సాక్షి, అమరావతి/ అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో పడవ బోల్తా కేసు నుంచి పెద్దలు, అసలు సూత్రధారులను తప్పించేందుకు ప్రభుత్వం పక్కాగా వ్యూహరచన చేస్తోంది. అనుమతి లేని పడవలను తెర వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు?, గతంలో విజిలెన్స్ అధికారులు సీజ్ చేసిన బోట్లను ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది?, ఎవరి ప్రమేయం ఎంత? అనే దిశలో లోతైన విచారణ చేయించకుండా కొందరు అధికారులు, కిందిస్థాయి వ్యక్తులను బలి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. కృష్ణా నదిలో విజయవాడకు సమీపంలో అనుమతులు లేకుండా పడవ షికార్లు నిర్వహిస్తున్న వ్యవహారంలో ఇద్దరు మంత్రులు, కొందరు పర్యాటక శాఖ అధికారులకు నేరుగా ప్రమేయం ఉన్న విషయం తెలిసిందే. అయితే మంత్రులతో సంబంధం లేకుండా పర్యాటక శాఖ సిబ్బందిని, ఇతరులను బాధ్యులను చేసి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎవరిపై చర్యలు తీసుకోవాలనే విషయమై చర్చించేందుకు జలవనరులు, హోం, పర్యాటక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు బుధవారం సచివాలయంలో సమావేశం కానున్నారు. అయితే పర్యాటక శాఖలో జనరల్ మేనేజర్ స్థాయిలో పనిచేసే ఒక వ్యక్తి, ఆయనకు సహకరించిన ఇద్దరు కింది స్థాయి ఉద్యోగులు, మరికొందరిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బోటు ఆపరేటర్ కొండలరావుతోపాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు అయ్యాయి.
బినామీ బాగోతం బట్టబయలు
మరోవైపు 22మందిని బలిగొన్న బోటు ఆపరేటర్ శేషం మోదకొండలరావు కొందరు పెద్దల బినామీయేనన్నది స్పష్టమైంది. ‘మా స్నేహితులు పెట్టుబడి పెట్టారు. స్థానికంగా ఉంటాను కాబట్టి నా పేరున బోటింగ్ సంస్థ నెలకొల్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేను అందుకు సరే అన్నా. కానీ ఆ బోటు ఎక్కడ తిరుగుతోందో... ఎలా తిరుగుతోందో నాకు తెలీదు..’అని కొండలరావు మంగళవారం ఓ అజ్ఞాత ప్రదేశంలో మీడియాకు వెల్లడించారు. కాగా ఇద్దరు మంత్రుల్లో ఒకరైన గుంటూరు జిల్లా మంత్రికి అత్యంత సన్నిహితుడైన పర్యాటక శాఖ ఉన్నతాధికారి ఒకరు ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారి అని విశ్వసనీయంగా తెలిసింది. అందుకే అనుమతులు లేనప్పటికీ ఆ బోటును దర్జాగా కృష్ణా నదిలోకి తీసుకువచ్చారు.
ఇటీవల బదిలీపై నెల్లూరు వెళ్లిన ఆ ఉన్నతాధికారి గతంలో అమరావతి పరిధిలోనే పని చేశారు. ఆ సమయంలోనే మంత్రి అండతో ప్రైవేటు బోటింగ్ మాఫియాను వ్యవస్థీకృతం చేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. గతంలో విజిలెన్స్ అధికారులు అనుమతులు లేని కొన్ని బోట్లను సీజ్ చేసినప్పటికీ మంత్రి ఒత్తిడితో విడిచిపెట్టారని తెలిసింది. అలా అనుమతి లేకుండా తిరుగుతున్న ‘రివర్ బే బోటింగ్ అండ్ అడ్వంచర్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్’కు చెందిన పడవే ఆదివారం ప్రమాదానికి గురైంది. ఆ సంస్థ కొండలరావు పేరున ఉండగా శేషగిరి, మనోజ్, మరికొందరు పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఆ నలుగురి వెనుక మంత్రి, పర్యాటక శాఖ ఉన్నతాధికారి ఉన్నారన్నది సుస్పష్టమని కొందరు అధికారులే చెబుతున్నారు.
కొండలరావుపై ఒత్తిళ్లు
మంగళవారం మీడియాతో మాట్లాడిన కొండలరావు ఆచూకీ తెలియకుండా పోయింది. విజయవాడ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. కానీ కొండలరావును అరెస్టు చేసినట్లు వారు ప్రకటించలేదు. అయితే అతన్ని ఓ ఆటోలో ఎక్కించుకుని తీసుకుపోయారని, పెద్దలు చెప్పినట్లుగా వినాలని, వారి పేర్లు బయటకు రానివ్వకూడదని ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు ఒప్పందం కుదిరిన తర్వాతే కొండలరావు అరెస్టును అధికారికంగా ప్రకటించేలా ప్రభుత్వ పెద్దలు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
ఒడ్డుకు చేరిన మృత్యు పడవ
ఇబ్రహీంపట్నం (మైలవరం): ఆదివారం కృష్ణానదిలో బోల్తా పడిన పడవను మంగళవారం సాయంత్రం అధికారులు ఒడ్డుకు చేర్చారు. నదీ గర్భంలో ఇసుక తోడే రెండు డ్రెడ్జింగ్ బోట్‌ల సహాయంతో ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి ఫెర్రీ ఘాట్ ఒడ్డుకు చేర్చారు. ఈ పడవను చూసేందుకు అధిక సంఖ్యలో స్థానికులు ఆ ప్రాంతానికి వచ్చారు. పడవపై కొంతమంది రాజకీయ నాయకుల బంధువుల పేర్లు ఉన్నాయని గత మూడు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి ఊతం ఇస్తూ పడవకు రెండు వైపులా కొత్తగా రంగులు వేసినట్లుగా కన్పించింది. 22 మంది మృతికి కారణమైన పడవను సీజ్ చేసి నది ఒడ్డునే ఉంచుతారా లేక మరేదైనా ప్రాంతానికి తరలిస్తారా? తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment