Justice Somayajulu commission
-
‘టీడీపీ అధర్మ పాలన వల్లే 29 మంది మృతి’
సాక్షి, అమరావతి : శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి టీడీపీ ప్రభుత్వం, జస్టిస్ సోమయాజులు కమిషన్‌పై నిప్పులు చెరిగారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కొసలాటకు మీడియా అత్యుత్సాహం, భక్తుల అవగాహనాలేమి కారణమని తేల్చిన సోమయాజులు కమిషన్‌కు భారతరత్న, ఆస్కార్ అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అధర్మపాలన సాగుతోంది కనుకనే అంతటి ఘోరం జరిగిందని వాపోయారు. పుష్కరాల్లో చనిపోయిన 29 మంది కుటుంబాల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. టీడీపీకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు.. తిరుమల శ్రీవారి ఆభరణాలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శివస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పోలీసులు తనపై మూడు అక్రమ కేసులు పెట్టారని, విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. కేసుకు సంబంధించిన విషయాలను విచారించాల్సిందిపోయి.. శైవక్షేత్ర ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు అడుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు మంచి తీర్పునిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : దోషం భక్తులది.. పాపం మీడియాది -
సోమయాజులు కమిషన్‌పై మండిపడుతున్న పండితులు
-
‘భక్తికి కాకుండా మీడియా దేనికి ప్రచారం కల్పించాలి’
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట ప్రమాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ జస్టిస్ సోమయాజులు కమిషన్‌పై పండితులు, ప్రవచనకర్తలు మండిపడుతున్నారు. పుష్కరాలపై పండితులు, మీడియాను తప్పుపట్టడం సరికాదని పంచాంగ జ్యోతిష్య పండితులు మధురపాల శంకర్ శర్మ ధ్వజమెత్తారు. పంచాంగ కర్తలపై నిందవేయడం దారుణమన్నారు. పుష్కరాల తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వవైఫల్యమేనని పేర్కొన్నారు. సంప్రదాయాలు లేని చోటే దుర్మార్గాలు పుట్టుకొస్తాయని నిప్పులు చెరిగారు. పండితులపై చేసిన వ్యాఖ్యలను జస్టిస్ సోమయాజులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు గోదావరి పుష్కరాలకు ముహూర్తపెట్టింది పంచాంగ కర్తలు కాదని, అలాంటప్పుడు తమపై ఎందుకు నిందవేస్తున్నారన్నారు. భక్తి విషయాల్లో కాకుండా మీడియా దేనికి ప్రచారం కల్పించాలన్నారు. ఆధ్యాత్మిక విషయాలకు మీడియా ప్రచారం కల్పించకుండా, తప్పుడు విషయాలకు ప్రచారం చేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కమిటీని మళ్లీ వేసి దాంట్లో సరైన పంచాంగ కర్తలని తీసుకొని, ముహూర్త దోషాలు ఉన్నాయా లేదా అని తేల్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక పారదర్శకంగా ఇచ్చిందని భావించడం లేదని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకుగరై కమిషన్ నివేదిక ఇచ్చినట్లుందని తెలిపారు. గోదావరి పుష్కరాల దుర్ఘటనను భక్తుల నమ్మకాల మీదకు నెట్టేయడం దారుణమన్నారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే దుర్ఘటనకు కారణమని పేర్కొన్నారు. పుష్కరాలను ప్రభుత్వం ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా తీసుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుష్కరఘాట్ లో స్నానం చేస్తారన్న విషయం ముందుగానే అధికారులు ప్రజలకు చెప్పాల్సిందని తెలిపారు. అలా చెప్పకుండా భక్తులను ఘాట్ బయట నిలబెట్టడం తప్పు అన్నారు. కాగా, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందడానికి భక్తులు, పండితులు, ప్రసార మాధ్యమాలే కారణమని రిటైర్డ్ జస్టిస్ సోమయాజులు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ తేల్చేసింది. 2015 జూలై 14న పుష్కరాల తొలి రోజున స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ముహూర్త కాలంలోనే స్నానం చేయకపోతే పుణ్యం రాదేమోనన్న ఆందోళనతో భక్తులంతా ఒక్కసారిగా నదిలోకి దూసుకురావడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. ఈ దుర్ఘటనపై మూడేళ్లపాటు సుదీర్ఘ విచారణ చేసిన జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన ఈ నివేదికను చూసిన రాష్ట్ర ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. -
పాపం ప్రజలదేనట..!
-
ఆ వీడియోలను బయటపెట్టాలని డిమాండ్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా 2015 జూలై 14న జరిగిన తొక్కిసలాటపై జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ దాదాపు మూడేళ్లపాటు విచారణ జరిపి, ఇచ్చిన నివేదికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటనకు మీడియా ప్రచారం, భక్తుల రద్దీయే కారణమని తేల్చడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ఈ తొక్కిసలాటతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదని, పైగా చంద్రబాబు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారని కితాబు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల్లో ముఖ్యమంత్రి స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలు ఎక్కడున్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్ష్యాధారాలను మాయం చేశారని, సీఎం ప్రచారం యావ వల్లే ఈ తొక్కిసలాట జరిగి, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి మీడియాను, భక్తులను కారకులను చేయడం సరికాదని పేర్కొంటున్నారు. సాధారణ భక్తుల ఘాట్‌కు సీఎం ఎందుకెళ్లారు? గోదావరి పష్కరాలకు తరలి రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది ముందుగానే టీవీ చానళ్లు, పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో సాగించిన ప్రచారాన్ని సోమయాజులు కమిషన్ తన నివేదికలో కనీసం ప్రస్తావించలేదు. వీఐపీలకు ప్రత్యేకంగా రాజమహేంద్రవరంలోనే సరస్వతి ఘాట్ ఉండగా, సీఎం చంద్రబాబు కుటుంబం, మంత్రులు సాధారణ భక్తులకు కేటాయించిన పుష్కర ఘాట్‌లోకి ఎందుకు వెళ్లారో చెప్పలేదు. పుష్కరఘాట్‌లో భక్తులను నిలిపివేసి ఒక్కసారిగా వదిలారన్న అంశాన్ని కమిషన్ విస్మరించింది. రద్దీ అధికంగా ఉంటే భక్తులను పక్కనే 200 మీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాల ఘాట్, పద్మావతి ఘాట్లకు ఎందుకు మళ్లించలేదు? అని నివేదికలో ఎక్కడా ప్రశ్నించలేదు. ఆ వీడియోలు ఎక్కడున్నాయి? తొక్కిసలాట ఘటనకు మీడియా, భక్తులను బాధ్యులను చేయడం దారుణం. రూ.64 లక్షలకు ఏపీ టూరిజం శాఖ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పుష్కరాల్లో ముఖ్యమంత్రి స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలు ఎక్కడున్నాయి? – ముప్పాళ్ల సుబ్బారావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు. రాజమహేంద్రవరం సీఎం ప్రచార యావ వల్లే తొక్కిసలాట 2003 నాటి గోదావరి పుష్కరాల ఫొటోలు ఉన్నాయి, మరి 2015 పుష్కరాల సీసీ కెమెరాల ఫుటేజీలు ఎందుకు లేవు? సాక్ష్యాధారాలను మాయం చేశారు. సీఎం ప్రచారం యావ వల్లే తొక్కిసలాట జరిగింది. మీడియా, భక్తులను కారకులను చేయడం సరికాదు. – కూనపురెడ్డి శ్రీనివాసరావు, న్యాయవాది, అఫిడవిట్దారుడు, రాజమహేంద్రవరం అబద్ధం ఎవరిది? తాను అక్కడ ఉండగానే తొక్కిసలాట గురించి తెలిసిందని, వెంటనే కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి కంట్రోల్ చేయాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఏకసభ్య కమిషన్ మరోలా చెప్పింది. ఇక్కడ చంద్రబాబు అబద్ధం అడారా? లేక కమిషన్ అబద్ధం చెప్పిందా? – ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ మీడియాను నిందించడం సరికాదు పుష్కరాలపై సమాచారం తెలియజేయడం మీడియా ప్రధాన విధి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. దానికి మీడియాను కారణంగా చూపడం సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – మండేలా శ్రీరామమూర్తి, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రాజమహేంద్రవరం -
దోషం భక్తులది.. పాపం మీడియాది
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందడానికి భక్తులు, ప్రసార మాధ్యమాలే కారణమని రిటైర్డ్ జస్టిస్ సోమయాజులు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ తేల్చేసింది. 2015 జూలై 14న పుష్కరాల తొలి రోజున స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ముహూర్త కాలంలోనే స్నానం చేయకపోతే పుణ్యం రాదేమోనన్న ఆందోళనతో భక్తులంతా ఒక్కసారిగా నదిలోకి దూసుకురావడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. ఈ దుర్ఘటనపై మూడేళ్లపాటు సుదీర్ఘ విచారణ చేసిన జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన ఈ నివేదికను చూసిన రాష్ట్ర ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం ప్రచార యావకు సామాన్యులు బలి గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై అప్పటి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను గానీ, అలాగే ఘటన ఎలా జరింగిందనే దానిపై మీడియాలో వచ్చిన కథనాలను గానీ ఏకసభ్య కమిషన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు పలువురు కమిషన్ ముందు విచారణకు హాజరై ఇచ్చిన నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో అట్టహాసంగా నిర్వహించామని ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్నానం చేస్తుండగా వెనుక పెద్ద ఎత్తున జనసందోహం కనిపించేలా వీడియోలు చిత్రీకరించడం, దానివల్లే తొక్కిసలాట జరగడాన్ని ఏకసభ్య కమిషన్ పట్టించుకోలేదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది చెబితే అదే నివేదికలో రాసిచ్చినట్లుగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పైగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుష్కర స్నానాన్ని కూడా ప్రస్తావిస్తూ దానికి మీడియాలో ప్రచారం కల్పించారని నివేదికలో పేర్కొనడం గమనార్హం. అధికార పార్టీపై ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తాయని నివేదికలో ప్రస్తావించారు. 29 మంది మృతి చెందడం సాధారణ విషయమేనని, అందులో ప్రభుత్వం తప్పేమీ లేదని, పొరపాటంతా పుష్కర భక్తులది, ప్రచారం చేసిన మీడియాదేనని నివేదికలో పేర్కొన్నారు. కమిషన్ నివేదికలో ఏముందంటే... ‘‘పుష్కరాలలో తీర్థవిధులు నిర్వర్తించడమే చాలా ముఖ్యమైన అంశం. భక్తులు తమ పెద్దల పుణ్యతిథి రోజు ఈ తీర్థవిధులు నిర్వర్తిస్తారు. అందరు తల్లిదండ్రుల తిథులు ఒకే రోజు రావుకదా! ఈ ఇంగితాన్ని తెలుసుకోలేని ప్రసార మాద్యమాలు, ప్రవచన పండితులు, పంచాగకర్తలు, స్వామీజీలు ప్రజలను మూఢ నమ్మకాల్లో ముంచెత్తారు. నదీ స్నానం తెల్లవారుజామున చేస్తే అది దేవత స్నానం, సూర్యోదయం తరువాత చేస్తే మనుష్య స్నానం, ఎప్పుడుపడితే అప్పుడు చేస్తే అది రాక్షస స్నానం అని విశ్వాసం. కానీ, పుష్కరాల సమయంలో ఎప్పుడు స్నానం చేసినా అది పుణ్యప్రదమేనని సూత మహర్షి తన శిష్యులకు చెప్పారని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ సంగతిని ఏ టీవీ చానల్లోనూ సరిగ్గా చెప్పలేకపోయారు. ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించి తప్పుదోవ పట్టించారు. పుష్కరాలు జరిగే 12 రోజులూ పుణ్యకాలమేనని పురాణాలు ఘోషిస్తున్నాయి. దీన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేక తాము ఓ గొప్ప విషయాన్ని చెబుతున్నట్లుగా భావించి ఆ ముహూర్తానికే పుష్కర స్నానం చేయాలంటూ మీడియాలో ఊదరగొట్టారు. దీనివల్ల లక్షలాది మంది భక్తులు గోదావరి తీరాన పడిగాపులు పడ్డారు. ముహూర్తకాలంలోనే స్నానం చెయ్యకపోతే పుణ్యం రాదేమోనన్న ఆందోళనతో ఒక్కసారిగా వెల్లువలా నదిలోకి పరుగులు పెట్టారు. పల్లంలోకి ప్రవహించే నీటిని ఆపగలమా? ప్రచారమనే చెడ్డవాహిక వల్ల ఎన్నో ప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి స్నానం చేసి వ్యాన్‌లోకి వెళ్లిన తరువాతే తొక్కిసలాట ఘటన జరిగింది’’ అని ఏకసభ్య కమిషన్ నివేదికలో వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు వీఐపీ ఘాట్‌ను వదిలి ఉదయమే 6.26 గంటలకు ఇతర వీఐపీలతో కలిసి పుష్కర ఘాట్‌కు ఎందుకు వచ్చారనే విషయాన్ని కమిషన్ అసలు పరిగణనలోకి తీసుకోలేదు. అక్కడ షూటింగ్ ఎందుకు నిర్వహించారనే అంశాన్ని ప్రస్తావించలేదు. తొక్కిసలాట ఘటనపై అప్పటి జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఆ నివేదిక గురించి ఏకసభ్య కమిషన్ కనీసం ప్రస్తావించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా వీవీఐపీలు, వీఐపీల కోసం పుష్కర ఘాట్‌ను గంటల తరబడి మూసివేశారని, తరువాత ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లు అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారు. రెండు రోజుల ముందు నుంచే భక్తులు రాజమండ్రికి రావడం ప్రారంభించారని, పుష్కరాలు ప్రారంభం కాగానే నదిలో స్నానం చేయాలని ఉత్సుకతతో ఆ రోజు తెల్లవారుజూమునే పుష్కర ఘాట్‌కు తరలివచ్చారని జిల్లా కలెక్టర్ తన నివేదికలో తెలియజేశారు. సీఎం చంద్రబాబుతోపాటు వీవీఐపీలు, వీఐపీలు ఉదయం 6.26 గంటల నుంచి పుష్కర ఘాట్‌లో ఉన్నారని, గోదావరి నదిలో తొలుత స్నానం చేసి పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని, వారు స్నానం పూర్తయ్యి బయటకు వచ్చేసరికి ఉదయం 8.30 గంటలైందని కలెక్టర్ పేర్కొన్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 8.30 గంటల వరకూ భక్తులను అనుమతించకపోవడంతో తాకిడి విపరీతంగా పెరిగిపోయిందని, ఆ తర్వాత కూడా కేవలం ఒక్క గేటునే తెరవడంతో తొక్కిసలాట జరిగిందని, పోలీసులు నిలువరించలేకపోయారని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయాలను ఏకసభ్య కమిషన్ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో షూటింగ్ గోదావరి పుష్కరాల్లో లక్షలాది మంది జనం వెనుక కనిపిస్తుండగా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు పుష్కర స్నానం చేస్తుండగా షూటింగ్ చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఈ వీడియోలను పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకోవాలని భావించారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో షూటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. వీఐపీల స్నానానికి తొలుత సరస్వతి ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. సీఎం, కుటుంబ సభ్యులు సరస్వతి ఆలయం వద్ద పుష్కర స్నానం ఆచరించాల్సి ఉంది. అయితే, చివరి నిముషంలో జనసమూహం మధ్య స్నానం ఆచరిస్తున్నట్లు షూటింగ్ చేసి, డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలని నిర్ణయించారు. దీంతో సీఎం, కుటుంబ సభ్యులు వీఐపీ ఘాట్‌ను వదిలి పుష్కర ఘాట్‌కు వచ్చారు. దీంతో భక్తులందరినీ అధికారులు నిలిపివేశారు. భక్తులంతా పెద్ద సమూహంగా కనిపించేలా పుష్కరాల ప్రారంభ ఘట్టాలను డ్రోన్ కెమేరాల ద్వారా చిత్రీకరించారు. ఆ చిత్రీకరణ పూర్తయ్యేదాకా భక్తులను స్నానాలకు అనుమతించలేదు. చిత్రీకరణ పూర్తయ్యాక ఒక్కసారిగా గేట్ తెరిచారు. దీంతో అందరూ ఒకేసారి ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రత్యక్ష సాక్షులంతా ఇదే విషయం చెప్పారు. అయితే ఏకసభ్య కమిషన్ తన నివేదికలో దీనిగురించి ప్రస్తావించకపోవడం పట్ల బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పుష్కరాల షూటింగ్‌లు, ప్రచారాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసింది. -
విచారణ ’పుష్కర’కాలం కొనసాగుతోంది
-
సోమయాజులు కమిషన్ విచారణ గడువు పెంపు
రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల మొదటి రోజు రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటపై విచారణ జరుపుతున్న జస్టిస్ సీవై సోమయాజులు ఏకసభ్య కమిషన్ గడువును ప్రభుత్వం మూడోసారి పెంచింది. రెండోసారి పెంచిన గడువు సెప్టెంబర్ 29తో ముగియడంతో 2017 జనవరి 29 వరకు నాలుగు నెలలపాటు పొడిగిస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జూలై 14న తొక్కిసలాట ఘటన చోటుచేసుకుని 29మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన మూడు నెలల తర్వాత అక్టోబర్ 15న విచారణ కమిషన్‌ను నియమించి 2016 మార్చి 29కి విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే పలుమార్లు విచారణ చేపట్టిన కమిషన్‌కు ప్రభుత్వ అధికారులు ఆధారాలు సమర్పించకపోవడం వల్ల గడువులోపు విచారణ పూర్తి కాలేదు. ఈ విషయాన్ని పిటిషనర్లు ఎప్పటికప్పడు కమిషన్ దృష్టికి తీసుకొస్తూ అవసరమైన ఆధారాలు సమర్పించేలా ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఆధారాలు సమర్పించలేదు. సీసీ కెమెరాల రికార్డులు, పుష్కరఘాట్ వద్ద వీఐపీ కాన్వాయ్ రావడానికి అనుమతి ఎవరు ఇచ్చారు, రోడ్లు భవనాల శాఖ ఏర్పాటు చేసిన బారికేడ్లు ఎవరు తొలగించారు వంటి వివరాలను కమిషన్ కు సమర్పించాల్సి ఉంది. సీఎం చంద్రబాబు గంటలపాటు పుష్కరఘాట్‌లో ఉండడమే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమని పిటిషనర్లు వాదిస్తుండగా ఘటన జరిగిన సమయంలో అక్కడి పరిస్థితులు కూడా ఇందుకు బలం చేకూరుస్తుండడంతో ప్రభుత్వం కావాలనే విచారణను సాగదీస్తోందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. మొదటిసారి గడువు పెంచిన ప్రభుత్వం నెల తర్వాత జీవో జారీ చేసింది. రెండో దఫా జూన్ 29న గడువు ముగియగా ఈసారి దాదాపు నెల తర్వాత ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పడు తాజాగా సెప్టెంబర్ 29తో సమయం ముగియగా 26 రోజుల తర్వాత జీవో జారీ చేసింది. ఇలా గడువు పెంచిన ప్రతిసారీ నెల రోజులపాటు సమయం వృథా అయ్యేలా ప్రభుత్వం వ్యవహరించడం విచారణపై ప్రభుత్వ నాన్చివేత ధోరణికి అద్దం పడుతోందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. -
ఆ షార్ట్ ఫిల్మ్‌ను బయటపెట్టాలి
నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చిత్రించిన షార్ట్ ఫిల్మ్‌ను బయటపెట్టాలి సోమయాజులు కమిషన్‌కు పలువురి డిమాండ్ పుష్కర ఘాట్ విషాదంపై కలెక్టర్ రెండు రకాల నివేదికలిచ్చారని వెల్లడి 29 మంది మృతి చెందితే ఏ ఒక్కరిపైనా చర్యలు లేకపోవడం దారుణమని ఆవేదన రాజమహేంద్రవరం : గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా గత ఏడాది జూలై 14న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి.. కలెక్టర్‌ను కమిషన్ ముందు హాజరుపరచి, క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు డిమాండ్ చేశారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. పుష్కర తొక్కిసలాట ఘటనపై రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ నాలుగోసారి బహిరంగ విచారణ జరిపింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చింతపల్లి ప్రభాకరరావు తన వాదనలు వినిపిస్తూ.. పుష్కర తొక్కిసలాటకు ఎవరూ బాధ్యులు కారని, కమిషన్ ముందు అధికారులను హాజరుపరచి విచారించాల్సిన అవసరం లేదని అన్నారు. బాధితులెవరూ అఫిడవిట్లు దాఖలు చేయలేదని.. ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తులు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశారని.. వారి వాదనలు పట్టించుకోనవసరం లేదని అన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందిస్తూ ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే ఏ ప్రభుత్వ అధికారుల తప్పు లేదంటూ కలెక్టర్ నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. ఇదే కలెక్టర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర ఘాట్‌లో 2 గంటలపాటు ఉండిపోయినందువల్లనే తొక్కిసలాట జరిగినట్టు నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. అదే కలెక్టర్ కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో ఈ ఘటనలో ఏ అధికారి తప్పిదమూ లేదని నివేదిక ఇవ్వడమేమిటని తప్పుపట్టారు. ఒకే వ్యక్తి రెండు రకాలుగా ఎలా నివేదిక ఇస్తారని ప్రశ్నించారు. సంఘటన స్థలంలో ఉన్న కలెక్టర్‌ను, ఆర్డీఓను, సబ్ కలెక్టర్‌ను, సంబంధిత అధికారులను హాజరుపరచి విచారణ జరపాలని కమిషన్‌ను కోరారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, పుష్కర ఏర్పాట్లపై గొప్పలు చెప్పిన ప్రభుత్వం పుష్కరాల నిర్వహణలో ఘోరంగా విఫలమైందని అన్నారు. ప్రజాప్రతినిధులు, న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ సోమయాజులు ఈ నెల 14న కమిషన్ తిరిగి విచారణ జరుపుతుందని తెలిపారు. కలెక్టర్‌ను విచారించాలి రెండు రకాలుగా నివేదికలిచ్చిన కలెక్టర్‌ను కమిషన్ ముందు హాజరుపరచి విచారణ జరపాలి. వీఐపీ ఘాట్ ఉండగా ముఖ్యమంత్రి పుష్కర ఘాట్కే ఎందుకు రావాలి? ఆయన ఆ ఘాట్‌లో స్నానం చేయడంవల్లే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట తరువాత సకాలంలో వైద్యం అందక చాలామంది మృతి చెందారు. దీనిపై విచారణ జరపాలి. కృష్ణా పుష్కరాల సందర్భంగా రైలింగ్ పడిపోయి ఐదుగురు మృతి చెందితే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. దానిని నిర్మించిన కాంట్రాక్టర్ పైన, సూపరింటిండెంట్ ఇంజనీర్ పైన, ఇతర అధికారులపైన చర్యలు తీసుకున్నారు. ఇక్కడ 29 మంది మృతి చెందితే ఏ ఒక్కరి పైనా చర్యలు తీసుకోలేదు. - జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు ముఖ్యమంత్రిని కమిషన్ ముందు హాజరుపరచాలి గోదావరి పుష్కరాల గొప్పతనం ప్రపంచానికి తెలిసేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ జియోగ్రఫీ ఛానల్, షార్ట్ ఫిల్మ్‌లను బయట పెట్టాలి. ఇంత పెద్ద ఘటన జరిగితే ఏ అధికారి తప్పూ లేదని చెప్పడం దారుణం. ఘటనా స్థలంలో ముఖ్యమంత్రి ప్రత్యక్ష సాక్షి కనుక ఆయనను, కలెక్టర్, ఆర్డీఓ, ఇతర అధికారులను కమిషన్ ముందు హాజరుపరచి ఎలా జరిగిందనేది బయటపెట్టాలి. - ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ కలెక్టర్‌ను విచారించాలి తప్పుడు సమాచారం ఇచ్చిన కలెక్టర్‌ను విచారించాలి. ఈ ఘటనకు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ, ఫొటోలు కానీ, సీసీ కెమెరా ఫుటేజ్‌లు కానీ కమిషన్‌కు సమర్పించలేదు. కలెక్టర్‌ను క్రాస్ ఎగ్జామ్ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి. పైగా 53 సంవత్సరాల 3 నెలల వయస్సున్న వృద్ధ మహిళలు మృతి చెందినట్లు కలెక్టర్ నివేదికలో ఇచ్చారు. అంటే ఆ వయస్సున్న మహిళల ప్రాణాలకు విలువ లేదా? నేషనల్ జియోగ్రఫీ చానల్ వీడియో ఫుటేజ్‌లు కమిషన్‌కు అందజేయాలి. - ముప్పాళ్ళ సుబ్బారావు, పౌరహక్కుల కౌన్సిల్ అధ్యక్షులు