
సాక్షి, హైదరాబాద్: పంటల పెట్టుబడి పథకం, మరింతగా అందుబాటులోకి రానున్న సాగునీటి వసతి, పలు సంక్షేమ కార్యక్రమాలు, మార్కెటింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలతో రాష్ట్ర రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు అవుతుందని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకలలో అమలవుతున్న వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలపై అధ్యయనం చేసి వచ్చిన మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల బృందం మంగళవారం రాత్రి మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లో రైతులు వేసే పంటలు, దిగుబడు లు, నిల్వ సదుపాయాలు, మా ర్కెట్ యార్డుల పరిస్థితి, మద్దతు ధర, రైతులకు చెల్లింపులు, మార్కెట్ స్థిరీకరణ నిధి వంటి అంశాలపై తమ అధ్యయనాన్ని ఈ బృందం మంత్రికి వివరించింది.
30 ఏళ్లుగా కాటన్ కార్పొరేషన్
మహారాష్ట్రలో గత 30 ఏళ్లుగా కాటన్ మార్కె టింగ్ కార్పొరేషన్ పనిచేస్తున్నట్టు అధికారులు మంత్రికి తెలిపారు. ఆ రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ కందులు కొనుగోలు చేసి, పప్పుగా మార్చి మధ్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ‘భావంతర్ భుగ్తాన్’’పేరిట అమలు చేస్తున్న కార్యక్రమాన్ని మంత్రికి వివరించారు. ఈ పథకం కింద మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర పలికిన సందర్భాల్లో మిగతా డబ్బును నష్టపరిహారం కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ‘సరాసరి ధర’ను అమలుచేస్తోందని వివరించారు. ఈ నాలుగు రాష్ట్రాల అధ్యయన నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించిన తర్వాత తగిన నిర్ణయాలు తీసుకుంటామని హరీశ్‌రావు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment