ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసు | People have to know how to develop | Sakshi
Sakshi News home page

ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసు

Published Tue, Jan 6 2015 12:25 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసు - Sakshi

ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసు

పటాన్‌చెరు: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని హామీలను కూడా అమలు చేస్తున్నాం. ఏదో పత్రికలో చూశాను.. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడారు. ఆయనకు వాస్తవాలు తెలియాలంటే హైదరాబాద్‌లో కారు దిగి ఏ ఆటోవాలను అడిగినా ఆటో టాక్స్ రద్దు గురించి చెబుతారంటూ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.  

సోమవారం పటాన్‌చెరు మండలం పాటిశివారులో ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన టీఆర్‌ఎస్ నియోజక వర్గ స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసిన హామీలేవీ నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ కోసం తమ ప్రభుత్వం రూ. 17 వేల కోట్లు ఆర్థిక భారాన్ని భరించిందన్నారు. అలాగే ఇన్‌పుట్ సబ్సిడీ కింద రైతులకు రూ. 480 కోట్లు ఇచ్చిందన్నారు.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇచ్చి జీతాలు కూడా పెంచిందన్నారు.  ఏడు నెలలుగా తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. రూ. 22500 కోట్లు ఖర్చు చేసి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. హైదరబాద్‌లో పేకాట క్లబ్‌లు మూసి వేసిన ఘనత తమదేనన్నారు. వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ, టెక్స్‌టైల్స్ పార్క్ స్థాపిస్తున్నామన్నారు. పాడి రైతులకు మేలు చేసేందుకు విజయ డెయిరీ పాలకు రూ. నాలుగు పెంచామన్నారు.
 
జీహెచ్‌ఎంసీలో గులాబీజెండా ఎగరాల్సిందే..
హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాల్సిందేనని హరీష్‌రావు పిలుపునిచ్చా రు. ఇందుకోసం కార్యకర్తలు మరింత క్రియాశీలం గా వ్యవహరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన కార్యకర్తలు తెలంగాణ పునర్నిర్మాణంలో  కూడా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు.
 
రేషన్ కార్డులు ఎక్కడా తొలగించలేదు
జిల్లాలో కొత్తగా లక్షా రెండు వేల రేషన్ కార్డులను ఇచ్చామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. అనర్హులను తొలగించిన మాట వాస్తవమేనని,  కానీ పాత రేషన్‌కార్డుల కంటే అదనంగా లక్షకుపై చిలుకు రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. జిల్లాలో రూ. 12 వందల కోట్లతో రోడ్ల అభివృద్ధి జరుగుతోందన్నారు. ఒక్క పటాన్‌చెరులోనే రూ. 91 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. కళ్యాణ లక్ష్మి కింద రూ. 51 వేలు 70 మంది లబ్ధిదారులకు అందించామన్నారు.
 
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ. 350 కోట్లతో నియోజక వర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.  ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం జనరంజకంగా ఉందన్నారు. పటాన్‌చెరు ఎంపీపీ శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ మండల పరిధిలోని అంతర్గత రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి హరీష్‌రావుకు వినతిపత్రం సమర్పించారు.

అంతకు మందు మంత్రి హరీష్ రావు రూ. 11 కోట్లతో చేపట్టే పాటి నుంచి రామచంద్రాపురం, తెల్లాపూర్ ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పాటి చౌరస్తాలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నేతలు చాగన్ల నరేంద్రనాథ్, రామచంద్రాపురం ఎంపీపీ యాదగిరి యాదవ్, సోమిరెడ్డి, పుష్పా నగేష్, గాలి అనిల్ కుమార్, తుమ్మల పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement