రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల మొదటి రోజు రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటపై విచారణ జరుపుతున్న జస్టిస్ సీవై సోమయాజులు ఏకసభ్య కమిషన్ గడువును ప్రభుత్వం మూడోసారి పెంచింది. రెండోసారి పెంచిన గడువు సెప్టెంబర్ 29తో ముగియడంతో 2017 జనవరి 29 వరకు నాలుగు నెలలపాటు పొడిగిస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జూలై 14న తొక్కిసలాట ఘటన చోటుచేసుకుని 29మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన మూడు నెలల తర్వాత అక్టోబర్ 15న విచారణ కమిషన్ను నియమించి 2016 మార్చి 29కి విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది.
అయితే పలుమార్లు విచారణ చేపట్టిన కమిషన్కు ప్రభుత్వ అధికారులు ఆధారాలు సమర్పించకపోవడం వల్ల గడువులోపు విచారణ పూర్తి కాలేదు. ఈ విషయాన్ని పిటిషనర్లు ఎప్పటికప్పడు కమిషన్ దృష్టికి తీసుకొస్తూ అవసరమైన ఆధారాలు సమర్పించేలా ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఆధారాలు సమర్పించలేదు. సీసీ కెమెరాల రికార్డులు, పుష్కరఘాట్ వద్ద వీఐపీ కాన్వాయ్ రావడానికి అనుమతి ఎవరు ఇచ్చారు, రోడ్లు భవనాల శాఖ ఏర్పాటు చేసిన బారికేడ్లు ఎవరు తొలగించారు వంటి వివరాలను కమిషన్ కు సమర్పించాల్సి ఉంది.
సీఎం చంద్రబాబు గంటలపాటు పుష్కరఘాట్‌లో ఉండడమే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమని పిటిషనర్లు వాదిస్తుండగా ఘటన జరిగిన సమయంలో అక్కడి పరిస్థితులు కూడా ఇందుకు బలం చేకూరుస్తుండడంతో ప్రభుత్వం కావాలనే విచారణను సాగదీస్తోందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. మొదటిసారి గడువు పెంచిన ప్రభుత్వం నెల తర్వాత జీవో జారీ చేసింది. రెండో దఫా జూన్ 29న గడువు ముగియగా ఈసారి దాదాపు నెల తర్వాత ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పడు తాజాగా సెప్టెంబర్ 29తో సమయం ముగియగా 26 రోజుల తర్వాత జీవో జారీ చేసింది. ఇలా గడువు పెంచిన ప్రతిసారీ నెల రోజులపాటు సమయం వృథా అయ్యేలా ప్రభుత్వం వ్యవహరించడం విచారణపై ప్రభుత్వ నాన్చివేత ధోరణికి అద్దం పడుతోందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.
సోమయాజులు కమిషన్ విచారణ గడువు పెంపు
Published Wed, Oct 26 2016 8:30 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
Advertisement
Advertisement