సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం హోటల్‌లో దారుణం చోటు చేసుకుంది. మాస్క్ ధరించాలని సూచించిన కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడి చేశారు. గత శనివారం ఈ ఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులంతా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగులంతా మాస్కులు ధరించగా, డిప్యూటీ మేనేజర్ భాస్కర్ మాత్రం దీనిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించాలని మహిళా ఉద్యోగి ఉషారాణి సూచించగా, తనకే సలహాలు ఇస్తావా అంటూ ఆమెపై దాడి చేశారు. సహచర ఉద్యోగులు కలుగజేసుకొని ఆయనను బయటకు పంపించేశారు. అనంతరం బాధితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన సీసీ పుటేజీని కూడా పోలీసులకు అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
మహిళలుపై దాడులు చేస్తే సహించేది లేదు : వాసిరెడ్డి పద్మ
మహిళా ఉద్యోగి ఉషారాణిపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె నెల్లూరుకి వెళ్లి ఉషారాణిని పరామర్శించారు. అనంతరం పద్మ మీడియాతో మాట్లాడుతూ.. దివ్యాంగురాలైన మహిళపై దాడి చేయడం అమానుషం అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా భాస్కర్ ప్రవర్తించారని మండిపడ్డారు. మాస్క్ ధరించమన్నందుకు ఇష్టానుసారంగా దాడి చేయడం దారుణమన్నారు. మహిళలపై దాడి చేస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దాడి చేసిన ఉద్యోగిని విధుల నుంచి సస్పెండ్ చేసిందని ఆమె వెల్లడించారు. మహిళలపై దాడులు చేసిన, లైంగిక నేరాలకు పాల్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment