Kakatiyas history
-
గోన గన్నారెడ్డి ఇలాకా.. వర్ధమానపురం
నాగర్‌కర్నూల్: ‘కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నందివడ్డెమాన్ గ్రామం. తెలంగాణలో వర్ధమానపురానికి 2 వేల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. క్రీస్తుశకం 8 నుంచి 12వ శతాబ్దం వరకు వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పరిపాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికీ కనిపించే ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం. నందివడ్డెమాన్‌గా ఎలా మారిందంటే.. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన జైనమతం నాటి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిందని సాహిత్యపరంగా పురావస్తు శాఖ ద్వారా తెలుస్తోంది. నాటి జైనమత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైనమత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరుమీద ఈ గ్రామానికి వర్ధమానపురం పేరు వచి్చంది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నందివర్ధమానపురంగా పేరొందింది. ఇది కాలక్రమేణా నందివడ్డెమాన్‌గా మారింది. 1100 గ్రామాలతో పాలన.. ఉదయచోళుడు 8వ శతాబ్దంలో వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 1100 గ్రామాలతో కండూరు నుంచి నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా) విస్తరించిన రాజ్యాన్ని పరిపాలించినట్లు చరిత్రకారులు చెబుతారు. కాకతీయ సామ్రాజ్యంలో సామంతుడిగా ఉన్న ఆయన.. తరువాత తనను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. దీంతో కాకతీయ మహారాజు గణపతిదేవుడు వీరుడైన గోన బుద్దారెడ్డి సహకారంతో ఉదయచోళుడిని ఓడించి తిరిగి వర్ధమానపురాన్ని స్వా«దీనం చేసుకున్నారు. తరువాత గోన బుద్దారెడ్డినే సామంత రాజుగా ప్రకటించి పట్టాభిõÙకం చేశారు. గోన బుద్దారెడ్డి మరణానంతరం ఆయన ముగ్గురు కుమారుల్లో ఒకడైన గోన గన్నారెడ్డి ఈ రాజ్యం పగ్గాలు చేపట్టారు. గుణశేఖర్ సినిమాలో.. 2015లో గుణశేఖర్ దర్శకత్వంలో వచి్చన రుద్రమదేవి సినిమాలో ‘నేను తెలుగుభాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా’, ‘గమ్మునుండవోయ్’అంటూ తెలంగాణ యాసలో ఆకట్టుకునే డైలాగులతో అల్లు అర్జున్ చేసిన పాత్ర గోన గన్నారెడ్డిదే. గోన బుద్దారెడ్డి తరువాత వర్ధమానపురం రాజ్యం పగ్గాలు చేపట్టిన గోన గన్నారెడ్డి రుద్రమదేవికి కుడిభుజంగా ఉండి సమస్త కాకతీయ రాజ్యాలను రక్షించిన యోధుడిగా చెప్పుకుంటారు. ఆయన అశ్వ శిక్షణలో, గుర్రపు స్వారీలో, కత్తి యుద్ధంలో కాకతీయ రాజుల సామంతులలో ఎవరూ సాటి వచ్చేవారు కాదని చెప్పుకొంటారు. కాకతీయ సామ్రాజ్యంపైకి ఎవరైనా శత్రువులు వస్తే.. తన సైన్యంతో గుట్టుగా మాటు వేసి దాడులు చేసేవారని, ఇందుకోసం ప్రత్యేకంగా సొరంగ మార్గాలు కూడా ఉండేవని చరిత్రకారులు చెబుతారు. ‘రంగనాథ రామాయణం’ఆవిష్కరణ గోన బుద్దారెడ్డి మంచి సాహిత్యకారుడిగా పేరుపొందారు. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి బుద్దారెడ్డి రంగనాథ రామాయణం పేరుతో తొలి ద్విపద కావ్యాన్ని రచించారు. యుద్ధకాండ వరకు బుద్దారెడ్డి రచించగా ఆయన కుమారులు మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు. వాలీ్మకి రచించిన రామాయణంలో లేని కొన్ని సంఘటనలు కూడా ఇందులో పొందుపరిచారు. గోన గన్నారెడ్డి సైతం వర్ధమానపురాన్ని పరిపాలించే సమయంలో రాజ్యానికి 12 కిలోమీటర్ల దూరంలో అరణ్యంలో ఓ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ ప్రాంతాన్ని నాడు బుద్దవరంగా.. ప్రస్తుతం బుద్దారంగా పిలుస్తారు. నంది వర్ధమానపురాన్ని పరిపాలించిన కాకతీయులు, గోన వంశీయులు దైవభక్తిపరులు, దీనికి నిదర్శనం గ్రామంలో నేటికీ చెక్కుచెదరని ఆలయాలే. ఇక్కడ తొమ్మిది ప్రధానాలయాలున్నాయి. వర్ధమానపురం సామ్రాజ్యానికి సంబంధించిన శిలాశాసనాలు నేటికీ అక్కడ దర్శనమిస్తాయి. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలం 24–1–1229 నాటి శిలాశాసనాలు కూడా ఉన్నాయి. పలు ఆలయాల్లో శిలాశాసనాలు, రాజ్యం చుట్టూ నిర్మించిన కోటగోడలు కూడా కనిపిస్తాయి.పర్యాటక కేంద్రంగా గుర్తించాలి వేల ఏళ్ల చరిత్ర కలిగిన నంది వడ్డెమాన్ను పర్యాటక కేంద్రంగా గుర్తించాలి. నంది వడ్డెమన్కు ఉన్న చరిత్రను భవిష్యత్ తరాలకు అందరికీ తెలిసేలా చేయాలి. మా వంతుగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. నందివడ్డెమాన్ చరిత్ర అందరికీ తెలిసేలా పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి. – వంగ సుదర్శన్‌గౌడ్, మాజీ సర్పంచ్ పూర్వవైభవం తేవాలి.. గతంలో నేచర్ అండ్ ఇండియన్ కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయాల చుట్టూ శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని యువజన సంఘాలు, యువకులు సహకరించారు. ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు, దేవతలను ప్రతిష్టించేందుకు, ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. – భూపతి, గ్రామస్తుడుప్రధాన ఆలయాలివి.. కాళికామాత ఆలయం.. గ్రామ చెరువు భీమ సముద్రం కట్టకు దగ్గరలో కాళికామాత దేవాలయం ఉంది. అత్యంత జీవకళ ఉట్టిపడేలా ఉండే ఈ దేవాలయంలో విగ్రహాలు రజాకార్ల కాలంలో ధ్వంసమైనట్లు చెబుతుంటారు. ఎన్నో కళాఖండాలతో నగిïÙలతో దేవాలయం అద్భుతంగా ఉంటుంది. శివగౌరమ్మ ఆలయం.. తూర్పు దిక్కున శివుడు, దొంతుల గౌరమ్మ, పంచ గౌరమ్మ ఆలయాలున్నాయి. ఆలయం ముందున్న విఘ్నేశ్వరుడి విగ్రహం అద్భుత కళా నైపుణ్యంతో చెక్కబడి కనిపిస్తుంది.త్రిమూర్తుల ఆలయం.. ఆగ్నేయ దిశలో అరుదుగా ఉండే త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆలయాలున్నాయి. ఈ దేవాలయాలు ఎత్తుగా ఉండి నిర్మాణ శైలి అలంపూర్‌లోని ఆలయాలను పోలి ఉంటాయి. ఈ దేవాలయం నుంచి గుడిపల్లి గట్టు వరకు సొరంగ మార్గం ఉన్నట్లు చెబుతుంటారు. విగ్రహాలను దుండగులు అపహరించుకుపోవడంతో ఆలయాలు మాత్రమే దర్శనమిస్తాయి. వీరభద్రాలయం.. పడమర దిక్కున వీరభద్రస్వామి, శివుడు ఆలయాలు ఉన్నాయి. నిలువెత్తు వీరభద్రస్వామి విగ్రహం గాంభీర్యంతో కత్తి ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.నందీశ్వర, శనైశ్వర ఆలయం.. ప్రధానంగా శివుడు, పార్వతి, ప్రత్యేక ఆకర్షణగా నంది విగ్రహాలుంటాయి. నంది విగ్రహం అద్భుత కళానైపుణంతో చెక్కి ఉంటుంది. ఇది శ్రీశైలంలోని ప్రధాన నందిని పోలి ఉంటుంది. దీనికి సమీపంలో శనేశ్వరస్వామి ఆలయం ఉంది. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయానికి ప్రతి శని త్రయోదశి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. -
కాకతీయుల కళావైభవం
కాకతీయుల కళాపోషణకు సజీవ సాక్ష్యాలుగా పలు కట్టడాలు నేటికీ దర్శనమిస్తున్నాయి. భారతీయ సంస్కృతికి ఒక కృతిని, ఆకృతిని కల్పించి.. తమలో దాగిన ఆగమజ్ఞాన నిధిని.. తత్వార్థ ఖనిని రాళ్లల్లో ఇమిడ్చిన కాకతీయుల ప్రతిభ అనన్యం అపూర్వం.. సుమధురం. కాకతీయుల కళామణిహారం లోంచి జాలువారిన కళాఖండాలు ఎన్నో నారాయణపేట జిల్లా నర్వ మండలం పెద్దకడ్మూర్‌లో సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మన చరిత్ర, సంస్కృతి, వైభవాన్ని ఎలుగెత్తి చాటుతోంది ఇక్కడి బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం. కాకతీయుల కళాపిపాసకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. – నర్వ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నో కోటలు, సంస్థానాలు కాకతీయుల కాలంలో నిర్మించబడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. నర్వ మండలం పెద్దకడ్మూర్‌లోని అనేక కట్టడాలు గత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా పేర్కొంటున్నారు. కాకతీయుల కాలంలోని శాతవాహనులు, గుప్తులు, వాకాటములు, కదంబులు రాజ్యపాలన చేశారు. శాతవాహనుల తర్వాత దక్కను భాగమును విశేషంగా ఆక్రమించుకున్న వారు పల్లవులు. పల్లవుల నుంచి కర్ణాటక ఉత్తర భాగాన్ని విడిపించిన వారు కదంబులు. వీరు క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం ప్రారంభం వరకు సర్వాధికారాలతో పరిపాలన సాగించారు. ఈ కదంబులు కుంతల దేశాన్నే కాకుండా కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గ, బీజాపూర్, ధారవాడ, బళ్లారిలతో పాటు కర్నూల్, అనంతపురం ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. వీటితో పాటు పాలమూరు జిల్లాలోని నారాయణపేట, మక్తల్ తాలుకా, తాండూర్, కోస్గి, కొడంగల్, ఆత్మకూర్, గద్వాల ప్రాంతాలతో పాటు అలంపూర్, అయిజ, కందూర్, కడుమూర్, కోడూర్ ప్రాంతాల్లో కదంబులతో పాటు కర్ణాటక ప్రభువులు ఏలుబడి ఉందని చరిత్ర చెబుతోంది. కదంబులు నాడు నిర్మించిన గ్రామమే కడుమూర్.. నేడు పెద్దకడ్మూర్గా పిలవబడుతోందని చరిత్రకారుడు, సాహితీ సేవకుడు కవి బాబు దేవిదాస్‌రావు ‘పాలమూరు చరిత్ర’ గ్రంథంలో పేర్కొన్నారు. చరిత్రకు సాక్ష్యంగా కల్యాణి చాళుక్యుల శాసనం పెద్దకడ్మూర్ బాలబ్రహ్మేశ్వర ఆలయ ప్రాంగణంలో కల్యాణి చాళుక్యుల శాసనం గత చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ శాసనాన్ని చరిత్రకారుడు బాబు దేవిదాస్‌రావు విపులంగా వివరించారు. కదంబుల కాలంలో పాలమూరు జిల్లాపై కర్ణాటక ప్రభువుల ఏలుబడి ఎక్కువగా ఉండేది. దీంతో నాటి కదంబూరు (కడ్మూర్), నాగలకడ్మూర్ గ్రామాలు ఆత్మకూర్ తాలుకాలో ఉండేవి. కడ్మూర్లోని బాలబ్రహ్మేశ్వర ఆలయ ఆవరణలో స్థాపించిన శాసనంలో అనేక అంశాలను పొందుపర్చారు. అహవమల్లరాయ నారాయణుడి పరిపాలన కాలంలో మూడవ ఏట వీరబలంజయ ధర్మప్రతిపాదకులైన ‘ఆయావోళేనూర్వర స్వాములు’ కర్ణాటక దేశాన 4వేల ఉభయ నానాదేశి వర్తకులు పెద్దకడ్మూర్‌లో కూర్చొని తమ సంఘం వారికై చేసుకున్న కట్టుబాట్లను శాసన రూపకంగా పొందుపర్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కాగా.. గత వైభవాన్ని చాటే కాకతీయుల కళాఖండాలను సంరక్షించాలని పలువురు కోరుతున్నారు. మరో కథ వెలుగులో.. నేటి పెద్దకడ్మూర్ ప్రాంతం జూరాల ప్రాజెక్టు అతి సమీపంలోని కృష్ణానది తీరంలో ఉండటంతో కాకతీయ రాజు రెండవ పులకేశి వేటకు వచ్చాడంటా. ఈ ప్రాంతం దట్టమైన అడవి.. కృష్ణనది సోయగాలతో రెండవ పులకేశిని మంత్రముగ్దులను చేసిందంటా. దీంతో ఇక్కడ ఓ గ్రామాన్ని నిర్మించాలని ఆయన తలంచారు. రాజులు తలచుకుంటే కొదవే ముంటుందన్న చందంగా సైనికులు, నిపుణులు, శిల్పులతో కలిసి రాజుకు ఇష్ట దైవమైన బాలబ్రహ్మేశ్వరుడి ఆలయం నిర్మించారని గ్రామంలో చెబుతున్నారు. ఆలయంతో పాటు గ్రామముఖ ద్వారం, గ్రామదేవత ఆలయం, నాగదేవతల ఆలయాలు రూపొందించారు. ఈ అద్భుతమైన కట్టడాలు, కాకతీయుల కళాపోషణకు నిదర్శనాలుగా నిలిచి, నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చారిత్రక ఆలయాన్ని సంరక్షించాలి కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చారిత్రక నేపథ్యం కలిగిన బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని సంరక్షించాలి. గ్రామస్తుల చైతన్యంతో కొంత అభివృద్ధి జరిగింది. ఆలయాన్ని ప్రాచీన ఆలయంగా గుర్తించి, విలువైన శిల్పసంపదను కాపాడాలి. – తంబలి నర్సింహయ్య, బాలబ్రహ్మేశ్వర ఆలయ అర్చకుడు అద్భుత శిల్ప సౌందర్యాలకు నిలయం.. అద్భుత శిల్ప సౌందర్యాలకు నిలయం బాలబ్రహ్మేశ్వర ఆలయం. గ్రామముఖ ద్వారాలు, నాగదేవతల స్థలాలను సంరక్షించాలి. చారిత్రక నేపథ్యం కల్గిన ఈ కట్టడాలను పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సందర్శించి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామస్తుల సహకారంతో ఆలయాలను సంరక్షించుకుని ప్రస్తుతం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – ప్రవీణ్‌కుమార్ ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడు -
ఒకప్పుడు మన రాజధాని కందూరు.. తాజాగా వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: కందూరు.. ఇది మహబూబ్‌నగర్ జడ్చర్ల సమీపంలో ఉంది. ఇప్పుడు ఓ గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందింది. క్రీస్తుశకం 1025-1248 మధ్య కాలంలో కల్యాణి చాళుక్యులు, కాకతీయులకు సామంతులుగా కందూరు చోళులు స్వతంత్ర పాలన నిర్వహించారు. ఆనాటì ఈ ప్రాంత వైభవం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. తరచుగా వెలుగు చూస్తున్న అలనాటి గుర్తులు అప్పటి వైభవాన్ని చాటి చెబుతున్నాయి. తాజాగా విశ్రాంత పురావస్తు అధికారి, చరిత్ర పరిశోధకుడు, విజయవాడ కల్చరల్ సెంటర్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి మంగళవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి నాటి వివరాలు మరికొన్ని వెలుగులోకి తెచ్చారు. ఇనుప యుగం నాటి అరుదైన మానవ సమాధులు, కందూరు చోళుల పాలన కాలం నాటి శిల్పాలు, మందిర ఆనవాళ్లపై స్థానికులకు అవగాహన కల్పించారు. నాటి జ్ఞాపకాలు చెదిరిపోకుండా కాపాడాలని స్థానిక సర్పంచ్ మున్నూరు శ్రీకాంత్‌కు సూచించారు. శివనాగిరెడ్డి వెంట నల్లమల నేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పట్నం కృష్ణంరాజు తదితరులున్నారు. అరుదైన రాక్షస గుళ్లు ఇది క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల కిందటి ఇనుప యుగం నాటి మానవ సమాధి. సమాధి పైభాగంలో భారీ రాళ్లను వృత్తాకారంలో పేర్చి ఉండే ఈ నిర్మాణాలను రాక్షస గుళ్లుగా పేర్కొంటారు. కానీ వృత్తాకారంలో రాళ్లు రెండు వరసలుగా ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైన రాకాసి గుళ్ల సమాధి ఇది. రెండో వరస రాళ్ల పైభాగపు మొనలు మాత్రమే ఉపరితలంలో కనిపిస్తున్నాయి. వ్యవసాయం విస్తరణ కోసం అవగాహన లేక రైతులు తొలగించగా కేవలం నాలుగు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా మాయమైతే స్థానిక భావితరాలకు వీటిని చూసే అవకాశం ఉండదు. అద్భుత శిల్పకళా చాతుర్యం అద్భుత అలంకరణతో చిన్నచిన్న వివరాలను కూడా ఇట్టే గుర్తించగలిగే శిల్పకళా చాతుర్యం.. వెరసి ఇదో కమనీయ శిల్పం. 12వ శతాబ్దపు కల్యాణిచాళుక్యుల కాలం నాటి శిల్పుల నేర్పరితనానికి నిలువుటద్దం ఈ చెన్నకేశవస్వామి విగ్రహం. ఇటీవల అభివృద్ధి పనులు చేస్తుండగా ఇలా భూగర్భం నుంచి బయటపడింది. స్థానిక దేవాలయంలో పూజలందుకునే వేళ ముష్కరుల దాడిలో కొంత ధ్వంసమైంది. చేతి భాగాలు విరిగి ఉన్నాయి. మిగతా విగ్రహం అపురూపంగా కనిపిస్తోంది. గుండుపై వీరగల్లు ఇది ఓ వీరగల్లు. యుద్ధంలో వందమందిని మట్టి కరిపించిన స్థానిక వీరుడి స్మారకం. సాధారణంగా వీరగల్లులు విడిగా శిల్పాలుగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా గుండుపై చెక్కినవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఓ యుద్ధంలో శత్రువులను చీల్చి చెండాడి వీరమరణం పొందిన వీరుడిని నిరంతరం తలుచుకునేలా ఇలా గుండుపై చెక్కి సగర్వంగా నిలిపారు. -
మసకబారుతున్న చారిత్రక గురుతులు
సాక్షి, ఖమ్మం: ఘన చరిత్ర కలిగిన జిల్లాలో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో గుట్టపై కాకతీయుల కాలంలో కోట నిర్మించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు దాడి చేసి కోటను స్వాధీనం చేసుకున్నట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది ఉత్సవాలు వారంరోజుల పాటు ఇక్కడ నిర్వహించారు. గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అధికారులు ప్రకటించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాగా కోటలో బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ కొందరు తవ్వకాలు చేపట్టారు. దీంతో ఈ ప్రాంతమంతా శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు స్పందించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
కాలగర్భంలో కళా వైభవం!
అద్భుత శిల్పకళా సంపద మట్టిలో కలిసిపోతోంది. నిత్యం పూజలు, అభిషేకాలతో విలసిల్లిన దేవాలయాలు, శిల్పాలు రాళ్ల కుప్పలవుతున్నాయి. గుప్త నిధుల వేటలో రాతి కట్టడాలు ధ్వంసమవుతున్నాయి. చరిత్ర కాలగర్భంలో సమాధి అవుతోంది. తెలంగాణలో గుప్తనిధుల తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పురాతన దేవాలయాల్లోని విగ్రహాల కింద బంగారం, వజ్రాలు ఉన్నాయన్న ఆశతో కొందరు దుండగులు నేరాలకు పాల్పడుతున్నారు. జంతు బలులు చేయడానికీ వెనుకాడటం లేదు. దీంతో కాకతీయులు, రాష్ట్ర కూటులు, చాళుక్యుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న అనేక ఆలయాలు, ఉప ఆలయాలు శిథిలమైపోయాయి. తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా పేర్కొనే వరంగల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆలయాల ప్రస్తుత పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. – సాక్షి, హైదరాబాద్ శిథిలావస్థలో రామప్ప ఆలయాలు కాకతీయుల కళావైభవానికి, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం రామప్ప ఆలయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి ప్రముఖ ఆలయాల్లో రామప్ప ఒక్కటి. రామప్ప ఆలయంతోపాటు దాని చుట్టు పక్కల కిలోమీటర్ దూరంలో 20 ఉప ఆలయాలను కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయాలు ఆదరణ కరువై శిథిలమవుతున్నాయి. ఘనకీర్తి గల చారిత్రక ఆలయంలోని స్తంభాలు కూలిపోతున్నాయి. కొన్ని కట్టడాలపై మొలచిన పిచ్చి మొక్కల మధ్య శిల్పాలన్నీ వెలవెలబోతున్నాయి. అప్రమత్తమవ్వాలి దేవాలయాలను పరిరక్షించుకోవడంలో ప్రజల పాత్ర ముఖ్యమైంది. గ్రామాల్లోని యువత ఆలయాల్లో తవ్వకాలు వంటి చర్యలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు తెలియజేయాలి. అప్రమత్తంగా ఉండాలి. ఒక కమిటీగా ఏర్పడి దేవాలయాలను సంరక్షించుకోవాలి. పండుగలు, జాతరలు వచ్చినప్పుడు మాత్రమే దేవాలయాల వైపు చూడటం కాదు.. నిత్యం వాటిపై పరిశీలన ఉండాలి. పురాతన సంపద పరిరక్షణ కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కన్వీనర్ కూలిన 36 మీటర్ల ప్రాకారం కేంద్ర పురావస్తు శాఖ అధీనంలోని రామప్ప ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. కట్టడాలు కూలిపోతున్నా పురావస్తు శాఖలో చలనం కనిపించడంలేదు. దీంతో గత రెండేళ్లుగా రామప్ప ఆలయం శిథిలమవుతోందని పలువురు చరిత్రకారులు వాపోతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు తూర్పు ద్వారాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం 36 మీటర్ల వరకు కుప్పకూలింది. ఇటీవల సిబార (సున్నము, ఇసుక, బెల్లం, కరక్కాయల మిశ్రమం) పద్ధతిలో ప్రహరీ గోడ మరమ్మతులు చేపట్టారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న 16 ఉప ఆలయాలు కూడా పూర్తిగా శిథిలమైపోయాయి. వీటిలో కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం కోసం కూలగొట్టి.. శిలలను కుప్పలుగా పోశారు. యాకూబ్‌సాబ్ స్థలంలో ఉన్న శివాలయం పూర్తిగా కూలిపోయింది. గుప్తనిధుల కోసం గర్భగుడిని గునపాలతో తవ్వేశారు. చాలా చోట్ల గుప్తనిధుల కోసం పురాతన ఆలయాల్లో రాత్రిళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. గ్రామాల్లో నివాసం ఉండేవారే ఇలాంటి వారికి సహకరిస్తున్నారని పలు కేసుల్లో జరిగిన విచారణలో తేలింది. శిల్ప సౌందర్యానికి ప్రతీకలు కాకతీయుల కాలంలో రామప్ప ఆలయంతోపాటు దాన్ని ఆనుకుని కాటేశ్వర, కామేశ్వర, నరసింహస్వామి, నంది మంటపం నిర్మించారు. రామప్ప చుట్టూ ఉన్న కోటగోడ లోపల గొల్లగుడి, యాకూబ్‌సాబ్ గుడి, త్రికూ ట ఆలయంతోపాటు అడవిలో మరో రెండు శివాలయాలు ఉన్నాయి. రామప్ప సరస్సు కట్టపై కల్యాణ మంటపం, కాటేజీల పక్కన త్రికూటాలయం, మరో రెండు చిన్న ఆలయాలు కనిపిస్తాయి. రామప్ప ఆలయం ఉన్న పాలంపేటలో మరో రెండు శివాలయాలు శిథిలమవుతున్నాయి. లక్ష్మీ దేవిపేట, పెద్దాపురం, రామాంజాపురం, నర్సాపురం గ్రామాల్లోని ఆలయాలు శిల్ప సౌందర్యానికి, కాకతీయుల కళా వైభవానికి అద్దం పడుతాయి. ప్రస్తుతం ఆ శిల్పాలు ఎండకు ఎండుతూ వానకు తడు స్తూ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. గణపురంలోని కోటగుళ్లు, కటాక్షపూర్‌లోని ఆలయాలు శిథిలమవుతున్నాయి. -
చరిత్రకు చిత్రిక పట్టారు!
సాక్షి, హైదరాబాద్: చెరువులు.. పట్టణాలు.. ఆలయాలు (త్రిబుల్ టీ) స్ఫూర్తితో పాలన సాగించిన కాకతీయుల చరిత్రను ప్రస్తుత తరాలకు కళ్లకు కట్టినట్లు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. వ్యవసాయం, అనుంబంధ వర్గాలకు చేయూత నిచ్చేలా పాలించిన కాకతీయుల వైభవాన్ని చిత్రాల రూపంలో అందరికీ తెలియజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాకతీయుల పరిపాలన కేంద్రం ఖిలా వరంగల్‌లోని ప్రస్తుత గృహాలపై వారి పరిపాలన ప్రస్థానాన్ని, వైభవాన్ని చిత్రీకరించనున్నారు. పర్యాటక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ హస్తకళల విశ్వవిద్యాలయం (జేఎన్ఏఎఫ్ఏయూ) విద్యార్థులు భాగస్వాములవనున్నారు. 120 ఇతివృత్తాలు ఖిలా వరంగల్‌లో కాకతీయుల నాటి సంఘటనలు గుర్తుకు తెచ్చేలా 120 ఇతివృత్తాలను పర్యాటక శాఖ ఎంపిక చేసింది. వీటి ఆధారంగా ఇళ్లపై బొమ్మలను తీర్చిదిద్దనున్నారు. రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని ఇళ్లన్నీ ఒకేలా కనిపిస్తూ పర్యాటకులను ఆలరిస్తాయి. అదే తరహాలో ఖిలా వరంగల్‌లోని నిర్మాణాలపై నీలిరంగుతో కాకతీయ ఘట్టాలను బొమ్మలుగా వేయనున్నారు. పరుసవేది లభించడం నుంచి ప్రతాపరుద్రుడి పరాజయం వరకు సంఘటలను చిత్రించనున్నారు. ఖిలా వరంగల్, కాకతీయ కీర్తితోరణాలు, ఖుష్ మహల్ చూసేందుకు వచ్చే పర్యాటకులకు కాకతీయ యుగంపై అవగాహన వచ్చేలా ఈ చిత్రాలు కనువిందు చేయనున్నాయి. తొలిదశలో పడమర కోట ముఖద్వారం నుంచి ఖుష్‌మహల్ వరకు ఉన్న ఇళ్లను ఎంపిక చేశారు. రోడ్డు వైపు ఉన్న గోడలపై కా>కతీయుల చరిత్రను తెలిపేలా చిత్రాలు వేయనున్నారు. పడమర కోట ముఖ ద్వారంలో ప్రయోగాత్మకంగా 3 చిత్రాలు వేశారు. త్వరలోనే ఈ పనులు పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయి. ఏకశిల గుట్ట.. ఐనవోలు తోరణం.. కాకతీయుల రాజ్య స్థాపకుడు గుణ్యన నుంచి మొదలు రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వరకు కీలక ఘట్టాలను పర్యాటక శాఖ ఎంపిక చేసింది. కాకతీయులు జైనం నుంచి శైవంలోకి మారారు. వేలాది శివాలయాలు నిర్మించారు. శైవారాధన చేసే చిత్రాలు, కాకతీయ కళా తోరణం, హన్మకొండ ప్రవేశద్వారం, హన్మకొండ కోట, ఎండ్ల బండ్ల వరుస, భూమిలో బండి కూరుకుపోవడం, ఇనుప కమ్మి బంగారంలా మారడం, రాజుగారికి తెలియజేయడం, ప్రోలరాజు గురువులతో కలసి రావడం, పరుసవేది శివలింగం, కోట నిర్మాణం ప్రారంభం, పరుసవేది ప్రతిష్టాపన, స్వయంభూ ఆలయ నిర్మాణం, 7 కోట గోడలు, మట్టి ఆకారం కోసం అగడ్తల తవ్వకం, తోరణ స్తంభాల ఏర్పాటు, మట్టికోట–రాతికోట–ఇటుక కోట–పుట్టకోట నిర్మాణాలు, గొలుసుకట్టు చెరువులు, మెట్ల బావుల నిర్మాణం, సైనికుల శిక్షణ, వ్యవసాయం, చేనేత, కళలు, తోటలు, రెండు అంతస్తుల బంగ్లాలు, ఏకశిల గుట్ట, ఐనవోలు తోరణం, జైన–శైవ–వైష్ణవ, భైరవ పూజ, పేరిణి నాట్యం, సింహద్వారం, మోటుపల్లి రేవు, వెయ్యి స్తంభాల ఆలయం, రామప్పలోని నంది, కుష్ మహల్, రుద్రమదేవి అబ్బాయిగా వేషధారణ వంటి ఎంపిక చేసిన ఘట్టాలను బొమ్మలుగా వేయనున్నారు. -
చరిత్రకారుడు ‘దెందులూరి’ కన్నుమూత
హన్మకొండ కల్చరల్: కాకతీయుల చరిత్రను ఔపోసన పట్టిన మేధావిగా, గొప్ప వ్యాఖ్యాతగా జిల్లాను ప్రముఖులు సందర్శించిన సమయంలో చరిత్ర-శిల్పకళారీతులను వివరించే గైడ్‌గా సుపరిచితులైన దెందులూరి సోమేశ్వర్రావు శనివారం సాయంత్రం కన్నుమూశారు. 92 ఏళ్ల సోమేశ్వర్రావు హన్మకొండలోని కిషన్‌పురలో ఉంటుండగా, అక్కడే కన్నుమూశారు. ఆయనకు నలుగురు కుమారులు. భార్య సుశీలాదేవి 2010లో మరణించారు. 1924 మే 31వ తేదీన హన్మకొండలోని లష్కర్‌బజార్‌లో వెంకటసుబ్బమ్మ, వెంకటసుబ్బయ్య దంపతులకు సోమేశ్వరరావు జన్మించారు. ప్రభుత్వ టీచర్, ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. తెలుగు, ఉర్ధూ, పర్షియన్, ఇంగ్లిష్, సంసృ్కత భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. జ్యోతిష్యవాస్తుశాస్త్రాలలో కూడా నిష్ణాతులు. కేసీఆర్ రాజకీయగురువు మదన్మోహన్, మాడభూషిశ్రీధర్, ప్రభుత్వసలహాదారు పాపారావు, వి.ప్రకాశ్ తదితరులు ఎందరో ఆయన వద్దనే చదువుకున్నారు. 1974లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన రాసిన మనశిల్పకళాసంపద పుస్తకాన్ని ప్రభుత్వమే ప్రచురించింది. ఆయన సాహిత్య అకాడమి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇంటాక్ చిత్రకళాపరిషత్‌లలో శాశ్వతసభ్యులుగా ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం లోగోను సోమేశ్వరరావు రూపొందించారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు విద్యానాధ్ తెలిపారు.