
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే సాధారణ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన గెలుపు భావుటా ఎగురవేయనుందని పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆ లోపు ఒకవేళ బీజేపీ జీఎస్టీ పన్ను రేటును ఫ్లాట్ 18 శాతానికి తీసుకురాకపోతే, 2019లో తాము చేసి చూపిస్తామన్నారు. 178 వస్తువుల పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకున్న నిర్ణయంపై రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు భిన్నమైన పన్ను రేట్లు భారత్‌కు అవసరం లేదని, ఈ పాలనలో సమగ్రనాత్మక నిర్మాణం అవసరమన్నారు.
''మేము సంతోషంగా లేము. 'గబ్బర్ సింగ్ ట్యాక్స్' ను రద్దు చేయాలని కోరుకుంటున్నాం. కేవలం ఒకే ఒక 18 శాతం పన్ను శ్లాబు మాకు కావాలి. ఒకవేళ బీజేపీ దీన్ని చేయలేకపోతే, 2019లో మేము చేసి చూపిస్తాం'' అని రాహుల్ గాంధీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీసు ట్యాక్స్‌ను, రాహుల్ గాంధీ గబ్బర్ సింగ్ ట్యాక్స్‌గా అభివర్ణించారు. పన్ను రేట్లు తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సినవసరం ఉందని పేర్కొన్నారు. చిన్న వర్తకులకు బీజేపీ సాయం చేయడం లేదని, కేవలం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకే ఇది సహకరిస్తుందని రాహుల్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment