Visakhapatnam railway station
-
దేవుడి దయతో బయటపడ్డాం
రాయగడ: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దేవుడి దయతో బయటపడ్డామని, అసలు బతుకుతామని అనుకోలేదని ప్రమాదం నుంచి బయటపడిన ఒక కుటుంబం పేర్కొంది. ఇప్పటికీ ప్రమాద సంఘటన తలుచుకుంటే నిద్ర పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పయికొవీధిలో నివాసముంటున్న ఒడిశా పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దిలీప్ కుమార్ పాత్రో (41), అతని భార్య సుజాత స్వాయి (40), ఎనిమిదేళ్ల కూతురు సుదీక్ష పాత్రో, మేనకోడలు అనన్య గంతాయిత్ (7), అతని తల్లి సుక్షా కుమారి పాత్రోలు సరదాగా గడపడానికి శనివారం విశాఖపట్నం వెళ్లారు. అనంతరం ఆదివారం విశాఖపట్నం–రాయగడ ప్యాసింజర్ ట్రైన్‌కు తిరుగు ప్రయాణం కోసం రిజర్వేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో విశాఖ–రాయగడ ప్యాసింజర్ ట్రైన్లో బోగీ నంబర్ డీ–1లో తమకు కేటాయించిన బెర్తుల్లో కూర్చున్నారు. అంతలోనే ప్రమాదం ఎంతో సరదాగా రెండు రోజులు గడిపిన విషయాలను కుటుంబమంతా చర్చించుకుంటున్న సమయంలో, ట్రైన్ కంటకాపల్లి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా తాము కూర్చున్న బోగి ఎగిరిపడింది. సుమారు రెండు అడుగుల ఎత్తుకు ఎగరడంతో తామంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డామని దిలీప్ అన్నారు. తమ పిల్లలు పైబెర్తులో ఉండడంతో పైనుంచి కిందికి పడిపోయారు. లగేజీలు చెల్లాచెదురయ్యాయి. ఇంతలో తామ ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురయ్యిందని తెలుసుకున్నామని పాత్రో తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. చుట్టూ చీకటిమయం ప్రమాదం జరిగిన ప్రాంతమంతా చీకటిమయంగా ఉందని ఆయన తెలియజేశారు. బోగి మెయిన్ డోర్ కొద్దిగానే తెరిచి ఉంది. దీంతో అతికష్టం మీద అక్కడకు వెళ్లి చూసేసరికి ప్రయాణికులు పరుగులు తీస్తుండడం కనిపించింది. ఆర్తనాదాలు వినిపించాయి. అరగంట వ్యవధిలో సంఘటన స్థలానికి అంబులెన్స్‌ల సైరన్లు వినిపించాయి. దీంతో భయాందోళనకు గురైన తామంతా కష్టం మీద బోగి నుంచి కిందికు దిగి అరగంట సమయం రైలు ట్రాక్‌పై నడుచుకుంటూ అతికష్టం మీద కంటకాపల్లి రోడ్డుకు చేరుకున్నామన్నారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బస్సు రావడంతో అందరం ఎక్కి విజయనగరం చేరుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని సుమారు రాత్రి మూడు గంటలకు రాయగడ చేరుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తమ పిల్లలు ఆ భయం నుంచి బయటపడలేదని సుజాత స్వాయి అన్నారు. రైలు ప్రయాణం సురక్షితంగా భావిస్తున్నప్పటికీ, కొద్ది నెలలుగా తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలను చూస్తే అసలు ప్రయాణించేందుకు ఇష్టపడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
విశాఖ రైల్వే స్టేషన్ లో టైట్ సెక్యూరిటీ
-
అగ్నిపథ్ నిరసనలు.. విశాఖ రైల్వేస్టేషన్ మూసివేత
సాక్షి, విశాఖపట్నం: అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో విశాఖలోని పలు రైల్వేస్టేషన్ల వద్ద భారీగా భద్రత పెంచారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ లోకల్ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వేస్టేషన్లో భద్రతా ఏర్పాట్లను సీపీ శ్రీకాంత్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ రైల్వే స్టేషన్లపై దాడులు పాల్పడవచ్చుననే సమాచారం ఉంది. విశాఖ రైల్వేస్టేషన్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాము. ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. యువత కేసుల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. విస్తృతంగా తనిఖీలు అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో విశాఖ నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. బస్సులు, బైకులు, ఆటోలు, కార్లు ఆపి తనిఖీలు పోలీసులు నిర్వహిస్తున్నారు. రైల్వేస్టేషన్ మూసివేత అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ రైల్వే స్టేషన్ మూసివేశారు. రైల్వే స్టేషన్‌కు వస్తున్న ప్రయాణికులను వెనక్కి పంపిస్తున్నారు. విజయవాడ వైపు వెళ్లే వాళ్లు, వచ్చే వాళ్ళు దువ్వాడ వెళ్లాలని, కోల్కత్తా, ఒరిస్సా వైపు నుంచి వచ్చే వాళ్లు, వెళ్లేవాళ్లు కొత్తవలస వెళ్ళాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. -
పొగరాయుళ్లకు నకిలీ సెగ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ సిగరెట్లు హల్చల్ చేస్తున్నాయి. కోల్‌కతా లైన్ కేంద్రంగా ఢిల్లీ, బిహార్, రాయ్‌పూర్ నుంచి ఖరీదైన సిగరెట్ స్థానంలో నకిలీ రంగ ప్రవేశం చేస్తోంది. ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్లో బండిల్స్ కొద్దీ దొరికిన ఫేక్ సిగరెట్ బండిల్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బ్రాండెడ్‌కు దగ్గరగా ఉంటూ ధూమపాన ప్రియులను తక్కువ ధరలతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ టొబాకో కంపెనీ(ఐటీసీ) ద్వారా మాత్రమే నాణ్యమైన పొగాకుని కొనుగోలు చేసి బ్రాండెడ్ కంపెనీలు సిగరెట్స్‌ని తయారు చేస్తుంటాయి. గతంలో ఐటీసీ గుర్తింపు పొందిన కంపెనీల సిగరెట్స్ మాత్రమే మార్కెట్లో దర్శనమిచ్చేవి. కేంద్రం విధించిన పన్ను భారంతో బ్రాండెడ్ సిగరెట్స్ ఖరీదైపోవడంతో నకిలీ సిగరెట్లు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. నకిలీ సిగరెట్ తయారీ ఇలా? బ్రాండెడ్ కంపెనీలు వాడే పొగాకులో నాసిరకం పొగాకుని అతి తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేసుకుంటారు. పొగాకుతో పాటు రంపపు పొట్టుని కూడా కలిపేసి చవగ్గా సిగరెట్స్ తయారు చేసేసి.. వాటిని మార్కెట్లోని బ్రాండెడ్ సిగరెట్స్ ప్యాకెట్స్ మాదిరిగా సిద్ధం చేసేస్తున్నారు. ఆ ప్యాకెట్స్‌పై ఎక్కడ తయారవుతున్నాయి.? వాటి కంపెనీ ఏమిటి.? అనే వివరాలు మాత్రం కనిపించవు. కొందరు తెలివిగా.. బ్రాండెడ్ ప్యాకెట్స్‌పై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లనే ముద్రించేస్తున్నారు. ఎలా వచ్చేస్తున్నాయ్..? గతంలో బంగ్లాదేశ్, నేపాల్ నుంచి నకిలీ సిగరెట్లు వచ్చేవి. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని తయారు చేసేస్తున్నారు. ఢిల్లీ, బిహార్, సూరత్, రాయ్‌పూర్, చంఢీగఢ్, కోల్‌కతా వంటి నగరాల్లో అసలు బ్రాండ్లను పోలిన సిగరెట్లు తయారవుతున్నాయి. వీటిని కోల్‌కతా కేంద్రంగా వివిధ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోకి మాత్రం రైలు మార్గంలోనే ఎక్కువగా రవాణా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల విశాఖ డివిజన్ రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు రూ. లక్షల విలువ చేసే నకిలీ సిగరెట్లను పట్టుకున్నారు. వాటిని ఎవరు ఆర్డర్ చేశారన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. నకిలీ పొగ.. ప్రాణాంతకం సాధారణంగా బ్రాండెడ్ సిగరెట్లు తాగితేనే క్యాన్సర్, గుండెజబ్బులు, నరాల బలహీనతలు, ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమిస్తుంటాయి. అలాంటిది నకిలీ సిగరెట్లు తాగడం వల్ల.. ఈ వ్యాధులు వేగంగా శరీరాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్స్ తయారైన ఆరు నెలల్లోపే వినియోగించాలి. ఆ తర్వాత అందులో ఫంగస్ చేరి.. మనిషి ఆయువుని తీసేస్తుందని.. సిగరెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గొలుసు తెంచేందుకు ప్రయత్నిస్తున్నాం.. ఇటీవల రైల్వేస్టేషన్లో భారీగా నకిలీ సిగరెట్ డంప్‌ని స్వాధీనం చేసుకున్నాం. వీటిని తీసుకొచ్చిన వ్యాపారి ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. నకిలీ సిగరెట్ల వ్యాపారంపై గట్టి నిఘా ఉంచుతున్నాం. ప్రతి రైలు నుంచి వచ్చే పార్సిళ్లను పరిశీలించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. – శ్రీనివాసరావు, రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ -
ఆ.. నకిలీ సిగరెట్లు ఎవరివో?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వేస్టేషన్లో పట్టుబడిన నకిలీ సిగరెట్ బండిల్స్ ఎవరివో తేల్చేపనిలో రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ అధికారులు తలమునకలయ్యారు. వీటిని కోల్‌కతా కేంద్రంగా తయారు చేస్తూ ఛత్తీస్‌గఢ్, బిహార్ మీదుగా వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే .. ఓ పాసింజర్ రైలులో బుధవారం అర్ధరాత్రి విశాఖకు భారీగా నకిలీ సిగరెట్ బండిల్స్ చేరుకుంటున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖ రైల్వే స్టేషన్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫాంపై డివిజన్ అధికారులు మాటు వేశారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సంబంధిత సరుకు యజమానులు అక్కడినుంచి జారుకున్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటలవుతున్నా ఎవరూ సరుకు కోసం రాకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రాంతి ట్రాన్స్పోర్ట్ పేరుతో సాధారణ సామగ్రిగా బుక్ చేసిన 56 భారీ బండిల్స్‌ను జీఎస్టీ కార్యాలయానికి తరలించారు. సిగరెట్ బాక్సులపై తయారీ యూనిట్ల చిరునామా లేనట్లు గుర్తించారు. ప్రముఖ ఐటీసీ బ్రాండ్లని పోలినట్లుగానే గోల్డ్ విమల్, పారిస్, గుడ్‌టైమ్స్, టఫ్.. ఇలా విభిన్న రకాల సిగరెట్లున్నాయనీ.. వాటి ధర ఎంతనేది ఇంకా లెక్కించలేదని అధికారులు తెలిపారు. కొన్ని ప్యాకింగ్‌లపై టోల్‌ఫ్రీ నంబర్లు ముద్రించారని, అవి ప్రముఖ బ్రాండ్లపై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లేనని.. అదేవిధంగా మిగిలిన ప్యాక్‌లపై ఉన్న ఫోన్ నంబర్లు ఏవీ పనిచెయ్యడం లేదని అధికారులు వెల్లడించారు. ప్యాకింగ్‌లపై ఉన్న జీఎస్టీ ఐడీ, బార్ కోడ్లు కూడా నకిలీవేనన్నారు. నకిలీ సిగరెట్లను ముఖ్యంగా కోల్‌కతా ప్రధాన కేంద్రంగా తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఒడిశా, రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఢిల్లీలోనూ వీటి తయారీ శాఖలున్నట్లు తెలిసిందని వివరించారు. అయితే ఈ సరుకు మొత్తం ఏ వ్యాపారికి సంబంధించినది, ఒక్కరిదేనా? వేర్వేరు వ్యాపారులున్నారా అనే అంశాలపై లోతైన దర్యాప్తు నిర్వహిస్తున్నామని విశాఖ డివిజన్ జీఎస్టీ అధికారులు వెల్లడించారు. -
ఇక.. గార్డులేని రైలు
సాక్షి, విశాఖపట్నం: రైలు సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడంలో కీలకంగా వ్యవహరించే వారిలో ముందు వరసలో ఉండే గార్డుల వ్యవస్థ త్వరలోనే కనుమరుగు కానుంది. రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక వ్యవస్థ మరింత సురక్షిత రవాణాకు సాయపడనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే.. గార్డుల స్థానాన్ని భర్తీచేస్తోంది. ఇప్పటికే తూర్పు కోస్తా రైల్వేలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతం అయింది. త్వరలోనే వాల్తేరు డివిజన్లో ప్రయోగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొత్త వ్యవస్థ సఫలీకృతమైతే గార్డులను ఇతర స్థానాల్లో భర్తీ చేయనున్నారు. రైలు పట్టాలపై సురక్షితంగా పరుగులు తీయాలంటే గార్డులు కచ్చితంగా అవసరం. సంప్రదాయంగా భారతీయ రైల్వేలో గార్డులే కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వారి స్థానంలో సాంకేతికత అమలు కాబోతోంది. ఎండ్ ఆఫ్ ట్రైన్ టెలిమెట్రీ (ఈవోటీటీ) అమలుకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. ఈస్ట్‌కోస్ట్ జోన్లో గతనెల ఈవోటీటీని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా.. గూడ్స్ ట్రైన్ గార్డు లేకుండా వందల కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణం సాగించింది. రైలును భద్రంగా నడిపించే గార్డు నిర్వర్తించే ప్రతి బాధ్యతను ఈవోటీటీ విజయవంతంగా చేపడుతోంది. చివరి బోగీలో ఏర్పాటు రైలు చివరి బోగీలో ఈవోటీటీ పరికరాన్ని ఏర్పాటు చేస్తారు. లోకోపైలట్‌కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సురక్షితంగా అందిస్తుంటుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ (జీఎస్ఎం) ద్వారా ఇది పనిచేస్తుంది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన పరికరం ద్వారా ఎప్పటికప్పడు సమాచారం పైలట్‌కు అందుతుంది. దీనికి ఆటోమేటిక్ స్విచ్ విధానం ఉంది. ట్రాక్ వ్యవస్థలో ఏవైనా మార్పులు కనిపించినా, ఏదైనా ప్రమాదం జరగకుండా ముందే.. దూసుకుపోతున్న రైలును ఆపేలా ఎయిర్ బ్రేక్ ఈవోటీటీ అదనపు సౌకర్యం. బ్రేక్ పవర్ ప్రెజర్‌ను లోకోపైలట్ నియంత్రించేలా ఎయిర్ బ్రేక్ ఉపయోగించి రైలు ఆపవచ్చు. గూడ్స్ రవాణాపై విశాఖ నుంచి పరిశీలన తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ అత్యాధునిక వ్యవస్థను త్వరలోనే జోన్లో భాగమైన వాల్తేరు డివిజన్‌లోనూ పరిశీలించనున్నారు. గూడ్స్ రవాణాపై విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఈవోటీటీ ప్రయోగాన్ని అమలు చేస్తామని డివిజన్ అధికారులు తెలిపారు. భద్రతకు భంగం కలగకుండా, రైల్వేపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించేలా ఈవోటీటీ పరికరం తయారు చేశారని చెప్పారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే గార్డుల అవసరం ఉండదని, గార్డులను వివిధ విభాగాలకు బదిలీ చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ అత్యాధునిక పరికరం లోకోపైలట్ స్థైర్యానికి కొత్త ఊపిరి పోస్తుందని పేర్కొన్నారు. -
‘మేరీ సహేలీ’తో మహిళా ప్రయాణికులకు రక్ష
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రైళ్లలో ప్రయాణించే మహిళల భద్రతే ముఖ్య ఉద్దేశంగా మేరీ సహేలీ(మై ఫ్రెండ్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్) అందుబాటులోకి తీసుకొచ్చింది. శనివారం విశాఖ రైల్వే స్టేషన్లో సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్ర శ్రీవాస్తవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోదావరి స్పెషల్ ఎక్స్‌ప్రెస్, ఏపీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్ల వద్ద మహిళా ప్రయాణికులకు ఆర్పీఎఫ్ సిబ్బంది అవగాహన కల్పించారు. భద్రత ఇలా: ఆర్పీఎఫ్ సిబ్బంది ముందుగా మహిళా ప్రయాణికుల సీటు, బెర్త్, కోచ్ నంబర్లు తదితర సమాచారం సేకరించి వారిని అప్రమత్తం చేస్తారు. ఇదే సమాచారాన్ని ఆ రైలు ప్రయాణించే అన్ని స్టేషన్లలోని ఆర్పీఎఫ్ సిబ్బందికి ఆందజేస్తారు. ఆ రైలు ఆ స్టేషన్‌కు వెళ్లే సమయానికి అక్కడ ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికుల వద్దకు వెళ్తారు. వారి స్థితిని తెలుసుకుంటారు. ఇలా ఆ రైలు గమ్యం చేరే వరకు ప్రతి స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది వారిని అనుసరిస్తుంటారు. అత్యవసరమైతే ఉచిత హెల్ప్‌లైన్ 182 నంబర్లో సంప్రదించాలని ప్రయాణికులకు చెబుతున్నారు. -
విశాఖ రైల్వే స్టేషన్లో కలకలం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ రైల్వే స్టేషన్లో మంగళవారం ఓ ఘటన కలకలం సృష్టించింది. హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ చెందిన ముఠా ప్లాట్‌ఫాం నెంబర్ 7 నుంచి హౌరా-యశ్వంత్‌పూర్ వెళ్తున్న రైల్లో ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ ముఠాను పట్టుకోడానికి సూమారు వంద మంది సివిల్, ఇంటిలిజెన్స్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురు పురుషులు, ముగ్గురు స్త్రీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
స్నేహహస్తం తెచ్చింది పతకం
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తరం): విశాఖపట్నం రైల్వేస్టేషన్ చరిత్రలో మరో మైలురాయిని అధిగమించింది. దేశంలోనే ఎ1 రైల్వేస్టేషన్లలో పరిశుభ్ర రైల్వేస్టేషన్‌గా మొదటి స్థానం సంపాదించుకున్న కొద్ది రోజులకే ఉత్తమ పర్యాటక స్నేహపూర్వక స్టేషన్‌గా అవార్డు అందుకోనుంది. ఈ అవార్డుకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మేనేజర్ పి.వి.దీపక్ శుక్రవారం తెలియజేశారని డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.సునిల్‌కుమార్ తెలిపారు. సెప్టెంబరు 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్న ‘స్టేట్ టూరిజం యాన్యువల్ ఎక్సలెన్సీ అవార్డ్స్–2017’ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేస్తారని చెప్పారు. పర్యాటకాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న సంస్థలను గుర్తించి ఏటా ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ ఈ అవార్డు అందజేస్తుందని తెలియజేశారు. విశాఖ స్టేషన్లో సీటింగ్ సదుపాయాలు, విశ్రాంతి గదులు, ప్లాట్‌ఫారాల శుభ్రత, పార్యటక సహాయక కౌంటర్ లభ్యత, ప్రీ–పెయిడ్ ఆటో/టాక్సీ సర్వీసుల లభ్యత, దివ్యాంగులకు ర్యాంపులు, బ్యాటరీ ఆపరేటెడ్ కార్ల లభ్యత, విశాఖ–అరకు విస్తాడోమ్ కోచ్ తదితర అంశాలన్నీ విశాఖ రైల్వేస్టేషన్‌కు అవార్డు వచ్చేందుకు దోహదపడ్డాయని వివరించారు. -
బాబోయ్.. టి‘కేటు’గాళ్లు!
విశాఖ రైల్వేస్టేషన్లో ఘరానా మోసగాళ్లు క్షణాల్లో టికెట్ మార్చేస్తున్న వైనం దిక్కుతోచని స్థితిలో ప్రయాణికులు టికెట్లు జారీ చేసే వారిపై నెపాన్ని నెడుతున్న వైనం తాటిచెట్లపాలెం: అది విశాఖ రైల్వే స్టేషన్. అప్పటికే ఓ వ్యక్తి చెన్నై వెళ్లేందుకు టికెట్ తీసుకుని రైలు కోసం నిరీక్షిస్తున్నాడు. ఇంతలో.. హలో బాగున్నారా.. అంటూ ఓ అపరిచితుడి పలకరింపు. సంబంధిత వ్యక్తి ఎవరో తెలియకపోయినా .. ఆ బాగున్నానండీ అంటూ మాటల్లో పెట్టి.. టికెట్ మార్చేశాడు. పైగా.. ‘మీకు.. టికెట్ కౌంటర్లో అనకాపల్లి టికెట్ ఇచ్చారు. చూసుకోలేదా..’ బిత్తరపోయాడు అమాయకుడు. కౌంటరు వద్దకు పరుగులు తీశాడు. ఇంకేముంది.. ఇదే అదనుగా.. సదరు మొదటి వ్యక్తి రెలైక్కి హ్యాపీగా వెళ్లిపోయాడు. ఇదేమీ కథ కాదు.. విశాఖపట్నం రైల్వేస్టేషన్లో జరుగుతున్న మోసాల్లో ఇదో రకం.. అంతే! వివరాళో ్లకెళితే... విశాఖ రైల్వేస్టేషన్లో కేటుగాళ్లు తయారవుతున్నారు. వాళ్లు చేరుకోవాల్సిన గమ్యానికి సరిపడా టికెట్ధర లేక ఈ తరహామోసాలకు తెగబడుతున్నారు. సమీప ప్రాంతాలకు రూ.30 లోపు టికెట్ తీసుకోవడం.. ఆపై వారు వెళ్లాల్సిన ప్రదేశానికే చేరే ప్రయాణికులపై కన్నేయడం.. వారిని బురిడీకొట్టించడం.. చాకచక్యంగా చక్కబెట్టేస్తున్నారు. మాటల్లో పెట్టి టికెట్ మార్చేస్తున్నారు. గతేడాది ఈ తరహా మోసాలు వెలుగుచూసాయి. ఆ సమయంలో బాధితులు అప్పటి ఆర్పీఎఫ్ సీఐను ఆశ్రయించగా.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించారు. కానీ రూ.500 టికెట్‌కు ఎందుకీ ఎంక్వైరీలనుకుని వదిలేశారు. సేవాభావంతో ఆయనతోపాటు ఉద్యోగులందరూ తలోచేయి వేసి బాధితుడికి టికెట్ తీసి ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా వారం క్రితం మరో సంఘటన జరిగినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో సికిందరాబాద్ వెళ్దామని టికెట్ తీసుకుంటే అతని విషయంలో ఇదే జరిగింది. ఓ కేటుగాడు అతడి టికెట్‌ను మార్చేశాడు. దీంతో బాధితుడు ఎక్కాల్సిన రైలు అందుకోలేక ఇబ్బందిపడ్డారు. రైల్వే అధికారులకు తెలిపినా వారు కూడా నిట్టూర్చారు. దీంతో బాధితుడు దిక్కుతోచక వెనుదిరిగాడు. ఈ తరహా మోసాలపట్ల జాగ్రత్తగా వహించాలని, ఇబ్బందులెదురైతే తమను సంప్రదించాలని స్టేషన్‌లోని ఆర్పీఎఫ్ అధికారులు కోరుతున్నారు. -
విశాఖ స్టేషన్ లో పట్టాలు తప్పిన రైలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైలింజన్ పట్టాలు తప్పింది. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు హౌరా నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్(నం.12863) ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి బయల్దేరింది. సుమారు 200 మీటర్లు ముందుకు వెళ్లాక ఆర్ఆర్ కేబిన్ వద్ద రైలింజన్ పట్టాలు తప్పి భూమిలోకి కూరుకుపోయి పక్కకు ఒరిగింది. ఇంజనీరింగ్ అధికారులు పట్టాలు తప్పిన ఇంజన్‌ను బయటకు తీయించి లోకోషెడ్‌కు తరలించారు. మరో ఇంజిన్‌ను రప్పించి ఎక్స్‌ప్రెస్ రైలును ఎనిమిదో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు మార్చారు. అనంతరం రెండు గంటల ఆలస్యంగా రైలు బయల్దేరింది. ప్రమాద ఘటనపై డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ దర్యాప్తునకు ఆదేశించారు. -
పుష్కరాల బాట
నేటి నుంచి వరుస సెలవులు రాజమండ్రి ప్రయాణాల జోరు పోటెత్తుతున్న రైల్వే స్టేషన్ కిటకిటలాడుతున్న రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న వైనం విశాఖపట్నం సిటీః రైళ్లన్నీ కిటకిట లాడుతున్నాయి. ఏ రైలూ కాస్త ఖాళీగా కనిపించడం లేదు. ఇటు గోదావరి పుష్కరాలు..అటు పూరీ జగన్నాథ రధయాత్ర కు వెళ్లేవారితో విశాఖ రైల్వేస్టేషన్ మునుపెన్నడూ లేనంత రద్దీగా కనిపిస్తోంది. నాలుగయిదు రోజులుగా ఇదే పరిస్థితి.దీనికితోడు శని, ఆదివారాలు సెలవులు కావడంతో రైలు ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. విద్యాలయాలకు సోమ, మంగళవారాలు సెలవులు ప్రకటించడంతో అంతా ప్రయాణాల బాట పట్టారు. శుక్రవారం రైల్వే స్టేషన్ ఒక్క సారిగా కిటకిటలాడింది. క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. సాధారణ రోజుల్లో 20 నుంచి 25 వేల మంది మాత్రమే రోజుకు జనరల్ ప్రయాణికులు టికె ట్లు తీసుకుంటారు. రిజర్వేషన్, ఇతర స్టేషన్లలో తీసుకున్న టికెట్లతో లెక్కిస్తే రోజుకు లక్ష మందికి పైగా విశాఖ నుంచి బయల్దేరిన ట్టు అంచనా వేస్తున్నారు. పుష్కరాలు ముగిసే కొద్దీ మరింత రద్దీ పెరిగేలా ఉందని రైల్వే వర్గాలంటున్నాయి. గత సోమవారం నుంచి శుక్రవారం వరకూ విశాఖ నుంచి రాజమండ్రికి బయల్దేరిన వారు 5 లక్షల మందికిపైగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. పుష్కరాల సందర్భంగా వాల్తేరు రైల్వే ప్రవేశపెట్టిన 12 రైళ్లతో పాటు 40కు పైగా రెగ్యులర్ రైళ్లు రాజమండ్రికి నిత్యం వెళుతుండడంతో ప్రయాణికులంతా ఈ రైళ్లను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. అన్ని రైళ్లకూ 100 నుంచి వెయ్యి మంది చొప్పున బయల్దేరుతున్నారని రైల్వే వర్గాలు అంటున్నాయి. రైళ్లన్నీ 3 నుంచి 5 గంటలు ఆలస్యంః -పుష్కర రద్దీ కారణంగా రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు దూర ప్రాంతాల నుంచి ఎక్కువ రైళ్లు నడుపుతుండడంతో ట్రాక్ ఖాళీ లేక ఎక్కడి రైళ్లను అక్కడే నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా ప్రతీ రైలు రాజమండ్రిలో చోటు కోసం నిరీక్షించడంతో ఈ సమస్య తలెత్తినట్టు రైల్వే అధికారిక వర్గాలు అంటున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచీ రైళ్ల ఆలస్యం కొనసాగుతోంది. ఎప్పుడూ 12 గంటలకు విశాఖ స్టేషన్‌కు వచ్చి 12.30 గంటలకు బయల్దేరే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు వచ్చి తిరిగి 5 గంటలకు బయల్దేరి వెళ్లింది. ఠంచనుగా తెల్లవారి 6 గంటలకు విశాఖకు చేరుకునే గోదావరి ఎక్స్‌ప్రెస్ ఉదయం 8 గంటలకు, 7 గంటలకు చేరుకునే విశాఖ ఎక్స్‌ప్రెస్ 9.30 గంటలకు విశాఖకు చేరుకున్నాయి. విశాఖ నుంచి బయల్దేరాల్సిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్ భారీ ఆలస్యంతో నడుస్తుంది. ఈ రైలు విశాఖకు చేరుకునేందుకు ఆలస్యం కావడంతో ప్రత్యేక రైళ్లు కూడా ఎప్పుడు బయల్దేరతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ైరె ళ్లన్నీ ఆలస్యంగా చేరుకోవడం, బయల్దేరడం జరుగుతోంది. ప్రతీ రైలు కనీసం రెండు గంటల నుంచి గరిష్టంగా 5 గంటల వరకూ ఆలస్యంగా ఉన్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. పెరిగిన ప్రయాణికులు ఇలా..! 12-7-2015 26,000 13-7-2015 52,000 14-7-2015 46,000 15-7-2015 49,000 16-7-2015 52,000 17-7-2015 60,000 -
పండగ వేళ గుండెల్లో రైళ్లు
పండక్కి ఊరెళ్లాలి. పిల్లలకు సెలవులిచ్చేశారు. అసలే పెద్ద పండగ. సొంతూళ్లో చేసుకోకపోతే సంతృప్తి ఉండదు. అందుకే విశాఖ రైల్వే స్టేషన్ ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. నగరంలో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారే ఎక్కువ. వారంతా స్వస్థలాలకు పయనం కావడంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. శనివారం ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ తీసుకునేందుకు పోటీ పడాల్సి వచ్చింది. గంటపాటు నిరీక్షిస్తేనే కానీ టికెట్ లభ్యం కాలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో ఆ రైలు వెళ్లిపోవడంతో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన బొకారో, రత్నాచల్, ప్యాసింజర్ రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి, నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లకు వందలాదిమంది నిరీక్షణ జాబితాలోనే ప్రయాణిస్తున్నారు. కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద వుండే జనరల్ బుకింగ్‌ను హుద్‌హుద్ తుపాను నుంచి మూసేశారు. దీంతో ప్రయాణికులంతా జనరల్ బుకింగ్ కౌంటర్ వద్దకు పరుగులు తీస్తున్నారు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు కూడా పనిచేయకపోవడంతో తోపులాట తప్పడం లేదు. -విశాఖపట్నం సిటీ -
స్తంభించిన రైళ్లు
విశాఖపట్నం సిటీ: తూర్పు కోస్తా రైల్వేలోని ప్రధానమైన విశాఖ రైల్వే స్టేషన్ చిగురుటాకులా వణికిపోయింది. శనివారం అర్ధరాత్రి నుంచే మొదలైన గాలులకు రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. భీకర గాలులకు ఎగిరిపోతున్న పైకప్పులను సరి చేసే లోపే మరో ప్లాట్‌ఫాం మీద వున్న పై కప్పులు ఎగిరిపోతుండడంతో ఆఖరికి సిబ్బంది సైతం చేతులెత్తేశారు. ప్లాట్‌ఫార పై ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ప్లాట్‌ఫాంపై వున్న ఐఆర్సీటీసీ దుకాణాలన్నీ బంతుల్లా దొర్లాయి. విశాఖ రైల్వే స్టేషన్‌లోని 8 ప్లాట్‌ఫాంలపై ఉన్న ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులు, ఐరన్ షీట్లు కాగితాల్లా ఎగిరిపోయాయి. అత్యవసర ప్రయాణాలు చేద్దామనుకున్న వారంతా చిగురుటాకుల్లా వణికిపోయారు. రైళ్లరద్దుతో వేలాది మంది ప్రయాణికులు వచ్చి టికెట్లు రద్దు చేసుకుంటారనుకున్నా భయంకర తుఫాన్‌కు ఎవరు స్టేషన్ వైపు రాలేదు. వచ్చిన వారు మాత్రం ఎటూ వెళ్లలేక స్టేషన్లోనే దిగాలుగా పడిగాపులు కాస్తున్నారు. ఏ సమాచారం తెలియక తంటాలు పడుతున్నారు. రైల్వే ఉద్యోగులు సైతం ఆదివారం విధుల్లోకి రావాల్సిన వారంతా రాలేదు. దీంతో శనివారం రాత్రి విధుల్లో వున్న వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఖాళీ రైళ్లు ఢీ: తూర్పు కోస్తా రైల్వే చిగురుటాకులా వణికిపోయింది. హుదూద్ తుఫాను బీభత్సం సృష్టించనుందని ముందే హెచ్చరించడంతో దాదాపు 50కు పైగా రైళ్లను ఎక్కడున్న వాటిని అక్కడే నిలిపివేసినా వాటిని నియంత్రించడం కష్టతరమైంది. విశాఖలో నిలిపివేసిన పలు రైళ్లు భారీ ఈదురుగాలులకు పట్టాలపై దొర్లుకుపోవడం రైల్వే వర్గాలను కలవరపెట్టాయి. అందులో ప్రయాణికులు లేకపోయినా ఈదురు గాలులకు రైళ్లు సైతం కొట్టుకుపోతున్నాయని కలవరపడ్డారు. ఆదివారం రోజంతా అవి ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూనే ఉన్నాయి. బ్రేక్‌లపై నిలిపివేసిన రైళ్లు సైతం చిగురుటాకుల్లా దొర్లిపోయేవి. వాటిని పట్టాలపై నియంత్రించడం సాధ్యమయ్యేది కాదు. ప్రయాణాలకు బ్రేక్ గత రెండు రోజులుగా విశాఖలో హుదూద్ చేస్తున్న హడావుడితో పలువురు ప్రయాణాలు బ్రేక్ చేసుకున్నారు. వేలాది మంది తమ టికెట్లను శనివారం రాత్రే రద్దు చేసుకున్నారు. దాదాపు నాలుగు నుంచి 5 వేల మంది ప్రయాణికులకు రూ. కోట్లలో చెల్లింపులు(రిఫండ్) చేశారు. మరో రెండు మూడు రోజుల వరకూ ప్రయాణాల పరిస్థితి మందకొడిగానే కొనసాగే అవకాశాలున్నాయి. -
ప్రయాణికుల భద్రతపైనే దృష్టి
విశాఖ రైల్వే స్టేషన్లో కేంద్ర ఇంటెలిజెన్స్ బృందం పర్యటన విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల భద్రతపై కేంద్ర నిఘా విభాగం దృష్టి సారించింది. రైల్వే స్టేషన్లో మరిన్ని పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని రైల్వే ఇంటిలిజెన్స్ బృందం అభిప్రాయపడుతోంది. ముగ్గురు సభ్యులతో కూడి న కమిటీ రెండు రోజులుగా విశాఖ స్టేషన్లో పర్యటిస్తోంది. గురువారం ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఇంకా చేపట్టాల్సిన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రత రైల్వే ఆస్తుల పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రణాళికలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ప్లాట్‌ఫాంతో బాటు స్టేషన్ పరిసరాల ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉగ్రవాదులు, మావోయిస్టులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు రైల్వే స్టేషన్లోకి సులభంగా ప్రవేశించేందుకు అనువుగా ఉన్న ప్రాంతాలను మూసివేయాలని సూచించారు. ఒకటో నెంబర్ ప్లాట్ఫారం ఆర్ఆర్ఐ కేబిన్ ఎదురుగా వున్న రెండు అనధికారిక మార్గాలను మూసివేయాలని నిర్ణయించారు. జ్ఞానాపురం మార్గం వైపు కూడా కొన్ని సూచనలు చేశారు. రైల్వే నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగి స్తున్న స్టాల్స్ సిబ్బందిపై నిరంతరం దృష్టి సారించాలని కోరారు. రైళ్లలో రవాణా అవుతున్న పదార్థాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని నిఘా బృం దం స్థానిక రైల్వే పోలీసులను అప్రమత్తం చేసింది. తినుబండారాల ముసుగులో అక్రమ రవాణా పై నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు.