కోటి ఎకరాల మాగాణే లక్ష్యం: హరీశ్‌రావు | 'One crore acres of agriculture is our aim' says Minister Harish Rao | Sakshi
Sakshi News home page

కోటి ఎకరాల మాగాణే లక్ష్యం: హరీశ్‌రావు

Published Thu, Mar 31 2016 7:47 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

'One crore acres of agriculture is our aim' says Minister Harish Rao

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలను మాగాణిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను చేపట్టిందని నీటివనరుల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం శాసన మండలిలో సాగునీటిపై లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను, తెలంగాణ అవసరాలను ఎలా తీర్చుకోబోతున్నామన్న అంశాలను అందరికీ తెలిపేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టెక్నాలజీ ద్వారా ఇచ్చిన ప్రెజెంటేషన్ దేశంలోని ఇతర సీఎంలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లపై ప్రతిపక్షాలకు అనుమానాలుంటే నివృత్తి చేసుకోవాల్సిందిపోయి, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని పారిపోయాయన్నారు. వట్టిపోయిన ప్రాజెక్ట్‌లకు నీటిని ఎలా తెస్తామో కూడా సీఎం వివరించారని, పెండింగ్ ప్రాజెక్ట్‌లను కూడా ఎలా పూర్తిచేస్తామో తెలిపారని ఆయన పేర్కొన్నారు.

ప్రాణహిత ద్వారా అదిలాబాద్‌కు, భీమ, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌ల ద్వారా మహబూబ్‌నగర్‌కు ఏడాదిన్నరలో సాగునీరందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షాలు ఎటువంటి సూచనలిచ్చినా స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు మాట్లాడుతూ.. ప్రాజెక్ట్‌లపై రాజకీయ పార్టీలకు ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేపుడు ప్రభుత్వం మిగిలిన పక్షాలను కూడా కలుపుకుపోవాలని సూచించారు. ప్రతి ఎకరాకు సాగు నీరందించడం ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, బంగారు తెలంగాణ సాధనను బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తాము కోరుకుంటున్నామన్నారు. ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాథర్ గౌడ్, నరేందర్‌ రెడ్డి, శంబీపూర్‌ రాజు, బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హరిత విప్లవం, క్షీర విప్లవం మాదిరిగా జలవిప్లవానికి కేసీఆర్ నాంది పలికారని త్వరలోనే కోటి ఎకరాల బీడుభూములు మాగాణంగా మారబోతున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రుణ ఉపశమన బిల్లుకు మండలి ఆమోదం ప్రైవేటు రుణాలను పొందిన చిన్న, సన్నకారు రైతులు, వ్యాపారులు, కార్మికులకు సదరు వడ్డీ వ్యాపారుల వేధింపుల నుంచి ఉపశమనం లభించేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణ ఉపశమన బిల్లుకు గురువారం శాసనమండలి ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ) మహమూద్ అలీ బిల్లును ప్రతిపాదించగా, టీఆర్‌ఎస్, బీజేపీ పక్షాలు సంపూర్ణ మద్ధతును తెలిపాయి. కాంగ్రెస్, మజ్లీస్ పార్టీల సభ్యులు మండలికి హాజరుకాలేదు.

 

అంతకు మునుపు మండలి ప్రారంభం కాగానే చైర్మన్ స్వామిగౌడ్ లఘు చర్చను ప్రారంభించగా, ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ అనంతరం చర్చిద్దామని కొందరు సభ్యులు అనడంతో సాయంత్రం 4గంటలకు సాగునీటిపై చర్చను వాయిదా వేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ మట్లాడుతూ సమావేశాల్లో సభ్యులు అడిగిన మొత్తం 121 ప్రశ్నలకు ప్రభుత్వం జవాబిచ్చిందని, ఈ సమావేశాల్లో 12 బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు. సమావేశాలకు టీఆర్‌ఎస్ సభ్యులు 21మంది, కాంగ్రెస్ నుంచి 8మంది, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక్కరు, పీఆర్టీయూ నుంచి ఇద్దరు, ఆరుగురు నామినేటెడ్ సభ్యులతో కలిపి మొత్తం 40మంది ఎమ్మెల్సీలు హాజరైనట్లు చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement