నల్లగొండ గడ్డపై 'కొత్త చరిత్ర' | Historical era on nalgonda | Sakshi
Sakshi News home page

నల్లగొండ గడ్డపై 'కొత్త చరిత్ర'

Published Thu, Jun 8 2017 2:37 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

నల్లగొండ గడ్డపై 'కొత్త చరిత్ర' - Sakshi

నల్లగొండ గడ్డపై 'కొత్త చరిత్ర'

తొలి చారిత్రక యుగం నాటి ఆధారాలు
- గోరుగిచ్చుడు, పుష్పాల డిజైన్లతో కుండ పెంకులు
ఒడిసేల రాళ్లు, ఇటుక ముక్కలు, రాతి పనిముట్లు లభ్యం
నివాస ప్రాంతమై ఉంటుందంటున్న చరిత్రకారులు
 
సాక్షి, నల్లగొండ: శాతవాహనుల నుంచి కళ్యాణి చాళక్యులు, కాకతీయులు, కందూరు చోళుల వరకు.. రాచరిక కాలం నాటి ఆనవాళ్లకు సజీవ సాక్ష్యం నల్లగొండ గడ్డ. ఫణిగిరి బౌద్ధక్షేత్రమైనా, నాగార్జునసాగర్‌ బహుళార్ధ సాధక ప్రాజెక్టులో మునిగిపోయిన తొలి చారిత్రక గ్రామం సలేశ్వరమైనా, పెన్‌పహాడ్‌ సమీపంలో లభించిన యోగా నారసింహుడైనా.. జాజులబండ, పజ్జూరు, నెమ్మికల్లు అప్పాజిపేటల్లో దొరికిన ఆనవాళ్లయినా.. అన్నీ నీలగిరి క్షేత్రంలోనే. చరిత్రను తన గుండెల్లో నిక్షిప్తం చేసుకున్న ఈ అపురూప క్షేత్రంలో మరో ‘కొత్త చరిత్ర’కు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఔత్సాహిక చారిత్రక పరిశోధకులు జరుపుతున్న సర్వేలో నల్లగొండకు పది కిలోమీటర్ల దూరంలోనే ఈ 1, 2 శతాబ్దాల నాటి ఆధారాలు దొరికాయి. తిప్పర్తి మండలం రామలింగాలగూడెం గుట్టల్లో దొరికిన ఈ ఆనవాళ్లు తొలియుగం నాటి జీవన విధానాన్ని ప్రస్ఫుటిస్తున్నాయి. 
 
క్రీ.శ. 1, 2 శతాబ్దాలకు చెందిన ఆనవాళ్లు
రామలింగాల గూడెం గుట్టల పక్కనే ఉన్న పాటిమీద పరిశీలిస్తే అనేక చారిత్రక ఆధారాలు లభించాయి. వీటిని బట్టి చూస్తే ఇవి క్రీస్తు శకం 1, 2 శతాబ్దాలకు చెందినవని, ఆ కాలంలో శాతవాహనులు ఈ గడ్డను పాలించారని చరిత్రకారులంటున్నారు. పరిశోధనల్లో భాగంగా ఈ పాటి భూమిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ నలుపు–ఎరుపు, ఎరుపు–నలుపు కుండ పెంకులు లభించాయి. ఈ కుండ పెంకులపై గోరుగిచ్చుడు, వేలిముద్రలు, గీతలు, పువ్వులతో డిజైన్లు ఉన్నాయి. వీటితో పాటు రిమ్‌బాగపు ముక్కలు, తొక్కుడుబిళ్లలు, రాతి పనిముట్లు కూడా లభించాయి. సీసం గోళీ సైజులో ఉన్న ఒడిసేల రాళ్లు, దీపాంతలు, తేలికపాటి ఇటుకముక్కలు దొరికాయి. ఈ ఇటుకల తయారీని బట్టి ఇవి శాతవాహనుల కాలం నాటివని చెప్పవచ్చని అంటున్నారు. అయితే.. ఈ ఇటుక ముక్కలు ఉన్నాయంటే ఇక్కడ నివాస ప్రాంతం ఉండి ఉంటుందని, తవ్వకాలు జరిపితే భూఅంతర్భాగంలో నివాస ప్రాంతం లభిస్తుందని చెబుతున్నారు.

ఇక్కడ లభించిన ముడి ఇనుము ముక్కలను బట్టి చూస్తే ఇక్కడ అప్పట్లోనే చిన్నపాటి ఇనుము పరిశ్రమ కూడా ఉండి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పాటికి పక్కనే ఉన్న ఆలయం కందూరు చోళులు కాలం నాటిదని చరిత్ర చెబుతోంది. నల్లగొండ జిల్లాలో లభ్యమైన శాసనాలను నిక్షిప్తం చేసిన పుస్తకాల ఆధారంగా పరిశీలిస్తే ఈ ఆలయాన్ని చాళుక్య త్రిభువనమల్ల విక్రమాదిత్య–6 కాలంలో కట్టించిందని అర్థమవుతోంది. ఈ ఆలయానికి సంబంధించిన శాసనాన్ని క్రీ.శ.1104లో ఇప్పటి డిసెంబర్‌ 31 నాడు వేయించారని తెలుస్తోంది. చక్రవర్తి ప్రతినిధి కందూరు భీమన చోడమహారాజు కందూరు–110లోని, ఇరమ–300లోని, చెరకు–70లోని భడితిప్పర్తిని కవలియ బ్రమ్మదేవయ్యకు దానం ఇచ్చినట్లుగా ఇందులో రాసి ఉంది. 
 
ఆధారాలు వెలుగులోకి..
రామలింగాలగూడెం అలియాస్‌ గుట్టకాడి గూడెం గ్రామం ఉంది. ఈ గ్రామంలో కందూరు చోళులు (కాకతీయుల సామంతులు) కట్టించిన శివాలయం ఉంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉండడంతో అసలీ రామలింగాల గూడెంలోని శైవక్షేత్రంపై పరిశోధన చేయాలనే ఆలోచనకు వచ్చింది ‘తెలంగాణ కొత్త చరిత్ర’ అన్వేషక బృందం. ఈ బృందం సభ్యుడైన  పజ్జూరుకు చెందిన రాగి మురళి  ఈ ఆలయాన్ని, గ్రామంలోని గుట్ట పక్కన ఉన్న పరిసరాలను పరిశీలించడంతో ఈ ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయం పక్కనే ఉన్న గుట్ట చుట్టూ ఉన్న దేవుడి మాన్యంలో పాటి ఉన్నట్లు గుర్తించడంతో ఆ పాటి మీద మరింత లోతుగా పరిశీలన జరపడంతో తొలి చారిత్రక యుగం నాటి ఆనవాళ్లు లభించాయి. 
 
చారిత్రక ‘కారిడార్‌’
ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లభిం చిన చారిత్రక ఆధారాలు, గతంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాలు, వాటి చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ చారిత్రక కారిడార్‌ కనిపిస్తుంది.  నల్లగొండ గుట్ట మీద కోటలకు తోడు పజ్జూరు, అప్పాజీపేట, పెన్‌పహాడ్, నెమ్మిక ల్‌ ప్రాంతాల్లో లభించిన బృహత్‌ శిలా యుగం నుంచి తొలి చారిత్రక యుగం వరకు ఆనవాళ్లు ఈ ప్రాంత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 
 
చరిత్రను కాపాడుకునేందుకే
నల్లగొండ జిల్లాలో మరుగునపడిన చారిత్రక ప్రాంతాలను వెలుగులోకి తెచ్చి చరి త్రను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇది. చరిత్రకారుడు రామోజు హరగోపాల్‌ నాయకత్వంలో మేం పది మంది మి తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే పనిలో ఉన్నాం.  ఈ ఆనవాళ్లపై మరింత పరిశోధన చేయిస్తే ఇక్కడ మరో కొత్త చరిత్ర లభ్యమవుతుంది.
 – రాగి మురళి,  కొత్త చరిత్ర అన్వేషక బృందం సభ్యుడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement