Kakatiyas
-
గోన గన్నారెడ్డి ఇలాకా.. వర్ధమానపురం
నాగర్‌కర్నూల్: ‘కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నందివడ్డెమాన్ గ్రామం. తెలంగాణలో వర్ధమానపురానికి 2 వేల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. క్రీస్తుశకం 8 నుంచి 12వ శతాబ్దం వరకు వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పరిపాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికీ కనిపించే ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం. నందివడ్డెమాన్‌గా ఎలా మారిందంటే.. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన జైనమతం నాటి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిందని సాహిత్యపరంగా పురావస్తు శాఖ ద్వారా తెలుస్తోంది. నాటి జైనమత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైనమత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరుమీద ఈ గ్రామానికి వర్ధమానపురం పేరు వచి్చంది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నందివర్ధమానపురంగా పేరొందింది. ఇది కాలక్రమేణా నందివడ్డెమాన్‌గా మారింది. 1100 గ్రామాలతో పాలన.. ఉదయచోళుడు 8వ శతాబ్దంలో వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 1100 గ్రామాలతో కండూరు నుంచి నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా) విస్తరించిన రాజ్యాన్ని పరిపాలించినట్లు చరిత్రకారులు చెబుతారు. కాకతీయ సామ్రాజ్యంలో సామంతుడిగా ఉన్న ఆయన.. తరువాత తనను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. దీంతో కాకతీయ మహారాజు గణపతిదేవుడు వీరుడైన గోన బుద్దారెడ్డి సహకారంతో ఉదయచోళుడిని ఓడించి తిరిగి వర్ధమానపురాన్ని స్వా«దీనం చేసుకున్నారు. తరువాత గోన బుద్దారెడ్డినే సామంత రాజుగా ప్రకటించి పట్టాభిõÙకం చేశారు. గోన బుద్దారెడ్డి మరణానంతరం ఆయన ముగ్గురు కుమారుల్లో ఒకడైన గోన గన్నారెడ్డి ఈ రాజ్యం పగ్గాలు చేపట్టారు. గుణశేఖర్ సినిమాలో.. 2015లో గుణశేఖర్ దర్శకత్వంలో వచి్చన రుద్రమదేవి సినిమాలో ‘నేను తెలుగుభాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా’, ‘గమ్మునుండవోయ్’అంటూ తెలంగాణ యాసలో ఆకట్టుకునే డైలాగులతో అల్లు అర్జున్ చేసిన పాత్ర గోన గన్నారెడ్డిదే. గోన బుద్దారెడ్డి తరువాత వర్ధమానపురం రాజ్యం పగ్గాలు చేపట్టిన గోన గన్నారెడ్డి రుద్రమదేవికి కుడిభుజంగా ఉండి సమస్త కాకతీయ రాజ్యాలను రక్షించిన యోధుడిగా చెప్పుకుంటారు. ఆయన అశ్వ శిక్షణలో, గుర్రపు స్వారీలో, కత్తి యుద్ధంలో కాకతీయ రాజుల సామంతులలో ఎవరూ సాటి వచ్చేవారు కాదని చెప్పుకొంటారు. కాకతీయ సామ్రాజ్యంపైకి ఎవరైనా శత్రువులు వస్తే.. తన సైన్యంతో గుట్టుగా మాటు వేసి దాడులు చేసేవారని, ఇందుకోసం ప్రత్యేకంగా సొరంగ మార్గాలు కూడా ఉండేవని చరిత్రకారులు చెబుతారు. ‘రంగనాథ రామాయణం’ఆవిష్కరణ గోన బుద్దారెడ్డి మంచి సాహిత్యకారుడిగా పేరుపొందారు. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి బుద్దారెడ్డి రంగనాథ రామాయణం పేరుతో తొలి ద్విపద కావ్యాన్ని రచించారు. యుద్ధకాండ వరకు బుద్దారెడ్డి రచించగా ఆయన కుమారులు మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు. వాలీ్మకి రచించిన రామాయణంలో లేని కొన్ని సంఘటనలు కూడా ఇందులో పొందుపరిచారు. గోన గన్నారెడ్డి సైతం వర్ధమానపురాన్ని పరిపాలించే సమయంలో రాజ్యానికి 12 కిలోమీటర్ల దూరంలో అరణ్యంలో ఓ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ ప్రాంతాన్ని నాడు బుద్దవరంగా.. ప్రస్తుతం బుద్దారంగా పిలుస్తారు. నంది వర్ధమానపురాన్ని పరిపాలించిన కాకతీయులు, గోన వంశీయులు దైవభక్తిపరులు, దీనికి నిదర్శనం గ్రామంలో నేటికీ చెక్కుచెదరని ఆలయాలే. ఇక్కడ తొమ్మిది ప్రధానాలయాలున్నాయి. వర్ధమానపురం సామ్రాజ్యానికి సంబంధించిన శిలాశాసనాలు నేటికీ అక్కడ దర్శనమిస్తాయి. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలం 24–1–1229 నాటి శిలాశాసనాలు కూడా ఉన్నాయి. పలు ఆలయాల్లో శిలాశాసనాలు, రాజ్యం చుట్టూ నిర్మించిన కోటగోడలు కూడా కనిపిస్తాయి.పర్యాటక కేంద్రంగా గుర్తించాలి వేల ఏళ్ల చరిత్ర కలిగిన నంది వడ్డెమాన్ను పర్యాటక కేంద్రంగా గుర్తించాలి. నంది వడ్డెమన్కు ఉన్న చరిత్రను భవిష్యత్ తరాలకు అందరికీ తెలిసేలా చేయాలి. మా వంతుగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. నందివడ్డెమాన్ చరిత్ర అందరికీ తెలిసేలా పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి. – వంగ సుదర్శన్‌గౌడ్, మాజీ సర్పంచ్ పూర్వవైభవం తేవాలి.. గతంలో నేచర్ అండ్ ఇండియన్ కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయాల చుట్టూ శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని యువజన సంఘాలు, యువకులు సహకరించారు. ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు, దేవతలను ప్రతిష్టించేందుకు, ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. – భూపతి, గ్రామస్తుడుప్రధాన ఆలయాలివి.. కాళికామాత ఆలయం.. గ్రామ చెరువు భీమ సముద్రం కట్టకు దగ్గరలో కాళికామాత దేవాలయం ఉంది. అత్యంత జీవకళ ఉట్టిపడేలా ఉండే ఈ దేవాలయంలో విగ్రహాలు రజాకార్ల కాలంలో ధ్వంసమైనట్లు చెబుతుంటారు. ఎన్నో కళాఖండాలతో నగిïÙలతో దేవాలయం అద్భుతంగా ఉంటుంది. శివగౌరమ్మ ఆలయం.. తూర్పు దిక్కున శివుడు, దొంతుల గౌరమ్మ, పంచ గౌరమ్మ ఆలయాలున్నాయి. ఆలయం ముందున్న విఘ్నేశ్వరుడి విగ్రహం అద్భుత కళా నైపుణ్యంతో చెక్కబడి కనిపిస్తుంది.త్రిమూర్తుల ఆలయం.. ఆగ్నేయ దిశలో అరుదుగా ఉండే త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆలయాలున్నాయి. ఈ దేవాలయాలు ఎత్తుగా ఉండి నిర్మాణ శైలి అలంపూర్‌లోని ఆలయాలను పోలి ఉంటాయి. ఈ దేవాలయం నుంచి గుడిపల్లి గట్టు వరకు సొరంగ మార్గం ఉన్నట్లు చెబుతుంటారు. విగ్రహాలను దుండగులు అపహరించుకుపోవడంతో ఆలయాలు మాత్రమే దర్శనమిస్తాయి. వీరభద్రాలయం.. పడమర దిక్కున వీరభద్రస్వామి, శివుడు ఆలయాలు ఉన్నాయి. నిలువెత్తు వీరభద్రస్వామి విగ్రహం గాంభీర్యంతో కత్తి ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.నందీశ్వర, శనైశ్వర ఆలయం.. ప్రధానంగా శివుడు, పార్వతి, ప్రత్యేక ఆకర్షణగా నంది విగ్రహాలుంటాయి. నంది విగ్రహం అద్భుత కళానైపుణంతో చెక్కి ఉంటుంది. ఇది శ్రీశైలంలోని ప్రధాన నందిని పోలి ఉంటుంది. దీనికి సమీపంలో శనేశ్వరస్వామి ఆలయం ఉంది. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయానికి ప్రతి శని త్రయోదశి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. -
చారిత్రక బావి.. అభివృద్ధి చర్యలేవి
అయిదంతస్తులు.. వంద అడుగుల లోతు.. కాకతీయుల కాలం నాటి కళాత్మక నిర్మాణమిది. శిథిలమైపోతున్న ఒక పురాతన బావి నేపథ్యమిది. పాలకుల ఆదరణకు నోచక..శిథిలమైపోతున్న ఈ బావి కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్ర శివారులో ఉంది. సుమారు 18వ శతాబ్దంలో నిర్మితమైన ఈ బావి అడుగు నుంచిపైభాగంవరకునాలుగు వైపులా ఒకే రకమైన మెట్లు ఉన్నాయి. ఉపరితలం నుంచి 20 అడుగుల వరకు ఒక్కొక్క అంతస్తు చొప్పున అయిదు అంతస్తుల మెట్లు ఉన్నాయి. మెట్ల బావి చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచాయి. పునరుద్ధరణ కోసం పురావస్తు శాఖ ముందుకొచ్ఛినా.. నిధుల కొరత వల్ల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ మెట్ల బావి తరహాలోనే.. లింగంపేటలోని పురాతన మెట్ల బావిని బాగు చేయాలని.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
గుడి నిర్వహణకు వృత్తి పన్ను
సాక్షి,హైదరాబాద్: ఊళ్లలో దేవాలయాలు నిర్మించినప్పుడు వాటి నిర్వహణ ఖర్చులకు కూడా కులవృత్తుల వారిపై పన్ను విధించేవారని తెలిపే కాకతీయుల శాసనం ఒకటి వెలుగు చూసింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సాల్వాపూరు గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు దేవరం రమేశ్ శర్మ, సామలేటి మహేశ్‌లు కాకతీయకాలం నాటి ఈ శాసనాన్ని గుర్తించారు. ప్రతాపరుద్రుడు పాలించిన కాలం నాటిదిగా చెబుతున్నారు. 1290–91 విరోధినామ సంవత్సరంలో ఈ శాసనాన్ని వేయించినట్టుగా ఉంది. నాలుగు వైపులా శాసనం చెక్కిన రాయి ఆ దేవాలయంలో ఉంది. నూనె గానుగలను నిర్వహించే గానుగలవాండ్లు, నేతవృత్తి నిర్వహించే సేనివారు దేవాలయ నిర్వహణకు పన్ను చెల్లించాలని ఆ శాసనంలో ఉంది. గానుగల వారు గానుగ ఒక్కింటికి, సేనివారు మగ్గం ఒక్కింటికి అడ్డుగ (అర్థరూపాయి) చొప్పున చెల్లించాలని ఆ శాసనం చెప్తోంది. అయితే గోడలోకి ఏర్పాటు చేయించినందున శాసనం అన్ని వైపులా చూసే వీలు లేకుండా ఉందని, మొత్తం చూస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని, వెలుగుచూసినంతవరకు శాసనపాఠాన్ని పరిష్కరించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. -
అరుదైన ఆలయంపై అంతులేని నిర్లక్ష్యం!
సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రఖ్యాతి గాంచిన కాకతీయులు నిర్మించిన ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పైకప్పులు దెబ్బతిని చిన్న వర్షానికే నీటితో నిండిపోతున్నాయి. ఈ చారిత్రక సంపదను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిరక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా్లలోని గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామంలో ఉన్న దేవాలయం ప్రత్యేకమైనది. రాణి రుద్రమదేవి కాలంలో ఇక్కడ పూజలు జరిగాయి. వేయి స్తంభాల గుడి, రామప్ప నిర్మాణాలన్నీ సాండ్‌బాక్స్ టెక్నాలజీగా చెప్పుకుంటాం. కానీ మొగిలిచర్లలోని ఆలయం మాత్రం నేటి ఇంజినీర్లకే అంతుచిక్కని సాంకేతికతతో రూపుదిద్దుకుంది. రాతిబండపై భారీ శిల్పాలను, శిలలను పేర్చినా వందల సంవత్సరాల నుంచి చెక్కుచెదరకుండా నిలబడి ఉండటం విశేషం. తెలంగాణలో కాకతీయుల చరిత్రను చెప్పే అత్యంత విశిష్టతను కలిగిన దేవాలయం పాలకుల నిర్లక్ష్యం, పురావస్తు శాఖ అధికారుల చిన్నచూపుతో నిరాదరణకు గురవుతోందని చరిత్రకారులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడి విశిష్టత కాసె సర్వప్ప రచించిన ‘సిద్దేశ్వర చరిత్ర’లో చెప్పిన దాని ప్రకారం గర్భగుడి, అంతరాలయాలు చిన్నగదులుగా, 28 స్తంభాలతో, విశాలమైన అర్ధమంటపంతో కూడిన దేవాలయం ఇది. గర్భగుడిపైన విమానం లేదు. రంగమంటపంపైన అవశేషాలు మిగిలిన ఇటుకల విమానమొకటి కనిపిస్తున్నది. హిందూ దేవాలయాలవలె తూర్పు, ఉత్తర ముఖద్వారాలతో కాక పశ్చిమాభిముఖంగా ఈ గుడి ఉంది. గర్భాలయ ద్వారపాలకులు కనిపించరు. అంతరాలయ ద్వారమొకటి కొంత పూర్వకాకతీయ లేదా చాళుక్యశైలిలో కనిపిస్తుంది. రంగమంటపం లోకప్పు అష్టదళపద్మం, అష్టభుజకోణాల మధ్య చెక్కబడివుంది. గతవైభవం కోల్పోయిన ఆలయం హరిహరదేవుడు, మురారిదేవుడు ఇద్దరూ తిరుగుబాటుకు ప్రయత్నించడం తెలిసిన రుద్రమదేవి వారిని మొగిలిచెర్లవద్దనే నిలువరించి, ఓడించి, బంధించింది. రుద్రమ సైనికాధికారులు రేచెర్ల ప్రసాదిత్యుడు, కాయస్త జన్నిగదేవుడు, విరియాల సూరననాయకుడు వారిని శత్రుశేషం ఉండరాదని వధించారు. దేవగిరి రాజు మహదేవుడు రుద్రమ ఏకవీరాదేవి గుడికి వెళ్తున్నపుడే అడ్డగించి, యుద్ధానికి దిగాడు. మహదేవుని ఓడించి రుద్రమదేవి తరిమికొట్టిందని తెలుస్తోంది. మొగిలిచెర్లలో సైనిక శిక్షణ కేంద్రముండేది. ప్రతాపరుద్రుని కాలంలో ఇక్కడియోధులు ఢిల్లీలో తమ యుద్ధవిద్యా ప్రదర్శనలిచ్చారు. ఏకవీరాలయంలో పేరిణీ నృత్య ప్రదర్శనలు నిర్వహించేవారని ఈ గుడిపై పరిశోధన జరిపిన చరిత్రకారులు తెలిపారు. రుద్రమదేవి పంచరాత్ర వ్రతం మొగిలిచర్ల ఊరికి వాయవ్య భాగాన చేను, చెలకల మధ్య ఏకవీరాదేవి (రేణుకాదేవి) ఆలయం ఉంటుంది. దీనిని కాకతిరుద్రదేవుడు (క్రీ.శ.1042 నుంచి 1130) కట్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయం ముందు కూలిపడిపోయిన మహాద్వారం ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఆలయం పైకప్పు 34 రాతి స్తంభాలపై నిలిచి ఉంది. గర్భాలయంలో రెండు స్తంభాలతో అంతరాలయంతో పాటు, బయట ఒక నాట్యమండపం కూడా ఉన్నది. గర్భాలయంలో ఏకవీరాదేవి విగ్రహం లేకపోయినా, కుండలములు, కంఠాభరణము, దండ కడియాలు ధరించి చతుర్భుజాలతో ఉన్న స్త్రీదేవతామూర్తి కనిపిస్తున్నది. ఈ విగ్రహం నాలుగుచేతుల్లో ఖడ్గం, ఢమరుకం, పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి.‘‘కాకతితో పాటు ఏకవీరకు పూజలు గొప్పగా జరుగుతుండేవని, ఏకవీర ఆలయం సైనికాధికారి కట్టించినదని, సువిశాల ప్రాంగణంలో ఆలయనిర్మాణం జరిగిందని, మంచినీటిబావి తవ్వకం చేయబడిందని, ఏకవీరను రుద్రమదేవి క్రమం తప్పక పూజించేదని చరిత్ర చెబుతుంది. అంతేకాకుండా యుద్ధవ్యూహరచనలను కూడా ఇక్కడే చేసేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ గుడినుంచి ఓరుగల్లుకు రెండు రహస్య సొరంగ మార్గాలుండేవని, కాకతీయులు ఏకవీర గుడి ఎదురుగా వున్న రాతిగుండ్లను తొలిచి గదులుగా చేసారని చెప్పబడింది. పట్టాభిషేకం పూర్తయిన తర్వాత రుద్రమదేవి ఐదు రాత్రులు నిద్రపోకుండా పంచరాత్రవ్రతం ఇక్కడే చేసిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆలయాన్ని కాపాడాలి ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయం నేడు గత వైభవాన్ని కోల్పోయింది. అక్కడికి వెళ్లాలంటే పొలాల గట్లపై నుంచి వెళ్లాలి. సరైన మార్గం లేక అక్కడికి వెళ్లే వాళ్లు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ గుడిలో ఎప్పుడు కూలిపోతాయో అన్నట్లు ఆలయ స్తంభాలు ఉన్నాయి. మట్టి బస్తాలను స్తంభాలు కూలకుండా పెట్టారు. కాగా వర్షానికి ఆ మట్టి బస్తాలు తడిసి బస్తాల్లోని మట్టి కరిగిపోతుంది. ఇప్పటికైనా పురావస్తుశాఖ స్పందించి ఆలయాన్ని కాపాడాలి. –ఆరవింద్ ఆర్య, చరిత్ర పరిశోధకుడు -
వెయ్యేళ్ల కోట... వెయ్యాలి బాట!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదీతీరం.. దట్టమైన అడవి.. ఎత్తైన గుట్ట.. అద్భుతమైన నిర్మాణం.. శత్రుదుర్భేద్యమైన స్థావరం.. జల, వన, గిరుల మధ్య దర్శనమిస్తోంది ప్రతాపరుద్రుడి వనదుర్గం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి గ్రామ సమీపంలో ఉన్న ఈ కోట ఇటీవల వెలుగుచూసింది. వెయ్యేళ్ల నాటి అరుదైన ఈ చారిత్రక సంపద ఆదరణలేక మరుగున పడిపోయింది. ఇటీవల ఔత్సాహిక చారిత్రక పరిశోధకులు అరవింద్ ఆర్యా, అనుదీప్ పరిశోధనల ఫలితంగా ఈ కోట గురించిన విశేషాలు బయ టి ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఏకో/అడ్వెంచర్ టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు ఈ కోటకు అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్నాయి. పర్యాటక శాఖ దృష్టి సారించి అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా మార్చవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఒకేచోట మూడు విధాలుగా... పూర్వం శత్రుసైన్యాల నుంచి రక్షణ కోసం రాజ్య సరిహద్దుల్లో కోట లేదా దుర్గాలను నిర్మించి సైనిక స్థావరంగా రాజులు ఉపయోగించుకునేవారు. ఈ కోటలు లేదా దుర్గాలు నీటి వనరుల పక్కన ఉంటే జలదుర్గం, అడవిలో ఉంటే వన దుర్గం, కొండలు/గుట్టలపై ఉంటే గిరి దుర్గం అంటారు. కాకతీయుల కాలంలో గోదావరి తీరం సమీపంలో ప్రతాపగిరి గ్రామ సమీపంలోని దట్టమైన అడవిలో ఎత్తైన కొండపై జల, వన, గిరి దుర్గంగా ప్రతాపగిరి కోటను నిర్మించారు. ఈ కోటను కాకతీయులు తమ సైనిక స్థావరంగా ఉపయోగించుకున్నారు. కాకతీయుల సామ్రాజ్యం చివరి రోజుల్లో ప్రతాపరుద్రుడు ఇక్కడ కొంత కాలం ఉన్నందున దీన్ని ప్రతాపగిరి కోట, ఈ కొండలను ప్రతాపగిరి గుట్టలు అని అంటారు. ఈ కొండ పై నుంచి గోదావరి నదీ ప్రవాహాన్ని చూడవచ్చు. ప్రతాపగిరి గిరి వద్ద మొదలైన గుట్టల వరస గోదావరితీరం వరకు విస్తరించి ఉంది. మధ్యలో గోదావరి నది మినహా ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంతో ఈ గుట్టలు అనుసంధానం చేయబడి ఉంటాయి. కాగా దీని వైపు ఇప్పుడు కన్నెత్తి చూసేవారు కరువవడంతో ఈ చారిత్రక సంపదకు తగిన గుర్తింపు రాలేదు. ఢిల్లీ సుల్తాను దండయాత్ర సమయంలో చివరి కాకతీయ వంశస్తులు ప్రతాపగిరిపై కొంతకాలం ఆశ్రయం తీసుకున్నాక దంతెవాడలో రాజ్యస్థాపన చేసినట్లు చరిత్ర చెబుతోంది. పన్నెండు అడుగుల ఎత్తయిన ప్రహరీ ఈ దుర్గం చుట్టూ ప్రహరీ, రాజప్రాసాదం, ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. కోట చుట్టూ ప్రహరీ 12 అడుగుల ఎత్తులో భారీ బండరాళ్లతో నిర్మించారు. కోట ప్రవేశద్వారానికి, దేవాలయానికి ఉన్నట్లు గజలక్ష్మి, సర్వతోభద్ర యంత్రం చెక్కబడి ఉన్నాయి. నాటి కాలానికి చెందిన శిల్పాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కోటలో రాజప్రాసాదం, సైనికుల నివాసాలు, గుర్రపుశాలలు, పహారా కాసే స్థలాలకు సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. కోటకు సమీపంలో గొంతెమ్మగుట్ట, రాపెళ్లి గుట్టల వద్ద కూడా కాకతీయుల కాలం నాటి సైనిక స్థావరాలున్నాయి. కోటలో రహస్యసొరంగ మార్గాలు ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. ముచ్చనాయుని నిర్మాణం కోటగోడపై తొమ్మిది వరసల్లో తెలుగులో చెక్కిన శాసనం ఉంది. ఇది పూర్తిగా చదివి అర్థం చేసుకునేందుకు అనువుగా లేదు. అర్థమైనంత వరకు కీలక సంవత్సర వైశాఖ శుద్ధ తదియ వడ్డేవారమున శాసనం వేయించారు. ఈ దుర్గాన్ని ముచ్చనాయినంగారు నిర్మించినట్లుగా ఇతనికి ఇరువత్తుగండడు, గండగోపాలుడు, కంచిరక్ష్యాపాలకా, దాయగజకేసరి, అరిరాయ గజకేసరి, తెలుగు రాయుడు వంటి బిరుదులున్నట్లు ఈ శాసనంలో పేర్కొన్నారు. ఇందులో పేర్కొన్న దాయగజకేసరి, అరిరాయ గజకేసరి వంటి బిరుదులను బట్టి కాకతీయుల కాలంనాటికి చెందిన శాసనంగా అంచనా వేయవచ్చు. -
చీమలతోనే చిక్కు..
సాక్షి, వరంగల్: అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉంది. చీమల కారణంగా ఈ ఆలయం గోడలు రోజురోజుకూ కుంగిపోతున్నాయి. క్రమంగా రెండు మూడేళ్లకు ఒకటి వంతున ఆలయానికి సంబంధించిన గోడలు, గోపురాలు, ద్వారాలు కూలిపోతున్నాయి. ఈ ఆలయం పునాదుల్లో ఉపయోగించిన ఇసుకను చీమలు తోడేస్తుండటంతో నిర్మాణంలోని పటిష్టత తగ్గిపోతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో రామప్పగుడిగా పిలువబడే రామలింగేశ్వరాలయం ఉంది. కాకతీయుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి ఈ ఆలయం నిదర్శనం. ఆలయంలో వేలాది శిల్పాలు ఉన్నాయి. ప్రధానంగా మదనికలు, నాగిని శిల్పాలను చూసేందుకు విదేశీ టూరిస్టులు కూడా వస్తుంటారు. కాకతీయులు భారీ ఆలయాల నిర్మాణంలో సాధారణ పద్ధతికి భిన్నంగా శాండ్బాక్స్ టెక్నాలజీని ఉపయోగించారు. పునాదిలో బలమైన రాళ్లను కాకుండా ఇసుకను ఉపయోగించారు. ఇసుక పునాదిపై రాతి శిల్పాలను పేర్చుకుంటూ ఆలయాన్ని నిర్మించారు. దీంతో కొన్నేళ్లుగా ఈ ఆలయానికి చీమల బెడద పట్టుకుంది. నిర్మాణంలో ఉపయోగించిన శిలల మధ్య చీమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. చీమలు నిత్యం పునాదుల్లో ఉన్న ఇసుకను తోడేస్తున్నాయి. దీంతో పునాది డొల్లగా మారుతోంది. ఫలితంగా ఈ పునాదిపై ఉన్న బరువైన శిలలు, శిల్పాల బరువుకు పునాది కుంగిపోతోంది. అధికారులేమో చీమలు పునాది నుంచి బయటకు తోడేస్తున్న ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు తప్పితే.. చీమల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. నష్టం జరిగినా అదేతీరు.. పునాదుల్లో ఇసుక బయటకు రావడంతో బలహీనమైన పునాదిపై బరువైన రాళ్లు (శిల్పాలు) ఉండడంతో క్రమంగా కుంగిపోతున్నాయి. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువై ఆలయ గోడలు కూలిపోతున్నాయి. పదేళ్ల క్రితం ఆలయ ప్రాంగణంలో ఉన్న కామేశ్వరాలయం ఒకవైపునకు ఒరిగి పోయింది. దీంతో ఆలయానికి సంబంధించి శిల్పాలను తొలగిచారు. తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పినా... పదేళ్లలో ఎటువంటి పురోగతి లేదు. తొలగించిన శిల్పాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. అనంతరం 2013లో రామప్ప ఆలయం తూర్పు ముఖ ద్వారం కూలిపోయింది. తాజాగా ప్రహరీ గోడలు కూలిపోయాయి. అడుగడుగునా నిర్లక్ష్యం.. రామప్ప ఆలయ నిర్వహణపై పురావస్తుశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై చరిత్రకారులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ నాగరాజు రామప్ప ఆలయంపై భద్రత, నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలపై సమాచారం హక్కు చట్టం ద్వారా 2016 ఏప్రిల్‌లో వివరాలు కోరారు. 2016 మేలో పురావస్తుశాఖ అధికారులిచ్చిన సమాధానంలో ఆలయ భద్రత, మనుగడ కోసం ఎటువంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం లేదని స్పష్టమైంది. పదేళ్లు దాటినా కామేశ్వరాలయం పునరుద్ధరణకు ఒక్క పైసా నిధులు కేటాయించలేదు. అంతేకాదు, రామప్ప ప్రధాన ఆలయంతోపాటు ఆరు ఆలయాలను గుర్తించామని చెప్పినా వాటి పరిరక్షణ కోసం ఇప్పటివరకు పురావస్తుశాఖ నుంచి ఎలాంటి పనీ జరగలేదు. -
నల్లగొండ గడ్డపై 'కొత్త చరిత్ర'
తొలి చారిత్రక యుగం నాటి ఆధారాలు - గోరుగిచ్చుడు, పుష్పాల డిజైన్లతో కుండ పెంకులు - ఒడిసేల రాళ్లు, ఇటుక ముక్కలు, రాతి పనిముట్లు లభ్యం - నివాస ప్రాంతమై ఉంటుందంటున్న చరిత్రకారులు సాక్షి, నల్లగొండ: శాతవాహనుల నుంచి కళ్యాణి చాళక్యులు, కాకతీయులు, కందూరు చోళుల వరకు.. రాచరిక కాలం నాటి ఆనవాళ్లకు సజీవ సాక్ష్యం నల్లగొండ గడ్డ. ఫణిగిరి బౌద్ధక్షేత్రమైనా, నాగార్జునసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టులో మునిగిపోయిన తొలి చారిత్రక గ్రామం సలేశ్వరమైనా, పెన్‌పహాడ్ సమీపంలో లభించిన యోగా నారసింహుడైనా.. జాజులబండ, పజ్జూరు, నెమ్మికల్లు అప్పాజిపేటల్లో దొరికిన ఆనవాళ్లయినా.. అన్నీ నీలగిరి క్షేత్రంలోనే. చరిత్రను తన గుండెల్లో నిక్షిప్తం చేసుకున్న ఈ అపురూప క్షేత్రంలో మరో ‘కొత్త చరిత్ర’కు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఔత్సాహిక చారిత్రక పరిశోధకులు జరుపుతున్న సర్వేలో నల్లగొండకు పది కిలోమీటర్ల దూరంలోనే ఈ 1, 2 శతాబ్దాల నాటి ఆధారాలు దొరికాయి. తిప్పర్తి మండలం రామలింగాలగూడెం గుట్టల్లో దొరికిన ఈ ఆనవాళ్లు తొలియుగం నాటి జీవన విధానాన్ని ప్రస్ఫుటిస్తున్నాయి. క్రీ.శ. 1, 2 శతాబ్దాలకు చెందిన ఆనవాళ్లు రామలింగాల గూడెం గుట్టల పక్కనే ఉన్న పాటిమీద పరిశీలిస్తే అనేక చారిత్రక ఆధారాలు లభించాయి. వీటిని బట్టి చూస్తే ఇవి క్రీస్తు శకం 1, 2 శతాబ్దాలకు చెందినవని, ఆ కాలంలో శాతవాహనులు ఈ గడ్డను పాలించారని చరిత్రకారులంటున్నారు. పరిశోధనల్లో భాగంగా ఈ పాటి భూమిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ నలుపు–ఎరుపు, ఎరుపు–నలుపు కుండ పెంకులు లభించాయి. ఈ కుండ పెంకులపై గోరుగిచ్చుడు, వేలిముద్రలు, గీతలు, పువ్వులతో డిజైన్లు ఉన్నాయి. వీటితో పాటు రిమ్బాగపు ముక్కలు, తొక్కుడుబిళ్లలు, రాతి పనిముట్లు కూడా లభించాయి. సీసం గోళీ సైజులో ఉన్న ఒడిసేల రాళ్లు, దీపాంతలు, తేలికపాటి ఇటుకముక్కలు దొరికాయి. ఈ ఇటుకల తయారీని బట్టి ఇవి శాతవాహనుల కాలం నాటివని చెప్పవచ్చని అంటున్నారు. అయితే.. ఈ ఇటుక ముక్కలు ఉన్నాయంటే ఇక్కడ నివాస ప్రాంతం ఉండి ఉంటుందని, తవ్వకాలు జరిపితే భూఅంతర్భాగంలో నివాస ప్రాంతం లభిస్తుందని చెబుతున్నారు. ఇక్కడ లభించిన ముడి ఇనుము ముక్కలను బట్టి చూస్తే ఇక్కడ అప్పట్లోనే చిన్నపాటి ఇనుము పరిశ్రమ కూడా ఉండి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పాటికి పక్కనే ఉన్న ఆలయం కందూరు చోళులు కాలం నాటిదని చరిత్ర చెబుతోంది. నల్లగొండ జిల్లాలో లభ్యమైన శాసనాలను నిక్షిప్తం చేసిన పుస్తకాల ఆధారంగా పరిశీలిస్తే ఈ ఆలయాన్ని చాళుక్య త్రిభువనమల్ల విక్రమాదిత్య–6 కాలంలో కట్టించిందని అర్థమవుతోంది. ఈ ఆలయానికి సంబంధించిన శాసనాన్ని క్రీ.శ.1104లో ఇప్పటి డిసెంబర్ 31 నాడు వేయించారని తెలుస్తోంది. చక్రవర్తి ప్రతినిధి కందూరు భీమన చోడమహారాజు కందూరు–110లోని, ఇరమ–300లోని, చెరకు–70లోని భడితిప్పర్తిని కవలియ బ్రమ్మదేవయ్యకు దానం ఇచ్చినట్లుగా ఇందులో రాసి ఉంది. ఆధారాలు వెలుగులోకి.. రామలింగాలగూడెం అలియాస్ గుట్టకాడి గూడెం గ్రామం ఉంది. ఈ గ్రామంలో కందూరు చోళులు (కాకతీయుల సామంతులు) కట్టించిన శివాలయం ఉంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉండడంతో అసలీ రామలింగాల గూడెంలోని శైవక్షేత్రంపై పరిశోధన చేయాలనే ఆలోచనకు వచ్చింది ‘తెలంగాణ కొత్త చరిత్ర’ అన్వేషక బృందం. ఈ బృందం సభ్యుడైన పజ్జూరుకు చెందిన రాగి మురళి ఈ ఆలయాన్ని, గ్రామంలోని గుట్ట పక్కన ఉన్న పరిసరాలను పరిశీలించడంతో ఈ ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయం పక్కనే ఉన్న గుట్ట చుట్టూ ఉన్న దేవుడి మాన్యంలో పాటి ఉన్నట్లు గుర్తించడంతో ఆ పాటి మీద మరింత లోతుగా పరిశీలన జరపడంతో తొలి చారిత్రక యుగం నాటి ఆనవాళ్లు లభించాయి. చారిత్రక ‘కారిడార్’ ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లభిం చిన చారిత్రక ఆధారాలు, గతంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాలు, వాటి చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ చారిత్రక కారిడార్ కనిపిస్తుంది. నల్లగొండ గుట్ట మీద కోటలకు తోడు పజ్జూరు, అప్పాజీపేట, పెన్‌పహాడ్, నెమ్మిక ల్ ప్రాంతాల్లో లభించిన బృహత్ శిలా యుగం నుంచి తొలి చారిత్రక యుగం వరకు ఆనవాళ్లు ఈ ప్రాంత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చరిత్రను కాపాడుకునేందుకే నల్లగొండ జిల్లాలో మరుగునపడిన చారిత్రక ప్రాంతాలను వెలుగులోకి తెచ్చి చరి త్రను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇది. చరిత్రకారుడు రామోజు హరగోపాల్ నాయకత్వంలో మేం పది మంది మి తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే పనిలో ఉన్నాం. ఈ ఆనవాళ్లపై మరింత పరిశోధన చేయిస్తే ఇక్కడ మరో కొత్త చరిత్ర లభ్యమవుతుంది. – రాగి మురళి, కొత్త చరిత్ర అన్వేషక బృందం సభ్యుడు -
పుట్టింట్లో పండుగలా ఉంది..
⇒ కాకతీయుల స్ఫూర్తితో చెరువుల పునరుద్ధరణ ⇒ తొలి దశలో జిల్లాలో 1,447 చెరువుల పనులు ⇒ ఖరీఫ్‌లోపు పూర్తి చేయడం లక్ష్యంగా ప్రణాళిక ⇒ చెరువు పనుల బాధ్యత సాగునీటి శాఖదే.. ⇒ ఉమ్మడి రాష్ర్టంలో పాలకులు పట్టించుకోలేదు.. ⇒ భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలి.. ⇒ ప్రజాప్రతినిధులు అవగాహన సదస్సులు నిర్వహించాలి ⇒ ‘మిషన్ కాకతీయ’ సదస్సులో మంత్రి హరీష్‌రావు సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్‌లో చెరువుల గురించి మాట్లాడుతుంటే పుట్టింట్లో పండుగలా ఉందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వ్యవసాయానికి చేయూతనిచ్చేలా గొలుసుకట్టు చెరువులను నిర్మించిన కాకతీయుల రాజధానిలో చెరువులపై అవగాహన సదస్సు జరగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాకతీయుల స్ఫూర్తితోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి ‘మిషన్ కాకతీయ’ పేరు పెట్టినట్లు వివరించారు. ఆచరణలోనూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామన్నారు. ‘మిషన్ కాకతీయ’లో భాగంగా జిల్లాలో 5,865 చెరువులను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందించామని.. తొలి దశలో 1,447 చెరువుల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలోని ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమంపై మంగళవారం ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు జరిగింది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. అందరూ భాగస్వాములు కావాలి.. ‘ప్రజలు, ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా భాగస్వాములు అరుుతేనే మిషన్ కాకతీయ విజయవంతమవుతుంది. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, అటవీ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేయాలి. మొదటి దశలో చేపట్టిన పనులను వచ్చే మే నెల వరకు పూర్తి చేస్తాం. ఖరీఫ్‌లో ఈ ఫలి తాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చెరువులను పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణలో వ్యవసాయం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. చెరువులను నిర్మించిన కాకతీయులను మనం ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాం. పునరుద్ధరణ పనులు చేపట్టిన మనలను భవిష్యత్తు తరాలు ఇలాగే గుర్తు చేసుకుంటాయి. అందరం కలిసి మిషన్ కాకతీయను విజయవంతం చేయాలి’ అని హరీశ్ అన్నారు. వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, ఎంపీలు కడియం శ్రీహరి, ఎ.సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు డి.వినయభాస్కర్, కొండా సరేఖ, ఆరూరి రమేశ్, దొంతి మాధవరెడ్డి, ఎ.చందులాల్, డీఎస్ రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, పూల రవీందర్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కలెక్టరు జి.కిషన్, సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈ విజయప్రకాశ్, ఎస్ఈ పద్మారావు పాల్గొన్నారు. ‘మిషన్ కాకతీయ’పై సూచనలు.. వ్యవసాయ శాఖ : సాగునీటి శాఖ అందించిన చెరువుల పట్టికను పరిగణలోకి తీసుకుని, ఆ చెరువుల మట్టి పరీక్షలు జరపాలి. ఆ మట్టిలో ఎలాంటి లవణాలు(పోషకాలు) ఉన్నాయో 15 రోజుల్లో నివేదిక తయారు చేయాలి. దీని వల్ల పూడిక తీసిన మట్టి పొలాల్లో పోసుకునే రైతులకు ఎరువుల విషయంలో సరైన సమాచారం ఇవ్వొచ్చు. మట్టి పరీక్షల ఫలి తాలు ఉంటే రైతులను చైతన్య పరచవచ్చు. అటవీ శాఖ : అటవీ ప్రాంతాల్లోని చెరువులు, కట్టకాల్వల పునరుద్ధరణకు అడ్డంకులు లేకుండా సహకరించాలి. సాగునీటి శాఖ నుంచి నిధులు అందిస్తాం. కాల్వ కట్టలపై ఆరేళ్లలోపు వినియోగంలోకి వచ్చే ఈత చెట్ల విత్తనాలతో నర్సరీ ఏర్పాటు చేయాలి. చెరువు గరిష్ట నీటిమట్టం పరిధిలో బాగా పొడవుగా పెరిగే సిల్వర్ ఓక్, ఇతర మొక్కల విత్తనాలు తయారు చేసుకోవాలి. సాగునీటి శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలి. రెవెన్యూ : కొన్ని చెరువులు, శిఖం భూములు అన్యాక్రాంతమయ్యాయి. రెవెన్యూ యంత్రాంగం తమ పాత రికార్డులు పరిశీలిస్తే ఆ వివరాలు వెలుగులోకి వస్తాయి. రికార్డుల ఆధారంగా వాటిని గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. భూగర్భ జలవనరులు : జిల్లాలో 194 గ్రామాల్లో భూగర్భ జలాలు అడు గంటినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. వీటిని కరువు ప్రభావ(ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) గ్రామాలుగా గుర్తించారు. మిషన్ కాకతీయలో ఈ గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా దృష్టి పెట్టాలి. సాగునీటి శాఖ : మిషన్ కాకతీయ మొత్తం సాగునీటి శాఖ బాధ్యతే. గతంలో రెండు జిల్లాలకు ఒక పర్యవేక్షక ఇంజినీర్ ఉండేవారు. ప్రస్తుతం జిల్లాకు ఒకరిని నియమించాం. రూ.50 లక్షల పనులు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు, రూ.కోటి పనులు పర్యవేక్షక ఇంజినీర్ కు అధికారాలు వికేంద్రీకరించాం. టెండర్‌కు వారం రోజులు, ఒప్పందానికి వారం చొప్పున.. 16వ రోజు నుంచి పని మొదలయ్యే విధంగా నిబంధనలలో మార్పులు చేశాం. ప్రతి చెరువుకు వేర్వేరుగా టెండర్‌ను పిలవాలని నిర్ణయించాం. చెరువుల పునరుద్ధరణ పనుల నాణ్యతను, ఇంజినీర్ల పనితీరును పరిశీలించేందుకు హైదరాబాద్‌లో నాణ్యత పర్యవేక్షణ విభాగాన్ని నెలకొల్పుతున్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఈ విభాగం పని చేస్తుంది. ఇంజినీర్లకు ల్యాప్‌టాప్, ఆధునిక సర్వే పరికరాలు ఇచ్చాం. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు తప్పనిసరిగా పనులు జరిగే మండలాల్లోనే ఉండాలి. పనితీరును బట్టి ఇంజినీర్లకు ర్యాంకులు ఇస్తాం. పోస్టింగ్‌ల విషయంలో దీనిని ప్రామాణికంగా తీసుకుంటాము. మండలాలు, గ్రామాల్లో అవగాహన ‘మిషన్ కాకతీయ’పై నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు వచ్చిన ఎంపీపీ, జెడ్పీటీసీలు వారివారి మండలాల్లో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులకు ఇలాం టి సమావేశాలు నిర్వహించాలి. కొన్ని చెరువుల్లో ఎంత వర్షం పడినా నీరురాదని అలాంటి వాటిని మినహాయించాలి. నియోజకవర్గానికి ఒక చెరువును ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రణాళిక పోచమ్మమైదాన్ : ఎంతో మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందేలా లేదనే బెంగతో వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి పిల్లి గిరిబాబు యూదవ్ ఈ ఏడాది ఫిబ్రవరి 19న పెట్రోల్ పోసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. గిరిబాబు యూదవ్ స్మారకార్థం పాలిటెక్నిక్ ప్రహరీ గోడకు అనుకుని ఆయన స్మారక స్థూపం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన వారందరికి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, టెక్నికల్ కోర్సుల్లో చేరినప్పటి నుంచే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. పాలిటెక్నిక్‌లో సప్లమెంటరీని త్వరలో ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నిస్తానని విద్యార్థులకు హమీ ఇచ్చారు. తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఏడు ఫిబ్రవరి 19వ తేదిన గిరిబాబు యూదవ్ స్మారక స్థూపం ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధికి పునరంకితం కావాలి వరంగల్ లీగల్ : ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచి... ఉద్యమకారులకు ధైర్యాన్ని అందించిన న్యాయవాదులు భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం కావాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ హాల్లో అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సమస్యలు పరి ష్కరించాలని న్యావాదులు ఇచ్చిన వినతిపత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. న్యాయవాదుల వృత్తికి ఆటంకంగా ఉన్న సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ సవరణ అంశాన్ని ఎంపీల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళుతామన్నారు. న్యాయవాదులకు హెల్త్ కార్డు ల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, వరంగల్‌లో ఏసీబీ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వరంగల్ జిల్లా కోర్టు ఏర్పాటై 100 వసంతాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఇందుకోసం నిధులు అందజేస్తామన్నారు. అనంతరం న్యాయవాదులు హరీష్‌రావును సత్కరించారు. శతాబ్ది ఉత్సవాలను గుర్తుగా నిర్మించే భవనానికి రూ.10 లక్షలను ఎంపీ ఫండ్స్ నుంచి కేటాయిస్తానని శ్రీహరి తెలిపారు. మార్కెట్‌ను ఆధునికీకరిస్తాం వరంగల్‌సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను పూర్తిస్థారుులో ఆధునికీకరిస్తామని మంత్రిహరీష్‌రావు అన్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. మార్కెట్లో నూతనంగా నిర్మించిన భోజన, ఫలహారశాల క్యాంటీన్‌తోపాటు రూ.2కోట్ల వ్యయంతో నిర్మించిన ఓపెన్షెడ్ను ప్రారంభించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడారు. మార్కెట్ మొత్తాన్ని ఆన్లైన్ సిస్టంలోకి మారుస్తామని హామీ ఇచ్చారు. మార్కెట్‌కు వచ్చే ప్రధాన రహదారులను డబుల్ లేన్ రోడ్లు వేయిస్తామన్నారు. మార్కెట్లో రైతు, హమాలీలకు విశ్రాంతి భవనాల ఏర్పాటు చేస్తామన్నారు.ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ షాపుల యజమానుల కోరిక మేరకు పాత గ్రెయిన్మార్కెట్లో దుకాణ సముదాయం ఏర్పాటుకు రూ. 3 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి హరీష్‌రావుకు ప్రజాప్రతినిధులు సీసీఐ, మార్కెఫెడ్ కొనుగోళ్ల తీరుతో రైతులు ఏవిధంగా నష్టపోతున్నారో వివరించారు. హమాలీ, గుమస్తా, దడువాయిలు తమసమస్యలను తీర్చాలని మంత్రికి విన్నవించారు. మంత్రికి వినతుల వెల్లువ హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్లో మంత్రి హరీష్‌రావుకు టీడీపీ శాసన సభాపక్షనేత ఎర్రబెల్లి పక్షాన పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఏనుమాముల మార్కెట్లో రైతుల సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అందులో వివరించారు. వీఆర్ఏలకు 10 పీఆర్సీలో మూలవేతనం ఇవ్వాలని, పదోన్నతుల్లో 70 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని, 010 పదద్వారా వేతనాలు ఇవ్వాలంటూ హరీష్‌రావుకు తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకులు వినతిపత్రం అందజేశారు. నోముల విజేందర్‌రెడ్డి, ఏల్పుల సదానందం పాల్గొన్నారు. హన్మకొండ : ఆదర్శ రైతలను కొనసాగించాలని మంత్రి హరీష్‌రావుకు నవ తెలంగాణ ఆదర్శ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంకుమార్‌గౌడ్, ఆదర్శ రైతులు ఎం.కేశవరెడ్డి, కటకం రాజు, పూజారి కర్ణాకర్, సింగారం రాజేందర్ వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ అధ్యాపకుడు పులి సారంగపాణికి టీఆర్ఎస్ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు.