సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వేస్టేషన్‌లో పట్టుబడిన నకిలీ సిగరెట్ బండిల్స్ ఎవరివో తేల్చేపనిలో రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ అధికారులు తలమునకలయ్యారు. వీటిని కోల్‌కతా కేంద్రంగా తయారు చేస్తూ ఛత్తీస్‌గఢ్, బిహార్ మీదుగా వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే .. ఓ పాసింజర్ రైలులో బుధవారం అర్ధరాత్రి విశాఖకు భారీగా నకిలీ సిగరెట్ బండిల్స్ చేరుకుంటున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖ రైల్వే స్టేషన్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫాంపై డివిజన్ అధికారులు మాటు వేశారు.
ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సంబంధిత సరుకు యజమానులు అక్కడినుంచి జారుకున్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటలవుతున్నా ఎవరూ సరుకు కోసం రాకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రాంతి ట్రాన్స్‌పోర్ట్ పేరుతో సాధారణ సామగ్రిగా బుక్ చేసిన 56 భారీ బండిల్స్‌ను జీఎస్‌టీ కార్యాలయానికి తరలించారు. సిగరెట్ బాక్సులపై తయారీ యూనిట్ల చిరునామా లేనట్లు గుర్తించారు. ప్రముఖ ఐటీసీ బ్రాండ్లని పోలినట్లుగానే గోల్డ్ విమల్, పారిస్, గుడ్‌టైమ్స్, టఫ్.. ఇలా విభిన్న రకాల సిగరెట్లున్నాయనీ.. వాటి ధర ఎంతనేది ఇంకా లెక్కించలేదని అధికారులు తెలిపారు.
కొన్ని ప్యాకింగ్‌లపై టోల్‌ఫ్రీ నంబర్లు ముద్రించారని, అవి ప్రముఖ బ్రాండ్లపై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లేనని.. అదేవిధంగా మిగిలిన ప్యాక్‌లపై ఉన్న ఫోన్ నంబర్లు ఏవీ పనిచెయ్యడం లేదని అధికారులు వెల్లడించారు. ప్యాకింగ్‌లపై ఉన్న జీఎస్‌టీ ఐడీ, బార్ కోడ్‌లు కూడా నకిలీవేనన్నారు. నకిలీ సిగరెట్లను ముఖ్యంగా కోల్‌కతా ప్రధాన కేంద్రంగా తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఒడిశా, రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఢిల్లీలోనూ వీటి తయారీ శాఖలున్నట్లు తెలిసిందని వివరించారు. అయితే ఈ సరుకు మొత్తం ఏ వ్యాపారికి సంబంధించినది, ఒక్కరిదేనా? వేర్వేరు వ్యాపారులున్నారా అనే అంశాలపై లోతైన దర్యాప్తు నిర్వహిస్తున్నామని విశాఖ డివిజన్ జీఎస్‌టీ అధికారులు వెల్లడించారు.
ఆ.. నకిలీ సిగరెట్లు ఎవరివో?
Published Fri, Oct 29 2021 4:20 AM | Last Updated on Fri, Oct 29 2021 4:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment