సురక్షితంగా ఇంటికి చేరుకున్న పాత్రో కుటుంబ సభ్యులు
రాయగడ: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దేవుడి దయతో బయటపడ్డామని, అసలు బతుకుతామని అనుకోలేదని ప్రమాదం నుంచి బయటపడిన ఒక కుటుంబం పేర్కొంది. ఇప్పటికీ ప్రమాద సంఘటన తలుచుకుంటే నిద్ర పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పయికొవీధిలో నివాసముంటున్న ఒడిశా పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దిలీప్ కుమార్ పాత్రో (41), అతని భార్య సుజాత స్వాయి (40), ఎనిమిదేళ్ల కూతురు సుదీక్ష పాత్రో, మేనకోడలు అనన్య గంతాయిత్ (7), అతని తల్లి సుక్షా కుమారి పాత్రోలు సరదాగా గడపడానికి శనివారం విశాఖపట్నం వెళ్లారు.
అనంతరం ఆదివారం విశాఖపట్నం–రాయగడ ప్యాసింజర్ ట్రైన్‌కు తిరుగు ప్రయాణం కోసం రిజర్వేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో విశాఖ–రాయగడ ప్యాసింజర్ ట్రైన్‌లో బోగీ నంబర్ డీ–1లో తమకు కేటాయించిన బెర్తుల్లో కూర్చున్నారు.
అంతలోనే ప్రమాదం
ఎంతో సరదాగా రెండు రోజులు గడిపిన విషయాలను కుటుంబమంతా చర్చించుకుంటున్న సమయంలో, ట్రైన్ కంటకాపల్లి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా తాము కూర్చున్న బోగి ఎగిరిపడింది. సుమారు రెండు అడుగుల ఎత్తుకు ఎగరడంతో తామంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డామని దిలీప్ అన్నారు. తమ పిల్లలు పైబెర్తులో ఉండడంతో పైనుంచి కిందికి పడిపోయారు. లగేజీలు చెల్లాచెదురయ్యాయి. ఇంతలో తామ ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురయ్యిందని తెలుసుకున్నామని పాత్రో తమ చేదు అనుభవాలను పంచుకున్నారు.
చుట్టూ చీకటిమయం
ప్రమాదం జరిగిన ప్రాంతమంతా చీకటిమయంగా ఉందని ఆయన తెలియజేశారు. బోగి మెయిన్ డోర్ కొద్దిగానే తెరిచి ఉంది. దీంతో అతికష్టం మీద అక్కడకు వెళ్లి చూసేసరికి ప్రయాణికులు పరుగులు తీస్తుండడం కనిపించింది. ఆర్తనాదాలు వినిపించాయి. అరగంట వ్యవధిలో సంఘటన స్థలానికి అంబులెన్స్‌ల సైరన్‌లు వినిపించాయి. దీంతో భయాందోళనకు గురైన తామంతా కష్టం మీద బోగి నుంచి కిందికు దిగి అరగంట సమయం రైలు ట్రాక్‌పై నడుచుకుంటూ అతికష్టం మీద కంటకాపల్లి రోడ్డుకు చేరుకున్నామన్నారు.
రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బస్సు రావడంతో అందరం ఎక్కి విజయనగరం చేరుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని సుమారు రాత్రి మూడు గంటలకు రాయగడ చేరుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తమ పిల్లలు ఆ భయం నుంచి బయటపడలేదని సుజాత స్వాయి అన్నారు. రైలు ప్రయాణం సురక్షితంగా భావిస్తున్నప్పటికీ, కొద్ది నెలలుగా తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలను చూస్తే అసలు ప్రయాణించేందుకు ఇష్టపడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment