తవ్వకాల్లో శాతవాహన కాలం నాటి అవశేష జాడలను పరిశీలిస్తున్న సందర్శకులు
సాక్షి, హైదరాబాద్: శాతవాహనుల కాలం నాటి చారిత్రక ప్రదేశంపై నేతల కన్ను పడింది. పురావస్తు శాఖ దాదాపు ఐదు దశాబ్దాల క్రితం అతికష్టం మీద సేకరించిన భూమిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలంటూ ఒత్తిడి ప్రారంభించారు. ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టే వంకతో భూమిని సొంతం చేసుకునే ప్లాన్ వేశారు. అందులో క్రీడా మైదానం, దాని ఆసరాగా వాణిజ్య సముదాయం నిర్మించాలని ఆ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిని ఆనుకుని ఈ భూమి ఉండటంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎలాగైనా తమకు అనుకూలంగా మలచుకు నేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక పెద్దబొంకూరులో జరుగుతున్న వ్యవహారమిది.
చారిత్రక ప్రాధాన్యం
పెద్దబొంకూరుకు చారిత్రకంగా చాలా ప్రాధాన్యముందని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించింది. దీనికి పది కిలోమీటర్ల దూరంలో ధూళికట్టలో బౌద్ధ స్తూపం ఉంది. దక్షిణ భారత దేశంలో లభించిన బౌద్ధ ప్రాంతాల్లో ఇది అత్యంత కీలకమైంది. శాతవాహనులు ప్రత్యేక శ్రద్ధతో బౌద్ధ స్తూపాలు, ఇతర నిర్మాణాలు కట్టించారు. దానికి అనుబంధంగానే పెద్దబొంకూరును తీర్చి దిద్దారు. పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ చారిత్రక అవశేషాలున్నట్టు గుర్తించి ఐదు దఫాల్లో తవ్వకాలు జరిపారు. అందులో ఏకంగా ఐదు వేల వరకు నాణేలు లభించాయి. కొన్ని రోమన్ బంగారు నాణేలు కూడా దొరకటంతో ఇది వాణిజ్య కేంద్రమన్న ఉద్దేశంతో తవ్వకాలు కొనసాగించారు. విశాలంగా ఉన్న హాళ్లు, ఇతర గదుల అవశేషాలు, 22 బావులు ఉన్నట్టు తేలింది. ఇది నాణేల ముద్రణ జరిగే కేంద్రంగా వాడుకుని ఉంటారని భావించారు. అయితే తర్వాత తవ్వకాలు నిలిచిపోయాయి.
ఆ 40 ఎకరాలు
భవిష్యత్తులో పెద్దబొంకూరు ప్రాంతంలో విస్తృతంగా తవ్వకాలు జరపాలన్న ఉద్దేశంతో అప్పట్లోనే 68 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. నెల రోజుల క్రితం అక్కడ మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. కానీ ఇంతలోనే ఆ భూమిపై నేతల కన్ను పడింది. ఇప్పటి వరకు జరిగిన అన్వేషణను చాలించి మిగతా ఖాళీ భూమిని అప్పగిస్తే ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టేందుకు వీలు కలుగుతుందంటూ ఒత్తిడి తెస్తున్నారు. గతంలో 25 ఎకరాల్లో తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు మూడెకరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నందున అంతవరకు భూమి అట్టిపెట్టుకుని మిగతా 40 ఎకరాలు ప్రభుత్వానికి సరెండర్ చేయాలన్న ఒత్తిడి ప్రారంభించారు.
జాతీయ రహదారిపై ఉన్న భూమి కావడంతో అక్కడ స్టేడియం.. దానికి అనుబంధంగా వాణిజ్య సముదాయాన్ని నిర్మింపచేస్తే తమకు గిట్టుబాటు అవుతుందన్న ఆలోచనలో వారున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని కొందరు ఉన్నతస్థాయి నేతలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, ప్రస్తుతం సచివాలయం స్థాయిలో ఆ మేరకు వ్యవహారం సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అధికారులు పూర్తిస్థాయి తవ్వకాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో చిన్నచిన్న ట్రెంచ్‌లు తవ్వి నిర్మాణాల ఆనవాళ్లు ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. ఆ ట్రెంచుల్లో కూడా నాటి పూసలు, ఇతర అవశేషాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. అయితే ట్రెంచుల్లో పెద్దగా అవశేషాల జాడ లేనందున మిగతా భూముల్లో తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం పురావస్తు శాఖ నుంచి వ్యక్తమయ్యేలా నేతలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది.
సైట్ మ్యూజియం నిర్మించాల్సిన స్థలం
సమీపంలోనే ఉన్న ధూళికట్ట వద్ద తవ్వకాలు జరిపినప్పుడు చారిత్రకంగా ఎంతో విలువైన శాతవాహనుల ఆధారాలు లభించాయి. వాటిని సందర్శకులు తిలకించే అవకాశమే లేకుండా పోయింది. ఆ ఆధారాలన్నీ పురావస్తు శాఖ స్టోర్ రూమ్‌లో మగ్గిపోతున్నాయి. ధూళికట్ట ప్రధాన రహదారికి దూరంగా ఉన్నందున, అక్కడి ఆధారాలు, పెద్దబొంకూరు తవ్వకాల్లో లభించిన ఆధారాలను.. జాతీయ రహదారిపై ఉన్న పెద్దబొంకూరు వద్ద సైట్ మ్యూజియం నిర్మించి ప్రదర్శనకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన పురావస్తు శాఖ వద్ద పెండింగులోనే ఉండిపోయింది.
తవ్వకాలు కొనసాగుతున్న ప్రాంతం
Comments
Please login to add a commentAdd a comment