సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా 2015 జూలై 14న జరిగిన తొక్కిసలాటపై జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ దాదాపు మూడేళ్లపాటు విచారణ జరిపి, ఇచ్చిన నివేదికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటనకు మీడియా ప్రచారం, భక్తుల రద్దీయే కారణమని తేల్చడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ఈ తొక్కిసలాటతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదని, పైగా చంద్రబాబు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారని కితాబు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల్లో ముఖ్యమంత్రి స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలు ఎక్కడున్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్ష్యాధారాలను మాయం చేశారని, సీఎం ప్రచారం యావ వల్లే ఈ తొక్కిసలాట జరిగి, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి మీడియాను, భక్తులను కారకులను చేయడం సరికాదని పేర్కొంటున్నారు.
సాధారణ భక్తుల ఘాట్‌కు సీఎం ఎందుకెళ్లారు?
గోదావరి పష్కరాలకు తరలి రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది ముందుగానే టీవీ చానళ్లు, పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో సాగించిన ప్రచారాన్ని సోమయాజులు కమిషన్ తన నివేదికలో కనీసం ప్రస్తావించలేదు. వీఐపీలకు ప్రత్యేకంగా రాజమహేంద్రవరంలోనే సరస్వతి ఘాట్ ఉండగా, సీఎం చంద్రబాబు కుటుంబం, మంత్రులు సాధారణ భక్తులకు కేటాయించిన పుష్కర ఘాట్‌లోకి ఎందుకు వెళ్లారో చెప్పలేదు. పుష్కరఘాట్‌లో భక్తులను నిలిపివేసి ఒక్కసారిగా వదిలారన్న అంశాన్ని కమిషన్ విస్మరించింది. రద్దీ అధికంగా ఉంటే భక్తులను పక్కనే 200 మీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాల ఘాట్, పద్మావతి ఘాట్లకు ఎందుకు మళ్లించలేదు? అని నివేదికలో ఎక్కడా ప్రశ్నించలేదు.
ఆ వీడియోలు ఎక్కడున్నాయి?
తొక్కిసలాట ఘటనకు మీడియా, భక్తులను బాధ్యులను చేయడం దారుణం. రూ.64 లక్షలకు ఏపీ టూరిజం శాఖ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పుష్కరాల్లో ముఖ్యమంత్రి స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలు ఎక్కడున్నాయి?
– ముప్పాళ్ల సుబ్బారావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు. రాజమహేంద్రవరం
సీఎం ప్రచార యావ వల్లే తొక్కిసలాట
2003 నాటి గోదావరి పుష్కరాల ఫొటోలు ఉన్నాయి, మరి 2015 పుష్కరాల సీసీ కెమెరాల ఫుటేజీలు ఎందుకు లేవు? సాక్ష్యాధారాలను మాయం చేశారు. సీఎం ప్రచారం యావ వల్లే తొక్కిసలాట జరిగింది. మీడియా, భక్తులను కారకులను చేయడం సరికాదు.
– కూనపురెడ్డి శ్రీనివాసరావు, న్యాయవాది, అఫిడవిట్‌దారుడు, రాజమహేంద్రవరం
అబద్ధం ఎవరిది?
తాను అక్కడ ఉండగానే తొక్కిసలాట గురించి తెలిసిందని, వెంటనే కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి కంట్రోల్ చేయాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఏకసభ్య కమిషన్ మరోలా చెప్పింది. ఇక్కడ చంద్రబాబు అబద్ధం అడారా? లేక కమిషన్ అబద్ధం చెప్పిందా?
– ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ
మీడియాను నిందించడం సరికాదు
పుష్కరాలపై సమాచారం తెలియజేయడం మీడియా ప్రధాన విధి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. దానికి మీడియాను కారణంగా చూపడం సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– మండేలా శ్రీరామమూర్తి, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment