శిథిలావస్థలో శిల్పాలు, ప్రతాపగిరి కోట ద్వారం
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదీతీరం.. దట్టమైన అడవి.. ఎత్తైన గుట్ట.. అద్భుతమైన నిర్మాణం.. శత్రుదుర్భేద్యమైన స్థావరం.. జల, వన, గిరుల మధ్య దర్శనమిస్తోంది ప్రతాపరుద్రుడి వనదుర్గం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి గ్రామ సమీపంలో ఉన్న ఈ కోట ఇటీవల వెలుగుచూసింది. వెయ్యేళ్ల నాటి అరుదైన ఈ చారిత్రక సంపద ఆదరణలేక మరుగున పడిపోయింది. ఇటీవల ఔత్సాహిక చారిత్రక పరిశోధకులు అరవింద్ ఆర్యా, అనుదీప్ పరిశోధనల ఫలితంగా ఈ కోట గురించిన విశేషాలు బయ టి ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఏకో/అడ్వెంచర్ టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు ఈ కోటకు అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్నాయి. పర్యాటక శాఖ దృష్టి సారించి అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా మార్చవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
ఒకేచోట మూడు విధాలుగా...
పూర్వం శత్రుసైన్యాల నుంచి రక్షణ కోసం రాజ్య సరిహద్దుల్లో కోట లేదా దుర్గాలను నిర్మించి సైనిక స్థావరంగా రాజులు ఉపయోగించుకునేవారు. ఈ కోటలు లేదా దుర్గాలు నీటి వనరుల పక్కన ఉంటే జలదుర్గం, అడవిలో ఉంటే వన దుర్గం, కొండలు/గుట్టలపై ఉంటే గిరి దుర్గం అంటారు. కాకతీయుల కాలంలో గోదావరి తీరం సమీపంలో ప్రతాపగిరి గ్రామ సమీపంలోని దట్టమైన అడవిలో ఎత్తైన కొండపై జల, వన, గిరి దుర్గంగా ప్రతాపగిరి కోటను నిర్మించారు.
ఈ కోటను కాకతీయులు తమ సైనిక స్థావరంగా ఉపయోగించుకున్నారు. కాకతీయుల సామ్రాజ్యం చివరి రోజుల్లో ప్రతాపరుద్రుడు ఇక్కడ కొంత కాలం ఉన్నందున దీన్ని ప్రతాపగిరి కోట, ఈ కొండలను ప్రతాపగిరి గుట్టలు అని అంటారు. ఈ కొండ పై నుంచి గోదావరి నదీ ప్రవాహాన్ని చూడవచ్చు. ప్రతాపగిరి గిరి వద్ద మొదలైన గుట్టల వరస గోదావరితీరం వరకు విస్తరించి ఉంది. మధ్యలో గోదావరి నది మినహా ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంతో ఈ గుట్టలు అనుసంధానం చేయబడి ఉంటాయి. కాగా దీని వైపు ఇప్పుడు కన్నెత్తి చూసేవారు కరువవడంతో ఈ చారిత్రక సంపదకు తగిన గుర్తింపు రాలేదు. ఢిల్లీ సుల్తాను దండయాత్ర సమయంలో చివరి కాకతీయ వంశస్తులు ప్రతాపగిరిపై కొంతకాలం ఆశ్రయం తీసుకున్నాక దంతెవాడలో రాజ్యస్థాపన చేసినట్లు చరిత్ర చెబుతోంది.
పన్నెండు అడుగుల ఎత్తయిన ప్రహరీ
ఈ దుర్గం చుట్టూ ప్రహరీ, రాజప్రాసాదం, ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. కోట చుట్టూ ప్రహరీ 12 అడుగుల ఎత్తులో భారీ బండరాళ్లతో నిర్మించారు. కోట ప్రవేశద్వారానికి, దేవాలయానికి ఉన్నట్లు గజలక్ష్మి, సర్వతోభద్ర యంత్రం చెక్కబడి ఉన్నాయి. నాటి కాలానికి చెందిన శిల్పాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కోటలో రాజప్రాసాదం, సైనికుల నివాసాలు, గుర్రపుశాలలు, పహారా కాసే స్థలాలకు సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. కోటకు సమీపంలో గొంతెమ్మగుట్ట, రాపెళ్లి గుట్టల వద్ద కూడా కాకతీయుల కాలం నాటి సైనిక స్థావరాలున్నాయి. కోటలో రహస్యసొరంగ మార్గాలు ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు.
ముచ్చనాయుని నిర్మాణం
కోటగోడపై తొమ్మిది వరసల్లో తెలుగులో చెక్కిన శాసనం ఉంది. ఇది పూర్తిగా చదివి అర్థం చేసుకునేందుకు అనువుగా లేదు. అర్థమైనంత వరకు కీలక సంవత్సర వైశాఖ శుద్ధ తదియ వడ్డేవారమున శాసనం వేయించారు. ఈ దుర్గాన్ని ముచ్చనాయినంగారు నిర్మించినట్లుగా ఇతనికి ఇరువత్తుగండడు, గండగోపాలుడు, కంచిరక్ష్యాపాలకా, దాయగజకేసరి, అరిరాయ గజకేసరి, తెలుగు రాయుడు వంటి బిరుదులున్నట్లు ఈ శాసనంలో పేర్కొన్నారు. ఇందులో పేర్కొన్న దాయగజకేసరి, అరిరాయ గజకేసరి వంటి బిరుదులను బట్టి కాకతీయుల కాలంనాటికి చెందిన శాసనంగా అంచనా వేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment