జాతీయస్థాయి పండగగా బతుకమ్మ
♦ నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ.10లక్షలు: రమణాచారి
♦ జిల్లాకొక ‘బతుకమ్మ పల్లె’
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మను జాతీయ స్థాయి పండుగగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. మంగళవారం రాత్రి సచివాలయంలో అన్నిజిల్లాల కలెక్టర్లు, జేసీలు, డీపీఆర్‌ఓలతో వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బతుకమ్మ పం డుగను నిర్వహించేందుకు ఒక్కో జిల్లాకు రూ.10లక్షలు కేటాయిస్తున్నామని తెలి పారు. ‘‘ఈసారి బతుకమ్మ పండుగకు చాలా విశిష్టత ఉంది.గతంలోలా కేవలం పూల పండుగ మాదిరిగా కాకుండా మహిళలు,బాలికలు, ప్రకృతి, చెరువు, పండుగ... ఈ ఐదింటి సమ్మేళనంగా జరుపుకోవాలి.
బతుకమ్మకు విస్తృత వ్యాప్తి కల్పించడమే దీని ఉద్దేశం’’ అని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక ‘బతుకమ్మ పల్లె’ను గుర్తించాలని ఆదేశించారు. విదేశీ యాత్రికులు ఆ గ్రామాలను సందర్శించి ప్రజల ఇళ్లల్లోనే అతిథులుగా తొమ్మిది రోజులపాటు ఉండి సంస్కృతీ సంప్రదాయాలను నేరుగా తెలుసుకుంటారని చెప్పారు. ‘ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం, షార్ట్‌ఫిల్మ్‌లపై రాష్ట్రస్థాయి పోటీలు కూడా ఉంటాయి. 21న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ముగింపు ఉత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా చేపట్టే పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా మహిళలు, మహిళా కళాకారులు మాత్రమే పాల్గొంటారు.శకటాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులిస్తాం’ అని వెల్లడించారు. జిల్లాల్లో మహిళా షాపింగ్ ఫెస్టివల్ కూడా నిర్వహించాలన్నారు.