
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్
● కె.కుపాసుకుద్ది గ్రామ యువకుడు
దుర్మరణం
ఇచ్ఛాపురం : ఈదుపురం రోడ్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కవిటి మండలం కె.కపాసుకుద్ది గ్రామానికి చెందిన గోకిడి రవి(25) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కె.కుపాసుకుద్ది గ్రామానికి చెందిన గోకిడి మాధవరావు, వేణు దంపతుల కుమారుడు రవి విదేశాల్లో వెల్డింగ్ పనుల చేసుకొంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇరాక్ నుంచి నెల రోజుల కిందట ఇంటికి వచ్చాడు. మంగళవారం రాత్రి ఇంట్లో భోజనం చేసి ఇచ్ఛాపురంలో తన స్నేహితులను కలిసేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఈదుపురం రోడ్డులోని ఇటుకల బట్టీ సమీపంలో మలుపు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి గుంతలో పడిపోయాడు. అర్ధరాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. దీంతో యువకుడు ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఉదయం అటువైపుగా వెళ్తున్న వారు మృతదేహాన్ని గమనించి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరించి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. తండ్రి మాధవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై ముకుందరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతికందిన కొడుకు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్