గోన గన్నారెడ్డి ఇలాకా.. వర్ధమానపురం | Vardhamanapuram called as history of Kakatiyas is today Nandivaddeman village | Sakshi
Sakshi News home page

గోన గన్నారెడ్డి ఇలాకా.. వర్ధమానపురం

Published Sun, Oct 13 2024 5:46 AM | Last Updated on Sun, Oct 13 2024 7:26 AM

Vardhamanapuram called as history of Kakatiyas is today Nandivaddeman village

కాలక్రమేణా నందివడ్డెమాన్‌గా మార్పు  

 దాదాపు 2వేల ఏళ్ల చరిత్ర గల ప్రాంతం  

4 శతాబ్దాలు పాలించిన గోన వంశీయులు  

నేటికీ సజీవంగా చారిత్రక ఆనవాళ్లు

నాగర్‌కర్నూల్‌: ‘కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నందివడ్డెమాన్‌ గ్రామం. తెలంగాణలో వర్ధమానపురానికి 2 వేల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. క్రీస్తుశకం 8 నుంచి 12వ శతాబ్దం వరకు వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పరిపాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికీ కనిపించే ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం.  

నందివడ్డెమాన్‌గా ఎలా మారిందంటే.. 
క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన జైనమతం నాటి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిందని సాహిత్యపరంగా పురావస్తు శాఖ ద్వారా తెలుస్తోంది. నాటి జైనమత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైనమత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరుమీద ఈ గ్రామానికి వర్ధమానపురం పేరు వచి్చంది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నందివర్ధమానపురంగా పేరొందింది. ఇది కాలక్రమేణా నందివడ్డెమాన్‌గా మారింది.   

1100 గ్రామాలతో పాలన.. 
ఉదయచోళుడు 8వ శతాబ్దంలో వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 1100 గ్రామాలతో కండూరు నుంచి నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా) విస్తరించిన రాజ్యాన్ని పరిపాలించినట్లు చరిత్రకారులు చెబుతారు. కాకతీయ సామ్రాజ్యంలో సామంతుడిగా ఉన్న ఆయన.. తరువాత తనను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. దీంతో కాకతీయ మహారాజు గణపతిదేవుడు వీరుడైన గోన బుద్దారెడ్డి సహకారంతో ఉదయచోళుడిని ఓడించి తిరిగి వర్ధమానపురాన్ని స్వా«దీనం చేసుకున్నారు. తరువాత గోన బుద్దారెడ్డినే సామంత రాజుగా ప్రకటించి పట్టాభిõÙకం చేశారు. గోన బుద్దారెడ్డి మరణానంతరం ఆయన ముగ్గురు కుమారుల్లో ఒకడైన గోన గన్నారెడ్డి ఈ రాజ్యం పగ్గాలు చేపట్టారు. 

గుణశేఖర్‌ సినిమాలో.. 
2015లో గుణశేఖర్‌ దర్శకత్వంలో వచి్చన రుద్రమదేవి సినిమాలో ‘నేను తెలుగుభాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా’, ‘గమ్మునుండవోయ్‌’అంటూ తెలంగాణ యాసలో ఆకట్టుకునే డైలాగులతో అల్లు అర్జున్‌ చేసిన పాత్ర గోన గన్నారెడ్డిదే. గోన బుద్దారెడ్డి తరువాత వర్ధమానపురం రాజ్యం పగ్గాలు చేపట్టిన గోన గన్నారెడ్డి రుద్రమదేవికి కుడిభుజంగా ఉండి సమస్త కాకతీయ రాజ్యాలను రక్షించిన యోధుడిగా చెప్పుకుంటారు. ఆయన అశ్వ శిక్షణలో, గుర్రపు స్వారీలో, కత్తి యుద్ధంలో కాకతీయ రాజుల సామంతులలో ఎవరూ సాటి వచ్చేవారు కాదని చెప్పుకొంటారు. కాకతీయ సామ్రాజ్యంపైకి ఎవరైనా శత్రువులు వస్తే.. తన సైన్యంతో గుట్టుగా మాటు వేసి దాడులు చేసేవారని, ఇందుకోసం ప్రత్యేకంగా సొరంగ మార్గాలు కూడా ఉండేవని చరిత్రకారులు చెబుతారు.   

‘రంగనాథ రామాయణం’ఆవిష్కరణ   
గోన బుద్దారెడ్డి మంచి సాహిత్యకారుడిగా పేరుపొందారు. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి బుద్దారెడ్డి రంగనాథ రామాయణం పేరుతో తొలి ద్విపద కావ్యాన్ని రచించారు. యుద్ధకాండ వరకు బుద్దారెడ్డి రచించగా ఆయన కుమారులు మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు. వాలీ్మకి రచించిన రామాయణంలో లేని కొన్ని సంఘటనలు కూడా ఇందులో పొందుపరిచారు. గోన గన్నారెడ్డి సైతం వర్ధమానపురాన్ని పరిపాలించే సమయంలో రాజ్యానికి 12 కిలోమీటర్ల దూరంలో అరణ్యంలో ఓ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ ప్రాంతాన్ని నాడు బుద్దవరంగా.. ప్రస్తుతం బుద్దారంగా పిలుస్తారు. నంది వర్ధమానపురాన్ని పరిపాలించిన కాకతీయులు, గోన వంశీయులు దైవభక్తిపరులు, దీనికి నిదర్శనం గ్రామంలో నేటికీ చెక్కుచెదరని ఆలయాలే. ఇక్కడ తొమ్మిది ప్రధానాలయాలున్నాయి. వర్ధమానపురం సామ్రాజ్యానికి సంబంధించిన శిలాశాసనాలు నేటికీ అక్కడ దర్శనమిస్తాయి. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలం 24–1–1229 నాటి శిలాశాసనాలు కూడా ఉన్నాయి. పలు ఆలయాల్లో శిలాశాసనాలు, రాజ్యం చుట్టూ నిర్మించిన కోటగోడలు కూడా కనిపిస్తాయి.

పర్యాటక కేంద్రంగా గుర్తించాలి 
వేల ఏళ్ల చరిత్ర కలిగిన నంది వడ్డెమాన్‌ను పర్యాటక కేంద్రంగా గుర్తించాలి. నంది వడ్డెమన్‌కు ఉన్న చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందరికీ తెలిసేలా చేయాలి. మా వంతుగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. నందివడ్డెమాన్‌ చరిత్ర అందరికీ తెలిసేలా పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి.  – వంగ సుదర్శన్‌గౌడ్, మాజీ సర్పంచ్‌  

పూర్వవైభవం తేవాలి.. 
గతంలో నేచర్‌ అండ్‌ ఇండియన్‌ కల్చర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆలయాల చుట్టూ శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని యువజన సంఘాలు, యువకులు సహకరించారు. ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు, దేవతలను ప్రతిష్టించేందుకు, ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. – భూపతి, గ్రామస్తుడు

ప్రధాన ఆలయాలివి.. కాళికామాత ఆలయం..  
గ్రామ చెరువు భీమ సముద్రం కట్టకు దగ్గరలో కాళికామాత దేవాలయం ఉంది. అత్యంత జీవకళ ఉట్టిపడేలా ఉండే ఈ దేవాలయంలో విగ్రహాలు రజాకార్ల కాలంలో ధ్వంసమైనట్లు చెబుతుంటారు. ఎన్నో కళాఖండాలతో నగిïÙలతో దేవాలయం అద్భుతంగా ఉంటుంది.  

శివగౌరమ్మ ఆలయం..  
తూర్పు దిక్కున శివుడు, దొంతుల గౌరమ్మ, పంచ గౌరమ్మ ఆలయాలున్నాయి. ఆలయం ముందున్న విఘ్నేశ్వరుడి విగ్రహం అద్భుత కళా నైపుణ్యంతో చెక్కబడి కనిపిస్తుంది.

త్రిమూర్తుల ఆలయం..  
ఆగ్నేయ దిశలో అరుదుగా ఉండే త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆలయాలున్నాయి. ఈ దేవాలయాలు ఎత్తుగా ఉండి నిర్మాణ శైలి అలంపూర్‌లోని ఆలయాలను పోలి ఉంటాయి. ఈ దేవాలయం నుంచి గుడిపల్లి గట్టు వరకు సొరంగ మార్గం ఉన్నట్లు చెబుతుంటారు. విగ్రహాలను దుండగులు అపహరించుకుపోవడంతో ఆలయాలు మాత్రమే దర్శనమిస్తాయి.  

వీరభద్రాలయం.. 
పడమర దిక్కున వీరభద్రస్వామి, శివుడు ఆలయాలు ఉన్నాయి. నిలువెత్తు వీరభద్రస్వామి విగ్రహం గాంభీర్యంతో కత్తి ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

నందీశ్వర, శనైశ్వర ఆలయం..  
ప్రధానంగా శివుడు, పార్వతి, ప్రత్యేక ఆకర్షణగా నంది విగ్రహాలుంటాయి. నంది విగ్రహం అద్భుత కళానైపుణంతో చెక్కి ఉంటుంది. ఇది శ్రీశైలంలోని ప్రధాన నందిని పోలి ఉంటుంది. దీనికి సమీపంలో శనేశ్వరస్వామి ఆలయం ఉంది. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయానికి ప్రతి శని త్రయోదశి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement