ కార్పొరేట్ పన్ను తగ్గింపు
నాలుగేళ్లలో ప్రభుత్వం కార్పొరేట్ పన్నును ప్రస్తుత 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా రానున్న బడ్జెట్‌లో కార్పొరేట్ పన్నును 1 నుంచి 2 శాతం వరకూ తగ్గించే అవకాశం ఉంది. అయితే దీనిని భర్తీచేసుకునే దిశలో ఏ మినహాయింపులు తొలగిస్తారన్న అంశాన్ని చెప్పలేం. పన్ను చట్టాలు మరీ అంత క్లిష్టంగా ఏమీ లేవు. నిర్వహణా పరంగా మాత్రం ఈ విభాగంలో కొన్ని సంస్కరణలు అవసరమే. అయితే సమీప కాలంలో వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేదు. కొద్దికొద్దిగా కాకుండా మొత్తంగా వ్యవస్థాపరమైన మార్పులు తీసుకురావాల్సి ఉండడమే దీనికి కారణం. - బాబీ పరేఖ్, బీఎంఆర్ అడ్వైజర్స్
ఐటీ పురోగతికి చర్యలు...
ఐటీ పరిశ్రమ... ప్లాట్‌ఫామ్స్, ప్రొడక్ట్స్ దిశలో అడుగులు వేయాల్సిన తక్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించి నైపుణ్య శిక్షణ, సబ్సిడీలు, పన్ను రాయితీలు, నిధుల లభ్యత వంటి అంశాల కోణంలో 2016-17 బడ్జెట్‌లో తగిన చర్యలు ఉంటాయని భావిస్తున్నాం. ఈ రంగం వృద్ధి లక్ష్యంగా ఒక ప్రత్యేక కర్తవ్య నిర్వహణా బృందాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. తయారీ, సేవలు, ఇన్‌ఫ్రా వంటి కీలక అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయాలు రూపొందించాలి. ప్రత్యేక ఆర్థిక జోన్లకు పన్ను ప్రయోజనాలను పునరుద్ధరించాలి. - పీ వెంకటేశ్, మావరిక్ సిస్టమ్స్, డెరైక్టర్
ఆదాయాలు పెరిగే అవకాశం
రానున్న ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా పన్ను వసూళ్లు 12.5 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. నికరంగా ఇది 18 శాతంగా ఉంటుంది. జీఎస్‌టీ రేటు (17 శాతం)కు అనుగుణంగా సేవల పన్నును స్వల్పంగా పెంచవచ్చు. పెట్రోలియం ప్రొడక్టులపై సుంకాల పెంపు ద్వారా ప్రభుత్వం తన రెవెన్యూ పెంపునకు కృషి చేయవచ్చు. పరోక్ష పన్ను పరిధిలోకి మరిన్ని వస్తువులను తీసుకురావడం ద్వారా కూడా ఆదాయాల పెంపునకు మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుంది. ప్రణాళికేతర వ్యయాలను 15 శాతం పెంచుతుందని భావిస్తున్నాం. ఇంధన సబ్సిడీల భారం తగ్గినా... ఆహార సబ్సిడీల భారం అధికంగానే కొనసాగుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ విభాగానికి సంబంధించి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటవుతుందని భావిస్తున్నాం. కొన్ని అదనపు భారాలు ఉన్నప్పటికీ, బడ్జెట్ 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదనపు ఆదాయాలు అందుతుండడం వల్ల మూలధన వ్యయాల పెంపుదలవైపే ప్రభుత్వం దృష్టి సారించే వీలుంది. స్థూల రుణాలు రూ. 6.1 లక్షల కోట్లు, నికర రుణాలు రూ.4.3 లక్షల కోట్లుగా బడ్జెట్ నిర్దేశించవచ్చన్నది అంచనా. ప్రభుత్వ రంగ కంపెనీల్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి కేంద్రం వ్యూహ రచన చేసే వీలుంది. - రీసెర్చ్ విభాగం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్