యుద్ధం గెలిస్తే.. నాణేలపై ముద్ర పడాల్సిందే! | Revoking and reprinting the Coins those in circulation | Sakshi
Sakshi News home page

యుద్ధం గెలిస్తే.. నాణేలపై ముద్ర పడాల్సిందే!

Published Thu, Apr 4 2019 2:42 AM | Last Updated on Thu, Apr 4 2019 2:42 AM

Revoking and reprinting the Coins those in circulation - Sakshi

మౌర్యుల నాణెం ముందువైపు , ఆ నాణెం వెనుకవైపు ఏనుగు చిహ్నాన్ని పునర్ముద్రించిన శాతవాహనులు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కోలాహలం.. గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది.. అంతవరకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది.. ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలు మొదలుపెడుతుంది. ఇందులో భాగంగా అంతకుముందు ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలు, కార్యక్రమాలను నిలిపేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది సహజం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లకముందు రాచరిక వ్యవస్థలో ఏం జరిగేది..? బలమున్నోడిదే రాజ్యం. రాజ్యాల మీదకు దండెత్తి విజయం సాధించి ఆ ప్రాంతాన్ని తన ఏలుబడిలో కలిపేసి సామ్రాజ్యాన్ని విస్తరించుకునేవారు. ఈ క్రమంలో ఆ రాజు వెంటనే చేసే పనేంటో తెలుసా? అంతవరకు చలా‘మణి’లో ఉన్న నాణేలపై తన ‘మార్కు’ముద్రించటమే.. 

ఆలస్యమవుతుందనే పునర్‌ ముద్రణ.. 
ఆనాడు నాణేలకు ఎంతో ప్రాధాన్యముండేది. ఏ రాజైన సరే తన రాజ వంశం, దైవం.. వంటి సొంత చిహ్నాలని నాణేలపై ముద్రించి చలామణి చేసేవారు. మరో రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు, కొత్త ప్రాంతంలో తమ నాణేలు చలామణి చేసేందుకు కొంత సమయం పడుతుంది. నాణేల ముద్రణ, అందుకు సరిపడా ముద్రణాలయాల ఏర్పాటు, జనంలోకి తరలింపు.. ఇవన్నీ జరిగేందుకు సమయం అవసరం. కొత్త నాణేలు వచ్చే వరకు, పాత రాజులు అమలు చేసిన నాణేలనే కొనసాగించేవారు. అయితే వాటిపై తమ చిహ్నాలను ముద్రించేవారు. చలామణిలో ఉన్న పాత నాణేలను తెప్పించి వాటిపై తమ చిహ్నాలను ముద్రించి పంపేవారు. వీటికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చారిత్రక ప్రాంతాల తవ్వకాల్లో ఇలాంటి నాణేలు వెలుగు చూశాయి. వాటి వల్లనే నాటి సంఘటనలు వెలుగు చూశాయి. వెరసి చరిత్రకు అవి సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పుడు అలాంటి అరుదైన కొన్ని నాణేలు లభించాయి.  

సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో... 
సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి బౌద్ధ స్తూపం, బౌద్ధ విహారాలు వెలుగు చూసిన చోట పురావస్తు శాఖ అధికారులు ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నారు. వీటిల్లో కొత్త విహారాలు, నాటి వస్తువుల అవశేషాలు, నాణేలు వెలుగు చూస్తున్నాయి. వాటిల్లో కొన్ని నాణేలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. సీసంతో తయారైన ఆ నాణేలు శాతవాహనకాలానికి చెందినవిగా తెలుస్తున్నాయి. శాతవాహన నాణేలకు వీటికి కొంత తేడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిపై శాతవాహన చిహ్నాలతో పాటు ఇతర కొన్ని చిహ్నాలున్నాయి. దీంతో.. శాతవాహనులు ఇతర రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో, పాత రాజు చలామణి చేసిన నాణేలపై తమ చిహ్నాలను పునర్‌ ముద్రించి అమలులోకి తెచ్చినవిగా చరిత్రకారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. వీటిపై మరింత పరిశోధన చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటి వివరాలు వెలుగులోకి వస్తే శాతవాహనుల కాలానికి సంబంధించి మరికొన్ని కొత్త వివరాలు వెలుగుచూస్తాయి. 

క్రీ.పూ.5వ శతాబ్దంలోనే.. 
దేశంలో నాణేల చలామణి క్రీ.పూ.5వ శతాబ్దంలో మొదలైంది. మగధ సామ్రాజ్యంలో 3.4 గ్రాముల బరువు తూగే వెండి నాణేల ముద్రణ మొదలైందప్పుడే. మగధ పాలకులు నాణేలపై సూర్యుడి గుర్తుతో పాటు 6 ఆయుధాల ఆకృతులను ముద్రించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. వీటితోపాటు మరికొన్ని చిహ్నాలున్నా, అవి మారుతూ వచ్చాయి. తదనంతరం నంద సామ్రాజ్యాధీశులు దాన్ని కొనసాగించారు. క్రీ.పూ. 2, 3 శతాబ్దాల్లో రోమన్, గ్రీకుతో వాణిజ్యం పెరిగిన తర్వాత నాణేల ప్రాధాన్యం బాగా పెరిగింది. ఆ తర్వాత సీసం నాణేలు వచ్చాయి. కుషాన్స్‌ హయాంలో బంగారు నాణేలు మొదలయ్యాయి. తర్వాత మౌర్యులు, దక్షిణాదిన మౌర్యులను ఓడించి శాతవాహనులు నాణేలను ప్రారంభించారు. ఇందులో మౌర్యులను ఓడించి వారి నాణేలపై తమ చిహ్నాలను శాతవాహనులు వేసుకున్నారని ఆధారాలు లభించాయి. 

రెండు చోట్లనే వెలుగులోకి...
మరో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు పాత నాణేలపై కొత్త రాజులు తమ చిహ్నాలను ముద్రించిన ఉదంతానికి సంబంధించి మన దగ్గర ఇప్పటికి 2 చోట్ల ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 2 కూడా శాతవాహన కాలానికి సంబంధించినవే కావడం విశేషం. శాతవాహనుల తొలి రాజధానిగా పేర్కొంటున్న కోటిలింగాల వద్ద, ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న మస్కి (రాయచూరు సమీపం) వద్ద జరిపిన తవ్వకాల్లో ఇలాంటి నాణేలు లభించాయి. దక్షిణ భారతం కూడా మౌర్యుల పాలనలో ఉందనటానికి ఇవే ఆధారాలుగా మిగిలాయి.

ఈ రెండు చోట్ల జరిపిన తవ్వకాల్లో మౌర్యులు చలామణి చేసి న వెండి నాణేలు బయటపడ్డాయి. ఇవి పంచ్‌ మార్క్‌డ్‌ నాణేలు. వీటికి మరోవైపు శాతవాహనులు ముద్రించిన ఏనుగు ఆకృతి కనిపించింది. మౌర్యులను ఓడించి ఆ ప్రాంతాన్ని శాతవాహనులు తమ అధీనంలోకి తెచ్చుకుని మౌర్యుల నాణేలపై తమ గుర్తులను పునర్ముద్రించారని చరిత్రకారులు తేల్చారు. ఈ రెండు చోట్ల తప్ప అలాంటి నాణేలు వెలుగు చూడలేదు. మళ్లీ ఇప్పుడు అలాంటి కౌంటర్‌ మార్క్‌ డ్‌ నాణేలు వెలుగు చూడటంతో చరిత్రకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫణిగిరిలో లభించిన నాణేలు సీసం ముడిపదార్థంగా రూపొందినవి. దీంతో అవి కొంతమేర చెదిరిపోయి ఉండటంతో వాటిపై చిహ్నాలు అస్పష్టంగా కనిపిస్తున్నా యి. ప్రత్యేక పద్ధతుల్లో వాటిని పరిశోధించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement