అగ్రరాజ్యం. అమెరికా ప్రపంచ పెద్దన్నగా కొనసాగాలంటే అధ్యక్షపీఠంపై ఆసీనులై పరిపాలించే నేత తీసుకునే నిర్ణయాలు తిరుగులేనివై ఉండాలి. దేశ అంతర్గత భద్రత, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ధరలుసహా యుద్ధాలు, వాతావరణ మార్పు వంటి అంతర్జాతీయ అంశాలపై పట్టుండాలి. అంతర్యుద్ధాలు, సంక్షోభాలు, అంతర్జాతీయ సమస్యలపై మిత్ర దేశాలతోపాటు శత్రుదేశాలనూ ఒప్పించగల నేర్పు తప్పనిసరి.
నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు తాము గెలిస్తే ఎలాంటి పాలన అందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత నాలుగేళ్లుగా జో బైడెన్ అమలుచేసిన అభివృద్ధి పథకాలను కొనసాగిస్తానని హారిస్ చెబుతుండగా అక్రమ వలసలను నిలువరించి బహిష్కరణ పర్వానికి తెరలేపుతానని, విప్లవాత్మక విధానాలను అమలుచేస్తానని ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞచేశారు.
‘‘అధ్యక్షురాలిగా గెలవగానే శ్రామిక కుటుంబాల కోసం పాటుపడతా. కనీస వేతనాన్ని పెంచుతా. సేవలు, ఆతిథ్యరంగంలోని సిబ్బందికి అందే టిప్పులపై వసూలుచేస్తున్న పన్నులను రద్దుచేస్తా’ అని హారిస్ అన్నారు. జూన్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే హామీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఇప్పటికే ట్రంప్, హారిస్ వెల్లడించిన అభిప్రాయాలు వారి పాలనాపంథాపై స్పష్టత తీసుకొస్తున్నాయి. వాటిని ఒకసారి తరచి చూస్తే..
అబార్షన్
హారిస్: సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్‌కు కమలా హారిస్ మద్దతు పలుకుతున్నారు. రిపబ్లిక్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అబార్షన్లపై నిషేధం విధించడాన్ని ఆమె ఇప్పటికే పలుమార్లు తప్పుబట్టారు. తాము అధికారంలోకి వస్తే చట్టబద్ధ అబార్షన్‌కు అనుమతిస్తూ పార్లమెంట్‌లో చట్టం తెచ్చేందుకు కృషిచేస్తానని చెప్పారు.
ట్రంప్: కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్‌పై నిషేధం అమలవుతుండగా కొన్ని రాష్ట్రాల్లో షరతుల మేరకు అనుమతిస్తున్నారు. దీంతో అబార్షన్‌పై ఎప్పుడు ప్రశ్నించినా ట్రంప్ సమాధానం దాటవేశారు. అబార్షన్‌పై జాతీయస్థాయి విధానాన్ని ప్రకటించలేదు. రాష్ట్రాలకే ఆ నిర్ణయం వదిలేస్తే మంచిది అన్నట్లు గతంలో వ్యాఖ్యానించారు.
చట్టాల అమలు/ ప్రజాస్వామ్యం
హారిస్: హారిస్ గెలిస్తే ట్రంప్‌పై కేసులపై దృష్టిపెట్టే అవకాశముంది. గత అధ్యక్ష ఫలితాలను తప్పుబడుతూ, పార్లమెంట్ భవంతి మీదకు రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ట్రంప్ ఉసిగొల్పడం, నీలితారకు అనైతిక నగదు చెల్లింపులు, ఆస్తిగా ఎక్కువగా చూపు రుణాల పొందటం వంటి కేసుల్లో తీర్పులు త్వరగా వచ్చేలా హారిస్ ఒత్తిడి తేవచ్చు. ప్రజాస్వామ్యయుత పాలనకు కట్టుబడతానని హారిస్ గతంలో అన్నారు.
ట్రంప్: బైడెన్ చేతిలో ఓడినపుడు అధ్యక్ష ఫలితాలను ట్రంప్ అంగీకరించలేదు. ఈసారి కూడా ఓడిపోతే ఓటమిని ట్రంప్ ఒప్పుకోకపోవచ్చు. నాటి పార్లమెంట్‌పై దాడి, అక్కడి పోలీసులను గాయపరిచిన నిందితులకు క్షమాభిక్ష పెడతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎఫ్‌బీఐను ప్రక్షాళిస్తానని చెప్పారు. బైడెన్ పాలనలో అవినీతిపై ప్రత్యేక ప్రాసిక్యూటర్‌తో విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.
వాతావరణ మార్పులు/ఇంథనం
హారిస్: అమెరికాలో కర్భన ఉద్గారాల విడుదల తగ్గిస్తానని ఉపాధ్యక్షురాలి హోదాలో హారిస్ గతంలో చెప్పారు. హరిత ఇంథనానికి జై కొట్టారు. సముద్రగర్భంలో చమురు వెలికితీతను వ్యతిరేకించారు. విద్యుత్ వినియోగం ఆదాతోపాటు పర్యావరణ అనుకూల పథకాలను ప్రోత్సహించారు.
ట్రంప్: వాతావరణ మార్పుల అంశాన్ని గాలి కొదిలేశారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగారు. ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా చమురు తవ్వకాలకు పచ్చజెండా ఊపారు. బైడెన్ ప్రభుత్వం వచ్చాక పారిస్ ఒప్పందంలో అమెరికా చేరింది. అయితే ఈసారి తాను గెలిస్తే పారిస్ ఒప్పందానికి మళ్లీ కటీఫ్ చేప్తానని ట్రంప్ అన్నారు.
ఇజ్రాయెల్/ ఉక్రెయిన్
యుద్ధాలు
హారిస్: గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులను సమర్థిస్తూనే పాలస్తీనియన్ల ప్రాణాలూ ముఖ్యమేనని హారిస్ చెప్పారు. త్వరగా యుద్ధాన్ని ముగించాలని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను కోరారు. కాల్పుల విరమణ ఒప్పందానికి, సంధికి మొగ్గుచూపారు. ఈజిప్ట్, ఖతార్‌లతో కలసి మధ్యవర్తిత్వానికి ఓటేశారు. ఈమె గెలిస్తే గాజా యుద్ధం త్వరగా ముగిసే వీలుంది. ఉక్రెయిన్ యుద్ధంపై ఆమె ఇంకా ఎలాంటి స్పష్టమైన విధానాలు
ప్రకటించలేదు.
ట్రంప్: హమాస్ అంతమయ్యేదాకా ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతానని ట్రంప్ గతంలో అన్నారు. అయితే మరింత మారణహోమం జరక్కుండా త్వరగా యుద్ధం ముగించి గాజాలో శాంతి నెలకొల్పాలని ఆయన కోరుతున్నారు. జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులనూ ట్రంప్ సైతం ఖండించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించే సత్తా తనకుందని ట్రంప్ గతంలో అన్నారు.
ప్రభుత్వపాలన
హారిస్: ప్రభుత్వ ఉద్యోగులను హఠాత్తుగా తొలగించే వివాదాస్పద ‘ప్రాజెక్ట్ 2025’ సిద్ధాంతాన్ని హారిస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సులభంగా తీసేసేందుకు వీలు కల్పించేలా 2020లో ట్రంప్ ఇచ్చిన షెడ్యూల్–ఎఫ్ ఉత్తర్వును హారిస్ వ్యతిరేస్తున్నారు. సిబ్బంది ఉద్యోగ భద్రతకు పాటుపడతానని ఆమె మాటిచ్చారు. అక్రమ వలసలను తగ్గిస్తానని చెప్పారు. ఆహార ఉత్పత్తుల ధరను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల టిప్‌లపై పన్నును తొలగిస్తానన్నారు. కార్మికుల కనీస వేతనం పెంచుతానని, పౌరులు కొనే అధునాతన ఆయుధాలపై నిషేధం విధిస్తానని చెప్పారు.
ట్రంప్: తన హయాంలో అమలు చేయాలని ప్రయత్నించిన ‘ప్రాజెక్ట్ 2025’ సిద్ధాంతం గురించి ట్రంప్ ఎక్కడా మాట్లాడట్లేదు. అయితే అధ్యక్ష కేంద్రంగా కేంద్రీకృత ప్రభుత్వానికి బాటలువేసే ఈ సిద్ధాంతాన్ని తాను గెలిస్తే అమలుచేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై పలు కేసులకు కారకులైన న్యాయశాఖ సిబ్బందిపై వేటు వేయడానికి ట్రంప్ సిద్దంగా ఉన్నాడని వార్తలొచ్చాయి. విద్యాశాఖను రద్దుచేస్తానని, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వంటి సంస్థలను ప్రక్షాళిస్తానని చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment