చూస్తే ‘డంగు’ అయిపోవాల్సిందే | Archaeologists Unearth Biggest stucco sculpture in Suryapet | Sakshi
Sakshi News home page

చూస్తే ‘డంగు’ అయిపోవాల్సిందే

Published Sat, Apr 27 2019 5:34 AM | Last Updated on Sat, Apr 27 2019 5:34 AM

Archaeologists Unearth Biggest stucco sculpture in Suryapet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌
దేశంలో ఇప్పటివరకు ఎక్కడా వెలుగు చూడని బుద్ధుడిదిగా భావిస్తున్న భారీ గార ప్రతిమ (డంగుసున్నంతో రూపొందిన) వెలుగు చూసింది. ఇక్ష్వాకుల కాలంలో క్రీస్తుశకం మూడో శతాబ్దంలో దీన్ని రూపొందించినట్లు పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న విఖ్యాత బౌద్ధస్తూప కేంద్రమైన ఫణిగిరిలో శుక్రవారం ఈ అద్భుతం బయల్పడింది. ఫణిగిరి బౌద్ధ స్తూపం ప్రాంగణంలో ఫిబ్రవరి నుంచి పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతోంది. బౌద్ధ స్తూపం, చైత్యాలు, బుద్ధుడి ధాతువు, బుద్ధుడి జీవిత చరిత్రను కళ్లముందు నిలిపే అద్భుత చెక్కడాలను గతంలో వెలికి తీశారు.

ఆ తర్వాత తవ్వకాలు నిలిపివేశారు. ఇటీవల హెరిటేజ్‌ తెలంగాణ (రాష్ట్ర పురావస్తుశాఖ) ఏఎస్‌ఐ నుంచి అనుమతి తీసుకుని ఫిబ్రవరిలో మళ్లీ తవ్వకాలు ప్రారంభించింది. ఈ క్రమంలో శుక్రవారం దాదాపు ఆరడగుల పొడవున్న బుద్ధుడి ఆకారం వెలుగు చూసింది. ఆ ప్రతిమ వెనుక భాగం మాత్రమే కన్పిస్తోంది. దాన్ని చూస్తే నిలబడి ఉన్న బుద్ధుడి ఆకారంగానే కనిపిస్తోంది. అయితే బుద్ధుడి జీవిత చరిత్రలో ఒక ఘట్టానికి చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. బుద్ధుడి చరిత్రలో ఉండే రాజులకు సంబంధించినదై కూడా ఉంటుందనే మరో అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

విగ్రహంపై అలంకరణ గుర్తులున్నాయి. సాధారణంగా బుద్ధుడి శరీరంపై ఎక్కడా అలంకరణ ఉండదు. కంకణాలు, ముంజేతి అలంకరణలు కనిపిస్తున్నందున అది బుద్ధుడిగా మారకముందు రూపమై ఉంటుందని, లేదంటే ఇతర రాజులకు సంబంధించినదై ఉంటుం దని తవ్వకాలకు నేతృత్వం వహిస్తున్న హెరిటేజ్‌ తెలంగాణ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగరాజు పేర్కొంటున్నారు. ఆ విగ్రహం ముందు భాగం చూస్తేగాని కచ్చితమైన రూపాన్ని ప్రకటించలేమని పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడా లేనట్టుగా..
పురాతన కాలం నాటి కట్టడాలున్న ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో డంగు సున్నంతో రూపొందించిన శిల్పాలు వెలుగు చూడటం సహజం. కానీ ఇవి రెండడుగుల కంటే ఎక్కువ పొడవున్న దాఖలాలు ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. కానీ తొలిసారి మానవుడి సహజ ఎత్తు పరిమాణంలో ఉండే సున్నం (గార) ప్రతిమ వెలుగుచూసిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఆరడగుల పరిమాణంలో ఉండే సున్నం ప్రతిమలు కనిపించలేదని నాగరాజు, విశ్రాంత అధికారులు రంగాచార్యులు, తవ్వకంలో పాలుపంచుకున్న భానుమూర్తిలు వెల్లడించారు. ఇది చాలా అరుదైన ప్రతిమగా వారు అభివర్ణించారు.

లోన ఇటుకలు..
ఈ విగ్రహాన్ని తొలుత ఇటుకలతో నిర్మించి దానిపై మందంగా డంగు సున్నం మిశ్రమ లేపనంతో ఆకృతి తెచ్చారు. ఆ విగ్రహానికి పలు ప్రాంతాల్లో రంధ్రాలున్నాయి. దానికి చేరువలో భారీ గోడ ఉన్న ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. అంటే ఆ విగ్రహాన్ని ప్రత్యేక పద్ధతిలో గోడకు అమర్చి ఉంటారని, అది గోడతోపాటు అలాగే కూలిపోయి భూగర్భంలో ఉండిపోయి ఉంటుందని భావిస్తున్నారు. వెలికి తీసే తరుణంలో అది ముక్కలు కానుంది. దాన్ని తిరిగి పూర్వపు పద్ధతిలో డంగు సున్నం మిశ్రమంతో తిరిగి అతికించనున్నారు. ఇందుకోసం విగ్రహాన్ని వివిధ భంగిమల్లో ఫొటోలు తీశారు.

విగ్రహం పగుళ్ల ఆధారంగా నంబర్లు వేశారు. వెలికి తీశాక అ ముక్కలను హైదరాబాద్‌ తరలించి ఫొటో డాక్యుమెంటేషన్‌ ఆధారంగా డంగు సున్నం మిశ్రమంతో తిరిగి అతికించి పూర్వరూపం తెస్తారు. ఈ భారీ విగ్రహం వెలుగు చూసిన విషయాన్ని వెంటనే హెరిటేజ్‌ తెలంగాణ ఇన్‌చార్జి డైరెక్టర్‌ సునీత భగవత్‌ దృష్టికి తీసుకెళ్లామని, ఆమె సూచనల మేరకు నిపుణులతో చర్చించి దాన్ని హైదరాబాద్‌ తరలింపు, సంరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు నాగరాజు పేర్కొన్నారు.

అపూర్వ గుర్తు
ఆ విగ్రహం వెలుగు చూసిన వెంటనే మా సిబ్బంది నా దృష్టికి తెచ్చారు. అది అతి అరుదైన ప్రతిమగా వారు చెప్పారు. కానీ పూర్తిగా వెలికి తీశాక గాని వివరాలు తెలియవు. ఇప్పటి వరకైతే అది చరిత్రకు సంబంధించి అపూర్వ గుర్తుగా భావిస్తున్నాం. తవ్వకాలు కొనసాగించి అక్కడ ఇంకా ఏమున్నాయో గుర్తిస్తాం. శనివారం కొన్ని వివరాలు వెల్లడవుతాయి.
సునీత భగవత్, ఇన్‌చార్జి డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement