సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కొత్తగా టూరిజం విభాగం ఏర్పాటు అవుతోంది. పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు తిప్పాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ బాధ్యతను పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. కానీ కొంత కాలంగా ఆ సంస్థ బాగా బలహీనపడింది. చాలినన్ని బస్సులను నిర్వహించే స్థితిలో లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో ఆ లోటును తన బస్సులతో భర్తీ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేలా ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడిచే హోటళ్లు, విశ్రాంతి గదులున్నాయి. ఇప్పడు వాటిని ఆర్టీసీ వినియోగించుకుంటుంది. ఇందుకోసం ఆర్టీసీ–పర్యాటక శాఖలు సంయుక్తంగా ఓ విధానాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నాయి.
ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో బస్‌భవన్‌లో రెండు విభాగాల సంయుక్త సమావేశం జరిగింది. ఇప్పటికే టూరిజం విభాగాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఆర్టీసీ, తన ప్రణాళికను పర్యాటక శాఖ ముందుంచింది. అటువైపు నుంచి వచ్చే స్పందన ఆధారంగా సంయుక్త విధానాన్ని రూపొందించుకుందామని ప్రతిపాదించింది.
ఆర్టీసీ ఇటీవలే ప్రయోగాత్మకంగా కేపీహెచ్‌బీ–వికారాబాద్, అనంతగిరి మధ్య ప్రతి ఆదివారం పర్యాటకుల కోసం సర్వీసులు ప్రారంభించింది. ఈ సర్వీసులకు మంచి డిమాండ్ ఏర్పడింది. త్వరలో ఇలాంటి మరికొన్ని ప్రాంతాలకు కూడా సాధారణ ప్రయాణికుల సర్వీసులుగా కాకుండా, పర్యాటకుల సర్వీసులు ప్రారంభించాలని భావిస్తోంది.
దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పర్యాటకరంగంలో తెలంగాణనే వెనకబడి ఉంది. కోవిడ్ భయం తగ్గిపోవటంతో గత నెలరోజులుగా పర్యాటక ప్రాంతాలకు జనం తాకిడి పెరిగింది. దీన్ని అందిపుచ్చుకుని ఇటు పర్యాటక శాఖ, అటు ఇతర అనుబంధ సంస్థలతో కలసి ముందుకు సాగాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భావిస్తున్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస గుప్తా, ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, ఇతర అధికారులు మునిశేఖర్, జీవన్‌ప్రసాద్, యుగేందర్, రఘునాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment