
సాక్షి,హైదరాబాద్: ఊళ్లలో దేవాలయాలు నిర్మించినప్పుడు వాటి నిర్వహణ ఖర్చులకు కూడా కులవృత్తుల వారిపై పన్ను విధించేవారని తెలిపే కాకతీయుల శాసనం ఒకటి వెలుగు చూసింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సాల్వాపూరు గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు దేవరం రమేశ్ శర్మ, సామలేటి మహేశ్‌లు కాకతీయకాలం నాటి ఈ శాసనాన్ని గుర్తించారు.
ప్రతాపరుద్రుడు పాలించిన కాలం నాటిదిగా చెబుతున్నారు. 1290–91 విరోధినామ సంవత్సరంలో ఈ శాసనాన్ని వేయించినట్టుగా ఉంది. నాలుగు వైపులా శాసనం చెక్కిన రాయి ఆ దేవాలయంలో ఉంది. నూనె గానుగలను నిర్వహించే గానుగలవాండ్లు, నేతవృత్తి నిర్వహించే సేనివారు దేవాలయ నిర్వహణకు పన్ను చెల్లించాలని ఆ శాసనంలో ఉంది.
గానుగల వారు గానుగ ఒక్కింటికి, సేనివారు మగ్గం ఒక్కింటికి అడ్డుగ (అర్థరూపాయి) చొప్పున చెల్లించాలని ఆ శాసనం చెప్తోంది. అయితే గోడలోకి ఏర్పాటు చేయించినందున శాసనం అన్ని వైపులా చూసే వీలు లేకుండా ఉందని, మొత్తం చూస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని, వెలుగుచూసినంతవరకు శాసనపాఠాన్ని పరిష్కరించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment