Rare Statue
-
బాసరలో చక్రేశ్వరి విగ్రహం గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: బాసరలో అరుదైన జైన శిల్పాన్ని గుర్తించారు. ఇది జైన మతంలో ప్రాధాన్యమున్న శాసనదేవత చక్రేశ్వరి విగ్రహం కావటం విశేషం. బాసరలో ఇంద్రతీర్ధంగా పిలుచుకునే కుక్కుటేశ్వరాలయంలో ఈ విగ్రహం ఉంది. సుఖాసనస్థితిలో ఉన్న ఈ చతుర్భుజి విగ్రహం వెనక హస్తాలలో శంఖం, అకుశం ఉండగా.. ముందు కుడి చేయి అభయహస్తంగా, ఎడమచేయి ఫలంతో ఉంది. తలపై కిరీట మకుటం, తల వెనక ప్రభావళి, చెవి కుండలాలు, జైన తీర్థంకరులకు ఉండే త్రివళితాలు, మెడలో కంఠిక, హారం, కాళ్లకు కడియాలు, చేతులకు కంకణాలు ఉన్నాయని, ఇది 9 లేదా 10 శతాబ్దాలకు చెందిన రాష్ట్రకూట శైలి విగ్రహమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. తమ బృందం సభ్యుడు బలగం రామ్మోహన్ దీన్ని గుర్తించారని చెప్పారు. -
గుడి నిర్వహణకు వృత్తి పన్ను
సాక్షి,హైదరాబాద్: ఊళ్లలో దేవాలయాలు నిర్మించినప్పుడు వాటి నిర్వహణ ఖర్చులకు కూడా కులవృత్తుల వారిపై పన్ను విధించేవారని తెలిపే కాకతీయుల శాసనం ఒకటి వెలుగు చూసింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సాల్వాపూరు గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు దేవరం రమేశ్ శర్మ, సామలేటి మహేశ్‌లు కాకతీయకాలం నాటి ఈ శాసనాన్ని గుర్తించారు. ప్రతాపరుద్రుడు పాలించిన కాలం నాటిదిగా చెబుతున్నారు. 1290–91 విరోధినామ సంవత్సరంలో ఈ శాసనాన్ని వేయించినట్టుగా ఉంది. నాలుగు వైపులా శాసనం చెక్కిన రాయి ఆ దేవాలయంలో ఉంది. నూనె గానుగలను నిర్వహించే గానుగలవాండ్లు, నేతవృత్తి నిర్వహించే సేనివారు దేవాలయ నిర్వహణకు పన్ను చెల్లించాలని ఆ శాసనంలో ఉంది. గానుగల వారు గానుగ ఒక్కింటికి, సేనివారు మగ్గం ఒక్కింటికి అడ్డుగ (అర్థరూపాయి) చొప్పున చెల్లించాలని ఆ శాసనం చెప్తోంది. అయితే గోడలోకి ఏర్పాటు చేయించినందున శాసనం అన్ని వైపులా చూసే వీలు లేకుండా ఉందని, మొత్తం చూస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని, వెలుగుచూసినంతవరకు శాసనపాఠాన్ని పరిష్కరించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. -
కరీంనగర్ జిల్లాలో ‘బౌద్ధ బ్రహ్మ’!
అరుదైన విగ్రహాన్ని గుర్తించిన ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం సాక్షి, హైదరాబాద్: త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు మందిరం ఉండదు.. విగ్రహమూ ఎక్కడా కనిపించదు. కానీ బౌద్ధ మతంలో నాలుగు తలలు, శరీరాలతో బ్రహ్మ అవతారంలో విగ్రహం కనిపిస్తుంది. అయితే మన దేశంలో ఈ ‘బౌద్ధ బ్రహ్మ’ విగ్రహాలు వెలుగుచూసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా కోహెడ మండలం సింగరాయలొద్దిలో ఈ అరుదైన విగ్రహం వెలుగు చూసింది. పాకిస్తాన్‌లోని సింధ్‌లో లభించిన గుప్తుల కాలంనాటి కంచు విగ్రహాన్ని ఇది పోలిఉంది. 6 శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఈ విగ్రహం ప్రస్తుతం ఎలాంటి ఆలనాపాలనా లేకుండా మట్టికొట్టుకుపోయి ఉంది. ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం సభ్యులు రామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణలు స్థానికులైన శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, పొన్నాల బాలయ్య తదితరుల సాయంతో ఈ విగ్రహాన్ని గుర్తించారు. నాలుగు శరీరాలతో: ‘బౌద్ధ బ్రహ్మ’ ఆకారం నాలుగు తలలతో ఉంటుంది. అరుదుగా కొన్నిచోట్ల మాత్రం నాలుదిక్కులా నాలుగు శరీరాలతో కూడా కనిపించింది. సింగరాయలొద్దిలో లభించిన విగ్రహం కూడా నాలుగు శరీరాలతో ఉంది. అయితే ముందువైపు పూర్తిగా ఉండగా.. మిగతా మూడు వైపులా అంత స్పష్టంగా లేదు. ముందువైపు జటామలకాలున్న నాలుగు తలలు, రెండు చేతులు ఉన్నాయి. ఎడమ చేతిలో కమండలం ఉంది. థాయ్‌లాండ్‌లో ఈ తరహా విగ్రహాలు ఉన్నాయి. బౌద్ధుల ఆవాసం: ఈ విగ్రహానికి ఎదురుగా 50 అడుగుల వ్యాసంలో ఇటుకల వృత్తాకార నిర్మాణాలు ఉన్నాయి. ఇటుకలు జారిపోకుండా అంచులకు రాతి కట్టడం ఉంది. కాస్త దూరంలో 20 అడుగుల వ్యాసమున్న మట్టి ఒరల బావి జాడ ఉంది. బౌద్ధ హీనయానం నుంచి మహాయాన, వజ్రయానాల కాలంనాటి బౌద్ధ క్షేత్రంగా ఈ ప్రాంతం విలసిల్లిందని ఈ ఆనవాళ్లు తెలుపుతున్నాయని ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం సభ్యులు చెప్పారు. ఇక్కడ పరిశోధనలు జరిపితే ఎన్నో చారిత్రాక విశేషాలు తెలిసే అవకాశం ఉందన్నారు. ఈ విగ్రహం బయటపడిన చోటికి సమీపంలోనే మోయతుమ్మెదవాగు ఉంది. వాగు ఆవల సన్యాసుల మఠం, మునుల గుహ పేరుతో బౌద్ధుల ఆవాసం ఉంది. ప్రస్తుతం దాన్ని ఆంజనేయుడి మందిరంగా పూజిస్తున్నారు. ఇక్కడికి దగ్గరలోని నాగసముద్రం గ్రామంలో నాగార్జునాచార్యుడు ఉన్నట్టు చారిత్రాక జాడలున్నాయి. ఈ మోయతుమ్మెదవాగు మానేరుకు ఉపనది. దాని ప్రవాహమార్గంలో బౌద్ధం విలసిల్లిందని చరిత్ర చెబుతోంది.