Taxes Department
-
జరిమానా కట్టకపోతే వేలమే!
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సరిగా చెల్లించనందుకు గాను సీజ్ చేసిన వస్తువులకు సంబంధించిన జరిమానాను నిర్దేశిత గడువులోపు వ్యాపారులు చెల్లించకపోతే ఆ వస్తువులను లేదా సరుకులను వేలంలో అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 129 (1) ప్రకారం జరిమానా విధించిన 15 రోజుల్లో చెల్లించకపోతే ఆ సరుకులను ఈ వేలంలో అమ్మేసేందుకు పన్నుల శాఖ అధికారులకు అనుమతినిచ్చింది. జరిమానాను సకాలంలో చెల్లించకపోతే డీలర్‌కు నోటీసులివ్వాలని, నోటీసులు ఇచ్చాక 15 రోజుల్లోపు వేలంలో పాల్గొనేవారి నుంచి బిడ్లు స్వీకరించాలని, బిడ్లలో అర్హత పొందిన వారికి వస్తువులను అమ్మేసి ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని వసూలు చేయాలని, మిగిలిన బిడ్లు దాఖలు చేసిన వారి ఫీజు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. సీజ్ చేసిన వస్తువులు 15 రోజుల్లోపు అమ్మాల్సిన స్వభావం కలిగి ఉంటే షెడ్యూల్‌ను నిర్ణీత అధికారి మార్చుకునే వెసులుబాటు కల్పించింది. అయితే నోటీసు జారీ చేయడానికి ముందే ఆ వస్తువులను భద్రపరిచేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వానికి డీలర్ చెల్లిస్తే వేలం ప్రక్రియను నిలిపివేయనుంది. ఐటీసీకి కొత్త నిబంధనలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందేందుకు డీలర్లు, సరఫరాదారులు పాటించాల్సిన నిబంధనల్లోనూ ప్రభుత్వం సవరణలు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సీఎస్ సోమేశ్‌కుమార్ తాజాగా జారీ చేశారు. సరఫరాదారులు జీఎస్టీఆర్ ఫాం–1లో ఇన్వాయిస్ల వివరాలు పొందుపర్చాల్సి ఉండగా డీలర్లు జీఎస్టీఆర్–2బీలో వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. అప్పుడే ఐటీసీ వర్తించేందుకు అనుమతి లభిస్తుంది. అలాగే చెల్లించిన పన్నును రీఫండ్ కింద తిరిగి పొందాలంటే ఇన్వాయిస్లపై యునిక్ ఐడెంటిటీ నెంబర్ (యూఐఎన్)ను రాయాల్సి ఉంటుందని, లేదంటే డీలర్ ధ్రువీకరణను జతపర్చాల్సి ఉంటుందని నిబంధనలను సవరించింది. ప్రతి సంవత్సరం సమర్పించిన రిటర్న్‌లను డీలర్ల స్వీయ ధ్రువీకరణతో ఫిబ్రవరి 28లోపు సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆ.. నకిలీ సిగరెట్లు ఎవరివో?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వేస్టేషన్లో పట్టుబడిన నకిలీ సిగరెట్ బండిల్స్ ఎవరివో తేల్చేపనిలో రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ అధికారులు తలమునకలయ్యారు. వీటిని కోల్‌కతా కేంద్రంగా తయారు చేస్తూ ఛత్తీస్‌గఢ్, బిహార్ మీదుగా వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే .. ఓ పాసింజర్ రైలులో బుధవారం అర్ధరాత్రి విశాఖకు భారీగా నకిలీ సిగరెట్ బండిల్స్ చేరుకుంటున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖ రైల్వే స్టేషన్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫాంపై డివిజన్ అధికారులు మాటు వేశారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సంబంధిత సరుకు యజమానులు అక్కడినుంచి జారుకున్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటలవుతున్నా ఎవరూ సరుకు కోసం రాకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రాంతి ట్రాన్స్పోర్ట్ పేరుతో సాధారణ సామగ్రిగా బుక్ చేసిన 56 భారీ బండిల్స్‌ను జీఎస్టీ కార్యాలయానికి తరలించారు. సిగరెట్ బాక్సులపై తయారీ యూనిట్ల చిరునామా లేనట్లు గుర్తించారు. ప్రముఖ ఐటీసీ బ్రాండ్లని పోలినట్లుగానే గోల్డ్ విమల్, పారిస్, గుడ్‌టైమ్స్, టఫ్.. ఇలా విభిన్న రకాల సిగరెట్లున్నాయనీ.. వాటి ధర ఎంతనేది ఇంకా లెక్కించలేదని అధికారులు తెలిపారు. కొన్ని ప్యాకింగ్‌లపై టోల్‌ఫ్రీ నంబర్లు ముద్రించారని, అవి ప్రముఖ బ్రాండ్లపై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లేనని.. అదేవిధంగా మిగిలిన ప్యాక్‌లపై ఉన్న ఫోన్ నంబర్లు ఏవీ పనిచెయ్యడం లేదని అధికారులు వెల్లడించారు. ప్యాకింగ్‌లపై ఉన్న జీఎస్టీ ఐడీ, బార్ కోడ్లు కూడా నకిలీవేనన్నారు. నకిలీ సిగరెట్లను ముఖ్యంగా కోల్‌కతా ప్రధాన కేంద్రంగా తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఒడిశా, రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఢిల్లీలోనూ వీటి తయారీ శాఖలున్నట్లు తెలిసిందని వివరించారు. అయితే ఈ సరుకు మొత్తం ఏ వ్యాపారికి సంబంధించినది, ఒక్కరిదేనా? వేర్వేరు వ్యాపారులున్నారా అనే అంశాలపై లోతైన దర్యాప్తు నిర్వహిస్తున్నామని విశాఖ డివిజన్ జీఎస్టీ అధికారులు వెల్లడించారు. -
అమ్మో.. ఆ సీటొద్దు..!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శా ఖ బోధన్ సర్కిల్లో పనిచేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు జంకుతున్నారు. ఇక్కడ పోస్టింగ్ అంటేనే మాతో కాదంటూ చేతులెత్తేస్తున్నా రు. కీలకమైన అసిస్టెంట్ కమిషనర్ (సీటీవో) పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటోంది. వాణిజ్య పన్నుల శా ఖలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగు చూసిన విష యం విధితమే. ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, రైసుమిల్లర్లు అధికారులతో కుమ్మక్కై భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు పన్ను ఎగవేశారు. ఈ నేపథ్యంలో తరచూ నివేదికలు పంపడం, విచారణ కోసం రాష్ట్ర కార్యాలయాల సమావేశాలకు హాజరుకావడం వంటివి ఎక్కువగా ఉండటంతో ఇ క్కడ పనిచేసేందుకు ఆశాఖ ఉన్నతాధికా రులెవరూ ముందుకు రావడం లేదు. ఇక్క డ సీటీవోగా పనిచేసిన విజయేందర్ ఎని మిది నెలల క్రితం బదిలీ చేసుకుని వెళ్లి పో యారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంటోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో కూ డా ఈ స్థానానికి ఎవరూ రాలేదు. ఆ సర్కిల్లోని డీసీటీవోకు ఇన్చార్జి సీటీవోగా బా ధ్యతలు అప్పగించారు. ఆ అధికారి కూడా సెలవుపై వెళ్లిపోవడం గమనార్హం. ప్రస్తు తం నిజామాబాద్ సర్కిల్లో పనిచేస్తున్న మరో డీసీటీవోకు బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఎగవేసిన పన్ను వసూలు పడకేసింది వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన పన్ను ఎగవేత కుంభకోణం రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం సృష్టించిన విషయం విధిత మే. నకిలీ చలానాలు, బోగస్ ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో రైసుమిల్లర్లు సర్కారు ఖ జానాకు రూ.కోట్లలో ఎగనామం పెట్టారు. అంతర్గత విచారణ చేపట్టిన ఆశాఖ జిల్లా వ్యాప్తంగా 118 మంది మిల్లర్లు రూ.62 కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. కేసు విచార ణ దాదాపు అటకెక్కగా, ఎగవేసిన సొమ్ము రికవరీ కూడా పడకేసింది. మిల్లర్లకు రాజకీయ అండదండలుండటంతో పన్ను బకాయిలను చెల్లించకుండా యథేచ్ఛగా తమ దందాలు కొనసాగిస్తున్నారు. వాణిజ్య ప న్నుల శాఖ అధికారులు కూడా ఈ బకా యిల వసూళ్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రాథమికంగా తేల్చినట్లుగా ఎగవేసిన సొమ్ము రూ.62 కోట్లలో కనీసం 50 శాతం కూడా ఇప్పటి వసూలు కాకపోవడం గమనార్హం. కుంభకోణం వెలుగు చూసిన కొత్తలో నామమాత్రంగా బకాయి లు చెల్లించిన మిల్లర్లు ఆపై దాదాపు చేతులెత్తేశారు. కొందరు మిల్లర్లు ఇచ్చిన చె క్కులు కూడా బౌన్స్ అయ్యాయి. ఈ నే పథ్యంలో ఈ సర్కిల్లో పనిచేసేందుకు అ ధికారులు ముందుకు రాకపోవడంతో ప న్ను ఎగవేతదారులకు మరింత వెసులు బాటు దొరికినట్లవుతోంది. -
వాళ్లేమన్నా చట్టానికి చుట్టాలా..?
సాక్షి, నిడదవోలు: సుబ్బారావుకు రూ.750 కరెంట్ బిల్లు వచ్చింది. డబ్బులు లేకపోవడంతో రెండు నెలల బిల్లు ఒకేసారి చెల్లిద్దామని అనుకున్నాడు. కానీ విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి నానా హడావుడి చేసి సరఫరా కట్ చేశారు. పరీక్ష ఫీజు నిర్ణీత సమయంలో చెల్లించకపోతే ఫైన్లు వేస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా జారీ చేసిన చలానాలు కట్టకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇలా ప్రభుత్వ కార్యాలయాలు, అందులో పనిచేసే అధికారులు సామాన్యులకు కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తుంటారు. కానీ ఆనిబంధనలు వారికి మాత్రం వర్తించవు. మునిసిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తి పన్ను ఏళ్ల తరబడి చెల్లిండం లేదు. పన్ను చెల్లించకపోతే నీటి కుళాయి కనెక్షన్ కట్ చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ సామాన్యులకు మునిసిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ హెచ్చరికలు సామాన్యులకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల గృహాలకు మినహాయింపు ఇస్తున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. బకాయిలు రూ.లక్షలు దాటుతున్నాయి. అయినా వారిపై వీసమెత్తు చర్యలకైనా సిద్ధపడటం లేదు. దరి చేరని లక్ష్యం నిడదవోలు పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయ వనరులైన ఆస్థి, ఆదాయ పన్నులు, షాపుల అద్దెలు, వివిధ రూపాల్లో ప్రకటనలు ద్వారా రావాల్సిన ఆదాయం అంతంత మాత్రంగానే వసూలవుతోంది. పట్టణంలో వివిధ కేటగిరీలకు చెందిన గృహ సముదాయాలు, కమర్షియల్ షాపులు, ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పురపాలక సంఘానికి 2018–19 ఆర్థిక సంవత్సరానికి 3.26 కోట్లు ఆదాయం పన్నుల రూపంలో రావాల్సి ఉంది. పన్నుల వసూళ్లు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.2.05 కోట్లు మాత్రమే ఖజానాకు చేరాయి. ఇంకా రూ.1.21 కోట్లు రావాల్సి ఉంది. మూడేళ్ల క్రితం నీటి పన్ను రూ.45 నుంచి రూ.100లకు పెంచడంతో పట్టణంలో ఉన్న 5,125 వేల మంచినీటి కుళాయి కనెక్షన్ల ద్వారా నీటి పన్నుల రూపంలో ఈఏడాది రూ.66 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.42 లక్షలు వసూలయ్యాయి. ఏటా సంతమార్కెట్ ద్వారా మాత్రమే మునిసిపాలిటీకి పన్నులు సకాలంలో అందుతున్నాయి. పెంచిన ఆస్థి పన్ను ప్రకారం అందరికీ నోటీసులు జారీ చేసినప్పటికీ చెల్లింపులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. మార్చి నెలాఖరునాటికి పూర్తిస్ధాయిలో బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికి అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం లేదు. పేరుకుపోతున్న బకాయిలు నిడదవోలు పురపాలక సంఘానికి ఆస్థి, నీటి పన్నులు, ప్రకటనలు, మున్సిపల్ షాపులు, కమర్షియల్ షాపుల ద్వారానే కాకుంగా ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోతున్నాయి. పట్టణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు గత ఏడేళ్లుగా పన్నులు చెల్లించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెడ్ నోటీసులు జారీ చేశాం పట్టణంలో భవన యజయానులు, షాపుల యజమానులు ఆస్తి పన్నుతో పాటు నీటిపన్నులు కూడా చెల్లిస్తే ఈ నెలాఖరు నాటికి 100 శాతం వసూళ్లు పూర్తవుతాయి. పురపాలక సంఘం పరిధిలో అన్ని రకాల పన్నుల వసూళ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. మొండి బకాయిల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేశాం. –ఎస్. నాగేశ్వరరావు, మున్సిపల్ రెవెన్యూ అధికారి -
ఆస్తి పన్ను వడ్డింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల ప్రజలపై ఆస్తి పన్ను మోత మోగనుంది. ఈ మున్సిపాలిటీల్లో 5 శాతం ఆస్తి పన్ను పెంపు తక్షణమే (13 నుంచి) అమల్లోకి వచ్చింది. రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ అధ్యక్షతన ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు ఈ నెల 13న సమావేశమై పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా ఏర్పడిన 61 మున్సిపాలిటీల్లో పంచాయతీరాజ్ చట్టం నిబంధనల ప్రకారం 5 శాతం ఆస్తి పన్ను పెంచి వసూలు చేయాలని ఆదేశించింది. ఈ మున్సిపాలిటీల నుంచి రూ.81.49 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా, రూ.22.39 శాతం మాత్రమే వసూలు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించింది. ఖాళీ స్థలాలపై పన్నులు... రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లు, ఖాళీ స్థలాలన్నింటిపై పన్ను విధించేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఖాళీ స్థలాల వివరాలను అందించాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి లేఖ రాసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చే సమాచారం మేరకు ఖాళీ స్థలాలపై వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు ఆదేశించింది. పన్ను విధించి వసూలు చేసేందుకు వీలుగా ఖాళీ స్థలాలను జియో ట్యాగింగ్ చేయాలని కోరింది. రూ.55.46 కోట్ల వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ డిమాండ్ మరింత పెంచాలని సూచించింది. అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 68 మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలాలను గుర్తించి పన్నులు విధించాలని కోరింది. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ.143 కోట్ల ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు గట్టిగా ప్రయత్నించాలని బోర్డు ఆదేశించింది. ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు ప్రతి 15 రోజులకోసారి డిమాండ్ నోటీసులు పంపించాలని కోరింది. కమిషనర్లకు నోటీసులు... అదనపు నిర్మాణాలు జరిపిన కట్టడాలను గుర్తించి ఆస్తి పన్నులు పెంచి వసూలు చేసేందుకు అమలు చేస్తున్న భువన్ కార్యక్రమం అమలులో జాప్యంపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 2,82,209 కట్టడాలపై మాత్రమే పన్ను పెంచారని, 28 మున్సిపాలిటీలు మాత్రమే 100 శాతం పెంపును అమలు చేశాయని బోర్డు పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విఫలమైన 36 మున్సిపాలిటీల కమిషనర్లకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. -
ఇక పన్ను సంస్కరణలపై దృష్టి...
చకచకా విధాన నిర్ణయాలు * ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆవిష్కరించిన జైట్లీ న్యూఢిల్లీ: పన్ను సంస్కరణలు, సత్వర నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి ఈ అంశాలు దోహదపడతాయని కూడా అన్నారు. ఫిబ్రవరి 28న లోక్‌సభలో 2015-16 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పన్నుల శాఖ అధికారులకు రాష్ట్రపతి ప్రశంసాపూర్వక జ్ఞాపికలను ఆర్థికమంత్రి అందజేశారు. ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు... * పన్ను చెల్లింపుదారుల పట్ల అధికారులు గౌరవప్రదంగా వ్యవహరించాలి. అయితే పన్ను ఉద్దేశపూర్వక ఎగవేతదారులను, ఎగవేతలను మాత్రం వదిలేయకూడదు. * పాలసీ నిర్ణయాల్లో స్థిరత్వ సాధనకు కృషి చేస్తాం. ఈ బాటలో పన్నులు, పాలనా వ్యవస్థల్లో సంస్కరణలకు పెద్దపీట వేస్తాం. * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు (ప్రభుత్వానికి నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయం- చేసే వ్యయానికి మధ్య వ్యత్యాసం) 4.1% మించి ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటాం. * గత వారం రోజులుగా నేను గమనించిన ముఖ్యమైన అంశమేమిటంటే... ఇతర పలుదేశాలతో పోల్చితే భారత్ పలు స్థూల ఆర్థిక అంశాల్లో చక్కటి పురోగతి సాధిస్తోంది. * దేశ విదేశీ మారక నిల్వలు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పరిస్థితి ఇప్పుడు ఎంతో మెరుగుపడింది. * అభివృద్ధి చెందుతున్న బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలతో పోల్చితే మన దేశంలో ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి. * డాలర్ మారకంలో రూపాయి విలువ పటిష్ట ధోరణిలో కొనసాగుతోంది. ఈ విషయంలో పలు ప్రపంచ దేశాలను చూసినా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. తయారీ రంగం కీలకం: డీఐపీపీ ఉపాధి కల్పన, వృద్ధి స్పీడ్‌కు తయారీ రంగం కీలకమని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ (డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధి కల్పన సవాలును ఎదుర్కొనడంలో రోజుకు 33,000 ఉపాధి అవకాశాల సృష్టి జరగాల్సి ఉందని, ఇదొక సవాలని అన్నారు. ఈ బాటలో దేశానికి ప్రస్తుతం వేలకొద్ది ఫ్లిప్‌కార్ట్‌లు, స్నాప్డీల్స్, అంతే స్థాయిలో యువ పారిశ్రామిక వేత్తల అవసరం ఉందని అన్నారు.