
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పర్యాటక శాఖలో నిధుల పందేరం కొనసాగుతోంది. ఫెస్టివల్స్ పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక కొత్త పేరుతో ఫెస్టివల్స్ నిర్వహించడం.. సగటున రూ.2 కోట్ల మేర ఖర్చు చేయడం ఆనవాయితీగా మారింది. ఒకటిన్నర ఏడాది కాలంలోనే నాలుగు ఫెస్టివల్స్‌ను పర్యాటకశాఖ నిర్వహించింది. వీటి నిర్వహణలో ఆ శాఖ సిబ్బందికి ఏ మాత్రమూ పాత్ర లేదు. పూర్తిగా ఈవెంట్ మేనేజర్లకే అప్పగిస్తున్నారు. ఒక్కో ఫెస్టివల్స్‌ను ఒక్కో ఈవెంట్ మేనేజింగ్ సంస్థకు పర్యాటక శాఖ అప్పగిస్తోంది. మరోవైపు టెంపుల్ టూరిజం సర్క్యూట్, శిల్పారామం పేరిట వివిధ పథకాలను ప్రకటించిన పర్యాటక శాఖ ఒక్క ప్రాజెక్టును కూడా ఇప్పటివరకు పూర్తి చేసిన పాపాన పోలేదు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ జిల్లాకు చెందినవారు. అయితే..జిల్లాలో దీర్ఘకాలం పనికొచ్చే కార్యక్రమాలు కాకుండా కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో అఖిలప్రియ వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈవెంట్ మేనేజర్లదే హవా
ఇప్పటివరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్లులో మూన్‌లైట్, కర్నూలులో ధూల్ ఫెస్టివల్స్‌తో పాటు అహోబిలం ఫెస్టివల్‌ను, తాజాగా కర్నూలులో ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్‌షోను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పర్యాటక శాఖ అధికారుల పాత్ర నామమాత్రమేనని చెప్పవచ్చు. ఒక్కో ఫెస్టివల్‌కు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.8 కోట్ల మేర ఖర్చు చేశారు. ఒక్కో ఫెస్టివల్ నిర్వహణను ఒక్కో ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు అప్పగించారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ..కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు మొత్తం పెత్తనమంతా ఈవెంట్ మేనేజర్లకే అప్పగించడం.. పర్యాటకశాఖ అధికారులకు ఏ పాత్ర లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధులతో కనీసం జిల్లాలో వివిధ దేవాలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ కానీ, మినీ శిల్పారామాన్ని కానీ ఏర్పాటు చేసివుంటే అటు భక్తులతో పాటు శిల్పకారులకైనా మంచి జరిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అహోబిలం ఫెస్టివల్‌కు కోటి 70 లక్షల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. కనీసం రోడ్డును బాగు చేసి ఉంటే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేది. మొత్తం మీద ఫెస్టివల్స్ పేరుతో రూ.కోట్లు ఖర్చు చేయడంతో మంత్రి అఖిలప్రియ వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment