పుట్టింట్లో పండుగలా ఉంది.. | Restoration of tanks from January first week: Harish Rao | Sakshi
Sakshi News home page

పుట్టింట్లో పండుగలా ఉంది..

Published Wed, Dec 10 2014 4:39 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పుట్టింట్లో పండుగలా ఉంది.. - Sakshi

పుట్టింట్లో పండుగలా ఉంది..

కాకతీయుల స్ఫూర్తితో చెరువుల పునరుద్ధరణ
తొలి దశలో జిల్లాలో 1,447 చెరువుల పనులు
ఖరీఫ్‌లోపు పూర్తి చేయడం లక్ష్యంగా ప్రణాళిక
చెరువు పనుల బాధ్యత సాగునీటి శాఖదే..
ఉమ్మడి రాష్ర్టంలో పాలకులు పట్టించుకోలేదు..
భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలి..
ప్రజాప్రతినిధులు అవగాహన సదస్సులు నిర్వహించాలి
‘మిషన్ కాకతీయ’ సదస్సులో మంత్రి హరీష్‌రావు

సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్‌లో చెరువుల గురించి మాట్లాడుతుంటే పుట్టింట్లో పండుగలా ఉందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వ్యవసాయానికి చేయూతనిచ్చేలా గొలుసుకట్టు చెరువులను నిర్మించిన కాకతీయుల రాజధానిలో చెరువులపై అవగాహన సదస్సు జరగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాకతీయుల స్ఫూర్తితోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి ‘మిషన్ కాకతీయ’ పేరు పెట్టినట్లు వివరించారు.

ఆచరణలోనూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామన్నారు. ‘మిషన్ కాకతీయ’లో భాగంగా జిల్లాలో 5,865 చెరువులను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందించామని.. తొలి దశలో 1,447 చెరువుల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలోని ఎన్‌ఆర్‌ఐ ఆడిటోరియంలో ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమంపై మంగళవారం ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు జరిగింది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
 
అందరూ భాగస్వాములు కావాలి..
‘ప్రజలు, ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా భాగస్వాములు అరుుతేనే మిషన్ కాకతీయ విజయవంతమవుతుంది. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, అటవీ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేయాలి. మొదటి దశలో చేపట్టిన పనులను వచ్చే మే నెల వరకు పూర్తి చేస్తాం. ఖరీఫ్‌లో ఈ ఫలి తాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చెరువులను పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణలో వ్యవసాయం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది.

చెరువులను నిర్మించిన కాకతీయులను మనం ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాం. పునరుద్ధరణ పనులు చేపట్టిన మనలను భవిష్యత్తు తరాలు ఇలాగే గుర్తు చేసుకుంటాయి. అందరం కలిసి మిషన్ కాకతీయను విజయవంతం చేయాలి’ అని హరీశ్ అన్నారు. వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ జి.పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, ఎంపీలు కడియం శ్రీహరి, ఎ.సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు డి.వినయభాస్కర్, కొండా సరేఖ, ఆరూరి రమేశ్, దొంతి మాధవరెడ్డి, ఎ.చందులాల్, డీఎస్ రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, పూల రవీందర్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కలెక్టరు జి.కిషన్, సాగునీటి శాఖ ఈఎన్‌సీ మురళీధర్, సీఈ విజయప్రకాశ్, ఎస్‌ఈ పద్మారావు పాల్గొన్నారు.
 
‘మిషన్ కాకతీయ’పై  సూచనలు..
వ్యవసాయ శాఖ : సాగునీటి శాఖ అందించిన చెరువుల పట్టికను పరిగణలోకి తీసుకుని, ఆ చెరువుల మట్టి పరీక్షలు జరపాలి. ఆ మట్టిలో ఎలాంటి లవణాలు(పోషకాలు) ఉన్నాయో 15 రోజుల్లో నివేదిక తయారు చేయాలి. దీని వల్ల పూడిక తీసిన మట్టి పొలాల్లో పోసుకునే రైతులకు ఎరువుల విషయంలో సరైన సమాచారం ఇవ్వొచ్చు. మట్టి పరీక్షల ఫలి తాలు ఉంటే రైతులను చైతన్య పరచవచ్చు.
 
అటవీ శాఖ : అటవీ ప్రాంతాల్లోని చెరువులు, కట్టకాల్వల పునరుద్ధరణకు అడ్డంకులు లేకుండా సహకరించాలి. సాగునీటి శాఖ నుంచి నిధులు అందిస్తాం. కాల్వ కట్టలపై ఆరేళ్లలోపు వినియోగంలోకి వచ్చే ఈత చెట్ల విత్తనాలతో నర్సరీ ఏర్పాటు చేయాలి. చెరువు గరిష్ట నీటిమట్టం పరిధిలో బాగా పొడవుగా పెరిగే సిల్వర్ ఓక్, ఇతర మొక్కల విత్తనాలు తయారు చేసుకోవాలి. సాగునీటి శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.
 
రెవెన్యూ : కొన్ని చెరువులు, శిఖం భూములు అన్యాక్రాంతమయ్యాయి. రెవెన్యూ యంత్రాంగం తమ పాత రికార్డులు పరిశీలిస్తే ఆ వివరాలు వెలుగులోకి వస్తాయి. రికార్డుల ఆధారంగా వాటిని గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
 
భూగర్భ జలవనరులు : జిల్లాలో 194 గ్రామాల్లో భూగర్భ జలాలు అడు గంటినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. వీటిని కరువు ప్రభావ(ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) గ్రామాలుగా గుర్తించారు. మిషన్ కాకతీయలో ఈ గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా దృష్టి పెట్టాలి.
 
సాగునీటి శాఖ : మిషన్ కాకతీయ మొత్తం సాగునీటి శాఖ బాధ్యతే. గతంలో రెండు జిల్లాలకు ఒక పర్యవేక్షక ఇంజినీర్ ఉండేవారు. ప్రస్తుతం జిల్లాకు ఒకరిని నియమించాం. రూ.50 లక్షల పనులు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు, రూ.కోటి పనులు పర్యవేక్షక ఇంజినీర్ కు అధికారాలు వికేంద్రీకరించాం. టెండర్‌కు వారం రోజులు, ఒప్పందానికి వారం చొప్పున.. 16వ రోజు నుంచి పని మొదలయ్యే విధంగా నిబంధనలలో మార్పులు చేశాం. ప్రతి చెరువుకు వేర్వేరుగా టెండర్‌ను పిలవాలని నిర్ణయించాం.

చెరువుల పునరుద్ధరణ పనుల నాణ్యతను, ఇంజినీర్ల పనితీరును పరిశీలించేందుకు హైదరాబాద్‌లో నాణ్యత పర్యవేక్షణ విభాగాన్ని నెలకొల్పుతున్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఈ విభాగం పని చేస్తుంది. ఇంజినీర్లకు ల్యాప్‌టాప్, ఆధునిక సర్వే పరికరాలు ఇచ్చాం. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు తప్పనిసరిగా పనులు జరిగే మండలాల్లోనే ఉండాలి. పనితీరును బట్టి ఇంజినీర్లకు ర్యాంకులు ఇస్తాం. పోస్టింగ్‌ల విషయంలో దీనిని ప్రామాణికంగా తీసుకుంటాము.
 
మండలాలు, గ్రామాల్లో అవగాహన
‘మిషన్ కాకతీయ’పై నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు వచ్చిన ఎంపీపీ, జెడ్పీటీసీలు వారివారి మండలాల్లో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులకు ఇలాం టి సమావేశాలు నిర్వహించాలి. కొన్ని చెరువుల్లో ఎంత వర్షం పడినా నీరురాదని అలాంటి వాటిని మినహాయించాలి. నియోజకవర్గానికి ఒక చెరువును ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
 
ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రణాళిక
పోచమ్మమైదాన్ : ఎంతో మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని  మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందేలా లేదనే బెంగతో  వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి పిల్లి గిరిబాబు యూదవ్ ఈ ఏడాది ఫిబ్రవరి 19న పెట్రోల్ పోసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. గిరిబాబు యూదవ్ స్మారకార్థం పాలిటెక్నిక్ ప్రహరీ గోడకు అనుకుని ఆయన స్మారక స్థూపం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన వారందరికి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, టెక్నికల్ కోర్సుల్లో చేరినప్పటి నుంచే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. పాలిటెక్నిక్‌లో సప్లమెంటరీని త్వరలో ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నిస్తానని విద్యార్థులకు హమీ ఇచ్చారు. తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఏడు ఫిబ్రవరి 19వ తేదిన గిరిబాబు యూదవ్ స్మారక స్థూపం ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.
 
అభివృద్ధికి  పునరంకితం కావాలి
వరంగల్ లీగల్ : ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచి... ఉద్యమకారులకు ధైర్యాన్ని అందించిన న్యాయవాదులు భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం కావాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ హాల్‌లో అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సమస్యలు పరి ష్కరించాలని న్యావాదులు ఇచ్చిన వినతిపత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

న్యాయవాదుల వృత్తికి ఆటంకంగా ఉన్న సీఆర్‌పీసీ సెక్షన్ 41 ఏ సవరణ అంశాన్ని ఎంపీల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళుతామన్నారు. న్యాయవాదులకు హెల్త్ కార్డు ల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, వరంగల్‌లో ఏసీబీ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వరంగల్ జిల్లా కోర్టు ఏర్పాటై 100 వసంతాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఇందుకోసం నిధులు అందజేస్తామన్నారు. అనంతరం న్యాయవాదులు హరీష్‌రావును  సత్కరించారు. శతాబ్ది ఉత్సవాలను గుర్తుగా నిర్మించే భవనానికి రూ.10 లక్షలను ఎంపీ ఫండ్స్ నుంచి కేటాయిస్తానని శ్రీహరి తెలిపారు.  
 
మార్కెట్‌ను ఆధునికీకరిస్తాం
వరంగల్‌సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను పూర్తిస్థారుులో ఆధునికీకరిస్తామని మంత్రిహరీష్‌రావు అన్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. మార్కెట్‌లో నూతనంగా నిర్మించిన భోజన, ఫలహారశాల క్యాంటీన్‌తోపాటు రూ.2కోట్ల వ్యయంతో నిర్మించిన ఓపెన్‌షెడ్‌ను ప్రారంభించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడారు. మార్కెట్ మొత్తాన్ని ఆన్‌లైన్ సిస్టంలోకి మారుస్తామని హామీ ఇచ్చారు.  

మార్కెట్‌కు వచ్చే  ప్రధాన రహదారులను డబుల్ లేన్ రోడ్లు వేయిస్తామన్నారు. మార్కెట్‌లో రైతు, హమాలీలకు విశ్రాంతి భవనాల ఏర్పాటు చేస్తామన్నారు.ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ షాపుల యజమానుల కోరిక మేరకు పాత గ్రెయిన్‌మార్కెట్‌లో దుకాణ సముదాయం ఏర్పాటుకు రూ. 3 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి హరీష్‌రావుకు ప్రజాప్రతినిధులు సీసీఐ, మార్కెఫెడ్ కొనుగోళ్ల తీరుతో రైతులు ఏవిధంగా నష్టపోతున్నారో వివరించారు. హమాలీ, గుమస్తా, దడువాయిలు తమసమస్యలను తీర్చాలని మంత్రికి విన్నవించారు.
 
మంత్రికి వినతుల వెల్లువ
హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్‌లో మంత్రి హరీష్‌రావుకు టీడీపీ శాసన సభాపక్షనేత ఎర్రబెల్లి పక్షాన పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఏనుమాముల మార్కెట్‌లో రైతుల సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అందులో వివరించారు.
 
వీఆర్‌ఏలకు 10 పీఆర్‌సీలో మూలవేతనం ఇవ్వాలని, పదోన్నతుల్లో 70 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని, 010 పదద్వారా వేతనాలు ఇవ్వాలంటూ హరీష్‌రావుకు తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకులు  వినతిపత్రం అందజేశారు. నోముల విజేందర్‌రెడ్డి, ఏల్పుల సదానందం పాల్గొన్నారు.
 
హన్మకొండ : ఆదర్శ రైతలను కొనసాగించాలని మంత్రి హరీష్‌రావుకు నవ తెలంగాణ ఆదర్శ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంకుమార్‌గౌడ్, ఆదర్శ రైతులు ఎం.కేశవరెడ్డి, కటకం రాజు, పూజారి కర్ణాకర్, సింగారం రాజేందర్ వినతిపత్రం అందజేశారు.

రిటైర్డ్ అధ్యాపకుడు పులి సారంగపాణికి టీఆర్‌ఎస్ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement