తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తరం): విశాఖపట్నం రైల్వేస్టేషన్ చరిత్రలో మరో మైలురాయిని అధిగమించింది. దేశంలోనే ఎ1 రైల్వేస్టేషన్‌లలో పరిశుభ్ర రైల్వేస్టేషన్‌గా మొదటి స్థానం సంపాదించుకున్న కొద్ది రోజులకే ఉత్తమ పర్యాటక స్నేహపూర్వక స్టేషన్‌గా అవార్డు అందుకోనుంది. ఈ అవార్డుకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మేనేజర్ పి.వి.దీపక్ శుక్రవారం తెలియజేశారని డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.సునిల్‌కుమార్ తెలిపారు. సెప్టెంబరు 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్న ‘స్టేట్ టూరిజం యాన్యువల్ ఎక్సలెన్సీ అవార్డ్స్–2017’ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేస్తారని చెప్పారు.
పర్యాటకాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న సంస్థలను గుర్తించి ఏటా ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ ఈ అవార్డు అందజేస్తుందని తెలియజేశారు. విశాఖ స్టేషన్‌లో సీటింగ్ సదుపాయాలు, విశ్రాంతి గదులు, ప్లాట్‌ఫారాల శుభ్రత, పార్యటక సహాయక కౌంటర్ లభ్యత, ప్రీ–పెయిడ్ ఆటో/టాక్సీ సర్వీసుల లభ్యత, దివ్యాంగులకు ర్యాంపులు, బ్యాటరీ ఆపరేటెడ్ కార్ల లభ్యత, విశాఖ–అరకు విస్తాడోమ్ కోచ్ తదితర అంశాలన్నీ విశాఖ రైల్వేస్టేషన్‌కు అవార్డు వచ్చేందుకు దోహదపడ్డాయని వివరించారు.