Satavahanas
-
మన గడ్డపై 2,300 ఏళ్లనాటి టెర్రకోట బొమ్మ!
సాక్షి, హైదరాబాద్: సుమారు తొమ్మిది అంగుళాలున్న ఈ టెర్రకోట బొమ్మ.. ఈ మధ్యే దాన్ని తయారు చేసినట్టుగా ఎరుపురంగులో మెరిసిపోతూ కనిపిస్తోంది. కానీ, ఆ బొమ్మ వయసు దాదాపు 2,300 ఏళ్లపైనే. మౌర్యుల అనంతర కాలంలో, శాతవాహనుల కంటే ముందు రూపొందించినట్టుగా భావిస్తున్న ఈ బొమ్మ తాజాగా సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ శివారులోని పాటిగడ్డలో లభించింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దికి చెందిన ఈ బొమ్మను బుద్ధుడి కథల్లో ప్రాధాన్య మున్న బౌద్ధ హారీతి విగ్రహంగా భావిస్తున్నట్టు చరిత్ర పరిశోధకులు వెల్లడించారు. అన్నింటికన్నా ప్రాచీనమైనది తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో శాతవాహన కాలానికి చెందిన వస్తువులు అరుదుగా వెలుగు చూస్తుంటాయి. కానీ, అంతకన్నా ముందునాటి.. అంటే క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం కంటే పాతవి బయటపడటం, అవి పాడైపోకుండా ఉండటం అత్యంత అరుదు. ఇప్పుడలాంటి బొమ్మ ఒకటి లభించింది. చేర్యాల పట్టణం శతాబ్దాల క్రితం మరోచోట విలసిల్లింది. ఆ ఊరు కాలగర్భంలో కలిసిపోయి పాటిగడ్డ దిబ్బగా మారింది. ఇప్పుడా దిబ్బగర్భంలో అలనాటి వస్తువులు బయటపడు తున్నాయి. తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీనివాస్ సేకరించిన కొన్ని వస్తువుల్లో ఈ టెర్రకోట బొమ్మ కూడా లభించింది. బొమ్మ తల భాగంలో జుట్టును అలంకరించిన తీరు ఆధారంగా ఇది మౌర్యుల కాలం ముగిసిన సమయంలో క్రీ.పూ.2వ శతాబ్దానికి చెందిందిగా చరిత్ర పరిశో ధకుడు ఈమని శివనాగిరెడ్డి సహకారంతో గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగో పాల్ పేర్కొ న్నారు. తలపై ప్రత్యేక అలంకారం, చెవులకు పెద్ద కుండలాలు, దండరెట్టలకు అలంకారాలు, నడు మున మేఖలతో ఉన్న ఈ శిల్పం అమ్మదేవతగా భావించే బౌద్ధ హారీతిదై ఉంటుందని చెప్పారు. గతంలో కొండాపూర్, పెద్దబొంకూరు, కోటలింగాలలో లభించిన కంచు, టెర్రకోట బొమ్మలతో ఇది పోలిఉందన్నారు. మేలురకం బంకమట్టితో బొమ్మచేసి కొలిమిలో కాల్చిన తర్వాత దానికి ఎరుపురంగు అద్దినట్టుందని, శతాబ్దాల పాటు మట్టిలో కూరుకుపోయి ఉండటంతో ఏమాత్రం ధ్వంసం కాకుండా, ఇప్పటికీ కొత్తదానిలా ఉందని వివరించారు. దారం వడికే మట్టికుదురు, మట్టితో చేసి, మంటల్లో కాల్చి రూపొందించిన టెర్రకోట పూసలు దారం వడికే మట్టికదురు.. టెర్రకోట బొమ్మతోపాటు శాతవాహన కాలానికి చెందిన, ఉన్ని దారం వడికే మట్టి కదురు బిళ్ల కూడా లభించింది. బిళ్లకు రెండువైపులా ఉబ్బెత్తుగా ఉండి, మధ్యలో రంధ్రం ఉందని, ఆ రంధ్రం గుండా పొడవాటి కర్ర పుల్లను ఉంచి ఉన్ని దారం వడికేందుకు వినియోగించేవారని హరగోపాల్ తెలిపారు. బంగారం, వెండి, రాగి లోహాలు కరిగించే మూస, సాంబ్రాణి, అగరుధూపం వేసే మట్టిపాత్ర, మట్టి కంచుడు, టెర్రకోట పూసలు, చనుముక్కు గొట్టం, ఆకుల డిజైన్ ఉన్న పెంకులు లభించాయన్నారు. (చదవండి: ‘కృత్రిమ మేధస్సు’.. గుంతల రోడ్లకు తేజస్సు!) -
ధీర వనితల్లో నాగనికది ముందు వరసే!
సాక్షి, హైదరాబాద్: ధీర వనితలు అనగానే చరిత్ర పుటల్లో రాణి లక్ష్మీబాయి, రుద్రమదేవి లాంటి వారి పేర్లు కనిపిస్తాయి. వారి వీరగాథలు తెరలు తెరలుగా కదలాడుతాయి. కానీ చరిత్రకు సజీవ సాక్ష్యాలు కనిపించటం మొదలైన తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని భావి తరాల మహిళలకు బాట చూపిన మహిళ నాగనిక. దేశంలో మూడొంతుల ప్రాంతాన్ని అప్రతిహతంగా ఏలిన శాతవాహన వంశానికి చెందిన ధీశాలి నాగనిక. శాతవాహన రాజు శాతకర్ణి భార్య. మూడు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన శాతవాహన సింహాసనాన్ని అంతే గంభీరంగా అధిష్టించి ఏలిన చక్రవర్తి శాతకర్ణి. ఆయన పాలనకు కూడా అంతే మంచి పేరుంది. అయితే మహారాష్ట్రలోని పుణే ఆవల నానేఘాట్ గుహలో వెలుగు చూసిన ఓ శాసనం మహిళల ధీరత్వానికి నిలువుటద్దం. అది నాగనిక వేయించిన శాసనం. శాతకర్ణి మరణించాక రాజ్యభారాన్ని ఆమెనే చూసుకున్నారని చరిత్రకారులు భావిస్తుంటారు. కానీ దానిని రుజువు చేసే ఆధారాలు పెద్దగా లేవు. కానీ నానేఘాట్ శాసనాన్ని నాగనిక వేయించటం ఆమె పాలనను బలపరుస్తోంది. ఈ శాసనంలో ఆమె శాతవాహన తొలి చక్రవర్తి చిముకుడు, తన భర్త శాతకర్ణి, కుమార భాయ, తన తండ్రి త్రణకయిరో, కుమార హకుసిరిల ప్రతిమలు, వారి కీర్తిని చెక్కించారు. ఆమె కీర్తికి తార్కాణం వెండి నాణేలు.. సాధారణంగా తమ పాలనకు గుర్తుగా చక్రవర్తులు, రాజులు నాణేలు చెలామణిలోకి తీసుకొస్తారు. ఏ ప్రాంతాన్నైనా ఓడించి తన పరిధిలోకి తెచ్చుకుంటే.. అక్కడ అప్పటివరకు ఉన్న నాణేలను పక్కనపెట్టేసి, తమ పేరు, గుర్తుతో ఉండే సొంత నాణేలు వేయిస్తారు. అప్పట్లో నాణేలకు అంత ప్రాధాన్యం ఉండేది. తమ పేర నాణెం వేయిస్తే.. ఆ ప్రాంతంలో తమ మాటకు ఎదురు లేదన్నట్టుగా భావించేవారు. అయితే చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ పేరుతో ఉన్న నాణెం జున్నూరు ప్రాంతంలో లభించింది. అది శాతవాహనుల వెండి నాణెం. దానిపై నాగనిక పేరు ఉంది. తన భర్త శాతకర్ణి పేరు కూడా అందులో వేయించింది. నాగనిక పాలించారనడానికి ఇదే గుర్తు అని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక పెద్దపెద్ద చక్రవర్తులు చేసే అశ్వమేధ యాగాన్ని కూడా ఆమె నిర్వహించినట్టు ఆ నాణేలు చెబుతున్నాయి. యాగ అశ్వం ఎంత దూరం వెళితే అంతవరకు తమ రాజ్యంగా పేర్కొనేవారు. ఇలా అశ్వమేధ యాగం నిర్వహించిన వారు.. తమ రాజ్య నాణేలపై గుర్రం బొమ్మను ముద్రిస్తారని చరిత్ర చెబుతోంది. నాగనిక పేరుతో దొరికిన కొన్ని నాణేలపై అశ్వం గుర్తు కనిపించటంతో ఆమె అశ్వమేధయాగం చేశారని భావిస్తున్నారు. మొత్తంగా సువిశాల శాతవాహన సామ్రాజ్యాన్ని ఆమె ధైర్యంగా ఏలారన్నది చరిత్రకారుల మాట. ఈ లెక్కన చరిత్రలో నిలిచిన ధీర వనితల్లో అమెది ముందు వరసే. చదవండి: కష్టాలను భరించి.. కరోనాను ఎదిరించి.. నారీ వారియర్ -
యుద్ధం గెలిస్తే.. నాణేలపై ముద్ర పడాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోలాహలం.. గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది.. అంతవరకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది.. ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలు మొదలుపెడుతుంది. ఇందులో భాగంగా అంతకుముందు ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలు, కార్యక్రమాలను నిలిపేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది సహజం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లకముందు రాచరిక వ్యవస్థలో ఏం జరిగేది..? బలమున్నోడిదే రాజ్యం. రాజ్యాల మీదకు దండెత్తి విజయం సాధించి ఆ ప్రాంతాన్ని తన ఏలుబడిలో కలిపేసి సామ్రాజ్యాన్ని విస్తరించుకునేవారు. ఈ క్రమంలో ఆ రాజు వెంటనే చేసే పనేంటో తెలుసా? అంతవరకు చలా‘మణి’లో ఉన్న నాణేలపై తన ‘మార్కు’ముద్రించటమే.. ఆలస్యమవుతుందనే పునర్ ముద్రణ.. ఆనాడు నాణేలకు ఎంతో ప్రాధాన్యముండేది. ఏ రాజైన సరే తన రాజ వంశం, దైవం.. వంటి సొంత చిహ్నాలని నాణేలపై ముద్రించి చలామణి చేసేవారు. మరో రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు, కొత్త ప్రాంతంలో తమ నాణేలు చలామణి చేసేందుకు కొంత సమయం పడుతుంది. నాణేల ముద్రణ, అందుకు సరిపడా ముద్రణాలయాల ఏర్పాటు, జనంలోకి తరలింపు.. ఇవన్నీ జరిగేందుకు సమయం అవసరం. కొత్త నాణేలు వచ్చే వరకు, పాత రాజులు అమలు చేసిన నాణేలనే కొనసాగించేవారు. అయితే వాటిపై తమ చిహ్నాలను ముద్రించేవారు. చలామణిలో ఉన్న పాత నాణేలను తెప్పించి వాటిపై తమ చిహ్నాలను ముద్రించి పంపేవారు. వీటికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చారిత్రక ప్రాంతాల తవ్వకాల్లో ఇలాంటి నాణేలు వెలుగు చూశాయి. వాటి వల్లనే నాటి సంఘటనలు వెలుగు చూశాయి. వెరసి చరిత్రకు అవి సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పుడు అలాంటి అరుదైన కొన్ని నాణేలు లభించాయి. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో... సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి బౌద్ధ స్తూపం, బౌద్ధ విహారాలు వెలుగు చూసిన చోట పురావస్తు శాఖ అధికారులు ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నారు. వీటిల్లో కొత్త విహారాలు, నాటి వస్తువుల అవశేషాలు, నాణేలు వెలుగు చూస్తున్నాయి. వాటిల్లో కొన్ని నాణేలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. సీసంతో తయారైన ఆ నాణేలు శాతవాహనకాలానికి చెందినవిగా తెలుస్తున్నాయి. శాతవాహన నాణేలకు వీటికి కొంత తేడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిపై శాతవాహన చిహ్నాలతో పాటు ఇతర కొన్ని చిహ్నాలున్నాయి. దీంతో.. శాతవాహనులు ఇతర రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో, పాత రాజు చలామణి చేసిన నాణేలపై తమ చిహ్నాలను పునర్ ముద్రించి అమలులోకి తెచ్చినవిగా చరిత్రకారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. వీటిపై మరింత పరిశోధన చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటి వివరాలు వెలుగులోకి వస్తే శాతవాహనుల కాలానికి సంబంధించి మరికొన్ని కొత్త వివరాలు వెలుగుచూస్తాయి. క్రీ.పూ.5వ శతాబ్దంలోనే.. దేశంలో నాణేల చలామణి క్రీ.పూ.5వ శతాబ్దంలో మొదలైంది. మగధ సామ్రాజ్యంలో 3.4 గ్రాముల బరువు తూగే వెండి నాణేల ముద్రణ మొదలైందప్పుడే. మగధ పాలకులు నాణేలపై సూర్యుడి గుర్తుతో పాటు 6 ఆయుధాల ఆకృతులను ముద్రించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. వీటితోపాటు మరికొన్ని చిహ్నాలున్నా, అవి మారుతూ వచ్చాయి. తదనంతరం నంద సామ్రాజ్యాధీశులు దాన్ని కొనసాగించారు. క్రీ.పూ. 2, 3 శతాబ్దాల్లో రోమన్, గ్రీకుతో వాణిజ్యం పెరిగిన తర్వాత నాణేల ప్రాధాన్యం బాగా పెరిగింది. ఆ తర్వాత సీసం నాణేలు వచ్చాయి. కుషాన్స్ హయాంలో బంగారు నాణేలు మొదలయ్యాయి. తర్వాత మౌర్యులు, దక్షిణాదిన మౌర్యులను ఓడించి శాతవాహనులు నాణేలను ప్రారంభించారు. ఇందులో మౌర్యులను ఓడించి వారి నాణేలపై తమ చిహ్నాలను శాతవాహనులు వేసుకున్నారని ఆధారాలు లభించాయి. రెండు చోట్లనే వెలుగులోకి... మరో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు పాత నాణేలపై కొత్త రాజులు తమ చిహ్నాలను ముద్రించిన ఉదంతానికి సంబంధించి మన దగ్గర ఇప్పటికి 2 చోట్ల ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 2 కూడా శాతవాహన కాలానికి సంబంధించినవే కావడం విశేషం. శాతవాహనుల తొలి రాజధానిగా పేర్కొంటున్న కోటిలింగాల వద్ద, ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న మస్కి (రాయచూరు సమీపం) వద్ద జరిపిన తవ్వకాల్లో ఇలాంటి నాణేలు లభించాయి. దక్షిణ భారతం కూడా మౌర్యుల పాలనలో ఉందనటానికి ఇవే ఆధారాలుగా మిగిలాయి. ఈ రెండు చోట్ల జరిపిన తవ్వకాల్లో మౌర్యులు చలామణి చేసి న వెండి నాణేలు బయటపడ్డాయి. ఇవి పంచ్ మార్క్డ్ నాణేలు. వీటికి మరోవైపు శాతవాహనులు ముద్రించిన ఏనుగు ఆకృతి కనిపించింది. మౌర్యులను ఓడించి ఆ ప్రాంతాన్ని శాతవాహనులు తమ అధీనంలోకి తెచ్చుకుని మౌర్యుల నాణేలపై తమ గుర్తులను పునర్ముద్రించారని చరిత్రకారులు తేల్చారు. ఈ రెండు చోట్ల తప్ప అలాంటి నాణేలు వెలుగు చూడలేదు. మళ్లీ ఇప్పుడు అలాంటి కౌంటర్ మార్క్ డ్ నాణేలు వెలుగు చూడటంతో చరిత్రకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫణిగిరిలో లభించిన నాణేలు సీసం ముడిపదార్థంగా రూపొందినవి. దీంతో అవి కొంతమేర చెదిరిపోయి ఉండటంతో వాటిపై చిహ్నాలు అస్పష్టంగా కనిపిస్తున్నా యి. ప్రత్యేక పద్ధతుల్లో వాటిని పరిశోధించాల్సి ఉంది. -
'పెద్దబొంకూరు'పై గద్దల కన్ను
సాక్షి, హైదరాబాద్: శాతవాహనుల కాలం నాటి చారిత్రక ప్రదేశంపై నేతల కన్ను పడింది. పురావస్తు శాఖ దాదాపు ఐదు దశాబ్దాల క్రితం అతికష్టం మీద సేకరించిన భూమిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలంటూ ఒత్తిడి ప్రారంభించారు. ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టే వంకతో భూమిని సొంతం చేసుకునే ప్లాన్ వేశారు. అందులో క్రీడా మైదానం, దాని ఆసరాగా వాణిజ్య సముదాయం నిర్మించాలని ఆ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిని ఆనుకుని ఈ భూమి ఉండటంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎలాగైనా తమకు అనుకూలంగా మలచుకు నేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక పెద్దబొంకూరులో జరుగుతున్న వ్యవహారమిది. చారిత్రక ప్రాధాన్యం పెద్దబొంకూరుకు చారిత్రకంగా చాలా ప్రాధాన్యముందని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించింది. దీనికి పది కిలోమీటర్ల దూరంలో ధూళికట్టలో బౌద్ధ స్తూపం ఉంది. దక్షిణ భారత దేశంలో లభించిన బౌద్ధ ప్రాంతాల్లో ఇది అత్యంత కీలకమైంది. శాతవాహనులు ప్రత్యేక శ్రద్ధతో బౌద్ధ స్తూపాలు, ఇతర నిర్మాణాలు కట్టించారు. దానికి అనుబంధంగానే పెద్దబొంకూరును తీర్చి దిద్దారు. పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ చారిత్రక అవశేషాలున్నట్టు గుర్తించి ఐదు దఫాల్లో తవ్వకాలు జరిపారు. అందులో ఏకంగా ఐదు వేల వరకు నాణేలు లభించాయి. కొన్ని రోమన్ బంగారు నాణేలు కూడా దొరకటంతో ఇది వాణిజ్య కేంద్రమన్న ఉద్దేశంతో తవ్వకాలు కొనసాగించారు. విశాలంగా ఉన్న హాళ్లు, ఇతర గదుల అవశేషాలు, 22 బావులు ఉన్నట్టు తేలింది. ఇది నాణేల ముద్రణ జరిగే కేంద్రంగా వాడుకుని ఉంటారని భావించారు. అయితే తర్వాత తవ్వకాలు నిలిచిపోయాయి. ఆ 40 ఎకరాలు భవిష్యత్తులో పెద్దబొంకూరు ప్రాంతంలో విస్తృతంగా తవ్వకాలు జరపాలన్న ఉద్దేశంతో అప్పట్లోనే 68 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. నెల రోజుల క్రితం అక్కడ మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. కానీ ఇంతలోనే ఆ భూమిపై నేతల కన్ను పడింది. ఇప్పటి వరకు జరిగిన అన్వేషణను చాలించి మిగతా ఖాళీ భూమిని అప్పగిస్తే ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టేందుకు వీలు కలుగుతుందంటూ ఒత్తిడి తెస్తున్నారు. గతంలో 25 ఎకరాల్లో తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు మూడెకరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నందున అంతవరకు భూమి అట్టిపెట్టుకుని మిగతా 40 ఎకరాలు ప్రభుత్వానికి సరెండర్ చేయాలన్న ఒత్తిడి ప్రారంభించారు. జాతీయ రహదారిపై ఉన్న భూమి కావడంతో అక్కడ స్టేడియం.. దానికి అనుబంధంగా వాణిజ్య సముదాయాన్ని నిర్మింపచేస్తే తమకు గిట్టుబాటు అవుతుందన్న ఆలోచనలో వారున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని కొందరు ఉన్నతస్థాయి నేతలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, ప్రస్తుతం సచివాలయం స్థాయిలో ఆ మేరకు వ్యవహారం సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అధికారులు పూర్తిస్థాయి తవ్వకాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో చిన్నచిన్న ట్రెంచ్లు తవ్వి నిర్మాణాల ఆనవాళ్లు ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. ఆ ట్రెంచుల్లో కూడా నాటి పూసలు, ఇతర అవశేషాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. అయితే ట్రెంచుల్లో పెద్దగా అవశేషాల జాడ లేనందున మిగతా భూముల్లో తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం పురావస్తు శాఖ నుంచి వ్యక్తమయ్యేలా నేతలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. సైట్ మ్యూజియం నిర్మించాల్సిన స్థలం సమీపంలోనే ఉన్న ధూళికట్ట వద్ద తవ్వకాలు జరిపినప్పుడు చారిత్రకంగా ఎంతో విలువైన శాతవాహనుల ఆధారాలు లభించాయి. వాటిని సందర్శకులు తిలకించే అవకాశమే లేకుండా పోయింది. ఆ ఆధారాలన్నీ పురావస్తు శాఖ స్టోర్ రూమ్లో మగ్గిపోతున్నాయి. ధూళికట్ట ప్రధాన రహదారికి దూరంగా ఉన్నందున, అక్కడి ఆధారాలు, పెద్దబొంకూరు తవ్వకాల్లో లభించిన ఆధారాలను.. జాతీయ రహదారిపై ఉన్న పెద్దబొంకూరు వద్ద సైట్ మ్యూజియం నిర్మించి ప్రదర్శనకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన పురావస్తు శాఖ వద్ద పెండింగులోనే ఉండిపోయింది. తవ్వకాలు కొనసాగుతున్న ప్రాంతం -
ఏరు మింగిన ఊరు
సాక్షి, హైదరాబాద్: మంచి నాగరికత వర్ధిల్లిందనడానికి చిహ్నంగా నాణ్యమైన వస్తువుల జాడ ఉందక్కడ. బాగా కాల్చి రూపొందించిన ఇటుకలు, నగిషీలద్ది తయారుచేసిన కుండలు, ఇంటి అవసరాలకు కావాల్సిన పనిముట్లు, అలంకరణకు వాడే రంగురంగుల పూసలే దీనికి నిదర్శనం. అవన్నీ ఒకటి రెండు శతాబ్దాల కాలానివిగా తెలుస్తోంది. కానీ ఇప్పుడక్కడ ఆవాసం జాడలేదు. మంచి పనిమంతుడి చేతిలో ఉలి విన్యాసం చేయటంతో రూపొందిన అద్భుత శిల్పకళాతోరణం, దానిపై ఉన్న ద్వారపాలకుల శిల్పాలు సౌందర్యంగా కనువిందు చేస్తున్నాయంటే వాటిని రూపొందించిన వారి చాతు ర్యం ఎంత గొప్పదో అవగతమవుతోంది. ఆ పనితనం కాకతీయుల కాలంది. కానీ ఆ దేవాలయంలో దేవతామూర్తులు లేరు. వెరసి శాతవాహనుల కాలం నుంచి కాకతీయుల వరకు ఆ ఊరు విలసిల్లిందని ఆధారాలతో స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆ తర్వాత ఊరు ఏమైంది. ఉన్నట్టుండి కాలగర్భంలో ఎందుకు కలిసిపోయింది. జీవనాధారంగా చేసుకున్న యేరే ఆ ఊరిని మింగేసిందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. పర్యావరణంలో వచ్చిన మార్పులు, వాటి పరిణామాలపై మన దేశంలో పరిశోధనలు దాదాపు శూన్యం. భావి తరాలు మరోసారి ప్రకృతి బీభత్సాల బారిన పడకుండా గతానుభవాల నిగ్గు తేల్చేందుకు ఇప్పుడు చాలాదేశాల్లో పరిశోధనలు సాగుతున్నాయి. కానీ మనవద్ద ఇప్పటివరకు వాటి ఊసు లేదు. వానాకాలంలో మాత్రమే కాస్త నీటి జాడలుండే ఓ యేరు ఒకప్పుడు ఉగ్రరూపాన్ని చూపిందని, దాని తాకిడికి ఊళ్లకు ఊళ్లు అంతరించాయని సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట సమీపంలో ఔత్సాహిక చారిత్రక పరిశోధకులు ప్రాథమిక ఆధారాలు గుర్తించారు. వందల ఏళ్లు మనుగడ సాగించిన ఊరు అంతరించటానికి మెరుపు వరదలే కారణమన్న సంగతి అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని బిక్క వాగు ఒడ్డున ఉన్న గాలిపల్లి–నరసక్కపేట మధ్య అంతరించిన ఊరును కొత్త తెలంగాణ చరిత్ర బృం దం తాజాగా గుర్తించింది. బృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, కరుణాకర్, చంటిలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ అంతరించిపోయిన ఊరు జాడలు గుర్తించారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం.. ఇక్కడున్న వాగును బిక్క వాగుగా పిలుస్తారు. ఒకటీ, రెండు శతాబ్దాల్లో జైనం, బౌద్ధం వర్ధిల్లింది. అప్పట్లో భిక్షువులు నీటి జాడ ఆధారంగా ఆ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటారు. భిక్షువుల ప్రాంతం కావటంతో అది భిక్షువుల వాగు, కాలక్రమంలో బిక్క వాగుగా మారింది. ఆలేరు సమీపంలోని బిక్కేరు కూడా ఇదేక్రమంలో పేరు సుస్థిరం చేసుకుంది. అక్కడ బౌద్ధారామాలు, స్థూపాలు వెలుగుచూశాయి. ఇదే క్రమంలో బిక్కవాగు వద్ద కూడా బౌద్ధం వర్ధిల్లి ఉంటుంది. తర్వాత కాకతీయుల కాలంలో హైందవం విలసిల్లింది. ఆ సమయంలో నిర్మితమైనట్టు భావిస్తున్న ఆలయం ఉంది. అది చిన్నగా ఉన్నా, ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన తోరణం అత్యద్భుతంగా ఉంది. చుట్టూ గోడలు శిథిలమయ్యాయి. ఆలయంలో ఎటువంటి విగ్రహాలు కనబడటం లేదు. తోరణ ద్వారానికి రెండు వైపులా ద్వారపాలకుల విగ్రహాలు, వాటికి ఇద్దరేసి చామరగ్రాహిణులు, పరిచారికల శిల్పాలున్నాయి. పైభాగంలో లలాటబింబంగా గజలక్ష్మిమూర్తి ఉంది. అది చెన్నకేశవుడి ఆలయంగా సమీపంలోని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఆలయానికి ముందువైపు ఉన్న పొలాల్లో ఊరి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎరుపు, నలుపు రంగుల్లో ఉన్న కాల్చి రూపొందించిన పెద్దపెద్ద ఇటుకలు, మట్టి కుండల ముక్కలు, పనిముట్లు, ఆయుధాల అవశేషాలు కనిపిస్తున్నాయి. వాగులో నీటి వనరు పుష్కలంగా ఉండటంతో అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేసుకుని జీవనం సాగించారు. ఉన్నట్టుండి దానికి మెరుపు వరదలు రావటంతో ఊరు ధ్వంసమై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గాలిపల్లి గ్రామానికి ఇది చేరువగా ఉంది. పాత ఊరు ధ్వంసం కావటంతో ప్రస్తుత గ్రామం కాలక్రమంలో ఏర్పడింది. ఇక్కడ చారిత్రక అన్వేషణ జరిపితే వందల ఏళ్లనాటి విషయాలు, బౌద్ధ నిర్మాణాల జాడ కూడా తెలిసే అవకాశం ఉంది. -
ఈ పాచిక వయసు రెండువేల ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరులో రాష్ట్ర పురావస్తు శాఖ (హెరిటేజ్ తెలంగాణ) తాజాగా చేపట్టిన తవ్వకాల్లో ఈ వస్తువులు వెలుగు చూశాయి. ఐదు దశాబ్దాల కాలంలో ఇక్కడ మూడు నాలుగు పర్యాయాలు తవ్వకాలు జరిపారు. అప్పట్లో వేల సంఖ్యలో శాతవాహన, రోమన్సహా పలు దేశాల నాణేలు వెలుగు చూశాయి. దీంతో ఇది శాతవాహనకాలం నాటి ప్రధాన వర్తక కేంద్రంగా భావిస్తున్నారు. నాణేల ముద్రణ కేంద్రం కూడా అయి ఉంటుందన్న అనుమానాలూ ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయిలో తవ్వకాలు ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితమే తవ్వకాలు మొదలు కాగా, కొన్ని మట్టి పాత్రలు, ఇతర అవశేషాలు, నాటి గోడల ఆనవాళ్లు కనిపించాయి. కానీ రెండు రోజుల క్రితం అలనాటి పాచిక, ఓ రాగి నాణెం వెలుగుచూశాయి. నాణెం చాలాకాలం మట్టిలో ఉండటంతో దానిపై ముద్రలు, అక్షరాలు చెదిరిపోయి స్పష్టంగా కనిపించటం లేదు. గత నెల పురావస్తు శాఖ సంచాలకురాలు విశాలాచ్చి ఈ తవ్వకాలు ప్రారంభించారు. ఆ శాఖ సహాయ సంచాలకులు రాములు నాయక్ నేతృత్వంలో జరుగుతున్న తవ్వకాలను శాఖ విశ్రాంత ఉప సంచాలకులు రంగాచార్యులు, సహాయ సంచాలకులు నాగరాజు, విశ్రాంత అధికారి భానుమూర్తి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో జరిపిన తవ్వకాల్లో, వేల ఏళ్లనాడే ఇక్కడ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్టు గుర్తించారు. నీటి వనరులకోసం ప్రత్యేక ఏర్పాటు, నీటి తరలింపు చానళ్లు కనిపించాయి. వాటికి వాడిన ఇటుకలతోపాటు, అత్యంత నునుపుగా పాత్రల తయారీని బట్టి ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. కానీ తవ్వకాలు చాలా పరిమితంగా నిర్వహించటంతో పెద్దగా చారిత్రక ఆధారాలు దొరకలేదు. ఇది అతి చిన్న మట్టిపాత్ర. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ మనుగడలో ఉన్న గురిగి (చిన్న మట్టిపాత్ర) కంటే పరిమాణంలో చిన్నగా ఉన్న ఈ పాత్ర కూడా శాతవాహనుల కాలం నాటిదే. రెండు అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న ఈ పాత్ర కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. విలువైన ఆధారాలు దొరికే అవకాశం ‘‘ఇక్కడ శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి విలువైన సమాచారం దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా గౌతమీపుత్ర శాతకర్ణి నాణేల కోసం వెదుకుతున్నాం. నాణేలతో కొత్త కోణాలు వెలుగు చూస్తాయి. ఇక నాటి వస్తువులు, నిర్మాణ పరిజ్ఞానం, ఆయుధ సంపత్తి, పాత్రలు, సాహిత్యానికి సంబంధించిన ఆనవాళ్లు దొరకవచ్చు. రెండుమూడు నెలల పాటు తవ్వకాలు జరుగుతాయి’’ – విశాలాచ్చి, సంచాలకురాలు -
వాణిజ్యానికి పేరు.. పెద్దబొంకూరు!
సాక్షి, హైదరాబాద్: మట్టిని ముట్టుకుంటే నాణేలు తగులుతున్నాయి. ఇప్పటివరకు 30 వేలకు పైచిలుకు లభించాయి. ఏంటా అని తవ్వి చూస్తే 20 మీటర్ల పొడవున్న ఓ భారీ భవంతి ఆనవాళ్లు తేలాయి.. మరికాస్త శోధిస్తే కొన్ని గదుల రూపురేఖలూ కనిపించాయి. ఆ పక్కన మంచినీటి బావులు.. వాటికి నాణ్యమైన ఇటుకల అమరిక.. అక్కడి నుంచి నీటిని తరలించే కాలువలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ.. వెరసి అదో పట్టణమే. నాణేలు, నిర్మాణాల సరళిని పరిశీలిస్తే అది క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 2వ శతాబ్దం మధ్య కాలానివని తేలింది. తొలి శాతవాహన కాలానికి చెందినదని ప్రాథమికంగా రూఢీ అయింది. శాతవాహనుల జాడలు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక ప్రాంతం పెద్దబొంకూరు. శాతవాహన చరిత్రకు కీలక ఆధారాలు చెప్పే నేల. శాతవాహన కాలంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. అందుకే అక్కడ రోమ్ వంటి విదేశీ ప్రాంతాల నాణేలు లభించాయి. రోమన్ ప్రాంతాలతో శాతవాహనులు పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ వాణిజ్యానికి ప్రధాన కేంద్రమే ఇదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. శాతవాహన సామ్రాజ్యంలో మింట్ (నాణేల తయారీ కర్మాగారం)లు ఉండేవి. పూర్వపు మెదక్ జిల్లా కొండాపూర్ ప్రధాన మింట్ కాగా, అనుబంధంగా మరికొన్ని ఉండేవి. అందులో ఇది కూడా ఓ మింట్ అయి ఉండొచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. 1950– 1965 మధ్య కాలంలో ఇక్కడ తొలిసారి తవ్వకాలు జరిపారు. అప్పుడు ప్రాథమికంగా కొన్నిచోట్ల పురావస్తు శాఖ తవ్వకాలు జరిపి గొప్ప చారిత్రక ఆనవాళ్లను గుర్తించింది. కానీ అది ముందుకు సాగలేదు. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ ప్రాంతం చారిత్రక నేపథ్యమేంటో తేల్చబోతున్నారు. అప్పట్లోనే భూగర్భ డ్రైనేజీ 2 వేల ఏళ్ల క్రితమే అక్కడ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్టు తేలింది. ఆవాసాల ముందు నుంచి భూగర్భం గుండా మురుగు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటై ఉంది. ప్రాకృత భాష, బ్రాహ్మి లిపి వాడుకలో ఉన్నట్టు తేలింది. ఇనుము, వెండి, రాగి లోహాలను వస్తువుల తయారీకి వినియోగించారు. విరివిగా సీసం వస్తువులు వాడారు. రోమ్ వంటి ప్రాంతాల నుంచి సీసం దిగుమతి చేసుకున్నారు. భారీ మట్టి పాత్రల్లో ముడి సీసం చుట్టలు లభించాయి. శాతవాహన చరిత్రకు ఇదో మలుపు ‘తెలంగాణ చరిత్రలో శాతవాహన పాలన కీలకం. అంతకు పూర్వం వివరాలు అస్పష్టం. వాటికి సమాధానం చెప్పేవి పెద్దబొంకూరు వంటి ప్రాంతాలే. గతంలో జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసిన కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. తర్వాత కొత్త ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి భూమి పొరల్లో దాగున్న చరిత్రను వెలుగులోకి తెస్తాం’ –విశాలాచ్చి, హెరిటేజ్ తెలంగాణ సంచాలకులు వెలుగు చూసిన కొన్ని నాణేలు -
నల్లగొండ గడ్డపై 'కొత్త చరిత్ర'
తొలి చారిత్రక యుగం నాటి ఆధారాలు - గోరుగిచ్చుడు, పుష్పాల డిజైన్లతో కుండ పెంకులు - ఒడిసేల రాళ్లు, ఇటుక ముక్కలు, రాతి పనిముట్లు లభ్యం - నివాస ప్రాంతమై ఉంటుందంటున్న చరిత్రకారులు సాక్షి, నల్లగొండ: శాతవాహనుల నుంచి కళ్యాణి చాళక్యులు, కాకతీయులు, కందూరు చోళుల వరకు.. రాచరిక కాలం నాటి ఆనవాళ్లకు సజీవ సాక్ష్యం నల్లగొండ గడ్డ. ఫణిగిరి బౌద్ధక్షేత్రమైనా, నాగార్జునసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టులో మునిగిపోయిన తొలి చారిత్రక గ్రామం సలేశ్వరమైనా, పెన్పహాడ్ సమీపంలో లభించిన యోగా నారసింహుడైనా.. జాజులబండ, పజ్జూరు, నెమ్మికల్లు అప్పాజిపేటల్లో దొరికిన ఆనవాళ్లయినా.. అన్నీ నీలగిరి క్షేత్రంలోనే. చరిత్రను తన గుండెల్లో నిక్షిప్తం చేసుకున్న ఈ అపురూప క్షేత్రంలో మరో ‘కొత్త చరిత్ర’కు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఔత్సాహిక చారిత్రక పరిశోధకులు జరుపుతున్న సర్వేలో నల్లగొండకు పది కిలోమీటర్ల దూరంలోనే ఈ 1, 2 శతాబ్దాల నాటి ఆధారాలు దొరికాయి. తిప్పర్తి మండలం రామలింగాలగూడెం గుట్టల్లో దొరికిన ఈ ఆనవాళ్లు తొలియుగం నాటి జీవన విధానాన్ని ప్రస్ఫుటిస్తున్నాయి. క్రీ.శ. 1, 2 శతాబ్దాలకు చెందిన ఆనవాళ్లు రామలింగాల గూడెం గుట్టల పక్కనే ఉన్న పాటిమీద పరిశీలిస్తే అనేక చారిత్రక ఆధారాలు లభించాయి. వీటిని బట్టి చూస్తే ఇవి క్రీస్తు శకం 1, 2 శతాబ్దాలకు చెందినవని, ఆ కాలంలో శాతవాహనులు ఈ గడ్డను పాలించారని చరిత్రకారులంటున్నారు. పరిశోధనల్లో భాగంగా ఈ పాటి భూమిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ నలుపు–ఎరుపు, ఎరుపు–నలుపు కుండ పెంకులు లభించాయి. ఈ కుండ పెంకులపై గోరుగిచ్చుడు, వేలిముద్రలు, గీతలు, పువ్వులతో డిజైన్లు ఉన్నాయి. వీటితో పాటు రిమ్బాగపు ముక్కలు, తొక్కుడుబిళ్లలు, రాతి పనిముట్లు కూడా లభించాయి. సీసం గోళీ సైజులో ఉన్న ఒడిసేల రాళ్లు, దీపాంతలు, తేలికపాటి ఇటుకముక్కలు దొరికాయి. ఈ ఇటుకల తయారీని బట్టి ఇవి శాతవాహనుల కాలం నాటివని చెప్పవచ్చని అంటున్నారు. అయితే.. ఈ ఇటుక ముక్కలు ఉన్నాయంటే ఇక్కడ నివాస ప్రాంతం ఉండి ఉంటుందని, తవ్వకాలు జరిపితే భూఅంతర్భాగంలో నివాస ప్రాంతం లభిస్తుందని చెబుతున్నారు. ఇక్కడ లభించిన ముడి ఇనుము ముక్కలను బట్టి చూస్తే ఇక్కడ అప్పట్లోనే చిన్నపాటి ఇనుము పరిశ్రమ కూడా ఉండి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పాటికి పక్కనే ఉన్న ఆలయం కందూరు చోళులు కాలం నాటిదని చరిత్ర చెబుతోంది. నల్లగొండ జిల్లాలో లభ్యమైన శాసనాలను నిక్షిప్తం చేసిన పుస్తకాల ఆధారంగా పరిశీలిస్తే ఈ ఆలయాన్ని చాళుక్య త్రిభువనమల్ల విక్రమాదిత్య–6 కాలంలో కట్టించిందని అర్థమవుతోంది. ఈ ఆలయానికి సంబంధించిన శాసనాన్ని క్రీ.శ.1104లో ఇప్పటి డిసెంబర్ 31 నాడు వేయించారని తెలుస్తోంది. చక్రవర్తి ప్రతినిధి కందూరు భీమన చోడమహారాజు కందూరు–110లోని, ఇరమ–300లోని, చెరకు–70లోని భడితిప్పర్తిని కవలియ బ్రమ్మదేవయ్యకు దానం ఇచ్చినట్లుగా ఇందులో రాసి ఉంది. ఆధారాలు వెలుగులోకి.. రామలింగాలగూడెం అలియాస్ గుట్టకాడి గూడెం గ్రామం ఉంది. ఈ గ్రామంలో కందూరు చోళులు (కాకతీయుల సామంతులు) కట్టించిన శివాలయం ఉంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉండడంతో అసలీ రామలింగాల గూడెంలోని శైవక్షేత్రంపై పరిశోధన చేయాలనే ఆలోచనకు వచ్చింది ‘తెలంగాణ కొత్త చరిత్ర’ అన్వేషక బృందం. ఈ బృందం సభ్యుడైన పజ్జూరుకు చెందిన రాగి మురళి ఈ ఆలయాన్ని, గ్రామంలోని గుట్ట పక్కన ఉన్న పరిసరాలను పరిశీలించడంతో ఈ ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయం పక్కనే ఉన్న గుట్ట చుట్టూ ఉన్న దేవుడి మాన్యంలో పాటి ఉన్నట్లు గుర్తించడంతో ఆ పాటి మీద మరింత లోతుగా పరిశీలన జరపడంతో తొలి చారిత్రక యుగం నాటి ఆనవాళ్లు లభించాయి. చారిత్రక ‘కారిడార్’ ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లభిం చిన చారిత్రక ఆధారాలు, గతంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాలు, వాటి చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ చారిత్రక కారిడార్ కనిపిస్తుంది. నల్లగొండ గుట్ట మీద కోటలకు తోడు పజ్జూరు, అప్పాజీపేట, పెన్పహాడ్, నెమ్మిక ల్ ప్రాంతాల్లో లభించిన బృహత్ శిలా యుగం నుంచి తొలి చారిత్రక యుగం వరకు ఆనవాళ్లు ఈ ప్రాంత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చరిత్రను కాపాడుకునేందుకే నల్లగొండ జిల్లాలో మరుగునపడిన చారిత్రక ప్రాంతాలను వెలుగులోకి తెచ్చి చరి త్రను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇది. చరిత్రకారుడు రామోజు హరగోపాల్ నాయకత్వంలో మేం పది మంది మి తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే పనిలో ఉన్నాం. ఈ ఆనవాళ్లపై మరింత పరిశోధన చేయిస్తే ఇక్కడ మరో కొత్త చరిత్ర లభ్యమవుతుంది. – రాగి మురళి, కొత్త చరిత్ర అన్వేషక బృందం సభ్యుడు