14,15 తేదీల్లో పతంగుల పండుగ
తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహణ: చందూలాల్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘అంతర్జాతీయ పతంగుల పండుగ’ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాం స్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. శంషాబాద్‌లోని ఆగాఖాన్ అకాడమీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రాంగణంలో ఆ సంస్థతో కలసి తమ శాఖ ఈ పండుగ నిర్వహిస్తుంద న్నారు. టర్కీ, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, చైనా తదితర 32 దేశాల నుంచి వచ్చే కైట్ ఫ్లయర్స్, గుజరాత్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు ఇందులో పాల్గొంటారన్నారు. శుక్రవారం సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, పర్యాటకశాఖ కార్యదర్శి బి.వెంకటేశం, టూరిజం డెరైక్టర్ సునీత భగవతి, టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణలతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కళాకారులకు గుర్తింపు కార్డులు: ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ కళాభారతిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు డిజైన్లు పూర్తయ్యాయని చందూలాల్ చెప్పారు. అలాగే జానపద, గిరిజన, టీవీ, ఉర్దూ కళాకారులకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలోని రెండు వేల మంది వృద్ధ కళాకారులకు తోడు మరో 1,200 మందికి మార్చి/ఏప్రిల్‌లలో పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
సూరజ్‌కుండ్ మేళా థీమ్‌స్టేట్‌గా తెలంగాణ: ప్రసిద్ధి పొందిన హరియాణాలోని సూరజ్‌కుండ్ మేళాలో థీమ్ స్టేట్‌గా తెలంగాణ ఉండబోతోందని పర్యాటకశాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. ఈ మేళాలో కాకతీయ తోరణం గానీ, యాదాద్రి గానీ, లేదంటే ఈ రెండింటి నమూనాలను శాశ్వత కట్టడంగా అక్కడ నిర్మించబోతున్నామన్నారు. జనవరిలో హెలికాప్టర్ జాయ్‌రైడ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్‌ను అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.