నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చిత్రించిన షార్ట్ ఫిల్మ్‌ను బయటపెట్టాలి
సోమయాజులు కమిషన్‌కు పలువురి డిమాండ్
పుష్కర ఘాట్ విషాదంపై కలెక్టర్ రెండు రకాల నివేదికలిచ్చారని వెల్లడి
29 మంది మృతి చెందితే ఏ ఒక్కరిపైనా చర్యలు లేకపోవడం దారుణమని ఆవేదన
రాజమహేంద్రవరం : గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా గత ఏడాది జూలై 14న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి.. కలెక్టర్‌ను కమిషన్ ముందు హాజరుపరచి, క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు డిమాండ్ చేశారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. పుష్కర తొక్కిసలాట ఘటనపై రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ నాలుగోసారి బహిరంగ విచారణ జరిపింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ చింతపల్లి ప్రభాకరరావు తన వాదనలు వినిపిస్తూ.. పుష్కర తొక్కిసలాటకు ఎవరూ బాధ్యులు కారని, కమిషన్ ముందు అధికారులను హాజరుపరచి విచారించాల్సిన అవసరం లేదని అన్నారు. బాధితులెవరూ అఫిడవిట్లు దాఖలు చేయలేదని.. ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తులు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశారని.. వారి వాదనలు పట్టించుకోనవసరం లేదని అన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందిస్తూ ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే ఏ ప్రభుత్వ అధికారుల తప్పు లేదంటూ కలెక్టర్ నివేదిక ఇవ్వడం దారుణమన్నారు.
ఇదే కలెక్టర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర ఘాట్‌లో 2 గంటలపాటు ఉండిపోయినందువల్లనే తొక్కిసలాట జరిగినట్టు నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. అదే కలెక్టర్ కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో ఈ ఘటనలో ఏ అధికారి తప్పిదమూ లేదని నివేదిక ఇవ్వడమేమిటని తప్పుపట్టారు.
ఒకే వ్యక్తి రెండు రకాలుగా ఎలా నివేదిక ఇస్తారని ప్రశ్నించారు. సంఘటన స్థలంలో ఉన్న కలెక్టర్‌ను, ఆర్డీఓను, సబ్ కలెక్టర్‌ను, సంబంధిత అధికారులను హాజరుపరచి విచారణ జరపాలని కమిషన్‌ను కోరారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, పుష్కర ఏర్పాట్లపై గొప్పలు చెప్పిన ప్రభుత్వం పుష్కరాల నిర్వహణలో ఘోరంగా విఫలమైందని అన్నారు. ప్రజాప్రతినిధులు, న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ సోమయాజులు ఈ నెల 14న కమిషన్ తిరిగి విచారణ జరుపుతుందని తెలిపారు.
కలెక్టర్‌ను విచారించాలి
రెండు రకాలుగా నివేదికలిచ్చిన కలెక్టర్‌ను కమిషన్ ముందు హాజరుపరచి విచారణ జరపాలి. వీఐపీ ఘాట్ ఉండగా ముఖ్యమంత్రి పుష్కర ఘాట్‌కే ఎందుకు రావాలి? ఆయన ఆ ఘాట్‌లో స్నానం చేయడంవల్లే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట తరువాత సకాలంలో వైద్యం అందక చాలామంది మృతి చెందారు.
దీనిపై విచారణ జరపాలి. కృష్ణా పుష్కరాల సందర్భంగా రైలింగ్ పడిపోయి ఐదుగురు మృతి చెందితే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. దానిని నిర్మించిన కాంట్రాక్టర్ పైన, సూపరింటిండెంట్ ఇంజనీర్ పైన, ఇతర అధికారులపైన చర్యలు తీసుకున్నారు. ఇక్కడ 29 మంది మృతి చెందితే ఏ ఒక్కరి పైనా చర్యలు తీసుకోలేదు.
- జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు
ముఖ్యమంత్రిని కమిషన్
ముందు హాజరుపరచాలి
గోదావరి పుష్కరాల గొప్పతనం ప్రపంచానికి తెలిసేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ జియోగ్రఫీ ఛానల్, షార్ట్ ఫిల్మ్‌లను బయట పెట్టాలి. ఇంత పెద్ద ఘటన జరిగితే ఏ అధికారి తప్పూ లేదని చెప్పడం దారుణం. ఘటనా స్థలంలో ముఖ్యమంత్రి ప్రత్యక్ష సాక్షి కనుక ఆయనను, కలెక్టర్, ఆర్డీఓ, ఇతర అధికారులను కమిషన్ ముందు హాజరుపరచి ఎలా జరిగిందనేది బయటపెట్టాలి.
- ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ
కలెక్టర్‌ను విచారించాలి
తప్పుడు సమాచారం ఇచ్చిన కలెక్టర్‌ను విచారించాలి. ఈ ఘటనకు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ, ఫొటోలు కానీ, సీసీ కెమెరా ఫుటేజ్‌లు కానీ కమిషన్‌కు సమర్పించలేదు. కలెక్టర్‌ను క్రాస్ ఎగ్జామ్ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి. పైగా 53 సంవత్సరాల 3 నెలల వయస్సున్న వృద్ధ మహిళలు మృతి చెందినట్లు కలెక్టర్ నివేదికలో ఇచ్చారు. అంటే ఆ వయస్సున్న మహిళల ప్రాణాలకు విలువ లేదా? నేషనల్ జియోగ్రఫీ చానల్ వీడియో ఫుటేజ్‌లు కమిషన్‌కు అందజేయాలి.
- ముప్పాళ్ళ సుబ్బారావు, పౌరహక్కుల కౌన్సిల్ అధ్యక్షులు